పర్యావరణ యోధుడు

22 May, 2021 00:37 IST|Sakshi

ఎవరి ఔన్నత్యాన్నయినా చెప్పాలంటే వారిని హిమ శిఖరాలతో పోలుస్తారు. అటువంటి పర్వతసానువుల్లో పుట్టి, ఆ శిఖరాల పరిరక్షణకు పోరాటాలు రగిల్చి దేశంలోనే పర్యావరణ ఉద్యమాలకు ఆద్యుడిగా నిలిచిన సుందర్‌లాల్‌ బహుగుణ 94వ యేట శుక్రవారం కరోనా వైరస్‌ మహమ్మారికి బలయ్యారు. ప్రకృతిని గాఢంగా ప్రేమించి, దాని పరిరక్షణ కోసం తన యావజ్జీవి తాన్నీ అంకితం చేసిన యోధుడొకరు... మనిషి ప్రకృతి పట్ల సాగించే అపచారం పర్యవసానంగా పుట్టుకొస్తున్న అనేకానేక వ్యాధుల్లో ఒకటైన కరోనాకు బలికావడం దురదృష్టకరం, ఊహకందని విషయం. బ్రిటిష్‌ వలసపాలకులకు వ్యతిరేకంగా దేశంలో సుదీర్ఘకాలం సాగిన పోరాటాల పరం పరలో గాంధీజీ ఆధ్వర్యంలో సాగిన అహింసాయుత ఉద్యమం ఒక భాగం కాగా... అందులో సంగమించిన అనేకానేక పాయల్లో సుందర్‌లాల్‌ బహుగుణ ఒకరు. ప్రపంచంలో ఎత్తయిన పర్వత ప్రాంతాలనుంచి వచ్చిన బహుగుణ వ్యక్తిత్వం కూడా అదే స్థాయిలో శిఖరాయమానంగా వున్న దని గాంధీజీ అన్నారంటే అది బహుగుణ క్రియాశీలతకు దక్కిన అపురూపమైన ప్రశంస. గాంధీజీ స్ఫూర్తితో బహుగుణ హిమాలయాల్లో 4,700 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడాన్ని నిరసిస్తూ సాగుతున్న ఉద్యమాలు పాశ్చాత్య ప్రభావిత ప్రహసనాలనీ, వెనక బడిన దేశాలు ఎప్పటికీ ఎదగరాదన్న కుట్ర అందులో దాగి వున్నదనీ కొందరు నిందిస్తుంటారు. కానీ ప్రపంచంలో ఈ మాదిరి ఉద్యమాలు రావడానికి చాన్నాళ్లముందే సుందర్‌ లాల్‌ బహుగుణ హిమాలయ శిఖరాల పరిరక్షణకు ఉద్యమించారు. 


