దేశ భద్రత కోసం...

16 Dec, 2021 01:37 IST|Sakshi

రెండు కళ్ళలో ఏది ముఖ్యం అంటే ఏం చెబుతాం? ఒక కంటినే ఎంచుకోమంటే ఏం చేస్తాం? దేశ భద్రత, పర్యావరణ పరిరక్షణ – రెండూ కీలకమే. కానీ, వాటిలో ఒక దానికి తక్షణ ప్రాధాన్యం ఇవ్వాలన్నప్పుడు ఏం చేయగలుగుతాం? కొన్నేళ్ళుగా వివాదాస్పదమైన ఉత్తరాఖండ్‌లోని చార్‌ ధామ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ విషయంలో ఎదురైన చిక్కుప్రశ్న ఇదే. చివరకు, దేశ భద్రతా ప్రయోజనాల వైపే సర్వోన్నత న్యాయస్థానం కొంత మొగ్గాల్సి వచ్చింది. సున్నితమైన భారత – చైనా సరిహద్దులో అవసరాన్ని బట్టి త్వరితగతిన సైన్యాన్ని మోహరించడానికి వీలుగా హిమాలయాల్లోని 3 జాతీయ రహదారులను వెడల్పు చేయడం కీలకమని రక్షణ శాఖ భావిస్తోంది. ఆ వాదనకు సమ్మతించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ సారథ్యంలోని ముగ్గురు జడ్జీల సుప్రీమ్‌ కోర్టు ధర్మాసనం ప్రభుత్వం కోరినట్టు చార్‌ధామ్‌ ప్రాజెక్టును మంగళవారం అనుమతించింది. రోడ్ల వెడల్పు 5.5 మీటర్లే ఉండాలంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో మునుపటి ధర్మాసనం ఇచ్చిన ఆదేశాన్ని సవరించి, 10 మీటర్లకు ఓకే చెప్పింది. 

అయితే, పర్యావరణాన్ని విస్మరించరాదని కోర్టు పేర్కొనడం కొంత ఉపశమనం. గతంలో ‘హై పవర్డ్‌ కమిటీ’ ఇచ్చిన సిఫార్సులను పాటించేలా, తీవ్ర పర్యావరణ ఉల్లంఘనలు జరగకుండా చూసేలా ఓ పర్యవేక్షణ సంఘాన్ని కోర్టు నియమించింది. ఇది పర్యావరణవాదుల పోరాటానికి కొంతలో కొంత ఊరట. రూ. 12 వేల కోట్ల ఈ చార్‌ధామ్‌ ప్రాజెక్ట్‌ 900 కిలోమీటర్ల రహదారులకు సంబంధించినది. తాజాగా రోడ్ల వెడల్పుకు కోర్టు అనుమతించిన 3 జాతీయ రహదారులూ (రిషీకేశ్‌ నుంచి మనా, రిషీకేశ్‌ నుంచి గంగోత్రి, తనక్‌పూర్‌ నుంచి పిథోరాగఢ్‌) ఆ ‘చార్‌ధామ్‌ హైవే ప్రాజెక్ట్‌’లో భాగమే. చైనాతో మన దేశానికి ఉన్న ఉత్తర సరిహద్దుకు ఈ మూడు రహదారులూ దారి తీస్తాయి. ఇప్పుడిక సైకిల్‌ ప్రయాణానికి వీలు కల్పించే ‘పేవ్డ్‌ షోల్డర్‌’ ఇరువైపులా ఉండేలా రెండు లేన్ల (డీఎల్పీఎస్‌) వెడల్పాటి రోడ్లుగా ఈ హైవేలను అభివృద్ధి చేస్తారు. సైనిక దళాల అవసరాల రీత్యా ఈ విస్తరణ తప్పదని రక్షణ శాఖ మాట. సరిహద్దులో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల రీత్యా ఈ మాటను విస్మరించలేమని కోర్టు తన తీర్పులో పేర్కొనడం గమనార్హం.  

