తుపాకీ బలి కోరుతుంది!

27 May, 2022 00:30 IST|Sakshi

అపరిమితమైన తుపాకీ అమ్మకాలు... బాధ్యత లేని ప్రవర్తనలు. అమెరికాలో తరచూ జరుగుతున్న సామూహిక కాల్పుల ఘటనలపై ఓ ఆయుధ నిపుణుడి సంక్షిప్త వ్యాఖ్య ఇది. ఇటీవలే న్యూయార్క్‌ దగ్గరి బఫలోలో పది మంది నల్లజాతి అమెరికన్ల హత్యాకాండ సాగింది. పదిరోజులైనా గడవక ముందే మంగళవారం టెక్సాస్‌ రాష్ట్రం, ఉవాల్డేలోని ప్రాథమిక పాఠశాలలో 19మంది చిన్నారు లనూ, ఇద్దరు టీచర్లనూ బలిగొన్న కాల్పుల ఘటన నివ్వెరపరుస్తోంది. తల్లితండ్రుల గర్భశోకం చూస్తుంటే గుండె చెరువవుతోంది. అమెరికాలో ప్రబలిన ప్రమాదకర «ధోరణికి తాజా ఈ ఘటనలు ప్రతీకలు. ఏటేటా పెరుగుతున్న ఈ కాల్పులతో అక్కడి ఆయుధాల చట్టంపై మళ్ళీ చర్చ రేగుతోంది. 

అగ్రరాజ్యం అమెరికాలో జాతి దుర్విచక్షణ దాడులు, బజార్లు – బడులు – బహిరంగ ప్రదేశాల్లో అమాయకులపై కాల్పులు ఇప్పుడు తరచూ వింటున్నాం. గత నాలుగు దశాబ్దాల్లో ఇవి బాగా పెరిగాయి. చిత్రం ఏమిటంటే, ఈ దురంతాలకు పాల్పడ్డవారిలో అధిక శాతం మంది చట్టబద్ధంగా తుపాకీలు కొనుక్కున్నవారే. గణాంకాలు చూస్తే, అమెరికా పౌరుల వద్ద సొంతంగా 39 కోట్ల మారణాయుధాలు ఉన్నాయి. ప్రతి 100 మంది పౌరులకూ 120కి పైగా తుపాకీలు ఉన్నాయన్న మాట. ఇది ప్రపంచంలోకెల్లా అత్యధిక తలసరి ఆయుధస్వామ్యం. సంక్షుభిత యెమెన్‌ లాంటి చోట్ల కన్నా ఇది ఎక్కువ. చేతిలో సొంత ఆయుధంతో అమెరికాలో విచక్షణారహిత వాడకమూ పెరిగింది. ఆయుధ కొనుగోళ్ళు, వాడకంపై అనేక విధాన మార్పులు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. గత యాభై ఏళ్ళలో 14 లక్షల మందికి పైగా అమెరికా పౌరులు ఈ తుపాకీ సంస్కృతికి బలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయుధాల కొనుగోలు, వాడకంపై చట్టాలను కఠినతరం చేయాలన్న వాదన అమెరికాలో పదే పదే వినిపిస్తోంది. కానీ, అనేక కారణాలతో అది సాధ్యం కాకపోవడం విచారకరం. 

అమెరికా రాజ్యాంగంలోని ‘రెండో సవరణ’ పౌరులకు చిరకాలంగా సొంత ఆయుధాల హక్కు కల్పిస్తోంది. మారిన పరిస్థితుల్లో దీన్ని మార్చాలనే చర్చ చాలాకాలంగా ఉన్నదే. ఒబామా, డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఇవాళ్టి జో బైడెన్‌ దాకా దేశాధ్యక్షులు సైతం అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఈ తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా పలుమార్లు భావోద్వేగ ప్రసంగాలు చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పేమీ రాలేదన్నది చేదు నిజం. సొంతంగా తుపాకీల కొనుగోలును సమర్థించేవారు, వ్యతిరేకించేవారుగా అమెరికా సమాజం, రాజకీయవాదులు రెండు వర్గాలుగా చీలారు. ఈ అంశాన్ని రాజకీయకోణంలో చూడడం మరీ దురదృష్టకరం. డెమోక్రాట్లు చట్టాల్లో మార్పు కోరు తుంటే, పౌరులకు స్వీయరక్షణ హక్కు ఉండాల్సిందేనంటూ రిపబ్లికన్లు పట్టుబడుతున్నారు. దేశాధ్యక్షులైన పలువురు డెమోక్రాట్లు గతంలో కనీసం ప్రాథమిక తుపాకీ నియంత్రణ చట్టాలు తేవాలని చూసినా, చట్టసభలో ఆమోదముద్ర వేయించలేకపోయారు. 2018లో 68 శాతం మంది కఠినమైన ఆయుధ చట్టాలను కోరితే, గత ఏడాది జరిగిన ప్యూ పోల్‌లో వారి సంఖ్య తగ్గి, 53 శాతం మందే కఠిన చట్టాలకు జై కొట్టడం విచిత్రం. అయితే, మూడు, నాలుగు తరగతులు చదువుతున్న పదేళ్ళ లోపు పసిమొగ్గల్ని చిదిమేసిన తాజా ఘటన కరడుగట్టిన ఆయుధ సమర్థకులను సైతం కదిలిస్తోంది.   

