రాష్ట్రాలకు భంగపాటు! 

25 May, 2021 00:42 IST|Sakshi

ఉన్న ఒకే ఒక్క ఆశ అడుగంటింది! భారత్‌లో వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థలూ సకాలంలో అవసరమైనన్ని వ్యాక్సిన్‌లు అందజేయలేని స్థితిని గమనించి, ఇక చేసేది లేక సొంతంగా ప్రపంచ మార్కెట్‌లో కొనుగోలు చేయాలని ఆత్రపడిన రాష్ట్రాలకు భంగపాటు ఎదురైంది. టీకాల విషయంలో మీతో మాట్లాడలేమని మొన్న మోడెర్నా సంస్థ పంజాబ్‌కు చెప్పగా...ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మోడెర్నా ఒక్కటే కాదు...ఫైజర్‌ సైతం మొండి చేయి చూపింది. తాము వ్యాక్సిన్‌ల గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం తప్ప రాష్ట్రాలతో కాదని ఆ సంస్థలు జవాబిచ్చాయి. ఈ రెండు రాష్ట్రాలే కాదు...ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఒదిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు సైతం వ్యాక్సిన్‌ల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లు జారీ చేశాయి. ఇదంతా గత నెలాఖరులో జరిగింది. నెల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ‘కుదరదు పొమ్మ’ని జవాబొచ్చింది. మిగిలిన రాష్ట్రాలకు ఆ సంస్థలనుంచి భిన్నమైన ప్రత్యుత్తరం వస్తుందని ఆశించనవసరం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇలా మన దేశంనుంచే ఎవరికి వారు పోటీ పడితే వ్యాక్సిన్‌ల ధర కాస్తా కొండెక్కి కూచుంటుందన్నది నిజమే. కానీ గ్లోబల్‌ టెండర్లకు వెళ్లాలని సూచించింది కేంద్ర ప్రభుత్వమే. తీరా ఈ జవాబొచ్చిందంటే ఏమనుకోవాలి? ఏడాదిక్రితం కరోనా మహమ్మారి దేశంలో విస్తరించినప్పటినుంచి కేంద్రం వైఫల్యాల పర్యవసానంగా ఏర్పడుతున్న పరిణామాల పరంపరలో ఇది తాజా ఘట్టం. ఒకటి రెండు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దో గొప్పో తగ్గుముఖం పడుతున్న సూచనలు కనబడటం కొంత ఆశాజనకంగా వున్న మాట వాస్తవమే అయినా దేశంలో మూడింట రెండు వంతుల జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికి మించివుందని పదిరోజులక్రితం నిపుణులు తెలిపారు. నిజానికి చాలా రాష్ట్రాల గ్రామసీమల్లో అరకొర వైద్య సదుపాయాలున్నాయి. వచ్చింది సాధారణ జ్వరమో, ఈ మహమ్మారి విరుచుకుపడిందో నిర్ధారణగా చెప్పడానికి అవసరమైన సిబ్బందిగానీ, ఆ పరీక్షలకు కావలసిన ఉపకరణాలుగానీ అక్కడ లేవు. కనుక వెల్లడవుతున్న సంఖ్యలకు మించి కరోనా రోగులు వుండొచ్చని కొందరంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ పౌరులు ఎంత కలవరపడతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 

