రణిల్‌తో లంక చక్కబడేనా?

14 May, 2022 00:11 IST|Sakshi

నెల రోజులకుపైగా ఎడతెరిపిలేని నిరసనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఏలుబడి మొదలైంది. తమ కుటుంబ పాలన నిర్వాకానికి, దానివల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి ఆగ్రహోదగ్రులైన జనం వీధుల్లో విరుచుకుపడినా అధ్యక్షుడు గొటబయ రాజపక్స ధోరణిలో ఆవగింజంతైనా మార్పు రాలేదని రణిల్‌ నియామకంతో రుజువైంది. గత నెల 9న ప్రారంభమైన ఉద్యమం ప్రభుత్వం ముందుంచిన ఏకైక డిమాండ్‌ రాజపక్స కుటుంబీకులు గద్దె దిగాలన్నదే. కానీ రణిల్‌ ఆగమనం ఆ స్ఫూర్తికి విరుద్ధమైంది. రాజపక్స కుటుంబీకులతో ఆయన వర్తమాన సంబంధబాంధవ్యాలు ఎటువంటివో ప్రజలకు తెలుసు.

దేశాన్ని తాజా సంక్షోభంనుంచి కాపాడాలన్న చిత్తశుద్ధే గొటబయకు ఉంటే రణిల్‌ జోలికి పోకుండా విపక్ష ఎస్‌జేబీ నేత సజిత్‌ ప్రేమదాసను ఒప్పించే ప్రయత్నం చేసేవారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందినప్పుడు సజిత్‌ షరతు విధించిన మాట వాస్తవం. గొటబయ ఈనెల 15 లోగా అధ్యక్ష పదవినుంచి వైదొలగుతా నంటేనే అందుకు అంగీకరిస్తానన్నారు. ఆ విషయంలో ఆయనకు నచ్చజెప్పవలసి ఉండగా, ఈ సాకుతో రణిల్‌ను ఎంచుకోవడం గొటబయ కుయుక్తికి అద్దం పడుతుంది. లంక చల్లబడుతుందనీ, మళ్లీ  తమ పరివారానికి గత వైభవం దక్కుతుందనీ ఆయన కలలు కంటున్నట్టు కనిపిస్తోంది. 

తెరవెనక ఎత్తుగడల్లో రణిల్‌ ఆరితేరి ఉండొచ్చు. కానీ జనంలో విశ్వసనీయత శూన్యం. రెండేళ్ల నాడు జరిగిన పార్లమెంటు ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. రణిల్‌ పోకడలను సహించలేని నేతలంతా ఆ ఎన్నికలకు ముందు పార్టీని విడిచి కొత్త పార్టీ సామగి జన బలవేగయ(ఎస్‌జేబీ) స్థాపించడంతో ఆయన పార్టీ యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ) పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రణిల్‌ సైతం ఓటమి పాలు కాగా, పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రాతిపదికన ఎంపీలను నామినేట్‌ చేసే ‘నేషనల్‌ లిస్టు’ పుణ్యమా అని ఆయన ఒక్కడూ ఎంపీ కాగలిగారు.

225 మంది ఎంపీలుండే పార్లమెంటులో యూఎన్‌పీ తరఫున ఆయన ‘ఏక్‌ నిరంజన్‌’. అందుకే ప్రధాని పదవి ఇవ్వజూపితే తీసుకోబోనని పక్షం క్రితం ఆయన గంభీరంగా చెప్పారు. ఇంతలోనే వ్రతభంగానికి పాల్పడ్డారు. గతంలో ఆయన అయిదుసార్లు ప్రధానిగా చేశారు. కానీ ఎప్పుడూ పూర్తికాలం ఉండలేకపోయారు. లంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎవరినైనా ప్రధాని పదవిలో కూర్చోబెట్టవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనైతికమన్న ఆలోచనే గొటబయకు లేకుండా పోయింది. లంక ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన జాతీయ ప్రభుత్వం ఏర్పడాలి.

