Afghanistan Crisis: మరో యుద్ధం మొదలైంది!

1 Sep, 2021 00:20 IST|Sakshi

గెలవని యుద్ధం ఎన్నాళ్ళు చేస్తామనే ఆలోచనొచ్చాక, ఎవరికైనా పోరాటం కొనసాగించడం కష్టమే. లేస్తే మనిషిని కాననే అగ్రరాజ్యానికైనా నిస్పృహ తప్పదు. ఇరవయ్యేళ్ళ క్రితం స్వాతిశయంతో అఫ్గాన్‌లో మొదలుపెట్టిన తీవ్రవాదంపై యుద్ధానికి అమెరికా ఎట్టకేలకు అగౌరవ ప్రదమైన రీతిలో స్వస్తి చెప్పింది. అమెరికన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత కాలంగా సాగుతున్న అఫ్గాన్‌లోని యుద్ధమనే నెత్తిమీది బరువును ఎప్పుడు దించేసుకుందామా అని కొన్నేళ్ళుగా చూస్తున్న అమెరికా ఎట్టకేలకు ఆ భారం వదిలించుకుంది.

సైనిక ఉపసంహరణకు తనకు తాను చెప్పిన తుది గడువు ఆగస్టు 31 కన్నా 24 గంటల ముందే 30వ తేదీ అర్ధరాత్రికే అంతా ముగిం చింది. రెండేళ్ళ క్రితం 2020 ఫిబ్రవరిలో శాంతి ఒప్పందం పేరిట తాలిబన్లకు చట్టబద్ధతనూ, లేని పోని బలాన్ని అందించి అమెరికా తప్పు చేసింది. చివరకు అఫ్గాన్‌లో శాంతియుత, సుస్థిర వ్యవస్థకు చోటివ్వకుండా హడావిడి డెడ్‌లైన్‌ ప్రకటన, ప్రణాళిక లేని సైనిక ఉపసంహరణలతో ఆఖరి తప్పూ పూర్తి చేసింది.
(చదవండి: షారుక్ పాటకు.. స్టెప్పులు వేసిన అమెరికన్‌ జంట

ఆఖరి విమానంలో అమెరికా తాత్కాలిక రాయబారి, సైనికాధికారి సహా మిగిలిన కొందరు సైనికులూ తిరుగుముఖం పట్టారు. ఆగస్టు 15న కాబూల్‌ కైవసంతో మొదలైన తాలిబన్ల జైత్రయాత్రకు పదిహేను రోజుల్లోనే దక్కిన పతాకస్థాయి విజయమిది. చివరి దాకా పహారా కాసిన కాబూల్‌ విమానాశ్రయాన్ని సైతం అమెరికన్‌ సైనికులు ఖాళీ చేయడంతో, ఇప్పుడు అఫ్గాన్‌ మొత్తం తాలిబన్ల చేతికి వచ్చేసినట్టయింది.

పంజ్‌షీర్‌ లోయ లాంటి చోట్ల అంతర్గత ప్రతిఘటన ఉన్నా, ఆధిపత్యం తమదేనని నిరూపించుకొనేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌ అవతరించిందంటూ గాలిలో కాల్పులతో సాయుధ తాలిబన్ల సంబరాలు... గాలిలో హెలికాప్టర్‌ మీద నుంచి మనిషిని ఉరి తీయడాలు... చూశాక కొత్త హయాం ఎలా ఉంటుందో అనూహ్యమేమీ కాదు. ‘మా దేశం మీదకొస్తే, ఎవరికైనా ఏ గతి పడుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ’ అన్న తాలిబన్‌ ప్రతినిధుల మాట ఇప్పుడు ప్రపంచంలో ప్రతిధ్వనిస్తున్న హెచ్చరిక.

విపక్ష రిపబ్లికన్లతో పాటు స్వపక్ష డెమోక్రాట్లు, చివరకు సొంత పౌరుల నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు విమర్శలు తప్పలేదు. వాటన్నిటి మధ్యే ఆయన తాజా అధికారిక ప్రకటన చేశారు. లక్షమంది అఫ్గాన్‌ పౌరులు, 6 వేల మంది అమెరికన్‌ సైనికులు సహా అంతా కలిపి 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సుదీర్ఘ యుద్ధం... 2.3 లక్షల కోట్ల డాలర్లకు పైగా అమెరికా ఖర్చు చేసిన కళ్ళెదుటి యుద్ధం ముగిసింది. కానీ, కనిపించని కొత్త యుద్ధం మొదలైంది.

ఆరంభం నుంచి అంతిమ ఘట్టం దాకా అనేకానేక వ్యూహాత్మక తప్పిదాల ఫలితమే – ఈ మలి యుద్ధం. అమాయక అఫ్గాన్లు చేయాల్సి వచ్చిన హక్కుల యుద్ధం. తీవ్రవాదానికి అఫ్గాన్‌ అడ్డా కాకూడదని పొరుగునున్న భారత్‌ సహా పలు ప్రపంచ దేశాలు సాగించే రక్షణ, దౌత్య యుద్ధం. సొంత గడ్డ మీద ఉన్న సవాలక్ష తెగలతోనూ, ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థలతోనూ తాలిబన్లు చేయాల్సి ఉన్న అధికార సహవాస యుద్ధం. ఛాందసవాద మూర్ఖత్వానికి మానవత్వం బలి కూకూడదని యావత్‌ మానవాళి చేయాల్సిన మహా యుద్ధం. పాత తప్పుల ఫలితంగా, భవిష్యత్‌ పరిణామాలను ప్రభావితం చేసే శక్తిని పాశ్చాత్య ప్రపంచం ఇప్పుడు చాలావరకు కోల్పోవడమే ఈ కొత్త యుద్ధంలోని కీలక కోణం.  
(చదవండి: తాలిబన్లతో భారత రాయబారి చర్చలు)

అమెరికా ఛత్రచ్ఛాయలోని కాలంలో భారత్‌ సైనిక జోక్యం చేసుకోకుండా పార్లమెంట్‌ మొదలు అనేక నిర్మాణాలు, అభివృద్ధి సాయాలు, దౌత్య సంబంధాలతో అఫ్గాన్‌ పౌరసమాజం మనసు గెలిచింది. ప్రజాస్వామ్య అఫ్గాన్‌ సర్కారుకు ఆఖరు దాకా మద్దతు నిచ్చింది. ఇప్పుడిక మారిన పరిస్థితుల్లో వ్యూహం మార్చుకోక తప్పదు. అనిశ్చిత అఫ్గాన్‌లో కొత్త తాలిబన్‌ పాలనను మొత్తంగా తోసిపుచ్చడం కన్నా సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారిని దోవలోకి తెచ్చుకోవడమే ఇప్పటికి తెలివైన దౌత్యనీతి. అఫ్గాన్‌ను అమెరికా ఖాళీ చేసిన కొద్దిగంటలకే మంగళవారం భారత్‌ తొలిసారిగా తాలిబన్లతో చర్చలకు శ్రీకారం చుట్టింది.

ఖతార్‌లోని భారత రాయబారి తాలిబన్ల అభ్యర్థన మేరకు దోహాలో వారి ప్రతినిధులను కలసి, చర్చలు జరిపినట్టు కథనం. అఫ్గాన్‌ భూభాగాన్ని తీవ్రవాదానికి వినియోగించుకొనేందుకు అనుమతించరాదని చర్చల్లో భారత్‌ తెలిపింది. అదే సమయంలో మన పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అనుమతించాలనీ కోరింది. అలాగే, అఫ్గాన్‌ పరిణామాలపై దృష్టి పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.

అంతర్జాతీయంగా చట్టబద్ధత, ఆగిన విదేశీసాయం కోసం ఆరాటంతో తాలిబన్లు కూడా మెత్తటి కబుర్లు చెబుతున్నారు. కానీ, వివిధ ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థలతో సంబంధమున్న తాలిబన్లను ఎంతవరకు నమ్మాలనేది ఇప్పుడు ప్రపంచమంతటితో పాటు భారత్‌కూ ఉన్న సమస్యే. మరోపక్క తాలిబన్ల భయంతో వేలాది అఫ్గాన్‌ జనం పాకిస్తాన్‌కి తరలిపోతుండడం ఇంకో విషాదం. లక్షా 23 వేల మందికి పైగా పౌరులను అమెరికా దళాలు అఫ్గాన్‌ నుంచి తరలించినా, వివిధ దేశాల పౌరులు ఇంకా అఫ్గాన్‌లో చిక్కుబడి ఉన్నారు.

వెరసి, అమెరికా మునుపెన్నడూ లేనంత సుదీర్ఘకాలం సాగించిన యుద్ధం అన్ని రకాలుగా విఫలమైంది. తీరని అవమాన భారమే మిగిలింది. తీవ్రవాదంపై మొదలుపెట్టిన యుద్ధాన్ని చివరకు తీవ్రవాదులకే సానుకూలమయ్యేలా ముగించి, సేనలు ఇంటిముఖం పట్టడం విరోధాభాస. శాంతి అంటే యుద్ధానికీ, యుద్ధానికీ మధ్య విరామం అంటారు. కొత్త యుద్ధానికి సిద్ధమవడం ఒక్కటే ఇప్పుడు ప్రపంచానికి మిగిలింది.  
(చదవండి: 20 ఏళ్ల యుద్ధం ముగిసింది.. చిట్టచివరి సోల్జర్‌ ఈయనే!)

మరిన్ని వార్తలు