అధికార పీఠంపై తాలిబన్‌లు

10 Sep, 2021 00:54 IST|Sakshi

అమెరికాపై ఉగ్రదాడి జరిగి మరో 4 రోజుల్లో రెండు దశాబ్దాలు పూర్తవుతుందనగా మంగళవారం తాలిబన్‌లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే రోజు కాబూల్‌లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నవారిలో ఒక మహిళపై తుపాకి గురిపెట్టిన తాలిబన్‌ దళ సభ్యుడి చిత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగా వైరల్‌ అయింది. తాలిబన్‌ల ఏలుబడి తీరుతెన్నులు ఎలా ఉంటాయో చెప్పే ప్రతీకాత్మక చిత్రం ఇది. 

ఆ మరుసటి రోజే మహిళల ధర్నాను చిత్రీకరించిన టెలి విజన్‌ పాత్రికేయులిద్దరిని ఒళ్లంతా నుజ్జు చేసిన చిత్రాలు బయటికొచ్చాయి. తాలిబన్‌లతో రహ స్యంగా రెండేళ్లక్రితం చర్చలు ప్రారంభం కావడానికి చాలా ముందు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏం చెప్పారో ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. తాలిబన్‌లలో మంచివారు, చెడ్డవారు ఉన్నారని, మంచివారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని ఆయన అప్పట్లో ప్రకటించారు. తాజాగా కాబూల్‌లో కొలువుదీరిన ప్రభుత్వం అన్ని మంచి చెడ్డల్నీ గాలి కొదిలినట్టు కేబినెట్‌ కూర్పు చూస్తే అర్థమవుతుంది.

 90వ దశకంలో అఫ్గాన్‌ అధికారాన్ని చేజిక్కిం చుకున్న తర్వాత ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మాదిరే ఇప్పుడు కీలకమైన పదవులన్నీ ప్రధాన తెగ అయిన పష్తూన్‌లకు దక్కాయి. 33 మంది కేబినెట్‌లో ఒక ఉప ప్రధాని పదవి ఉజ్బెక్‌ తెగకు చెందిన వ్యక్తికి, సైనిక దళాల ప్రధానాధికారి పదవి తజిక్‌ తెగ నేతకు అప్పగించారు. తక్కినవారంతా పష్తూన్లే. అమెరికా కనుసన్నల్లో మొన్నటివరకూ నడిచిన సర్కారులో కీలక పదవులు అనుభవించిన హజారా తెగకు ఈసారి మొండిచేయి చూపారు. జనాభాలో అయిదోవంతు కంటే అధికంగా ఉన్న హజారాలు షియాలు. వారికి కూడా పదవులు కట్టబెట్టాలని ఇరాన్‌ ఎంతగా కోరినా సున్నీలైన తాలి బన్‌లు బేఖాతరు చేశారు. దేశంలో హజారాలు అందరికన్నా బాగా చదువుకున్నవారు. రాజకీ యంగా చురుగ్గా పనిచేస్తున్నవారు. తాలిబన్‌ల పాలనకు ఇకపై వీరినుంచి సహజంగానే సవాళ్లు ఎదురవుతాయి. మహిళలకు ప్రభుత్వంలో చోటేలేదు. ఈ సంగతలా ఉంచి  అమెరికా, నాటో దళా లపై జరిగిన పలు ఉగ్ర దాడులకు కారకుడని అమెరికా బలంగా విశ్వసిస్తున్న సిరాజుద్దీన్‌ హక్కానీ దేశ ఆంతరంగిక భద్రతామంత్రి అయ్యాడు. ఇరవైయ్యేళ్లుగా అతన్ని అరెస్టు చేయడానికి అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే సిరాజుద్దీన్‌ ఆచూకీ చెప్పినవారికి భారీ నజరానా ప్రకటించింది. ఆయన్ను ఆంతరంగిక మంత్రిని చేయడం ద్వారా... ఎన్నో అవమానాల మధ్య అఫ్గాన్‌ నుంచి నిష్క్రమించి, పరాభవంతో కుంగిపోయివున్న అమెరికాను మరింతగా దెబ్బతీసినట్టయింది. 

