చిలుక పేరు ఛీనాడు!

23 Oct, 2022 00:56 IST|Sakshi

జనతంత్రం

ఏడేడు సముద్రాల కావల ఒక నిర్జన ద్వీపం ఉండేదట! ఆ ద్వీపంలో ఒక ఊడల మర్రి. ఆ మర్రిచెట్టు తొర్రలో ఓ చిలుక. ఆ చిలుక గొంతులో ఉండేదట మాయల ఫకీరు ప్రాణం. ఆ మాయల ఫకీరు అనేవాడు లోకం మీద పడి నానా అరాచకాలు చేసేవాడు. స్త్రీలను చెరపట్టేవాడు. దోపిడీలు చేసేవాడు. కొన్నేళ్ల పాటు వీడి అఘాయిత్యాలు భరించిన జనం విసిగిపోయారు. చివరకు ఒక యువకుడు ఏడు సముద్రాలను దాటి, చెట్టు తొర్రలోని చిలుక గొంతు నొక్కేస్తే తప్ప ఆ మాయల ఫకీరు పీడ విరగడ కాలేదు.

ఇప్పుడైతే అటువంటి చిలుకల్ని సముద్రాలకవతల దాచిపెట్టవలసిన అవసరమే లేదు. హైదరాబాద్‌ మహానగరం శివార్లలో జాతీయ రహదారిని ఆనుకొని రెండువేల ఎకరాల్లో ఒక మంత్రలోకం విస్తరించి ఉంటుంది. ఓ మూలన ఒక ఒంటరి మట్టి గుట్ట. ఒంటి స్తంభంపై నిలబడినట్టు ఆ గుట్టపై ఒక మేడ. ఆ మేడలో ఒకాయన ఉంటారు. ఆయన పేరు రామోజీరావు. ఆయన ముంజేతిపై ఆ చిలుక ఎల్లప్పుడూ వాలి ఉంటుంది. ఆ చిలుక పేరు ‘ఈనాడు’. పేరుకే అది చిలుక. అరిస్తే కర్ణకఠోరం.

యజమాని రామోజీ ఆదేశాలకు అనుగుణంగా ఆ చిలుక అరుస్తుంది. దాని అరుపులే సంకేతాలుగా గ్రహించి పనిచేసే ఒక రాజకీయ వ్యవస్థ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది. ఆ వ్యవస్థ మొత్తాన్ని మాయల ఫకీరు క్యారెక్టర్‌తో పోల్చవచ్చు. వ్యవస్థతో కాదు, వ్యక్తితోనే పోల్చాలి అంటే సదరు వ్యవస్థను మోస్తున్న బాబెవరైతే ఉంటారో ఆ బాబునే మాయల ఫకీరు అనుకోవచ్చు. మాయల ఫకీరు ఏం చేసినా తనకోసం తన ఆనందం కోసమే! ఈ బాబు కూడా ఏం చేసినా తన కోసం, తన వారికోసం! చిలుకబాస్‌ కళ్లల్లో ఆనందం చూడటం కోసం, ఇంకో నాలుగైదు ట్రెయినీ చిలుకల సంతృప్తి కోసం మాత్రమే!

తనకు నచ్చిన వాళ్లను ఒకరకంగా, నచ్చని వాళ్లను మరోరకంగా ‘ఈనాడు’ చిలుక బ్రాండింగ్‌ చేస్తుంది. తనవాడైతే మాయల ఫకీరును కూడా గౌతమ బుద్ధుడని చెబుతుంది. తనవాడు కాకపోతే గాంధీని కూడా గాడ్సే అని పిలుస్తుంది. తన కూటమి ప్రయోజనాలకు భిన్నంగా ఏ నాయకుడైనా గట్టిగా నిలబడితే అతడి మీద అప్పుడెప్పుడో తానే చేసిన, వీగిపోయిన ఆరోపణల్ని మళ్లీ తవ్వి తీస్తుంది.

తన బాబుగారి ఆకాంక్షలకు ఎవరైనా బలంగా అడ్డుపడి నట్లయితే, ‘మన కోహినూర్‌ వజ్రాన్ని లార్డ్‌ డల్హౌసీ చేతిలో పెట్టి లంచాలు తిన్నవాడు ఇతనే’నని ఆరోపించగలుగుతుంది. అందుకు సాక్ష్యంగా సమాధుల్లోంచి కొన్ని ప్రేతాత్మలను లేప గలుగుతుంది. తమ ఎల్లో కూటమి అరాచకాలను, దౌర్జన్యాలను ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే... ‘ఇదుగో ఇతగాడు మహ్మద్‌ గజనీ వెంట దండయాత్రల్లో పాల్గొన్నాడ’ని బ్రాండింగ్‌ చేయగలుగు తుంది. సోమనాథ్‌ దేవాలయాన్ని ధ్వంసం చేసి కొల్లగొట్టిన రత్నరాశుల లెక్కను ఇతడిప్పుడు చెప్పవలసిందేనని నిల దీస్తుంది.

