కొత్త పొద్దుపొడుపు

31 Jan, 2023 00:26 IST|Sakshi

అవును... భారత క్రికెట్‌లో ఇది కొత్త పొద్దుపొడుపు. దక్షిణాఫ్రికాలో మహిళల తొలి అండర్‌–19 టీ20 వరల్డ్‌ కప్‌లో ఆదివారం సాయంత్రం భారతీయ బాలికలు ఇంగ్లండ్‌ జట్టును మట్టికరిపించి, ప్రపంచ విజేతలుగా నిలిచిన క్షణాలు అలాంటివి. షఫాలీ వర్మ సారథ్యంలో తెలుగమ్మాయి సునీత గొంగడి సహా 15 మంది సభ్యుల టీనేజ్‌ బాలికల జట్టు తమ విజయంతో దేశ మహిళా క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్, స్వయంగా దక్షిణాఫ్రికాకు వచ్చి ఫైనల్‌కు ముందు స్ఫూర్తి నింపిన ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా సహా అందరి ఆశలనూ, అంచనాలనూ నిజం చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పురుషులకు సమానంగా మహిళలకూ వేతనమివ్వాలని గత అక్టోబర్‌ చివరలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించిన వేళ... తాజాగా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఏర్పాటైన క్షణాన... వీస్తున్న మార్పు పవనాలకు ప్రపంచ కప్‌ సాధన ఓ కొత్త జోడింపు.

సరిగ్గా 40 ఏళ్ళ క్రితం 1983లో పురుషుల ప్రపంచ కప్‌లో భారత క్రికెట్‌ జట్టు అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత భారత క్రికెట్‌ మరింత మెరుగైన రీతిలో సమూలంగా మారిపోయింది. తాజాగా మన బాలికలు సాధించిన విజయం మన మహిళా క్రికెట్‌కు సరిగ్గా అలాంటి ఉత్ప్రేరకమే. గతంలో మన మహిళా క్రికెట్‌ జట్టు ఒకటి కన్నా ఎక్కువ సార్లే ప్రపంచ కప్‌ ఫైనల్స్‌కు చేరింది. అయితే, ఏ ఫార్మట్‌లోనైనా మన మహిళా క్రికెటర్లు వరల్డ్‌ కప్‌ సాధించడం ఇదే తొలిసారి. బీసీసీఐ మహిళా క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సమయంలో ఈ విజయం ఒక కొత్త ఉత్సాహం, ఊపునిచ్చాయి.

విరాట్‌ కోహ్లీ తదితరులది ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) తరం కాగా, షఫాలీ వర్మ సారథ్యంలోని అండర్‌–19 వరల్డ్‌ ఛాంపియన్‌ బాలికలను రానున్న డబ్ల్యూపీఎల్‌ (ఉమెన్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) తరం అనుకోవచ్చు. 2008 బాలుర అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో కోహ్లీ బృందం ఇలాగే విజయం అందుకుంది. అదే సమయంలో ఐపీఎల్‌ రావడంతో రాత్రికి రాత్రి పలువురు లక్షాధికారులయ్యారు. ఆటకు అవతార మూర్తులై, ఇంటింటా పాపులర్‌ అయ్యారు.

భారత క్రికెట్‌ స్వరూప స్వభావాలే మారిపోయాయి. ఇప్పుడు మన బాలికల జట్టు ప్రపంచ ఛాంపి యన్లుగా అవతరించిన సమయానికి డబ్ల్యూపీఎల్‌ కొత్తగా వచ్చింది. త్వరలో తొలి డబ్ల్యూపీఎల్‌ వేలంతో ఈ క్రికెటర్లలో కొందరు లక్షాధికారులు కానున్నారు. కష్టాలు కడతేరి, ఆర్థిక, సామాజిక హోదా మారిపోనుంది. ఈ మ్యాచ్‌ల ప్రసార హక్కులు, పలు ఫ్రాంఛైజీల బిడ్లు దాదాపు రూ. 5.5 వేల కోట్ల పైగా పలికినట్టు వార్త. మహిళా క్రికెట్‌కు ఇవి బంగారు క్షణాలంటున్నది అందుకే. 

అయితే, ఎన్ని లీగ్‌లు వచ్చినా అంతిమంగా అగ్రభాగాన నిలిపేది ప్రతిభే. భారత అండర్‌–19 బాలికల క్రికెట్‌ జట్టు ఈ ఐసీసీ వరల్డ్‌ కప్‌లో మొదటి నుంచి తన సత్తా చాటుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు ఆట మెరుగుపరుచుకుంటూ ఆస్ట్రేలియా (ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో) సహా అనేక జట్లను అధిగమించి, ఫైనల్స్‌కు చేరింది. కప్‌ సాధించింది. మన బాలికల క్రికెట్‌ ఈ వరల్డ్‌ కప్‌ ఘనత సాధించడం వెనుక ఆటగాళ్ళతో పాటు పలువురి పాత్ర ఉంది.

జాతీయ క్రికెట్‌ అకాడెమీ (ఎన్సీఏ) శ్రద్ధ, మహిళా కోచ్‌ నూషిన్‌ అల్‌ ఖదీర్‌ అసాధారణ అంకితభావం లాంటివి అండగా నిలిచాయి. పద్ధెనిమిదేళ్ళ క్రితం వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత సీనియర్‌ మహిళా జట్టులో సభ్యురాలైన నూషిన్‌ ఆకలిగొన్న పులిలా బరిలోకి దిగి, ఈ టీనేజ్‌ బాలికలను తీర్చిదిద్దారు. పోటీలోని వివిధ జట్ల క్రికెటర్ల కన్నా ప్రతిభావంతులుగా నిలిపారు. 

ఈ ప్రతిభాపాటవాలు భారత మహిళా క్రికెట్‌ భవిష్యత్తుకు బలమైన పునాది. కాలగతిలో సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యంతో బాలికలు ఉరకలెత్తుతున్నారు. దేశంలో మహిళా క్రికెట్‌ ప్రమాణాలు మెరుగవుతున్నాయనడానికి ఇది ఓ సూచన. నిజానికి, అర్ధశతాబ్ద కాలంలో మన మహిళా క్రికెట్‌ అనేక శృంఖలాలు తెంచుకొంది. పంజరాలను దాటింది. సామాన్య స్థాయి నుంచి అసామాన్యతకు ఎదిగింది. గడచిన రెండు సీనియర్ల టీ20 వరల్డ్‌ కప్‌లలో మన మహిళా జట్టు సెమీ ఫైనలిస్టుగా, ఫైనలిస్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో ఈ తొలి అండర్‌–19 టీ20 కప్‌లో బాలికలు ఏకంగా విజేతలయ్యారు. ఇది వారి జీవితాల్లోనే కాదు... మొత్తం భారత మహిళా క్రికెట్‌ చరిత్రలోనే కీలక మలుపు. 

దేశంలో ఆడపిల్లలకు ప్రత్యేక క్రికెట్‌ అకాడెమీలు వెలుస్తున్న రోజులివి. ఈ విజయం వాటికి కొత్త ఉత్తేజం. విజేతలకు ఆత్మవిశ్వాసం పెంచే ఔషధం. పురుషులకు భిన్నంగా తగిన పారితోషికం లేకున్నా, ఇంటా బయటా అవమానాలు ఎదురైనా, ఆర్థిక – సామాజిక అవరోధాలున్నా – అవన్నీ దాటుకొని వచ్చిన స్త్రీలు కాబట్టి తాజా విజయం మరింత గొప్పది. ఇది... కూతురు సోనా యాదవ్‌ క్రికెట్‌ షూస్‌ కోసం అదనపు షిఫ్ట్‌లు పనిచేసిన గ్లాస్‌ ఫ్యాక్టరీ కార్మికుడు, ఆడబిడ్డ త్రిష శిక్షణ కోసం ఉద్యోగం వదిలి భద్రాచలం నుంచి హైదరాబాద్‌ మారిన తండ్రి... ఇలా ఎందరో తల్లితండ్రుల త్యాగఫలం.

ఆడపిల్లలను ప్రోత్సహిస్తే వారు కుటుంబానికే కాదు... దేశానికీ ఎంతటి పేరు తెస్తారో చెప్పడానికి ఇది తాజా దర్పణం. బ్యాడ్మింటన్‌ తర్వాత భారత మహిళా క్రీడాంగణంలో ఇక క్రికెట్‌ కొత్త దీపశిఖ. దీన్ని మరింత ప్రజ్వరిల్లేలా చేయాల్సింది ఆటల సంఘాలు, అధికారంలోని పెద్దలే. 

మరిన్ని వార్తలు