అక్షరాల ఉత్సవం

23 Jan, 2023 00:53 IST|Sakshi

మనుషులతో కూడిక మనిషికి ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇల్లు విడిచి బయటకు కదిలే సందర్భాలు తిరిగి ఉత్సాహంగా ఇల్లు చేరడానికి, చేయవలసిన పనిలో పునర్‌లగ్నం కావడానికి దోహదం చేస్తాయి. కదలకుండా ఉండిపోయే మనిషిని కదల్చడానికి, తోటి మనిషిని కలవడానికి, లోకం తెలుసుకోవడానికి పెద్దలు పూర్వం ఆధ్యాత్మికత పేరుతోనైనా కూడికలు ఏర్పాటుచేశారు. జాతరలు, తిరునాళ్లు, తీర్థయాత్రలు, పుష్కరాలు, కుంభమేళాలు... ఇవన్నీ మనిషిని కదిల్చి తనలాంటి మనుషులను కలిసేలా చేస్తాయి. భారతీయులు ఈ నిష్ఠను పాటించడంలో ఎప్పుడూ ముందే ఉన్నారు. తెలుగువారు అందుకు సరిసమానం కాకుండా ఎలా ఉంటారు? మన జాతరలు కిటకిటలాడతాయి. మన పుణ్యక్షేత్రాలు కళకళలాడతాయి. అయితే సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు సంబంధించి ఈ నిష్ఠ మనలో ఏ మేరకు ఉన్నదన్నది ప్రశ్న. సాహిత్యం కోసం కదలడం, సంస్కృతికై కూడటం.

సంవత్సరంలో ఒకసారి ప్రపంచంలోని గొప్ప గొప్ప తెలుగు కూచిపూడి కళాకారులందరూ విజయవాడ కూచిపూడి ఉత్సవంలో పాల్గొంటారు. ఆ ఉత్సవం చూడటానికి దేశ విదేశాల నుంచి అతిథులు వస్తారు. సంవత్సరంలో ఒకసారి ప్రపంచంలోని తెలుగు మేటి జానపద కళాకారులందరూ ఆదిలాబాద్‌లో జమ అవుతారు. వేదికలు అదరగొడతారు. చూడటానికి దేశం కదిలి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి తెలుగు నాటకరంగ దిగ్గజాలందరూ నాటకాలతో తెనాలికి పొలోమంటారు. వారం రోజుల పాటు గొప్ప గొప్ప నాటకాలు ప్రదర్శిస్తారు. ఈ నాటక ఉత్సవం కోసం ప్రేక్షకులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. తిరుపతిలో వీనుల విందుగా శాస్త్రీయ సంగీత ఉత్సవాలు జరుగుతాయి. త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య మార్మోగుతారు. సీట్లు దొరక్క ప్రేక్షకులు అవస్థ పడతారు. వరంగల్‌లో అద్భుతమైన చిత్రకళా ఉత్సవం జరుగుతుంది. తెలుగు చిత్రకారులందరూ తరలివస్తారు. రంగులు, బ్రష్షులు పట్టుకుని చిన్నారులు చూడ పరిగెడతారు. ప్రతి ఏటా హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రపంచంలోని ఉత్తమ సినిమా నిపుణులకు ఆహ్వానం పలుకుతుంది. స్పీల్‌బర్గ్, కామెరూన్‌ వంటి వారు సినిమాల గురించి మాట్లాడతారు. కొత్త తరానికి ఉత్సాహాన్ని ఇస్తారు. ఇలా జరుగుతున్నదా? ఇలా ఎందుకు జరగడం లేదు?

స్వర్ణకాలం అంటే కొత్త అపార్ట్‌మెంట్‌లో చదరపు అడుగు ఆరున్నర వేలు పలకడం కాదు. కొత్త కార్లు రోడ్ల మీద కిటకిటలాడటం కాదు. ప్రజలు తమ సాంస్కృతిక అభిరుచిని సజీవంగా ఉంచుకునే కాలం. కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, నటీనటులు, వాద్యకారులు, చిత్రకారులు, హస్తకళా మాంత్రికులు తమ సృజనను ఉన్నతీకరించుకుంటూ సమాజంతో అనుసంధానం చేస్తూ పరస్పర సంలీనతతో పురోగమించే కాలం స్వర్ణకాలం. కళలకు ఆదరణ లభించిన అట్టి కాలమే చరిత్రలో నమోదయ్యింది. అలాంటి కాలం కొరకు ఏం చేయాలి? 16 ఏళ్ల క్రితం జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ ప్రారంభించినప్పుడు వేదికకు ఒక మూల నిలుచుని యాభై మందైనా వస్తారా అని బితుకుబితుకుమన్నా. ఇవాళ చూడండి వేలాదిగా పోటెత్తుతున్నారు అని ఆ ఫెస్టివల్‌ నిర్వాహకుడు సంజొయ్‌ కె.రాయ్‌ అన్నాడు. అతడు ప్రయత్నం మొదలెట్టాడు. తర్వాత ప్రజలు తోడు నిలిచారు. కనుకనే జైపూర్‌లో ఏటా జనవరిలో జరిగే జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌కు వందల మంది రచయితలు, వేలాదిగా పాఠకులు తరలి వస్తారు. ఆ సంవత్సరంలో ఇంగ్లిష్‌లో కొత్త పుస్తకాలు రాసిన, అనువాదమైన రచయితలు మాట్లాడతారు. అంతర్జాతీయ అవార్డు రచయితలు అందరిలో ఒకరై కనిపిస్తారు. ఆలోచనల మార్పిడి జరుగుతుంది. రచయితలు ఇదంతా మన సమూహం అని ఊపిరి నింపుకొంటారు. విద్యార్థులు హాజరై ప్రశ్నలు సంధిస్తారు. సృజన ఒక తరం నుంచి మరో తరాన్ని తాకుతుంది.

సాహిత్యాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం అంటే సంస్కృతినీ, భాషనూ సెలబ్రేట్‌ చేసుకోవడం. జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ స్ఫూర్తితో ఇవాళ దేశంలో ఎన్నో లిటరేచర్‌ ఫెస్టివల్స్‌ జరుగుతున్నాయి. పర్వత ప్రాంతాల వారు డెహరాడూన్‌లో, పంజాబ్‌ వారు కసౌలీలో, కేరళ వారు కోళిక్కోడ్‌లో, బెంగాలీలు కోల్‌కతాలో, కన్నడిగులు బెంగళూరులో, తమిళులు చెన్నైలో.. ప్రతి ఏటా లిటరేచర్‌ ఫెస్టివల్స్‌ జరుపుకొంటున్నారు. ఇతర ప్రాంతాల రచయితలను ఆహ్వానిస్తున్నారు. ప్రజలు వీటికి హాజరై సృజనకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. తమ జాతి మక్కువను నిరూపించుకుంటున్నారు.

మరి తెలుగులో? ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లో మొక్కుబడిగా సాగే ‘హైదరాబాద్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’ తప్ప ఘనమైన తెలుగు లిటరేచర్‌ ఫెస్టివల్స్‌ మనకు లేవు.  కన్నడ రచయితలు ఎక్కడ ఉన్నా ఏటా జాతీయ కన్నడ రచయితల ఉత్సవం పేరుతో ఏదో ఒక ఊరిలో కలుస్తారు. తెలుగు రచయితలు పక్క జిల్లా రచయితలతో కలిసే సందర్భాలు ఏర్పడవు. సాంస్కృతిక మందకొడితనం ఎందుకు మనలో మెండుగా ఉంటుందో తెలియదు. తెలుగు మహాసభలు జరగవు. భాషా ఉత్సవాలు జరగవు. మహా రచయితల శత జయంతులకు కూడా చీమ చిటుక్కుమనదు. 

పరిషత్‌ పోటీలు కొనఊపిరితో ఉంటాయి. మరో భాషలో రాసే రచయితను జీవిత కాలంలో ఒక్కసారైనా కలవకుండానే మన రచయితలు బావి బతుకులకు పరిమితమైపోతారు. ఇలా ఉంటే తెలుగు సాహిత్యస్థాయి మెరుగయ్యి ఎల్లలు దాటడం కల్ల. పెళ్లిళ్లు ఘనంగా చేయడమూ, భారీ కల్యాణ మంటపాలు కట్టడమూ జరుగుతున్న ఈ కాలంలో పన్నెండు కోట్ల మంది తెలుగువారు తమ తెలుగు సాహిత్యాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి సంవత్సరానికి ఒకసారి ఒక ఉత్సవం జరుపుకోలేకపోవడమే అమోఘమైన దారుణం. అత్యద్భుత విషాదం.  

మరిన్ని వార్తలు