తనకు చిత్తం వచ్చినట్టు ఇతరుల మీద బురద చల్లే ‘ఈనాడు’ చిలుక తన యజమాని చట్టవిరుద్ధ కార్యక్రమాలపై, ఎల్లో కూటమి సీఈవో బాబుగారి అవినీతిపై ఎక్కడా చర్చ జరగకుండా పహారా కాస్తుంది. ఎవరైనా తెగించి చర్చిస్తే వారిలోంచి లేని సంఘ విద్రోహశక్తిని వెలికితీసి మొహాన టార్చ్‌లైట్‌ వేస్తుంది. మావాళ్లు పత్తిత్తులనీ, మచ్చలేని మహా తోపులనీ నమ్మబలుకుతుంది.

ఎల్లో కూటమికి సూపర్‌బాస్‌గా వ్యవహరిస్తూ, సాలెగూడు వెనకాల కనపడకుండా కూర్చొని రిమోట్‌ నొక్కే వ్యక్తి ‘ఈనాడు’ చిలుక బాస్‌ రామోజీరావు. వారి చట్టవిరుద్ధ కార్యక్రమాలు బహిరంగ రహస్యం. రెండువేల ఎకరాల ఫిలిం సిటీ సామ్రాజ్యాన్ని ఆయన చట్ట విరుద్ధంగానే నిర్మించుకున్నారు. ప్రభుత్వాలు పేదలకిచ్చిన అసైన్‌మెంట్‌ భూములను కొనుగోలు చేయడం నేరం. అది నేరమని తెలిసినా ఆయన కొనుగోళ్లు చేశారు. తన సామ్రాజ్య విస్తరణకు సహకరించకుండా, అమ్మకా నికి నిరాకరించిన రైతుల భూములకు దారి లేకుండా చేసి భయపెట్టి విస్తరించగలిగారు. గ్రామాలను కలిపే రహదారు లనూ కబ్జా చేశారు. చెరువులను పూడ్చేసి కలిపేసుకున్నారు. గీత కార్మికులకు ఉపాధినిచ్చే వందలాది తాటిచెట్లను నరికించారు.

వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు జరగాలంటే భూ వినియోగ మార్పిడి జరగాలి. అటువంటిదేమీ జరగకుండానే ‘నాలా’ చట్టాన్ని హేళన చేస్తూ బహుళ అంతస్థుల భవనాలను డజన్ల కొద్దీ నిర్మించారు. ఫిలిం సిటీలో 147 అక్రమ నిర్మాణాలు న్నాయని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లెక్క తేల్చింది. వాటిని కూల్చివేస్తామంటూ అప్పుడప్పుడు అధికారులు నోటీసులు పంపిస్తుంటారు. రామోజీరావు పట్టించుకోరు. వీరు కూల్చి వేయరు. ఈ వ్యవహారం ఒక టెలివిజన్‌ సీరియల్‌. కానీ ఆయన చట్టవిరుద్ధ కార్యక్రమాలకు సాక్ష్యంగా ఈ 147 అక్రమ నిర్మా ణాలు ఎగరేసిన జెండాల మాదిరిగా రెపరెపలాడుతున్నాయి.

అనాజిపూర్‌ రెవిన్యూ పరిధిలోకి వచ్చే ఒక 60 ఎకరాల భూమిని సీలింగ్‌ చట్టం ప్రకారం మిగులు భూమిగా తేల్చి పేదలకు అసైన్‌ చేశారు. ఆ పేదలకు పప్పుబెల్లాలు పంచి రామోజీరావు సదరు భూమిని కబ్జాచేసి వాడుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువ రూ.300 కోట్ల పైమాటే. రిజిస్ట్రేషన్‌ విలువలు రాయడానికి ఆయన చస్తే ఒప్పుకోరు. ఇటీవల వైజాగ్‌కు సంబంధించిన వార్తా కథనంలో రిజిస్ట్రేషన్‌ వాల్యూ లెక్కించడమేమిటి? ఠాఠ్‌ బహిరంగ ధరనే లెక్కించాలని ఈనాడు చిలుక దబాయించింది.

నాగన్‌పల్లి గ్రామ రెవిన్యూ పరిధిలోని 14 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ భూమి కూడా రామోజీ ఆక్రమణలో ఉన్నట్టు ప్రభుత్వాధికారులు గుర్తించారు. అప్పటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అందులో 585 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అయితే ఆ పేదలు ఆ భూముల మీదకు రాకుండా అప్పట్నించీ ఫిలింసిటీ యాజమాన్యం అడ్డుకుంటూనే ఉన్నది. స్థానిక శాసనసభ్యుడు ఫిలింసిటీ తొత్తుగా మారడంతో పేదలకు అన్యాయం జరుగుతున్నది. నిన్న శుక్రవారం రోజున స్థానిక సీపీఎం నాయకుల బృందం ఈ ప్రాంతంలో పర్యటించి రామోజీపై భూకబ్జా కేసును నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. రాజశేఖరరెడ్డి పట్టాలిచ్చిన పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు స్వాధీనం చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తుందో లేదో చూడాలి.