అప్పుడు మాత్రమే దానికి ఇంటా బయటా అంతో ఇంతో విశ్వసనీయత కలుగుతుంది. రుణాలు లభిస్తాయి. ఇంధనం, నిత్యావసర సరుకుల దిగుమతులు పుంజుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడితే లంకకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగం పట్టాలెక్కుతుంది. శ్రీలంక రూపాయి కొద్దో గొప్పో కోలుకుంటుంది. దేశ క్షేమాన్ని కాంక్షించే రాజనీతిజ్ఞతే ఉంటే గొటబయ ఆ పని చేసేవారు. కానీ అందుకు భిన్నంగా తన చెప్పుచేతల్లో ఉండే నేతను ప్రధానిగా నియమించి భవిష్యత్తులో తనకూ, తన పరివారానికీ ముప్పు కలగకుండా ముందుజాగ్రత్త పడ్డారు. 

గొటబయ ఎత్తులు ఫలిస్తాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగడం కల్ల. ప్రస్తుత ఉద్యమం ఎప్పుడో సంప్రదాయ రాజకీయ నేతల చేతులు దాటిపోయింది. అందుకే ఉద్యమకారులపై లాఠీచార్జిలతో మొదలుపెట్టి కాల్పుల వరకూ పోయినా... కరడుగట్టిన నేరగాళ్లను జైళ్లనుంచి విడుదల చేయించి వారితో ఉద్యమ నేతలను హతమార్చాలని చూసినా జనం ఎక్కడా బెదరలేదు. సరిగదా అప్పటివరకూ ఎంతో శాంతియుతంగా సాగిన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. నేర గాళ్లను ఉద్యమకారులు దొరకబుచ్చుకుని దేహశుద్ధి చేసి, వారిని చెత్త తీసుకెళ్లే బళ్లలో ఊరేగించారు. అధికారిక నివాసాలకు నిప్పు పెట్టారు.

రివాల్వర్‌తో కాల్పులు జరిపి తప్పించుకోవాలని చూసిన అధికార పార్టీ ఎంపీని తరిమి తరిమికొట్టారు.  చివరకు ఆయన ప్రాణాలు తీసుకున్నాడని మొదట వార్తలు రాగా, అది హత్య అని తాజాగా పోలీసులంటున్నారు. గొటబయ కుటుంబీకులను ఏమాత్రం జనం సహించడంలేదు. అందుకే వారు ఒక్కొక్కరే పదవులనుంచి వైదొలగక తప్పలేదు. చివరకు గత సోమవారం గొటబయ సోదరుడు, ప్రధాని మహిందా రాజపక్స సైతం రాజీనామా చేయవలసి వచ్చింది. కళ్లముందు సాగుతున్న ఈ పరిణామాలు గొటబయకు తెలియవనుకోలేం. అయినా ఆయనలో ఏదో దింపుడు కళ్లం ఆశ ఉన్నట్టు కనబడుతోంది.

దేశం దివాలా తీసి, ప్రజానీకమంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గొటబయ తప్పుకోవడం, తమ పాలనలో జరిగిన అక్రమాలపై, కుంభకోణాలపై విచారణకు సిద్ధపడటం ఒక్కటే మార్గం. మెజారిటీ వర్గ ప్రజలను కృత్రిమ ఆధిక్యతా భావనలో ముంచి, వాస్తవ స్థితిగతులనుంచి వారి దృష్టి మరల్చి పౌరుల్లో పరస్పర విద్వేషాలను పెంచి పోషించిన ఘనులు రాజపక్స సోదరులు.

ఆ రాజకీయపుటెత్తుగడలే వర్తమాన పెను సంక్షోభానికి మూల కారణం. ఇలాంటి నేతలు ఇంకా పదవుల్లో కొనసాగడం లేదా వారికి అధికారిక అండదండలు లభించడం దేశ భవిష్యత్తుకు మరింత చేటు కలిగిస్తుంది. రాజకీయ సుస్థిరత ఏర్పడి, సాధారణ స్థితిగతులు సాధ్యపడాలంటే రాజపక్సేల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంలేని ప్రభుత్వం ఏర్పడటం అత్యవసరం. ఆ దిశగా అడుగులు పడటమే వర్తమాన సంక్షోభానికి విరుగుడు. 

మరిన్ని వార్తలు