ఏదీ శూన్యం నుంచి ఊడిపడదు. తన చుట్టూ వుండే పరిస్థితులనూ, పరిణామాలనూ లోచూపుతో వీక్షిస్తే... వాటి పూర్వాపరాలను గ్రహిస్తే ఎవరైనా ఎంతటి శక్తిమంతమైన ఉద్యమ నాయకులవుతారో చెప్పడానికి సుందర్‌లాల్‌ బహుగుణ జీవితమే ఉదాహరణ. ఆయన కళ్లు తెరవ డానికి దశాబ్దాల ముందే బ్రిటిష్‌ వలసపాలకులు హిమాలయ  పరిసరాల్లో వున్న అపార ప్రకృతి సంపద కబళించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 19వ శతాబ్ది చివరిలో, 20వ శతాబ్ది మొదట్లో దేశంలో విస్తరించిన రైల్వేలకు అవసరమైన కలప కోసం హిమ వనాలపైనే పడ్డారు. 1887లో అప్పటి వలసవాద ప్రభుత్వం తీసుకొచ్చిన భారత అటవీ చట్టం ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూకబ్జాకు నాంది పలికింది. కోట్లాది వృక్షాలు కూల్చి పాలకులు సాగించిన విధ్వంసం ఫలితంగా ఆ ప్రాంత ఆదివాసీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆ తర్వాత కాలంలో తెహ్రీ సంస్థానాధీశుడు సైతం తన వంతుగా అడవుల్ని తెగనరికించాడు. దీన్ని ప్రతిఘటించినందుకు 1930లో వందమందిని కాల్చి చంపారని చరిత్ర చెబుతోంది. అడవుల రక్షణ కోసం ఇలా ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్రగల ప్రాంతంలో పుట్టిన బహుగుణ పర్యావరణ పరిరక్షణే తన జీవిత ధ్యేయంగా మలుచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏ ఉద్యమానికైనా బలమైన నినాదం ప్రాణం. సుందర్‌లాల్‌ బహుగుణ ప్రారం భించిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమం వేలాది గ్రామాలకు కార్చిచ్చులా వ్యాపించడానికి కారణం ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ అన్న నినాదమే. పర్యావరణాన్ని రక్షించుకుంటే అది మాన వాళిని అన్నివిధాలా కాపాడగల శక్తిమంతమైన ఉపకరణమవుతుందన్న చైతన్యాన్ని రగల్చడంలో ఆ నినాదం తోడ్పడింది. గఢ్వాల్‌ ప్రాంతంలో వృక్షాలను కూల్చడాన్ని నిరసిస్తూ 1972లో చిప్కో ఉద్యమం ప్రారంభమైనప్పుడు అందులో గ్రామీణ మహిళలను భాగస్వాముల్ని చేయడంలో బహు గుణ దంపతులు విజయం సాధించారు. అడవుల విధ్వంసాన్ని అంగీకరించబోమంటూ  వృక్షాలను హత్తుకుని వేలాదిమంది తెలియజేసిన నిరసన ఆరోజుల్లో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన హిమాలయ పరిరక్షణోద్యమంతోనే నిలిచిపోలేదు. నదీ సంరక్షణకు నడుంబిగించాడు. ఆనకట్టలకు వ్యతిరేకంగా పోరాడాడు. అంతకు చాన్నాళ్లముందే అస్పృశ్యత నివారణకూ, మద్యపాన దుర్వ్యసనా నికీ వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించాడు. దేశంలోని యువత, విద్యార్థిలోకం తిరగ బడుతున్న 70వ దశకంలో సుందర్‌లాల్‌ బహుగుణ సాగించిన అహింసాయుత చిప్కో ఉద్యమంపై అసహనం వ్యక్తం చేసినవారు లేకపోలేదు. ఆకలి, దారిద్య్రాల కోరల్లో చిక్కుకున్న ప్రజల కోసం పోరాడకుండా చెట్ల పరిరక్షణ కోసం జనసమీకరణ చేయడమేమిటన్న ప్రశ్నలూ తలెత్తాయి. కానీ పాలకుల అభివృద్ధి నమూనాలు ప్రకృతి విధ్వంసానికి దారితీసి, అంతిమంగా ప్రజల జీవికను దెబ్బతీస్తాయన్న స్పృహను కలిగించడంలో చిప్కో ఉద్యమం విజయం సాధించింది.


 ప్రకృతిని అమ్మగా భావించి కొలవడం దేశ కాలాలకు అతీతంగా సాగుతున్నదే. కానీ ఆ ప్రకృతిలో భాగమైన కొండకోనల్ని, వృక్ష, జంతుజాలాలనూ ప్రాణప్రదంగా భావించి వాటి సంరక్షణ లోనే తన ఉనికి కూడా ఆధారపడి వున్నదనే చైతన్యాన్ని పొందడమే అసలైన ఆధ్యాత్మికతగా భావిం చిన బహుగుణ చివరివరకూ అందుకోసమే దృఢంగా నిలబడ్డారు. ఉద్యమక్రమంలో ఆయన పట్టు విడుపులు ప్రదర్శించి వుండొచ్చు. పాలకుల వాగ్దానాలు విశ్వసించి ఆనకట్టల నిర్మాణం ఆగిపోతుంద నుకుని వుండొచ్చు. ఆయన ఉద్యమ ఫలితంగా తీసుకొచ్చిన అనేక చట్టాలు ఆచరణలో సక్రమంగా అమలు కాకపోయి వుండొచ్చు. కానీ అవేవీ ఆయన ప్రాముఖ్యతను తగ్గించలేవు. దేశంలో పర్యా వరణ పరిరక్షణ భావన ఇంతగా పెరిగిందంటే అది ఆయన నిరంతర కృషి పర్యవసానంగానే సాధ్యమైంది. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. 

మరిన్ని వార్తలు