పెచ్చరిల్లిన యుద్ధకాండ

12 Oct, 2022 04:11 IST|Sakshi

రాజధాని కీవ్‌ సహా ఉక్రెయిన్‌ మళ్ళీ క్షిపణిదాడులతో దద్దరిల్లుతోంది. విద్యుత్‌ సరఫరా ఆగింది. జనం ప్రాణాలు అరచేత పట్టుకొని బంకర్లలో తలదాచుకుంటున్నారు. వరుసగా రెండురోజులుగా రష్యా క్షిపణిదాడులు. పిల్లల ఆటస్థలాలపైనా దాడులతో పదుల మంది ప్రాణాలు కోల్పోతే, వంద మందికి పైగా గాయాల పాలయ్యారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పెంచిన ఈ దాడులతో యుద్ధం ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వప్రతినిధిసభలో చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ఆక్రమిత ప్రాంతాలను రెఫరెండమ్‌ల మాటున తమ దేశంలో కలిపేసుకున్నట్టు ఇటీవలే రష్యా అక్రమంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ముందుకొచ్చింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఓటింగ్‌ జరగనుంది. వెరసి పెచ్చరిల్లిన యుద్ధకాండతో అంతర్జాతీయంగా ఉద్విగ్నత నెలకొంది.   

తమ దేశ గగనతల రక్షణకు మరిన్ని ఆయుధాలు కావాలని ఉక్రెయిన్‌ అభ్యర్థిస్తోంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అత్యవసరంగా ‘జీ7’ దేశాల నేతలతో సమావేశమయ్యారు. రష్యన్‌ చమురుపై కఠినతరమైన ఆంక్షలు పెట్టాలన్నారు. మరోపక్క ‘నాటో’ సైతం యుద్ధంలో కడ దాకా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. యుద్ధాన్ని ప్రారంభించిన రష్యాయే దీనికి ముగింపు పలకా లంది. ఈ వారంలోనే ‘నాటో’ రక్షణ మంత్రులూ సమావేశం కానుండడం మరో కీలక పరిణామం. రష్యా మాత్రం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచి, యుద్ధాన్ని పెంచిపోషిస్తున్నాయని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బల నేపథ్యంలో ఓ నిరంకుశ కొత్త సైనిక కమాండర్‌ను బరిలోకి దింపింది. వరస చూస్తుంటే, యుద్ధం మరింత సంక్లిష్ట దశకు చేరుకొన్నట్టు కనిపిస్తోంది.

తాజా దాడి ఘటనల్ని గమనిస్తే – రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అభిమాన ప్రాజెక్టు క్రిమియా – రష్యా మధ్య రోడ్డు, రైలు వంతెన. ఇటు సైనికపరంగా, అటు ప్రతీకాత్మకంగా అది ముఖ్యమైనది. ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యాకు కలిపే ఆ ‘కెర్చ్‌ వంతెన’ను 370 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించారు. నాలుగేళ్ళ క్రితం 2018 మే నెలలో పుతిన్‌ స్వయంగా దానిపై వాహనం నడుపుతూ ఆర్భాటంగా ప్రారంభించారు. రష్యా ఆక్రమణకు ఓ కీలక ప్రతీక లాంటి ఆ వంతెన పుతిన్‌ 70వ జన్మదినం మర్నాడే అక్టోబర్‌ 8 భారీ పేలుడుతో ధ్వంసమైంది. అందుకు ఉక్రెయినే కారణమంటూ పుతిన్‌ 48 గంటలు గడిచేలోగా భీకర ప్రతీకార దాడులకు దిగారు. తత్ఫలితమే – ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో సోమ, మంగళవారాల్లో ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా చేసిన దాడులు. 

ఏడునెలల క్రితం ప్రత్యేక సైనిక చర్య అంటూ మొదలుపెట్టిన పుతిన్‌ ఉక్రెయిన్‌ను రష్యాలో భాగం చేసుకోవాలనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయచట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. తక్షణం, బేషరతుగా వెనక్కి రావాలని మార్చిలో సాక్షాత్తూ ఐరాస 141 దేశాల మద్దతుతో తీర్మానించినా, మాస్కో జంకూగొంకూ లేకుండా దాడులు చేస్తూనే ఉంది. రెండున్నరేళ్ళుగా భయపెడుతున్న కోవిడ్‌ లానే ఈ యుద్ధకాండ ఫలితాలు సైతం ఒక్క ఉక్రెయిన్‌కే కాక మొత్తం ప్రపంచానికి విస్తరిస్తున్నాయి. ఐరాస పట్టు కోల్పోతోంది. ఆహార ధరలు పెరిగిపోయాయి. శరణార్థుల సమస్య, సాంస్కృతిక – క్రీడా రంగాల్లో బహిష్కరణలు సరేసరి. అంతర్జాతీయ సహకారానికి పెద్ద దెబ్బ తగిలింది. అణ్వస్త్ర ప్రయోగంపై పుతిన్‌ చీటికీమాటికీ చేస్తున్న హెచ్చరికలు ఆయన నిర్లక్ష్య నేరధోరణికీ, అంతకంతకూ పెరుగుతున్న అసహనానికీ ప్రతీకలు. పెరుగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచం అణ్వస్త్ర మహా సంగ్రామానికి అతి దగ్గరగా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు గతవారం హెచ్చరించడం గమనార్హం. 

ఇవి చాలదన్నట్టు పుతిన్‌ యుద్ధకాంక్ష ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాలపై, విపణిపై మును పెన్నడూ లేని ప్రభావం చూపింది. తాజాగా రష్యా సహా ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ప్రపంచ చమురు ఉత్పత్తిలో కోత విధించాలని నిర్ణయించడమూ దెబ్బే. చమురు కొరతతో ఈ శీతకాలంలో యూరోపి యన్‌ ప్రపంచానికి కష్టాలు పెరగనున్నాయి. అసలైతే ఒపెక్‌ సభ్యదేశాల్లో అనేకం పాశ్చాత్యానికి మిత్రపక్షాలే. ఇప్పుడవి తమ వైఖరిని మార్చుకున్నాయా అనిపిస్తోంది. అదే గనక నిజమైతే, రెండు వర్గాలుగా దేశాలు చీలుతాయి. నిరంకుశాధికార ఇరాన్‌ సహా రష్యాను సమర్థించే దేశాలు ఒకపక్క, అమెరికా – బ్రిటన్‌ – ఇతర జి7 దేశాలు – ఐరోపా సమాజం మరోపక్క మోహరిస్తాయి. 

ఇక, రష్యాతో పోరుతో పాటు ఉక్రెయిన్‌ను ఆర్థిక కష్టాలూ వెన్నాడుతున్నాయి. అమెరికా నెలకు 150 కోట్ల డాలర్ల సైనికేతర సాయం ఇస్తానని హామీ ఇచ్చింది కానీ, ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటేనే నెలకు 500 కోట్ల డాలర్లు అవసరం. మరోపక్క యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) తన వంతు సాయం చేయడంలో విఫలమైంది. 900 కోట్ల యూరోలు ఇస్తా మంటూ మేలో చెప్పిన బ్రస్సెల్స్‌ ఇప్పటికి 100 కోట్ల యూరోలే చెల్లించింది. ఉక్రెయిన్‌కు సైనిక సరఫరాలు, రష్యాపై ఆంక్షలపైనా ఈయూలో అభిప్రాయ భేదాలున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ లాంటివి కీలక ఆయుధాలు ఇవ్వనేలేదు. రష్యా అనుకూల హంగరీ ఈయూ ఐక్యతకు తూట్లు పొడుస్తోంది. 

పుతిన్‌ పరిస్థితీ గొప్పగా లేదు. సైనికవైఫల్యాలు, యుద్ధనేరాల ఆరోపణలు, ప్రజల్లో అసంతృప్తి రేపిన సైనిక సమీకరణ ఆలోచనలు ఆయన ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వంతెన విధ్వంసంతో తల కొట్టేసినట్టయి తెగబడేసరికి మళ్ళీ కలకలం రేగింది. ఈ ఉద్రిక్తత, దాడులు ఎవరికీ మంచిది కాద నేది భారత్‌ వాదన. అంతా అది అంగీకరించినా, ఆపే దిశగా ఆచరణ శూన్యం. భయపెడుతున్న అణుయుద్ధంలో ఎవరూ గెలవలేరు. ఆ ఉన్మాదంలో పరాజయం యావత్‌ మానవ ప్రపంచానిదే! 

మరిన్ని వార్తలు