నిరుడు కరోనా పంజా విసిరినప్పటి పరిస్థితి వేరు. అప్పటికి అన్ని దేశాలూ నిస్సహాయ స్థితిలో వున్నాయి. దాన్ని నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ల మాట అటుంచి, కనీసం చికిత్సపై కూడా అయోమయం. ఇప్పుడు ఎంతో కొంత చికిత్స విధానాలు మెరుగుపడ్డాయి. పైగా వ్యాక్సిన్‌లు అందుబాటులోకొచ్చాయి. దాదాపు అన్ని దేశాలూ తమ తమ స్థోమత మేరకు పౌరులకు యుద్ధ ప్రాతిపదికన టీకాలిస్తున్నాయి. అత్యంత బీద దేశాల సంగతి మినహాయిస్తే అందరూ ఎంతో ముందు చూపుతో వ్యాక్సిన్‌ తయారీదార్లకు అడ్వాన్సులిచ్చారు. ఒక అంచనా ప్రకారం చూస్తే అలా అడ్వాన్సులిచ్చిన దేశాలకు ముందనుకున్నట్టు వ్యాక్సిన్‌ సరఫరా చేయడానికి దాదాపు అన్ని ఫార్మా సంస్థలకూ కనీసం ఆర్నెల్లు పడుతుంది. మోడెర్నా, ఫైజర్‌ల పరిస్థితి కూడా అదే అయివుంటుంది. మరి పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆ కారణాన్ని చెప్పకుండా తాము కేంద్రంతో మాత్రమే లావాదేవీలు చేస్తామనడం ఎందుకో అంతుపట్టదు. మన దేశంలో ఫెడరలిజం ఎంత సొగసుగా అమలవుతున్నదో వారికి కూడా అర్థమైనట్టుంది! గ్లోబల్‌ టెండర్లకు వెళ్లొచ్చని రాష్ట్రాలకు చెప్పిననాటికే విదేశాల్లో ఉత్పత్తవుతున్న ముఖ్యమైన వ్యాక్సిన్‌లకు అనుమతులిచ్చివుంటే...మా రాష్ట్రాలు మీతో లావాదేవీలు చేస్తాయని ఆ సంస్థలకు చెప్పివుంటే వేరుగా వుండేది. కానీ దేశీయ వ్యాక్సిన్‌లు కోవీషీల్డ్, కోవాగ్జిన్‌లకూ... గత నెలలో స్పుత్నిక్‌ (రష్యా) వ్యాక్సిన్‌కు ఇచ్చిన అనుమతులు తప్ప ఇతర టీకాలకు మనదేశంలో అనుమతులు లేవు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లకు నిరుడు డిసెంబర్‌లోనే అమెరికా అనుమతులిచ్చింది. ఫైజర్‌ను బ్రిటన్‌ కూడా డిసెంబర్‌లోనే గుర్తించింది. మొత్తంగా దాదాపు 90 దేశాలు ఫైజర్‌కు, 41 దేశాలు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కూ అనుమతులిచ్చివున్నాయి. కొన్ని దేశాలు స్పుత్నిక్‌ వైపు మొగ్గాయి. మరి మనకేమైంది? ప్రజారోగ్యం ప్రధానం కనుక ఆ వ్యాక్సిన్‌ల పనితీరుపై అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సివుందన్నది వాస్తవమే అయినా... అందుకు ఆర్నెల్ల సమయం అవసరమా? 

కోవాగ్జిన్‌ రూపకల్పనలో భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలు కూడా పాలుపంచుకున్నాయి గనుక ఇతర సంస్థలకు కూడా దాన్ని ఉత్పత్తి చేసే అవకాశమివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించాక మరో రెండు మూడు సంస్థలకు కూడా అనుమతులిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కానీ దీన్నింకా విస్తరిస్తే తప్ప ఎక్కువమంది జనాభాకు టీకాలివ్వటం సాధ్యం కాదు. జాతీయంగా, అంతర్జాతీయంగా టీకాల లభ్యత విషయంలో ఇంత అలసత్వం ప్రదర్శిస్తూ పద్దెనిమిదేళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్‌లు ఇస్తామని ఈ నెల 1న ప్రకటించారు. దానికి ఆన్‌లైన్‌ నమోదు ఇప్పటికే సాగుతుండగా, సోమవారం నుంచి నేరుగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో నమోదు మొదలైంది. కానీ అవసరమైనన్ని టీకాలేవి? కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు ఇప్పుడెదురైన చేదు అనుభవంలాంటిది మరే రాష్ట్రానికీ కలగకుండా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు