దేశాన్ని చక్కబెడతారా?

22 Jul, 2022 00:04 IST|Sakshi

పాలకుడు మారితే పరిస్థితులు మారతాయని ఎక్కడైనా అనుకుంటారు. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభానికి ప్రయాణిస్తున్న శ్రీలంకకు ఆ సూత్రం పని చేయకపోవచ్చు. దేశాన్ని వదిలి పారిపోయిన గొటబయ రాజపక్సే స్థానంలో ఆయన పార్టీ ఆశీస్సులతోనే రణిల్‌ విక్రమసింఘే గురు వారం కొత్త అధ్యక్షుడిగా కొలువు తీరడంతో ఇప్పుడు పలువురి అనుమానం ఇదే. గొటబయ బదులు ఆయన మాట జవదాటని సన్నిహితులే గద్దెపైకి చేరడంతో పేర్లు మారాయే తప్ప, పాలన మారుతుందా అని సందేహిస్తున్నారు. 

1977లో రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఆరుసార్లు ప్రధాని పదవినెక్కి, ఏ ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని ఘనత రణిల్‌ది. కథ ముగిసిందనుకున్న ప్రతిసారీ రాజకీయంగా పునరుత్థానమై, గత అయిదు దశాబ్దాల శ్రీలంక రాజకీయ చరిత్రలో ‘జిత్తులమారి నక్క’గా పేరొందారు. అధ్యక్షపదవి కోసం పలుసార్లు విఫలయత్నం చేసి, ఎట్టకేలకు బుధవారం పార్లమెంటరీ రహస్య బ్యాలెట్‌లో జీవితకాల వాంఛ నెరవేర్చుకున్నారు. ఇక దేశానికి తొమ్మిదో అధ్య క్షుడిగా ఎంతకాలం నిలబడతారు, ఎలాంటి ఎత్తులు జిత్తులతో కథ నడుపుతారన్నది ఆసక్తికరం. లంక చరిత్రలో తొలిసారిగా నేరుగా ఎంపీల మద్దతుతో ఎన్నికైన ఈ మాజీ వకీలు గురువారం పదవీ బాధ్యతలు చేపడుతూనే, ప్రజాందోళనకారుల్ని ‘ఫాసిస్టులు’గా అభివర్ణించారు. ఉక్కుపాదం మోపుతానని తేల్చేశారు. పాఠశాలలో చిన్నప్పటి తన సహపాఠీ దినేశ్‌ గుణవర్దనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే పనిలోపడ్డారు. గొటబయ వర్గం మద్దతుతో సాగిన ఎన్నిక కానీ, పదవీ స్వీకారోత్సవానికి హాజరైన గొటబయ అన్న మహిందా ఆత్మీయత కానీ, రాజపక్సేయులకు నమ్మినబంటైన దినేశ్‌ ఎంపిక కానీ చూస్తే – ఒకటి స్పష్టం. రణిల్‌ నుంచి రాజపక్సేల వ్యతిరేక పాలననైతే చూడలేం. 

గతంలో ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్‌ రాజకీయంగా రాజపక్సేలకు ప్రతిపక్షమే. కానీ, వ్యక్తిగత అనుబంధాలతో వివాదాస్పద రాజపక్సే కుటుంబానికి ఆయన వీర విధేయుడు. కాబట్టి, దేశ దుఃస్థితికి కారణమైన రాజపక్సేలను గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పటిలానే ఇప్పుడూ ఆయన కాపాడతారని నిరసనకారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమం ద్వారా తాము డిమాండ్‌ చేస్తున్న రాజ్యాంగపరమైన మార్పు కానీ, చివరకు అధ్యక్షుడికి ముద్దరముడుపుగా అధికారాలు కట్టబెట్టే ‘ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెన్సీ’ విధానాన్ని కానీ రణిల్‌ మార్చకపోవచ్చని అనుమానిస్తున్నారు. అంటే, మొదట ప్రధాని స్థానం నుంచి మహిందా, తాజాగా అధ్యక్ష పదవి నుంచి ఆయన తమ్ముడు గొటబయ తప్పుకున్నా లంక వాసులు నిజాయతీగా ఆశించిన మార్పు రానే లేదు. రణిల్‌ తాజా వ్యాఖ్యలతో అసహనం పెరిగి, ఆందోళనలు కొనసాగే సూచనలున్నాయి. 

ఒకప్పుడు బలమైన ‘యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ’ (యూఎన్పీ)కి నేతగా వెలిగినా, ఆనక జనా దరణ కోల్పోయి, 2020లో జాబితా విధానంతో పార్లమెంట్‌లో తమ పార్టీకి ఏకైక ప్రతినిధిగా మిగిలారు రణిల్‌. మొన్న మే దాకా రాజకీయంగా దాదాపు తెర మరుగైన ఆయనకు ఆపద్ధర్మ ప్రధాని హోదా, ఇప్పుడు దేశాధ్యక్ష హోదా అనూహ్యంగా వచ్చి ఒళ్ళోపడ్డాయి. లెక్కప్రకారం గొట బయ పదవీకాలం ముగిసే 2024 నవంబర్‌ దాకా ఆయన అధ్యక్ష హోదాలో ఉండాలి. ఇది ఆయనకు ముళ్ళకిరీటమే. కానీ, ఆర్థిక వ్యవహారాల్లో దిట్టగా పేరున్న ఈ పాశ్చాత్య అనుకూల సంస్కరణవాదికి 2001లో సింహళాన్ని ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలాంటి ఇంద్రజాలం చేయగలరా? 

చైనా పన్నిన అప్పుల ఉచ్చులో చిక్కుకుపోవడమే సింహళ ఆర్థిక సంక్షోభానికి కారణమని అమెరికాకు చెందిన సీఐఏ లాంటివి తాజాగా ఆరోపిస్తున్నా, అది నిజం కాదని విశ్లేషకుల మాట. కొలంబోకున్న అప్పుల్లో చైనావి సుమారు 10 శాతమే అనీ, లంకేయుల వార్షిక విదేశీ రుణ సర్వీ సింగ్‌లోనూ అవి 5 శాతం మించవనీ వారి లెక్క. అనేకచోట్ల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి అధిక వడ్డీ రేట్లకు తెచ్చిన అంతర్జాతీయ సార్వభౌమ బాండ్లు ఈ ద్వీపదేశపు విదేశీ మారక నిల్వలు కరిగి, ఖాళీ అయిపోవడానికి ఓ ప్రధాన కారణం. 2002కి ఆ బాండ్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం 1.5 బిలియన్‌ డాలర్లు మించి, మొన్న మేలో చెల్లించలేక చేతులెత్తేసి, దేశాన్ని దివాళా తీయించింది. 

ఆర్థిక, పాలనా సంస్కరణలే ఇప్పుడు రణిల్‌కు దిక్కు. సంప్రతింపుల్లో 3.5 బిలియన్‌ డాలర్ల ఐఎంఎఫ్‌ కార్యక్రమానికి ఓకే చెబితే, ఇతర ద్వైపాక్షిక సాయాలకూ మార్గం సుగమం అవుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పీడిస్తున్న అవినీతి, అధికార అలసత్వాన్ని వదిలించుకోవాలి. భారత్‌ లాంటి స్నేహదేశాలతో ఆర్థిక వారధి నిర్మించుకోవాలి. వివాదాస్పద ప్రాజెక్టులకు 6 శాతం వ్యాపార వడ్డీ రేటుతో అప్పులిచ్చి, ముక్కుపిండి వసూలుకు దిగిన చైనా కన్నా, ఆహారం, ఆరోగ్యం, ఇంధనాల సాయంలో తోడు నిలిచిన భారత్‌తో దోస్తీ పెంచాలి. భారత్‌ సైతం హాంగ్‌కాంగ్‌ – చైనా నమూనాలో ద్వీపదేశంతో వాణిజ్య – పెట్టుబడుల జోడీ కడితే ఉభయతారకం. గత రెండు నెలల్లో ఆపద్ధర్మ ప్రధానిగా కొంత ప్రయత్నించిన రణిల్‌ ఇకపై ఏం చేస్తారో చూడాలి. అయితే, పులుకడిగిన ముత్యాన్నని చెప్పుకున్నా, గతంలో కేంద్ర బ్యాంకులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లాంటి ఆరోపణల్ని ఎదుర్కొన్న ఆయన ఈసారీ అలాంటి బాట పడితే జాతి క్షమించదు. సింహళంతో పాటు ఇప్పుడు యావత్‌ ప్రపంచం చూపూ రణిల్‌ మీదే! 

మరిన్ని వార్తలు