మహిళకు ‘సుప్రీం’ భరోసా

1 Oct, 2022 00:20 IST|Sakshi

గర్భవిచ్ఛిత్తి విషయంలో మహిళకు స్వేచ్ఛనీయని సమాజం కపటత్వంలో బతుకుతున్నట్టేనని నార్వే మాజీ ప్రధాని బ్రంట్‌లాండ్‌ ఒక సందర్భంలో అన్నారు. అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలన్న తేడా లేకుండా చాలా సమాజాలు స్త్రీలకు ఉండాల్సిన పునరుత్పాదక హక్కుల సంగతి వచ్చేసరికి వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తున్న వేళ గురువారం మన సర్వోన్నత న్యాయస్థానం వైద్యపరమైన గర్భవిచ్ఛిత్తి (ఎంటీపీ) చట్టాన్ని విస్తృతపరుస్తూ ఇచ్చిన తీర్పు స్వాగతించదగ్గది.

సురక్షిత అబార్షన్‌ వారి వారి వైవాహిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఉండే తిరుగులేని హక్కని ఈ తీర్పు తేల్చిచెప్పింది. అవాంఛిత గర్భం పొందిన సందర్భాల్లో  గర్భస్రావం చేయించుకునే హక్కు వివాహితతోపాటు సహజీవన సంబంధంలో ఉండే మహిళలకు సైతం ఉంటుందని తెలిపింది. వైవాహిక సంబంధాల్లో మహిళ ఇష్టం లేకుండా లైంగిక సంపర్కంలో పాల్గొ నటం అత్యాచారంగా పరిగణించాలా లేదా అనే అంశం మరో ధర్మాసనం పరిశీలనలో ఉండగానే అటువంటి సందర్భాల్లో సైతం అబార్షన్‌కు మహిళకు అవకాశమీయడం కొనియాడదగింది.

‘మహిళ’ నిర్వచనాన్ని కూడా విస్తృతీకరించటం ఈ తీర్పు విశిష్టత. జన్మతహా గుర్తించే జెండర్‌ని మాత్రమే పరిగణించే పద్ధతిని మార్చి ‘గర్భం ధరించగల వ్యక్తులందరికీ’ పునరుత్పాదక హక్కులు సమానంగా వర్తిస్తాయని తీర్పు విశదీకరించింది. ఇందువల్ల లింగనిర్ధారణ చట్రంలో ఇమడని ట్రాన్స్‌జెండర్, నాన్‌ బైనరీ జెండర్‌లకు సంబంధించిన వ్యక్తులకు కూడా గర్భవిచ్ఛిత్తి హక్కులు సమకూరుతాయి. 24 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలంటూ చేసుకున్న వినతిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్‌ చేస్తూ  ఒక అవివాహిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది.

నైతిక విలువల మాటెలా ఉన్నా మారుతున్న సమాజ పోకడల వల్ల పెళ్లికాకుండా తల్లులవు తున్నవారి సంఖ్య గణనీయంగానే ఉంటున్నది. పర్యవసానాలు తెలియని అమాయకత్వం వల్లనో లేదా ఆప్తులనుకున్నవారి లైంగిక నేరాల వల్లనో, అపరిచిత వ్యక్తుల అఘాయిత్యాలవల్లనో బాలికలు గర్భవతులవుతున్నారు. అలాంటివారు వేరే దారిలేక నాటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇక వైవాహిక బంధానికి వెళ్లకుండా ఒంటరిగా ఉందామనుకునేవారికి సైతం ప్రస్తుత చట్ట నిబంధనలు పెద్ద ఆటంకంగా మారాయి. గర్భస్రావానికి సిద్ధపడాలో లేదో తేల్చుకోవాల్సింది సంబంధిత మహిళే తప్ప ఆమె కుటుంబం కాదని అనటం, డాక్యుమెంట్లు, న్యాయపరమైన అనుమతి అవసరమనటం సరికాదని ధర్మాసనం చెప్పటం ఎందరికో ఊరటనిస్తుంది.

పితృస్వామిక భావజాల చట్రం పరిధి లోనే ప్రభుత్వాలూ, కింది కోర్టులూ ఆలోచించిన కారణంగా అవాంఛిత గర్భాలను తొలగించు కోవటం మహిళలకు కష్టంగా మారింది. 2003లో వచ్చిన ఎంటీపీ నిబంధనలు సహజీవన సంబంధంలో ఉన్న మహిళ గర్భవిచ్ఛిత్తి చేసుకోవటం విషయంలో మౌనం వహించాయి. ఢిల్లీ హైకోర్టు ఆ నిబంధనలను ప్రాతిపదికగా తీసుకుని ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. చట్టాలు, నిబంధనలు చేసినప్పుడు ప్రస్తావనకు రాని అంశాలు ఆచరణలో సమస్యాత్మకం కావటం విడ్డూర మేమీ కాదు. అటువంటప్పుడు సృజనాత్మకంగా అన్వయించటం, చట్టం లేదా నిబంధనల పరిధిని విస్తృతపరచటం న్యాయస్థానాల బాధ్యత.

సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆ పని చేసింది. అంతేకాదు... పునరుత్పత్తి హక్కుల విషయంలో ప్రభుత్వాల బాధ్యతను కూడా గుర్తుచేసింది. అందరికీ సురక్షిత లైంగిక విధానాలు, గర్భనిరోధక సాధనాల ప్రాముఖ్యతను తెలియజేయటం ప్రభుత్వాల విధి అనీ, తగిన వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉంచటం అవసరమనీ సూచించటం మెచ్చ దగింది. తాను శారీరకంగా, మానసికంగా గర్భస్రావాన్ని తట్టుకోగల స్థితిలో ఉన్నానో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛ మహిళకే ఇచ్చి, మెడికల్‌ బోర్డుల పెత్తనాన్ని తొలగించటం ఈ తీర్పులోని మరో కీలకాంశం. ఏ మహిళైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మెడికల్‌ బోర్డు ఏర్పాటుచేయటం ఆనవాయితీగా మారింది. ఆ బోర్డు సభ్యులు రకరకాల పరీక్షలతో కాలయాపన చేయటం, చివరకు గర్భం కొనసాగించక తప్పకపోవటం రివాజయింది. 

ఎంతో ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే అమెరికాలోని సుప్రీంకోర్టు అబార్షన్‌ హక్కుల విషయంలో ఈమధ్య ఎంతటి సంకుచితమైన తీర్పునిచ్చిందో అందరికీ తెలుసు. 1973, 1992 కేసుల్లో మహిళలకు లభించిన అబార్షన్‌ హక్కుల్ని అమెరికన్‌ సుప్రీంకోర్టు తీర్పు కాల రాసింది. ఢిల్లీ హైకోర్టు సైతం ఆ తోవనే వెళ్లటంతో కొందరు మహిళా సంఘ నేతలు మన సుప్రీంకోర్టు నిర్ణయంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. కానీ తాజా తీర్పు మహిళలకు భరోసాగా నిలిచింది. మహిళకు తన శరీ రంపై పూర్తి హక్కు ఉంటుందనీ, పిల్లల్ని కనాలో వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆమెదేననీ చెప్పటం అత్యంత విలువైన మాట.

అయితే గర్భవిచ్ఛిత్తి చట్టపరంగా మాత్రమే కాదు... సామాజికంగా కూడా ఆమోదనీయమయ్యేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. ఎంటీపీ చట్ట నిబంధనల వెలుపల గర్భస్రావం చేయించుకోవటం ఇప్పటికీ నేరంగానే పరిగణిస్తున్నారు. జిందాల్‌ లా స్కూల్‌ నివేదిక సూచించినట్టు తగినంతమంది రేడియాలజిస్టులు, ప్రసూతి వైద్య నిపుణులు, పిల్లల వైద్య నిపు ణులు, గైనకాలజిస్టులు అందుబాటులో ఉండేలా చేస్తేనే గర్భస్రావం ప్రాణాంతకమయ్యే స్థితి నుంచి మహిళలు బయటపడతారు. ఆ దిశగా చర్యలు అవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి. 

మరిన్ని వార్తలు