ఎడతెగని ఉన్మాదం

26 Jan, 2023 04:31 IST|Sakshi

ఎక్కడో ఒకచోట చాలా తరచుగా ఉన్మాదుల తుపాకులు పేలుతూనే ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు మనుగడ సాగిస్తున్న అమెరికాలో మరోసారి ఏడుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన రెండు ఉదంతాల్లో వీరు మరణించగా ఆదివారం ఉన్మాది కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 22 ఏళ్ల తెలుగు విద్యార్థి దేవాశిష్‌ ఆ మరునాడు కన్నుమూశాడు. నూతన సంవత్సరం ప్రారంభమైన ఈ మూడు వారాల్లో ఇంతవరకూ మొత్తం ఆరు ఉదంతాలు జరగ్గా దుండగుల తుపాకులకు 39 మంది బలయ్యారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతుంది. ప్రపంచ జనాభాలో అమెరికా వాటా అయిదు శాతం. కానీ ప్రపంచంలో ప్రైవేటు వ్యక్తుల దగ్గరుండే తుపాకుల్లో సగభాగం ఆ దేశంలోనే ఉంటాయి. అంతేకాదు...ఏటా ఉన్మాదులు తుపాకులతో రెచ్చిపోతున్న ఘటనల్లో మూడోవంతు అమెరికాలోనే చోటుచేసుకుంటాయి.

కాల్పుల ఘటనల్లో మరణిస్తున్నవారినీ, తుపాకులతో కాల్చుకుని ప్రాణాలు తీసుకునేవారినీ కలుపుకుంటే ఏటా 40,620 మంది ఈ మారణాయుధాల కారణంగా చనిపోతున్నారని నిరుడు ఒక నివేదిక తెలిపింది. అంటే రోజూ సగటున 110మంది తుపాకులకు బలైపోతున్నారు. తుపాకుల సంస్కృతిని అరికట్టడం తక్షణావసరమని గ్రహించడానికి ఈ గణాంకాలు చాలవా? కానీ ప్రభుత్వ విధానాలనూ, రాజకీయాలనూ తుపాకులే శాసిస్తున్నచోట ఈ విజ్ఞతను ఆశించటం దురాశే అవుతుంది. నిరుడు వరసగా వర్జీనియా, కొలరాడో, ఇల్లినాయ్, ఓక్లహమా, టెక్సాస్, న్యూయార్క్‌ తదితరచోట్ల విచ్చలవిడి కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మూడు దశాబ్దాల్లో తొలిసారి తుపాకుల కొనుగోలుపై పరిమిత స్థాయి సంస్కరణలు తీసుకురావాలని సెనేట్‌లో ఒప్పందం కుదిరింది. దానిపై చర్చ సాగుతుండగానే న్యూయార్క్‌ తుపాకుల చట్టాన్ని కొట్టేస్తూ ఆత్మరక్షణ కోసం తుపాకులు కలిగి ఉండటం ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

తుపాకులుండరాదని మెజారిటీ ప్రజానీకం భావించేచోట అవి నానాటికీ తామరతంపరగా పెరుగుతూ పోవటం ఒక వైచిత్రి. తుపాకి ఉండటం తమ హోదాకూ, గౌరవానికీ చిహ్నమని, ఆత్మరక్షణకు తప్పనిసరని భావించేలా చేయటంలో అక్కడి తుపాకి పరిశ్రమలు విజయం సాధించాయి. ఎక్కడో ఒకచోట తుపాకి పేలినప్పుడల్లా జనంలో ఆగ్రహావేశాలు రగలటం, తుపాకుల అమ్మకంపై నియంత్రణ విధించాలని కోరటం షరా మామూలే. కానీ ఆ వెంటనే తుపాకి లాబీ రంగప్రవేశం చేసి ఈ చర్చనంతటినీ తలకిందులు చేస్తోంది. మానసిక రోగులవల్ల తలెత్తుతున్న సమస్యను తుపాకుల అమ్మకానికి ముడిపెడుతున్నారని వక్రభాష్యాలకు దిగుతోంది. ఆ తర్వాత అంతా సద్దుమణుగుతోంది. తుపాకుల అమ్మకాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. అమెరికాలో పౌరుల వద్ద మొత్తం 39 కోట్ల తుపాకులు చలామణీలో ఉన్నాయని... ప్రతి వంద మంది పౌరుల దగ్గరా సగటున కనీసం 120 తుపాకులు ఉండొచ్చని స్విట్జర్లాండ్‌కు చెందిన పరి శోధనా సంస్థ లెక్కగట్టింది. ఇది 2018 నాటి మాట. అమెరికాలో ఏ రాష్ట్రంలోనూ తుపాకుల అమ్మకానికి సంబంధించిన డేటా బేస్‌ లేదు. పైగా పకడ్బందీ చట్టాలు కొరవడి బ్లాక్‌ మార్కెట్‌ జోరుగా సాగుతుంటుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నకాలంలో ప్రతి అయిదు కుటుంబా ల్లోనూ ఒక కుటుంబం తుపాకి కొనుగోలు చేసిందని మరో సంస్థ తేల్చింది. ఇదంతా చూస్తే ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల దగ్గరుండే తుపాకుల సంఖ్య ఎన్ని కోట్లు దాటివుంటుందో ఊహకందదు. హార్వర్డ్, నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీలు 2016లో తేల్చిన లెక్క ఆసక్తికరమైంది. అమెరికాలో అమ్ముడైన తుపా కుల్లో సగభాగం కేవలం 3 శాతంమంది దగ్గర కేంద్రీకృతమయ్యాయని ఆ పరిశోధన సారాంశం. 

తుపాకుల విచ్చలవిడి అమ్మకానికీ, వాటి ద్వారా జరిగే హింసకూ మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పడానికి పెద్ద పరిశోధన అక్కరలేదు. కానీ అలా పరిశోధించి చెప్పే నివేదికలకు కూడా అక్కడి తుపాకి లాబీ పెద్ద ప్రాధాన్యం ఇవ్వదు. వాటికి పోటీగా నివేదికలు విడుదల చేసి పౌరులను అయోమయంలోకి నెట్టే యత్నం చేస్తుంది. కాల్పులు జరిగినచోట ‘మంచి వ్యక్తి’ గనుక తుపాకితో ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికాదని ఆ నివేదికలు చెబుతుంటాయి. విచ్చలవిడి కాల్పుల ఉదంతాల నిరోధానికి పౌరుల దగ్గర మరిన్ని తుపాకులుండటమే పరిష్కా రమని తుపాకుల తయారీ పరిశ్రమలకు చెందిన జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌(ఎన్‌ఆర్‌ఏ) సంస్థ చెప్పిందంటే దాని తెలివి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

బ్రిటన్, స్వీడన్, జర్మనీ, బెల్జియంలలో తుపాలకు అమ్మకంపై గట్టి నియంత్రణలున్నాయి. కెనడాలో 2020 కాల్పుల ఉదంతం తర్వాత రెండు వారాల్లోనే ఆయుధ ధారణపై కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టం తీసుకొచ్చారు. న్యూజిలాండ్‌లో 51మందిని కాల్చిచంపిన క్రైస్ట్‌ చర్చ్‌ నగరం ఉదంతం తర్వాత పౌరుల దగ్గరున్న తుపాకులను ప్రభుత్వం కొని ధ్వంసం చేసేలా చట్టం తెచ్చారు. ఆస్ట్రేలియాలో 1996నాటి కాల్పుల ఘటన తర్వాత పౌరులనుంచి 6,50,000 తుపాకులు సేకరించి ధ్వంసం చేశారు. ఆ దేశాల్లో ఇలాంటి చట్టాలు తెచ్చాక హింస గణనీయంగా తగ్గింది. అయినా ఎన్‌ఆర్‌ఏ తన తర్కం వీడదు. ఫలితంగా తరచు దుండగుల తుపాకులకు పదులకొద్దీమంది నేలకొరుగుతున్నారు. అనేకులు గాయాలపాలై వికలాంగులవుతున్నారు. అక్కడ చదువుల కోసం, కొలువుల కోసం వెళ్తున్న మన పౌరులు అనేక మంది ఈ మారణహోమంలో సమిధలవుతున్నారు. అమెరికన్‌ సమాజం కళ్లు తెరడానికి మరెన్ని బలిదానాలు జరగాలో?! 

మరిన్ని వార్తలు