స్వయంకృతం

9 Feb, 2021 01:52 IST|Sakshi

వర్షాకాలంలో హఠాత్తుగా కుంభవృష్టితో వరదలు ముంచెత్తిన సందర్భం కాదు. మండు వేసవిలో హిమఖండం కరిగి ఊరిపై విరుచుకుపడిన ఉదంతమూ కాదు. ఎలాంటి కీడూ శంకించని వణికించే చలికాలంలో ఉన్నట్టుండి ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌ను జల విలయం ముంచెత్తింది. దేవభూ మిగా పిలుచుకునే ఆ రాష్ట్రానికి తీరని విషాదం మిగిల్చింది. ఇంతవరకూ 26 మంది మృతులను లెక్కేయగా, దాదాపు 171 మంది జాడ తెలియలేదంటున్నారు. హఠాత్తుగా వచ్చిన వరదల్లో జాతీయ థర్మల్‌ విద్యుత్‌ సంస్థ(ఎన్‌టీపీసీ) ఆధ్వర్యంలోని తపోవన్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు, రిషిగంగ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ధ్వంసం కాగా, మరికొన్ని డ్యామ్‌లు, రోడ్లు, బ్రిడ్జిలు, సొరంగం, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. ఆచూకీ తెలియకుండాపోయినవారిలో అత్యధి కులు తపోవన్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులేనని సమాచారం అందుతోంది. ఆ ప్రాజెక్టుకు చెందిన టన్నెల్‌ నుంచి 20మందిని కాపాడగలిగారు. ఉత్తరాఖండ్‌కు ఇది మొదటి విషాదం కాదు. ఎనిమిదేళ్లనాడు సైతం ఆ రాష్ట్రం ఇలాంటి విపత్తునే చవిచూసింది. 

ఎన్ని సాధించినా ప్రకృతి ముందు మనిషి పిపీలకం. దాని ఆగ్రహాన్ని చల్లార్చటం ఎవరి తరమూ కాదు. కావాలని ప్రకృతితో దోబూచులాడటానికి ప్రయత్నించి, పనిగట్టుకుని దాన్ని రెచ్చ గొడితే పర్యవసానాలు అసాధారణ రీతిలో వుంటాయి. ఇప్పుడు జరిగిందదే. అలక్‌నందా పరివాహ ప్రాంతంలో హిమనదీ సంబంధమైన సరస్సులు ఇరవై వరకూ వున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమఖండాలు కరగటం వల్ల ఏర్పడే జలాలు ఎక్కడికక్కడ ఇలా సరస్సులుగా ఏర్పడతాయి. వీటితో అత్యంత జాగురూకతతో మెలగాలని, అవి ఎప్పుడో అప్పుడు కట్టుదాటి నదీ ప్రవాహంలో కలిసి దిగువ ప్రాంతాల్లో తీరని నష్టం కలగజేసే ప్రమాదం వుందని కూడా హెచ్చరించారు. ఈ ముప్పును కనిష్ట స్థాయిలో వుంచేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలేమిటో కూడా సూచించారు. కానీ పట్టించుకున్నవారెవరు? 2013లో పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ల సమీపంలో భారీ వర్షాలు పడటంతో గంగ, భాగీరథి, మందాకిని, అలక్‌నంద వంటి నదులన్నీ మహోగ్రరూపమెత్తి జనావాసాలపై విరుచుకుపడ్డాయి.

వందలాదిమంది ప్రాణాలు తీశాయి. అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకూ చెందినవారు కూడా తీర్థయాత్రలకెళ్లిఆ వరదల్లో చిక్కుకుని నరకయాతన చవిచూశారు. రోజుల తరబడి సాయం అందక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సహాయ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడానికి కూడా చాలా రోజులు శక్యం కాలేదు. కానీ దాన్నుంచి అక్కడి ప్రభుత్వం నేర్చుకున్నదేమిటి? తీసుకున్న చర్యలేమిటి? వాటి మాటెలావున్నా యధాప్రకారం అక్కడ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముమ్మరం చేసేందుకు ప్రయత్నించింది. రాష్ట్రంలో అప్పటికే వంద లాది జల విద్యుత్‌ ప్రాజెక్టులున్నా పెండింగ్‌లోవున్న పది హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు అనుమతిని వ్వాలని మూడేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్తరాఖండ్‌ కోరింది. 