తాలిబన్‌లతో చర్చిస్తున్న క్రమంనుంచి వారు అల్‌ కాయిదాతో సంబంధాలు వదులుకుంటామని హామీ ఇచ్చారని అమెరికా చెబుతూ వచ్చింది. కానీ కుదరబోయే శాంతి ఒప్పందంపై తాలిబన్‌లు ఎప్పటికప్పుడు అల్‌ కాయిదాతో సంప్రదింపులు జరు పుతూనే వచ్చారు. పర్యవసానంగానే ఇప్పుడు ఆ సంస్థకు సన్నిహితుడైన సిరాజుద్దీన్‌కు కీలక పదవి దక్కింది. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌ పార్టీ కాకస్‌కు నేతృత్వం వహిస్తున్న కమిటీ అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాదుల చేత, ఉగ్రవాదుల కోసం ఏర్పడిన ఉగ్రవాదుల ప్రభుత్వం’గా అభివర్ణిం చింది. అయితే ఈ దుస్థితికి ప్రధానంగా తామే కారకు లమని ఆ కమిటీ గ్రహించినట్టు లేదు.

ఏ సాకు చెప్పుకున్నా అఫ్గాన్‌ దురాక్రమణ నిర్ణయం అత్యంత దారుణమైన, అనాగరికమైన చర్య అని అమెరికా గుర్తించాల్సివుంది. ఎలాంటి పాలన అవసరమో, ఎవరు అధికార పీఠంపై ఉండాలో నిర్ణయించుకోవాల్సింది అఫ్గాన్‌ పౌరులే తప్ప తాము కాదన్న ఇంగితం దానికి లేకపోయింది. తాలి బన్‌ మత ఛాందసవాదం ఆ దేశానికే కాక, మొత్తంగా మధ్య ఆసియాకు ముప్పు కలిగించేదే. కానీ దాని పుట్టుకకూ, విస్తరణకూ, అది బలంగా వేళ్లూనుకోవడానికీ తామే కారకులమని ఇప్పటికీ అమె రికా అంగీకరించడంలేదు. దురాక్రమించినప్పటి బాధ్యతారాహిత్యాన్నే నిష్క్రమణలోనూ ప్రదర్శిం చింది. మిత్ర కూటమి నాటోకు, అఫ్గాన్‌ సర్కారుకు సైతం తెలియకుండా తాలిబన్‌లతో అంగీకారా నికొచ్చింది. ఐక్యరాజ్యసమితి మొదలుకొని ఎన్నో ప్రపంచ వేదికలుండగా, అన్ని దేశాలనూ భాగ స్తులను చేయాల్సివుండగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. 

మతం ఏదైనా వ్యక్తిగత విశ్వాసాల పరిధిని దాటి పబ్లిక్‌లోకి వస్తే... అధికారంతో అంటకాగితే పర్యవసానాలెలా ఉంటాయో అన్ని దేశాల్లోనూ దశాబ్దాలుగా రుజువవుతూనే ఉంది. మన పొరు గున పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇంకా పశ్చిమాసియా, ఆఫ్రికా ఖండ దేశాలు మత ఛాందస వాదం ఉగ్రరూపం చూశాయి. చూస్తున్నాయి. పశు మాంసం తింటున్నారన్న సాకుతో తోటి మనుషు లను కొట్టి చంపిన ఉదంతాలు మన దేశంలో అనేకం జరిగాయి. రిపబ్లికన్‌ ఏలుబడి ఉన్న అమెరికా లోని టెక్సాస్‌ రాష్ట్రంలో తాజాగా అబార్షన్‌లను నిషేధించి, మహిళల హక్కులను కాలరాస్తున్న వైనం వెనుక క్రైస్తవ మత ఛాందసం దాగుంది. వాటి సంగతలావుంచి అఫ్గాన్‌లో తాలిబన్‌ల ఏలుబడితో అరాచకానికి తెరపడినట్టయిందని చైనా పరవశిస్తోంది. పాకిస్తాన్‌ సరేసరి. అది తాలిబన్‌ ప్రభు త్వంలో ఎవరుండాలో, ఉండకూడదో నిర్దేశిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రెండు దేశాల ప్రభా వాన్నీ తగ్గించి తాలిబన్‌లనుంచి ముప్పు లేకుండా చూసుకోవటం మన దేశం ముందున్న ప్రధాన సవాలు. త్వరలో తజకిస్తాన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ)లో ఈ విషయాన్ని లేవనెత్తడంతోపాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. 

మరిన్ని వార్తలు