మొదట్లో చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ నాలుగు పుణ్యక్షేత్రాలు బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రికి అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేలా యాత్రికుల కోసం ఉద్దేశించినది. 2016 డిసెంబర్‌లో ప్రధాని మోదీ ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. 2013 నాటి ఆకస్మిక వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇది నివాళి అన్నారు. కానీ, ఈ ప్రాజెక్ట్‌ ఆది నుంచి వివాదాస్పదమే. హిమాలయ పర్వతాల్లో వేల సంఖ్యలో వృక్షాలను కొట్టివేస్తే కానీ, రోడ్ల విస్తరణ సాధ్యం కాదు. జీవ్యావరణ రీత్యా సున్నితమైన ఈ ప్రాంతంలో ఇప్పటికే 25 వేలకు పైగా చెట్లను కొట్టేశారట. పర్యావరణవాదుల వ్యతిరేకత అందుకే. దానికి తగ్గట్టే కోర్టులోనూ ఇబ్బందులు తలెత్తాయి. పర్యావరణ అనుమతుల్లో, నిబంధనల్లో ఉల్లంఘనలపై దుమారం రేగింది. 2018 సెప్టెంబర్‌లో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఈ ప్రాజెక్టుకు ఓకే అన్నా, అదే అక్టోబర్‌లో సుప్రీమ్‌ స్టే ఇచ్చింది.

అసలు పర్వతప్రాంతాల్లో రోడ్ల వెడల్పు 5.5 మీటర్లు మించరాదన్నది 2018లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్‌. మునుపటి సుప్రీమ్‌ ధర్మాసనం ఆ మాటనే సమర్థించింది. 2020 డిసెంబర్‌కి వచ్చేసరికి పరిస్థితి మారింది. చైనా సరిహద్దుల దాకా వెళ్ళే ఈ మూడు హైవేలకూ వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగింది. సైనిక అవసరాల కోసం రోడ్ల వెడల్పును 10 మీటర్లకు పెంచాలని రక్షణ శాఖ కోరింది. లడఖ్‌ ప్రాంతంలో చైనాతో సాగుతున్న ఘర్షణల దృష్ట్యా ఆ అభ్యర్థన న్యాయమైనదే. అరుణాచల్‌ ప్రదేశ్, టిబెట్‌ సహా సరిహద్దుల వెంట చైనా జనావాస నిర్మాణాల నేపథ్యంలో ప్రేక్షకపాత్ర పోషించలేం. వెరసి, 26 మంది సభ్యుల హై పవర్‌ కమిటీలో మెజారిటీ వర్గీయులు అంగీకరించినట్టే, సుప్రీమ్‌ సైతం ఇప్పుడు దేశ రక్షణ రీత్యా ప్రాజెక్టుకు ఓకె చెప్పింది.
  
నిజానికి, ఒక్క చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్టే కాదు... హిమాలయ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న భవన నిర్మాణాలతో భారీ పర్యావరణ నష్టం జరుగుతోంది. చార్‌ధామ్‌పై కోర్టుకెళ్ళిన ఎన్జీవో ‘సిటిజెన్స్‌ ఫర్‌ గ్రీన్‌ డూన్‌’ దీనిపైనా స్వరం పెంచింది. ఢిల్లీ – డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం గణేశ్‌పూర్‌ – డెహ్రాడూన్‌  పొడుగూతా ముందస్తు అనుమతి లేకుండా చెట్ల నరికివేయడాన్ని ఆపాలంటూ న్యాయస్థానం తలుపు తట్టింది. ఆ ఆవేదన సరైనదే. కానీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపక ముందే, డెహ్రాడూన్, దాని పరిసర ప్రాంతాల్లో దురాశాపరుల చేతుల్లో అధిక శాతం చెట్లు, పచ్చదనం నాశనమయ్యాయి. ఇష్టారాజ్యంగా సాగిన భవన నిర్మాణాలు, చెట్ల నరికివేతతో వేసవి విడుదులైన డెహ్రాడూన్, ముస్సోరీ లాంటివి ఒకప్పటి ఆహ్లాద వాతావరణాన్ని పోగొట్టుకున్నాయి. 

పర్వత ప్రాంతాల్లో ఇష్టారాజ్యపు నిర్మాణాలతో చెట్లు పోయి, రాళ్ళు పట్టు కోల్పోయి కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతుంది. అలా చూస్తే పర్యావరణ పరిరక్షణ ముఖ్యమే. కానీ, విదేశీ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ భద్రతే అతి ముఖ్యం కాకమానదు. ఆ అనివార్యత అర్థం చేసుకోదగినదే. ఇప్పుడిక చేయాల్సిందల్లా– వీలైనంత తక్కువ పర్యావరణ నష్టంతో రహదారి నిర్మాణమే! పాలకుల బాధ్యత అది. సుప్రీమ్‌ అన్నట్టు దేశ భద్రత, పర్యావరణం రెంటినీ సమతూకం చేసుకోవాలి. అదే ఇటు దేశంతో పాటు ప్రకృతికీ శ్రీరామరక్ష! 

మరిన్ని వార్తలు