సాధారణ పరిస్థితుల్లో అయితే  హిమఖండాలు నెమ్మదిగా కరుగుతూ హిమానీ నదాల్లోకి ఎప్పటి కప్పుడు నీరు చేరుతుంటుంది. అందునా  శీతగాలులు బలంగా వీస్తున్న ప్రస్తుత సమయంలో అవి అంత త్వరగా కరగవు. పర్యావరణం దెబ్బతింటున్న వర్తమానంలో అటువంటి సహజసిద్ధమైన ప్రక్రియను ఊహించలేం. వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతుంటే, అడవులు తగలబడి దాన్ని మరింత పెంచుతుంటే ఆ హిమఖండాలు మోతాదుకు మించి కరగటం సర్వసాధారణం. అలాగే కుంభవృష్టి సైతం సరస్సు మట్టాలను పెంచి నదుల్లోకి భారీ వరద నీరు చేరుతుంది. ఇవి చాలవన్నట్టు జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం డైనమైట్లతో కొండలను పిండి చేస్తుంటే, ఆ ప్రకంపనల ధాటికి హిమఖండాలు ఒక్కసారిగా విరిగిపడే ప్రమాదం వుంటుంది.

2013 విషాదం తర్వాత ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసిన స్విస్‌ శాస్త్రవేత్తల బృందం హిమాలయ సానువుల్లో మొత్తం 251 హిమానీ నదాల సరస్సులున్నాయని తేల్చింది. వీటిల్లో 104 అత్యంత ప్రమాద కారులని, అలక్‌నంద సమీపంలో ఇవి 20 వరకూ వున్నాయని చెప్పారు. వీటివల్ల ముప్పు ఉన్నదని హెచ్చరించారు. ఇప్పుడు ఏ కారణం వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఉన్నట్టుండి ఒక పెద్ద పలక హిమఖండం నుంచి వేరుపడటంతో ఒక్కసారిగా సరస్సులోని జల మట్టం పెరిగి వరదలు పోటెత్తి వుండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విషాద ఘటన జరిగిన ఆదివారంగానీ, అంతకుముందు రోజుగానీ ఆ ప్రాంతంలో వర్షాలు లేవు. 

ఉత్తరాఖండ్‌ ఉదంతం ప్రకృతి పట్ల మన అవగాహనను పెంచాలి. దానిపట్ల భయభక్తులతో వ్యవహరిస్తేనే... దాని సహనాన్ని పరీక్షించకుండా వున్నప్పుడే అది మనల్ని చల్లగా చూస్తుందన్న ఎరుక కలగాలి. హిమానీ నదాల్లో ప్రకృతిపరంగా జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు గ్రహించగలిగే సాంకేతికతను అభివృద్ధి చేయటం, హెచ్చరిక వ్యవస్థలను అమలులోకి తీసుకు రావటం, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల సంఖ్యను బాగా కుదించటం, అన్ని రకాల అక్రమ నిర్మాణాలు ఆపటం వంటి చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ప్రమాదాలను నివారించగలుగుతాం. 2011లో స్వామి నిగమానంద గంగానదిని మాఫియాలనుంచి రక్షించాలని నాలుగు మాసాలపాటు ఆమరణ దీక్ష సాగించి ప్రాణాలు బలిపెట్టారు. కానీ ఆయన పరిత్యాగం నుంచి ఉత్తరాఖండ్‌ నేర్చుకున్నదేమీ లేదు. ఇప్పటికైనా పాలకులకు వివేకం కలగాలని ఆశిద్దాం. 

మరిన్ని వార్తలు