నిష్క్రమించిన దిగ్గజం

26 Sep, 2020 02:48 IST|Sakshi

దాదాపు అయిదున్నర దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచాన అసాధారణమైన, అనితరసాధ్య మైన ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించి భూగోళం నాలుగు చెరగులా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం కన్ను మూశారు. ప్రపంచ దేశాలన్నిటా గత ఏడెనిమిది నెలలుగా కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. ఇంతవరకూ దాదాపు పది లక్షలమందిని అది బలితీసుకుంది. వీరిలో ‘మా బాలు’ వుంటా రని ఆయన అభిమానుల్లో ఏ ఒక్కరూ అనుకోలేదు. అసలు తనకు కరోనా సోకిందని ఆయనే స్వయంగా ఒక వీడియో ద్వారా వెల్లడించినప్పుడు అభిమాన జనం నిర్ఘాంతపోయింది. తమకో, తమ కుటుంబసభ్యులకో వచ్చినంతగా తల్లడిల్లింది. ఆయన ఈ మహమ్మారి బారి నుంచి సురక్షి తంగా బయటపడాలని అందరూ వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. ఆయన యోగక్షేమాలను ప్రతి రోజూ ఆరా తీశారు. చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని తెలుసుకున్నాక ఉపశమనం పొందారు. ఈ నెల 7న జరిపిన కోవిడ్‌ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌ వచ్చిందన్నాక అందరూ çసంతోషంతో ఉప్పొంగారు. కానీ ఆ మహమ్మారి పోతూ పోతూ బాలు ఊపిరితిత్తుల్ని బాగా దెబ్బ తీసింది. హఠాత్తుగా గురువారం సాయంత్రం ఆయన ఆరోగ్యం విషమించిందన్న వార్త అందరినీ దిగ్భ్రమలోకి నెట్టింది. 24 గంటలు గడవకముందే ఆ స్వర మాంత్రికుడు ఈ లోకం నుంచి నిష్క్రమించారు. 

తెలుగింట పుట్టిన ఒక అద్భుతం బాలసుబ్రహ్మణ్యం. సంగీతంలో ఆయన కన్నా నిష్ణాతులు ఉండొచ్చు. చాలాసార్లు తానే చెప్పుకున్నట్టు ఆయనకన్నా గొప్ప గాయకులు ఉండొచ్చు. కానీ ఏక కాలంలో భాషనూ, నుడికారాన్ని, పదాల విరుపును, అందులోని సంస్కారాన్ని అంత బాగా ఒడిసిపట్టుకోగలిగే నిష్ణాతుడు మరొకరుండరు. మాతృభాషలో మాత్రమే కాదు... తాను పాడిన దాదాపు 18 భాషల్లోనూ, 41వేల పాటల్లోనూ ఆయన ఈ నియమం పాటించారు. కెరీర్‌ మొదట్లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ తమిళ సినిమాలో పాడే అవకాశం ఇచ్చినప్పుడు చెప్పిన మాటను ఆయన చివరి వరకూ తుచ తప్పకుండా పాటించారు. ‘పాట బాగా పాడావుగానీ, ఉచ్చారణ సరిగ్గా లేదు. తమిళం నేర్చుకుని రా’ అని ఆయన చెప్పారట. ఏడాదిపాటు ఆ భాషను ఔపోసన పట్టి, ఆయనతోనే శభాష్‌ అనిపించుకుని మరీ తమిళంలో పాడారు. అప్పటినుంచి తాను పాడే పాట ఏ భాషదైనా దాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకుని, అవగాహన చేసుకునేవారు. కనుకనే ఏ భాష మాట్లాడేవారైనా బాలును తమవాడిగా భావించారు.

ఆయన పాట పండిత, పామర జన రంజకం కావడం... చిత్ర విజయానికి అది దోహదపడటం గమనించి ఆయన కోసం నిర్మాతలు, సంగీత దర్శకులు క్యూ కట్టేవారు. తాను పాట పాడాల్సిన నటుడెవరో తెలుసుకుని, వారి పాత్రేమిటో ఆరా తీసి, వారి గాత్రాన్ని అవగాహన చేసుకుని అచ్చం వారే పాడుతున్న అనుభూతి కలిగించడానికి బాలు చేసిన ప్రయత్నం అనితరసాధ్యం. బాలుకు ముందు ఈ ప్రయత్నం చేసినవారు దాదాపు లేరు. కనుకనే అన్ని తరాల కథానాయకులూ బాలూనే ఎంచుకునేవారు. రాజబాబు, అల్లు రామ లింగయ్యవంటి హాస్యనటులు, కైకాలవంటి కేరెక్టర్‌ ఆర్టిస్టులు–ఇలా అందరిలోనూ ఆయన గాత్రం ఒదిగిపోయేది. అది భక్తిరసాన్ని ఒలికించే పాటైనా, విస్ఫులింగాల్ని వెదజల్లే పాటైనా, అది ఆర్ద్రతను చాటే పాటైనా, ఆవేశాన్ని రగిల్చే పాటైనా... నవ రసాలూ ఆయన గళం పలికేది. ఆయన గొంతు పలికే వరకూ పాటలో సైతం ధ్వన్యనుకరణ సాధ్యమని ఎవరికీ తెలియదు. ఆ అరుదైన కళ ఆయన నోట పాటనే కాదు... సంభాషణల్ని కూడా పలికించింది. ‘మన్మథ లీల’తో మొదలుపెట్టి ఎన్నో చిత్రా లకు ఆయన డబ్బింగ్‌ చెప్పారు. ప్రఖ్యాత నటుడు ‘దశావతారాలు’ సినిమాలో కమల్‌ హాసన్‌ ఏడు పాత్రల్లో నటిస్తే బాలు ఆ పాత్రలన్నిటికీ వైవిధ్యభరితమైన డబ్బింగ్‌ చెప్పి అందరినీ సంభ్రమాశ్చ ర్యాల్లో ముంచెత్తారు. ఎవరైనా చెబితే తప్ప అన్ని పాత్రలకు బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్‌ చెప్పారని తెలిసే అవకాశం లేదు. 

మనం సినిమాలోనో, రేడియోలోనో, టీవీ చానెల్‌లోనో ఒకటికి పదిసార్లు విన్న పాటే అయినా... భిన్న వేదికలపై అదే పాట పాడిన ప్రతిసారీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులను నింపి, అద్భుత స్వరాలాపనతో ఆహూతుల్ని మంత్రముగ్ధుల్ని చేయడం ఒక్క బాలూకు మాత్రమే సాధ్యం. కర్ణాటక సంగీత దిగ్గజం బాలమురళీకృష్ణ చాలా తరచుగా–‘నాకు సంగీతం పెద్దగా తెలియదండీ...కానీ సంగీ తానికి నేను తెలుసును’ అనేవారు. బాలసుబ్రహ్మణ్యంలోనూ అదే వినమ్రత ఉట్టిపడేది. ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్, సంగీత దర్శకుడు కేవీ మహదేవన్‌ ఆయన్ను ఆ వినమ్రత నుంచి బయటకు తీసుకురాకపోయివుంటే ‘శంకరాభరణం’ వంటి కళాఖండం సాధ్యమయ్యేది కాదు. ఆ చిత్ర ఇతి వృత్తంతోపాటు బాలూ గొంతునుంచి జాలువారిన పాటలన్నీ దాని ఘన విజయానికి తోడ్పడ్డాయి. సామాన్యులకు సైతం సంగీతంపై ఆసక్తినీ, అనురక్తినీ కలిగించాయి.

చిన్ననాటినుంచే వేదికలపై నిర్భయంగా మాట్లాడటం, పాడటం అలవాటైంది కనుక కొత్తగా తోసుకొచ్చిన బుల్లితెర మాధ్యమం కూడా ఆయనకు ఇట్టే పట్టుబడింది. అంతకు చాన్నాళ్లముందు ఆయన వివిధ నగరాల్లోనూ, పట్టణా ల్లోనూ ఆర్కెస్ట్రాతో ప్రదర్శనలిచ్చిన సందర్భాలున్నాయి. అలాంటి సమయాల్లో తాను పాడే పాట లోని సాహిత్యాన్ని, అందులోని సొబగుల్ని, ఆ పాట సందర్భాన్ని చమత్కారభరితంగా చెప్పడం, చెణుకులేయడం ఆయనకు అలవాటు. దాన్నే బుల్లితెరపై కూడా కొనసాగించి తెలుగుపాటను అజ రామరం చేశారు. పాడుతా తీయగా, ఎందరో మహానుభావులు, పాడాలని ఉంది వంటి కార్యక్రమా లతో వందలాదిమంది ప్రతిభాశాలురను తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. చివరి వరకూ పాట కోసం పరితపించి, ఆ క్రమంలోనే అనారోగ్యానికి లోనయి, కానరాని తీరాలకు వెళ్లిపోయిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాలసుబ్రహ్మణ్యం స్మృతికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తోంది. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా