మాటలు పలుచన

13 Mar, 2023 00:50 IST|Sakshi

జె.డి.శాలింజర్‌ తన నవల ‘క్యాచర్‌ ఇన్‌  ద రై’తో ప్రఖ్యాతం. అమెరికాలో లక్షల మంది అభిమానులను సంపాదించుకుని ఒక్కసారి కలిస్తే చాలు, చెప్పేది వింటే బాగుండు అని తహతహలాడించాడు. కాని ఎప్పుడూ జనం మధ్యలోకి రాలేదు. శాలింజర్‌ని ఇంటర్వ్యూ చేయడానికి మహామహులు ప్రయత్నిస్తే ఆశాభంగమే ఎదురైంది. అమెరికాలో తన నవల ‘హౌ టు కిల్‌ ఎ మాకింగ్‌బర్డ్‌’తో సంచలనం సృష్టించిన రచయిత్రి హార్పర్‌ లీ ఎవరినీ తన ఇంటిలోకి అడుగు పెట్టనీయలేదు. ఆమెని చూడాలని, ఇంటర్వ్యూ చేయాలని ఎందరో ప్రయత్నించి ఆమె ఇంటి గేట్‌ బయట నుంచే వెనుతిరిగే వారు.

ప్రఖ్యాత కవి సాహిర్‌ లూధియాన్వీ తాను పాల్గొనే ముషాయిరాల్లో కవితా జ్ఞానం లేని శ్రోతలను గమనించాడంటే నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టేవాడు. సంఘంలో గొప్పలు చెప్పుకోవడానికి కొంతమంది శ్రీమంతులు అతడు పాల్గొనే ప్రయివేటు ముషాయిరాలకు వచ్చినా వారికీ అదే గతి పట్టేది. అతణ్ణి ఇంటర్వ్యూ చేయడం దుర్లభం. చేయాలనుకున్న వ్యక్తికి ఉర్దూ సాహిత్యం, కవిత్వం కూలంకషంగా తెలిసి ఉండాలి. ‘నా గురించి నీకేం తెలుసో చెప్పు. అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తాను’ అనేవాడు. 

మాటలకు చాలా విలువ ఉంటుంది. మాట్లాడే మనిషిని బట్టి, మాటలను వెలికి తీసే మనిషిని బట్టి ఆ  సంభాషణ, ముఖాముఖికి విలువ వస్తుంది. ఓప్రా విన్‌ ఫ్రే తన ఇంటర్వ్యూలతో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఆమె తన నైపుణ్యంతో ఎదుటివారి మాటల్లో ఉండే జ్ఞాపకాల గాఢతను వెలికి తెస్తుంది. ఆమె మైకేల్‌ జాక్సన్‌ని ఇంటర్వ్యూ చేస్తే ఆ రోజుల్లో కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయి చూశారు. ఇప్పటికీ అమెరికన్‌  టెలివిజన్‌  చరిత్రలో అదే ఎక్కువ వ్యూయర్‌షిప్‌ పొందిన ఇంటర్వ్యూ. అడిగేవారి అంతస్తు చెప్పే వారి అంతస్తు తాలుమేలుగా కలిసినప్పుడు వచ్చే విలువ, గౌరవం అది. 

మన దేశంలో కూడా మంచి సంభాషణతో వ్యక్తిత్వాలను వెలికి తీసే పని స్త్రీలే మొదలెట్టారు. దూరదర్శన్‌లో నాటి బాలనటి తబస్సుమ్‌ చేసే టాక్‌ షోలకు విశేషంగా ఆదరణ ఉండేది. ఆమె తమను ఇంటర్వ్యూ చేయడం చాలామంది గౌరవంగా భావించేవారు. ఆ తర్వాత నటి సిమీ గెరేవాల్‌ చాలా విపులమైన ఇంటర్వ్యూలు చేసి అది చాలా శ్రద్ధతో పని చేయవలసిన రంగమని చాటింది.

జయలలిత వంటి మొండిఘటం చేత తన ఇంటర్వ్యూలో పాట పాడించింది సిమీ. రతన్‌  టాటా, రాజీవ్‌ గాంధీ, రాజ్‌ కపూర్‌... వీరందరూ ఆమెతో మాట కలిపినవారిలో ఉన్నారు. రజత్‌ శర్మ ‘ఆప్‌ కీ అదాలత్‌’ ఒక భిన్నమైన ఫార్మాట్‌తో నింద–సంజాయిషీల ద్వారా చాలా మంది వ్యక్తిత్వాలను ప్రదర్శనకు పెట్టింది. ఆ తర్వాత చాలా కాలానికి ఆమిర్‌ ఖాన్‌  ‘సత్యమేవ జయతే’ షోతో ముఖాముఖి కార్యక్రమాలు తన వంటి సూపర్‌ స్టార్‌ నిర్వహించడం వల్ల వచ్చే సీరియస్‌నెస్‌ను, సామాజిక ప్రయోజనాన్ని లోకానికి తెలియచేశాడు.

అయితే రాను రాను ఈ మాటల సేకరణ ఒక జీవనోపాధిగా మారింది. ప్రముఖులతో సంభాషణలు వినోదానికి, హాస్యానికి, కాలక్షేపానికి వనరుగా మారాయి. కరణ్‌జోహార్‌ వంటి హోస్ట్‌లు మునిగాళ్ల లోతుకే ఎదుటివారిని ఉంచుతూ సగటు ప్రేక్షకులను ఉత్సుకత పరిచే కబుర్లను వినిపించడం మొదలెట్టారు. శేఖర్‌ సుమన్‌  ‘మూవర్స్‌ అండ్‌ షేకర్స్‌’ ఇదే కోవలోకి వస్తుంది.

కపిల్‌ శర్మ వంటి వారు బయలుదేరి హాస్యం కోసం ఎదుట ఉన్నది ఎవరైనాసరే వారితో నేలబారు మాటలు మాట్లాడించవచ్చని నిరూపించారు. ప్రచారం కోసం, ఏదో ఒక విధాన గుర్తుండటం కోసం ఒకనాడు తమ తమ రంగాలలో ఎంతో కృషి చేసినవారు కూడా ఇలాంటి షోలకు హాజరయ్యి ‘మీ ఇంట్లో సబ్బు అరిగిపోతే ఏం చేస్తారు?’ వంటి ప్రశ్నలకు జవాబులు ఇస్తూ వారి అభిమానులను చానల్‌ మార్చేలా చేస్తున్నారు.

ఇప్పుడు ఈ మాటల సేకరణ పతాక స్థాయికి చేరింది. యూ ట్యూబ్‌ పుణ్యాన ప్రతి ఒక్కరూ కాసిన్ని వీడియోల కోసం, వాటి మీద వచ్చే జరుగుబాటు కోసం మైక్‌ పట్టుకుని సాంస్కృతిక, కళారంగాల్లో ఉన్న రకరకాల స్థాయి పెద్దల వెంటబడుతున్నారు. వీరికి తాము ఇంటర్వ్యూ చేస్తున్న కళాకారుల/సృజనకారుల గురించి ఏమీ తెలియదు. అధ్యయనం చేయరు. గతంలో ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో తెలుసుకోరు. ‘చెప్పండి సార్‌... చెప్పండి మేడమ్‌’ అంటూ ‘చెప్పండి’ అనే ఒక్కమాట మీద ఇంటర్వ్యూలు ‘లాగిస్తున్నారు’.

విషాదం ఏమంటే గొప్ప గొప్ప గాయనీ గాయకులు, నటీనటులు, సంగీతకారులు, రచయితలు, రాజకీయవేత్తలు, దర్శకులు, నిర్మాతలు... వీరి ‘బారిన’ పడుతున్నారు. తమను అడుగుతున్నవారు ‘పిల్లకాకులు’ అని తెలిసినా క్షమించి జవాబులు చెబుతున్నారు. ‘హోమ్‌ టూర్‌’ అని వస్తే తమ ఇళ్లు బార్లా తెరిచి చూపిస్తున్నారు. పిచ్చి ప్రశ్నలకు హతాశులవుతూనే ఏదో ఒకటి బదులు ఇస్తున్నారు. వారికి ఉన్న అభిమానులు వారి పట్ల ఉండే గౌరవాన్ని పోగొట్టుకునేలా ఈ ఇంటర్వ్యూలు ఉంటున్నాయి. అన్నింటినీ మించి వీరి ఇంటర్వ్యూలలోని శకలాలను వక్రీకరించే థంబ్‌నైల్స్‌తో పోస్ట్‌లు వస్తుండటం దారుణం. 

దినపత్రికలు పలుచబడి, అచ్చులో వచ్చే ఇంటర్వ్యూల స్థలం కుదింపునకు లోనయ్యాక సంభా షణలు, ముఖాముఖీలు ఇప్పుడు ఎలక్ట్రానిక్‌/డిజిటల్‌ మీడియాలోనే సాగుతున్నాయి. కొత్తగా మొదలైన ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌ తమ సబ్‌స్క్రిప్షన్‌ లు పెంచుకోవడానికి పాపులర్‌ సినిమా స్టార్‌లను రంగంలోకి దింపి ఆ స్టార్‌ల ములాజాతో ఇతర స్టార్‌లను పిలిపించి టాక్‌షోలు నిర్వహిస్తున్నాయంటే ఊహించుకోవచ్చు. ఈ షోలన్నీ ఉంటే ఉండొచ్చు. కాని మాటను పలుచన చేయరాదు.పెద్దలారా! మాటకు విలువివ్వండి! మీ పెద్దరికానికి మాటతో మాట రానీకండి!! 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు