రిపబ్లికన్ల హ్రస్వ దృష్టి

16 Feb, 2021 00:44 IST|Sakshi

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి కూడా విజయవంతంగా అభిశంసన నుంచి తప్పించుకోగలిగారు. అధ్యక్ష స్థానంలోవున్నవారు అభిశంసన తీర్మానం ఎదుర్కొనాల్సిరావడం అమెరికా చరిత్రలో ఇంతక్రితం కూడా జరిగింది. కానీ పదవినుంచి తప్పుకున్నాక కూడా అది వెన్నాడటం కొత్త రికార్డు. తన నాలుగేళ్ల పాలన, క్లైమాక్స్‌లో ప్రవర్తించిన తీరుతో ట్రంప్‌ చేజేతులా ఈ అపకీర్తి మూటగట్టుకున్నారు. ఫలితాలు వెలువడిన్పటినుంచి పదవి నుంచి తప్పుకునే వరకూ వున్న దాదాపు 80 రోజుల వ్యవధి ట్రంప్‌ అరాచక మనస్తత్వాన్ని మరింత బాహాటంగా బయటపెట్టింది. పదవినుంచి తప్పుకునే అధ్యక్షుడిని అమెరికాలో ‘నిరర్ధక అధ్యక్షుడి’గా అభి వర్ణించటం సంప్రదాయం. కానీ ఆ ‘నిరర్థక దశ’ను ట్రంప్‌ తనను తాను కాపాడుకునేందుకు ఉపయోగించుకున్నారు.  దిగ్భ్రమ కలిగించే నేరాలకు పాల్పడినవారికి సైతం ఉదారంగా క్షమాభిక్ష పెట్టారు. గత నెల 6న కొత్త అధ్యక్షుడి ఎన్నికను లాంఛనంగా ప్రకటించేందుకు కాంగ్రెస్‌ సమావేశమైనప్పుడు తన మద్దతుదార్లను కేపిటల్‌ హిల్‌పై దాడికి పురిగొల్పారని సామాజిక మాధ్యమాల సాక్షిగా రుజువైంది.

కర్రలు, తుపాకులు వగైరాలు ధరించి వచ్చిన ట్రంప్‌ మద్దతుదార్ల తీరు చూసి బెంబేలుపడిన అనేకమంది సెనేటర్లు ప్రాణ భయంతో బల్లలకింద దాక్కొనవలసి వచ్చింది. అక్కడ ఎంతో విధ్వంసం చోటుచేసుకుంది. ఇలా చేసినా రిపబ్లికన్‌ పార్టీకి ఏమాత్రం తప్పనిపించలేదంటే... పదవినుంచి దిగిపోయారు గనుక పట్టించుకోనవసరం లేదంటూ అది వాదించిందంటే ఆ పార్టీ ఎంత మితవాద శక్తిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పార్టీలో ట్రంప్‌ వంటి నేత అధ్యక్ష స్థానం వరకూ ఎగబాకారంటే వింత ఏముంది? మెజారిటీ సభ్యులు... అంటే వందమందిలో 57 మంది ట్రంప్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉందని అంగీకరించారు. డెమొక్రాటిక్‌ పార్టీకి వున్న 50 మంది సభ్యులతో పాటు రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఏడుగురు కూడా తీర్మానానికి మద్దతు పలకటం వల్ల ఇది సాధ్యమైంది. కానీ అభిశంసన నెగ్గాలంటే మూడింట రెండు వంతులమంది మెజారిటీ (67 మంది) అవసరం గనుక ట్రంప్‌ విజయవంతంగా బయట పడ గలిగారు. తీర్మానం నెగ్గితే డొనాల్డ్‌ ట్రంప్‌ భవిష్యత్తులో అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి అనర్హు లయ్యేవారు. 

ఈ అభిశంసన వీగిపోవటం న్యాయం గెలవటంగా ట్రంప్‌ అభివర్ణిస్తున్నారు. తనను  రాజ కీయంగా సమాధి చేద్దామనుకున్నవారి ప్రయత్నాలు విఫలమయ్యాయని సంబరపడుతున్నారు. తన చేష్టలకు ఏనాడూ పశ్చాత్తాపం ప్రకటించని ట్రంప్‌ అలా మాట్లాడటంలో వింతేమీ లేదు. కానీ స్వయంగా దేశాధ్యక్షుడే హింసకు పురిగొల్పటాన్ని రిపబ్లికన్‌ పార్టీ విస్మరించిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ చర్య ద్వారా అది తనకు తాను నష్టం చేసుకోవటంతోపాటు దేశానికి కూడా నష్టచేసింది. చట్టబద్ధ పాలనను అధ్యక్షుడే అపహాస్యంపాలు చేయటం, ఆవేశంతో ఊగిపోతున్న మూకను కేపిటల్‌ హిల్‌పై దాడికి పంపటం, వారి విధ్వంసాన్ని తేలిగ్గా తీసుకోవటం, ప్రజా తీర్పును వమ్ముచేసేందుకు ప్రయత్నించటం, రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురిచేయటం, అణగదొక్కే ప్రయత్నం చేయటం లాంటి చర్యలను క్షమించటం రిపబ్లికన్‌ పార్టీ పరువును పాతాళానికి నెట్టేసింది. దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్యం లోపరహితమైనది కాదని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే అది నియంతృత్వ పోకడలున్నవారి చేతుల్లోకి జారుకుంటుందని గత నెల 6నాటి పరిణామాలు నిరూపించాయి. దీన్ని కేవలం తమకూ, డెమొక్రటిక్‌ పార్టీకి మధ్య జరిగే పోరుగా మాత్రమే చూడటం రిపబ్లికన్‌ పార్టీ హ్రస్వ దృష్టికి నిదర్శనం.

పార్టీలో ఇదొక దుస్సంప్రదాయానికి కూడా అంకురార్పణ చేసింది. భవిష్యత్తులో ఒక నిర్మాణాత్మక పద్ధతిలో, మెరుగైన ఆలోచనలతో ముందుకొచ్చి అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడేవారికి ఆ పార్టీలో స్థానం దొరకదన్న అభిప్రాయం అందరికీ కలుగుతుంది. ట్రంప్‌కూ లేదా ఆయన మాదిరిగా ఇష్టానుసారం వ్యవహరించే మరో నాయకుడికి మాత్రమే ఆదరణ లభిస్తుందని శ్రేణులంతా భావిస్తాయి. ‘అందరం ఏకమవుదాం... అమెరికా ఘనతను మరోసారి చాటుదాం’ అంటూ ట్రంప్‌ ఇచ్చిన తాజా పిలుపు కాస్త హేతుబద్ధంగా ఆలోచించగలిగే రిపబ్లికన్‌ శ్రేణులను బెంబేలెత్తించివుండాలి. తీర్మానంపై మాట్లాడిన సెనేట్‌ రిపబ్లికన్‌ పక్ష నేత మెక్‌ కానిల్‌ సైతం ట్రంప్‌ తీరును తప్పుబట్టారు. అధ్యక్షుడిగా తన కర్తవ్యాన్ని విస్మరించి,  హింసకు నైతికంగా బాధ్యుడయ్యారని అంగీకరించారు. ఇంత చెప్పినవారు అభిశంసన తీర్మానంతో గొంతు కలిపేందుకు నిరాకరించటం విడ్డూరం.

ఉన్నత స్థాయికి ఎలా ఎగబాకాలో, జనాకర్షణకు మార్గాలేమిటో, సమర్ధులుగా రాణించటం ఎలాగో చెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిత్వరంగ నిపుణులు బోలెడు పుస్తకాలు రచించారు. కానీ ప్రజా తీర్పును గౌరవించటం ఎలాగో... హుందాగా పదవినుంచి వైదొలగటం ఎంత ముఖ్యమో చెప్పే పుస్తకాలు ఎవరూ రాసినట్టు లేరు. ఆ మాదిరి పుస్తకాలు అందుబాటులో వుంటే డోనాల్డ్‌ ట్రంప్‌కు అవి ఏదో మేరకు ఉపయోగపడేవి. ఏదేమైనా తాము నిష్పాక్షికమైన తీర్పరి స్థానంలో వున్నామని... దేశ చరిత్రలో మాయని మచ్చ అనదగ్గ ఒక మహాపరాధానికి కారకుణ్ణి గుర్తించి, శిక్షిం చాల్సిన కర్తవ్యం తమపై వున్నదని రిపబ్లికన్‌లు గుర్తించలేకపోవటం... ఫక్తు రాజకీయ నేతలుగానే వ్యవహరించటం విషాదం.  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు