అపూర్వం...అనితర సాధ్యం

16 Mar, 2021 03:01 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పురజనులు అపూర్వమైన రీతిలో హారతులు పట్టారు. ఆ చివర శ్రీకాకుళం మొదలుకొని ఇటు అనంతపురం వరకూ ప్రాంతాలకు అతీతంగా ముక్తకంఠంతో తిరుగులేని తీర్పునిచ్చారు. ఆదివారం వెలువడిన పురపాలక సంస్థలు, నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయం బహుశా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. ఫలితాలు వెలువడిన 11 నగర పాలక సంస్థలనూ ఆ పార్టీ కైవసం చేసుకోవటంతోపాటు, 75 పురపాలక సంస్థలు/నగర పంచాయతీల్లో 74 సొంతం చేసుకోవటం... పోలైన ఓట్లలో 52.63 శాతం సాధించడం అసాధారణం.

గత 22 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనూ, తీసుకుంటున్న విధాన నిర్ణయాలనూ వ్యతిరేకించటమే ఏకైక అజెండాగా పెట్టుకున్న తెలుగుదేశం ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అసెంబ్లీ ఫలితాలకు మించిన ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆఖరికి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఏడాదిగా అమరావతి పేరిట సాగిస్తున్న వీధి నాటకం కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదుకోలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ ఉద్యమ ప్రభావం వుందం టున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం తెలుగుదేశం పూర్తిగా అడుగంటింది. జాతీయ పక్షంగా బీరాలు పోతున్న ఆ పార్టీ చాలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సింగిల్‌ డిజిట్‌ డివిజన్లు/ వార్డులకు పరిమితమైందంటే దానిపై జనాగ్రహం ఏ స్థాయిలో వున్నదో అంచనా వేసుకోవచ్చు. 

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నిష్కళంకమైన పారదర్శక పాలన అంది స్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వాగ్దానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోను ఆ వేదికపై చూపుతూ దాన్ని భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి అందులోని వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేర్చటానికి త్రికరణ శుద్ధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గత 22 నెలల పాలన అందుకనుగుణంగా సాగుతోందని జనం గ్రహించబట్టే ఆ పార్టీకి ఇంతటి అపూర్వ విజయాన్ని అందించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చేనాటికి రాష్ట్రం దయనీయ స్థితిలోవుంది. చంద్రబాబు అపసవ్య విధానాలతో, అస్తవ్యస్థ పాలనతో ఖజానా నిండు కుంది. ఒకపక్క దాన్నంతటినీ సరిచేస్తూనే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటానికి కృషి చేస్తున్న ప్రభు త్వానికి హఠాత్తుగా విరుచుకుపడిన కరోనా వైరస్‌ మహమ్మారి పెను సవాల్‌ విసిరింది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింతగా కుంగదీసింది. లాక్‌డౌన్‌ పర్యవసానంగా సమస్త జీవన రంగాలూ స్తంభించి ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడినప్పుడు జగన్‌ ప్రభుత్వం నేనున్నానంటూ భరోసానిచ్చింది.

ఒకపక్క కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే అట్టడుగు ప్రజానీకం కనీస అవసరాలు నెరవేరటానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటునందించింది. నిత్యావసరాలు అందించింది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను విస్తరించటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసే సమయానికల్లా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు అండ దండలందించి ఉపాధి కల్పనకు తోవలు పరిచింది. సుదీర్ఘ అనుభవంగలవారి ఏలుబడిలోవున్న రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇవన్నీ చేస్తూనే మహిళల భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. సత్వర దర్యాప్తు జరిపి, నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్షలుపడేందుకు వీలు కల్పించే కఠినమైన దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దిశ పోలీస్‌ స్టేషన్లు నెలకొల్పింది. విద్యారంగ సమూల ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించింది. 

ఈ ఎన్నికల ఫలితాలు చూశాకైనా చంద్రబాబులో పునరాలోచన మొదలవుతుందనుకున్నవారికి నిరాశే ఎదురైంది. ‘ఇదే స్ఫూర్తితో పనిచేస్తే విజయం మనదే’నంటూ ఆయన ఇచ్చిన ట్వీట్‌ దిగ్భ్రాం తికరమైనది. ఏమిటా ‘స్ఫూర్తి’? అడుగడుగునా మాయోపాయాలు పన్నడమా? ప్రార్థనా మంది రాల్లో విగ్రహ విధ్వంసానికి పాల్పడటమా? వెళ్లినచోటల్లా సొంత పార్టీవారినీ, జనాన్నీ దుర్భాష లాడటమా? వారిపై చేయి చేసుకోవటమా? మీడియాను గుప్పెట్లో పెట్టుకుని, తప్పుడు కథనాలను ప్రచారంలో పెట్టడమా? వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకోవటమా? ఫలితాలు వెలువడ్డాకైనా పద్ధతులు మార్చుకుంటానని హామీ ఇవ్వాల్సిందిపోయి, తమవైపు తప్పిదాలు జరిగాయని అంగీక రించాల్సిందిపోయి బాబు ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నించటం ఆత్మ వంచన, పరవంచన కూడా. అధికారంలోకొచ్చిన తొలినాళ్లలోనే గ్రామ సచివాలయ వ్యవస్థనూ, వలంటీర్‌ వ్యవస్థనూ అమల్లోకి తెచ్చి పాలనను ప్రజలకు చేరువ చేశారు జగన్‌మోహన్‌ రెడ్డి. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకూ సమంగా అభివృద్ధిని విస్తరింపజేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు బాబు, ఆయన మిత్రగణం అవరోధాలు సృష్టించకపోతే ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌ ఎంతో పురోగతి సాధించేది. ప్రజానీకం దీన్నంతటినీ గమనించబట్టే బాబుకూ, ఆయన ప్రత్యక్ష, పరోక్ష మిత్రులకూ పంచాయతీ ఎన్నికలు మొదలుకొని పురపాలక ఎన్నికల వరకూ కర్రు కాల్చి వాతబెట్టారు. మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్రం నలుచెరగులా సంపూర్ణ మద్దతు పలి కారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన ఈ ఘన విజయం అన్ని రాష్ట్రాల్లోని పాలకులనూ ఆలో చింపజేస్తుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే, సమర్థవంతమైన పాలన అందిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తారన్న విశ్వాసం కలగజేస్తుంది. 

మరిన్ని వార్తలు