పదిహేనేళ్ళ క్రితం వరకు అమెరికాలోని మారణాయుధాల పరిశ్రమ స్వయం ప్రకటిత విధి, నిషేధాలను పాటించేది. తాజా ఘటనల్లో షూటర్లు వాడిన వ్యూహాత్మక తుపాకీల లాంటి వాటిని అప్పట్లో కేవలం పోలీసు, సైనిక వర్గాల వ్యాపార ప్రదర్శనల్లోనే పరిశ్రమ వర్గాలు చూపేవి. కానీ, ఆయుధ లాబీ దురాశతో క్రమంగా పరిస్థితి మారింది. వీలైనన్ని ఎక్కువ తుపాకీలను విక్రయించాలనే యావ పెరిగింది. అమెరికాలో తొలిసారిగా నల్లజాతి వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జాతి దుర్విచక్షణను ఆసరాగా చేసుకుంది. దాంతో, అమెరికాలో 2008 నాటికి 80 లక్షల లోపున్న తుపాకీల అమ్మకాలు కాస్తా 2016 నాటికి రెట్టింపై, 160 లక్షలకు చేరాయి. ఇవాళ అమెరికాలో 18 ఏళ్ళ వయసు దాటిన ఎవరైనా సరే తుపాకీలు, శక్తిమంతమైన తూటాలు, శరీర కవచాలను యథేచ్ఛగా కొనుక్కోవచ్చు. దాదాపు వంద కోట్ల డాలర్ల విలువైన మార్కెట్‌ ఉన్న ఆయుధ లాబీ ప్రాబల్యాన్ని అడ్డుకొని, చివరకు ఫెడరల్‌ తుపాకీ లైసెన్సుల చట్టంలో మార్పు తేవడం పాలకులకు సైతం వల్ల కాని దుఃస్థితి వచ్చిపడింది. 

ఆయుధాల ఆర్థిక, రాజకీయ లాభాల వేటను ఇకపై కొనసాగనిస్తే ప్రమాదం. అమెరికన్లు తమనూ, తమ వాళ్ళనూ రక్షించుకోవడానికి సొంతంగా ఆయుధాలు కలిగి ఉండడం తమ ‘సంస్కృతి’ అని బలీయమైన నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ లాంటి గ్రూపులు అంటున్నాయి. ఆ మాటలు సమర్థనీయం కానే కాదు. నిజానికి, వలస వచ్చిన అనేక దేశప్రజల కూడలి అమెరికాలో పౌరులంటే ఇప్పుడు ప్రపంచ పౌరులే. అలా ఇప్పుడు అమెరికా బాధ... ప్రపంచానికి బాధ. కాల్పుల సంస్కృతికి తోడ్పడేలా చట్టాలున్నప్పుడు వాటిని సవరించుకోవడమే తక్షణ అవసరం. అవసరమైతే అధ్యక్షుడు తన ప్రత్యేక పాలనాధికారాలు వాడాలి. అలాగే ఒంటరితనం వేధిస్తున్న టీనేజ్‌ దుండగుల నేరపూరిత ధోరణులను పసిగట్టేలా మానసిక వైద్య వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలి. పొంచి ఉన్న బయటి దేశాల ముప్పు గురించి ఎప్పుడూ చెప్పే అమెరికా ఈ అంతర్గత ముప్పును ఎంత తొందరగా అరికడితే అంత మంచిది. లేదంటే చేతపట్టినవాడిని సైతం ఆయుధం బలి తీసుకుంటుంది. తుపాకీకి తన, మన తేడా ఉండదు మరి!  

మరిన్ని వార్తలు