జీవితమే ఒక జూదం

23 May, 2022 01:04 IST|Sakshi

ప్రపంచంలో అతికొద్దిమంది అదృష్టవంతులకు తప్ప జీవితం నల్లేరుపై బండినడక కాదు. అలాగని అదృష్టం అందరికీ దక్కేది కాదు. అందుకే అదృష్టం కోసం మనుషులు అర్రులు చాస్తారు. స్వయంకృషి ఉంటే, అదృష్టం దానంతట అదే తరుముకుంటూ మరీ వస్తుందని ఎందరు మహానుభావులు ఎన్ని సూక్తులు వల్లించినా జనాభాలో అత్యధికులు అదృష్టాన్నే నమ్ముకుంటారు. . అదృష్టాన్ని నమ్ముకోవడం సామాన్య మానవుల సహజసిద్ధమైన బలహీనత. ఈ బలహీనతను కనిపెట్టిన ప్రాజ్ఞులు అదృష్టయంత్రాలు, తాయెత్తులు తదితర వస్తుజాలాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడం కద్దు. వాళ్లను మించిన నిపుణులు ద్యూతశాలలను నిర్వహిస్తుంటారు. 

అదృష్టంపై మనుషులకు నమ్మకం అనాది నుంచే ఉంది. నాణేలు వాడుకలోకి రాకముందు నుంచే బొమ్మా బొరుసు ఆట ఉండేది. నాణేలు లేనికాలంలో జనాలు తమ అదృష్టాన్ని తేల్చుకునేందుకు ఆల్చిప్పలతో బొమ్మా బొరుసు ఆడేవారు. చేతి ఎముకలతో తయారు చేసిన పాచికలతో రకరకాల ద్యూతక్రీడలు ఆడేవారు. జూదం ఎరుగని నాగరికతలేవీ ప్రపంచంలో లేవు. 

జూదంలో అన్నీ పోగొట్టుకుని అడవులపాలైన ధర్మరాజు ఉదంతం మహాభారతం ద్వారా మనందరికీ తెలుసు. అంతకుముందు నల మహారాజు కూడా జూదంలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు. ‘కన్యాశుల్కం’లో గురజాడ ‘వేదాల్లో అన్నీ ఉన్నాయష’ అని కరటక శాస్త్రి ద్వారా అనిపించడంలో వ్యంగ్యం ధ్వనిస్తుంది గానీ, వేదాల్లో జూదం ప్రస్తావన ఉందనేది అక్షరసత్యం. ఋగ్వేదంలోని ‘ద్యూతసూక్తం’ ఇందుకు నిదర్శనం. అంతమాత్రాన జూదాన్ని నెత్తికెత్తుకోలేదు మనవాళ్లు. సప్తవ్యసనాల జాబితాలో చేర్చారు. ‘ద్యూతంహీనామ పురుషస్య అసింహాసనం రాజ్యం’ అంటూ జూదరిని సింహాసనం లేని రాజ్యంతో అభివర్ణించాడు ‘మృచ్ఛకటికం’ నాటకంలో శూద్రకుడు. జూదంలో మాయోపాయాలు మామూలే! ‘నీకునౌ నీకునౌ నంచు నెమకి నెమకి/ ముగుదలగు వారి భ్రమియించి మోసపుచ్చు/ పశ్యతోహరు డత్యంత పాపబుద్ధి/ పట్టణములో దగుల్పరి పందెగాడు’– ‘క్రీడాభిరామం’లోని ఈ వర్ణనను చూస్తే, జూదంలో పందెగాళ్ల మోసకారితనం ఈనాటిది కాదని అర్థమవుతుంది.

ద్యూతక్రీడలో పాచికలు చాలా పురాతనకాలం నుంచి వాడుకలో ఉంటే, పేకముక్కలు ఆ తర్వాత వచ్చి చేరాయి. పేకాటకు మూలాలు చైనాలో ఉన్నాయి. టాంగ్‌ రాజుల హయాంలో కులీనులు కాలక్షేపం కోసం పేకాట ఆడేవారని తొమ్మిదో శతాబ్దినాటి చైనా సాహిత్యం ద్వారా తెలుస్తోంది. పద్నాలుగో శతాబ్ది నాటికి పేకాట యూరోప్‌కు పాకింది. పద్నాలుగో శతాబ్ది చివరినాటికి యూరోపియన్‌ రాచరిక చిహ్నాలను ప్రతిబింబించే పేకముక్కలను రూపొందించుకున్నారు. అప్పట్లో పేకదస్తాలో యాభయ్యారు ముక్కలు ఉండేవి. పదిహేనో శతాబ్ది చివరినాళ్లలో యాభైరెండు ముక్కల ‘ఫ్రెంచ్‌ సూటెడ్‌’ పేకముక్కలు రూపొందాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ‘ప్రామాణిక’ పేకముక్కలు ఇవే! బ్రిటిష్‌కాలంలో పేకాట మనదేశం నలుచెరగులా వ్యాప్తిలోకి వచ్చింది. పేకాట ప్రస్తావన ఆనాటి సాహిత్యంలో విస్తృతంగా కనిపిస్తుంది. ‘చతుర్ముఖ పారాయణం’, ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ వంటి జాతీయాలు పేకాట వ్యాప్తి తర్వాత వాడుకలోకి వచ్చినవే! తొలినాళ్లలో పెద్దమనుషుల కాలక్షేపంగా మొదలైన పేకాట, అనతికాలంలోనే సామాన్యులనూ సోకింది. ఓడిపోతున్న కొద్దీ రెట్టించిన పట్టుదలతో ఆడటం పేకాటరాయుళ్ల ప్రథమ లక్షణం. ‘నువ్వు సేఫనుకొని కొట్టిన ప్రతిముక్కా/ నవ్వుతూ ఎత్తుకుంటున్నాడు పక్కవాడు/ ఇక పెయిరయ్యే అవకాశం లేదు/ ఇప్పటికయినా మిడిల్‌డ్రాప్‌ పడెయ్యి’ అంటారు ‘మిడిల్‌డ్రాప్‌’ కవితలో వెల్చేరు నారాయణరావు. ఇలాంటి హితోక్తులు ద్యూతోద్రేకులను నిరుత్సాహపరచలేవు. ఉన్నదంతా ఊడ్చుకుపోతేగానీ వాళ్లకు తత్త్వం తలకెక్కదు.

ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆటలో కలిసొచ్చే ముక్కలు చేతిలో ఉన్నప్పుడు పేకాటరాయుళ్ల హుషారు మామూలుగా ఉండదు. సాక్షాత్తు వైకుంఠమే తమ అరచేతిలో ఇమిడిపోయిందనేంతగా పరవశులవుతారు. అలాంటి సందర్భాల్లోనే కొందరికి ఆశుకవిత్వం కూడా తన్నుకొస్తుంది. ‘కన్యాశుల్కం’లోని పేకాట సన్నివేశంలో ఆట రంజుగా సాగుతున్నప్పుడు పూజారి గవరయ్యకి ఇలాగే ఆశుకవిత్వం తన్నుకొచ్చి, ‘రాణా, డైమను రాణీ?/ రాణా యిస్పేటు రాణి, రాణా, కళావ/ర్రాణా ఆఠీన్రాణీ?/ రాణియనన్మధురవాణె, రాజుల రాణీ’ అంటూ పేకాట పరిభాషలోనే మధురవాణిని పొగుడుతూ పద్యం చెబుతాడు. చేతిలో పేకముక్కలుంటే చాలు, ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదనంతగా ఉంటుంది పేకాటరాయుళ్ల తన్మయావస్థ. ‘చెలువకు ప్లేయింకార్డుకు/ గల భేదం బేమొ చెప్పగలవా సుదతీ?/ చెలికన్న కార్డునందే/ వలపధికంబని తలంపవచ్చు మదవతీ!’ అంటూ పేకాటరాయుడి అభిరుచి తీవ్రతను ‘కర్ణానందదాయిని’లో జి.బాలాజీదాసు వర్ణించారు. 

ప్రపంచంలోని మిగిలిన అంశాల మాదిరిగానే ద్యూతక్రీడలు కూడా కాలంతో పాటే పరిణామం చెందుతూ వస్తున్నాయి. ఆల్చిప్పలతో మొదలైన ద్యూతక్రీడలిప్పుడు ఆన్‌లైన్‌కు చేరుకున్నాయి. డబ్బు చేతులు మారే జూదాలనే జనాలు పట్టించుకుంటారు గానీ, నిజానికి ఈ మాయాప్రపంచంలో జీవితమే ఒక జూదం. బతుకు పోరులో గెలుపు కోసం ఎవరి పాచికలు వాళ్లు వేస్తూనే ఉంటారు. అదృష్టం ఎప్పుడైనా తమ తలుపు తట్టకపోదా అనే ఆశతో ఎదురుచూస్తూనే ఉంటారు. 

మరిన్ని వార్తలు