ఫిలింసిటీ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని రామోజీ సినిమా షూటింగ్‌లకు అద్దెకిస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులతో యుద్ధం వంటి భారీ షూటింగ్‌లు ఇక్కడ జరుగుతాయి. వీటిపై అద్దె వసూళ్లు కూడా పెద్దమొత్తంలోనే ఉంటాయి. భూమి ప్రభుత్వానిది! అద్దె రామోజీది! ఇదీ లోకానికి నీతులు చెప్పే సుద్దపూస బాగోతం!! నాగన్‌పల్లి – పోల్కంపల్లి గ్రామాల మధ్యన ఉన్న రోడ్డును ఫిలింసిటీ ఆక్రమించి రెండువైపులా గేట్లు పెట్టి తాళాలు వేసింది. పాతికేళ్లు గడిచాయి కానీ, ఆ తాళాలు ఇంతవరకూ తెరవనేలేదు.
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు రాజ శేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పట్టాలెక్కి గమ్యాన్ని చేరుకున్నాయి. అయితే అక్కడ విమానాశ్రయం పెట్టాలనే ప్రతిపాదనలు అంతకుముందు నుంచే ఉన్నాయి. చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా ఈ విషయం తెలుసు కున్న రామోజీ పాల్మాకుల గ్రామ పరిధిలో 431 ఎకరాల భూమిని బినామీల పేరున సేకరించారు. ఈ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అమ్మడానికి ఇష్టపడని వారిని బెదిరించి కొనుగోలు చేశారని గ్రామస్థులు ఇప్పటికీ చెబు తున్నారు. ఈ భూముల్లో కూడా అసైన్డ్‌ భూములున్నట్టు ప్రభుత్వ యంత్రాంగం నిర్ధారించింది.

ఇక విశాఖపట్నం సీతమ్మధారలోని ‘ఈనాడు’ స్థల పురాణం వింటే ఎంతటివాడైనా దిగ్భ్రాంతికి లోనుకావలసిందే! ఆ స్థలం ఒకాయన దగ్గర అద్దెకు తీసుకున్నది. రోడ్డు విస్తరణలో కొంత భూమిని ప్రభుత్వం తీసుకున్నందుకు బదులుగా వేరొక చోట కేటాయించిన భూమిని యజమానికి ఇవ్వకుండా తానే కైంకర్యం చేశాడు రామోజీరావు. ఆయనపై అవినీతి నిరోధక శాఖ పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసింది.

ఇక మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారం జగమెరిగిన అక్రమం. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45 ఎస్‌ (1) నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఆయన 2,600 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. ఇందుకు పడాల్సిన శిక్ష రెండేళ్ల జైలు, 5,200 కోట్ల జరిమానా. అక్రమ బండారం బయటపడడంతో ఆయన హడావిడిగా రిలయన్స్‌ దగ్గర అప్పులు తెచ్చుకొని డిపా జిటర్లకు తిరిగి చెల్లించినట్టు ప్రకటించారు. చేసిన పాపం చెంప లేసుకుంటే పోతుందా? మరి న్యాయశాస్త్రం, చట్టాలు, కోర్టులు ఎందుకున్నట్టు? అందుకే ఈ కథ ఇంకా ముగిసి పోలేదు. మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది.

ఎల్లో కూటమిలోని రింగ్‌ లీడర్‌ పురాణం ఇట్లా వుంటే ఇక అందులోని దళపతులు, అధిపతులు, కులపతులు వగైరాల బాగోతాలెట్లా ఉండాలి! రెండెకరాల మెట్టభూమి నుండి రెండు లక్షల కోట్ల సంపద ఎత్తుకు ఎదిగిన విభ్రాంతికరమైన తాంత్రిక చరిత్ర చంద్రబాబు జీవితకథ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రాజకీయవేత్త చంద్రబాబేనని ఇరవయ్యేళ్ల క్రితమే తెహల్కా డాట్‌కామ్‌ ప్రకటించింది. మొన్నటి ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు అవినీతి బాగోతంపై ఒక గ్రంథాన్ని ప్రచురించవలసి వచ్చింది.

ఇక చంద్రబాబుకు దత్తపుత్రుడుగా ప్రచారంలో ఉన్న పవన్‌ కల్యాణ్‌ గురించి రెండు ముక్కలు చాలు. ఆయన మాట నిలకడ లేనితనంపై ఇప్పటికే ప్రజలకు ఏవగింపు కలిగింది. ఒకే అంశంపై సందర్భాన్ని బట్టి నాలుక మడతేయడంలో చంద్ర బాబు తర్వాత అంతటి సమర్థుడు పవనే అన్న అభిప్రాయం బలపడుతున్నది. ‘‘ఎవరి ప్రైవేట్‌ జీవితాలు వారివారి సొంతం, పబ్లిగ్గా నిలబడితే ఏమైనా అంటాం’’ అన్నాడు శ్రీశ్రీ. నాయ కుడుగా రాజకీయాల్లో నిలబడిన వ్యక్తి జీవితం ఆదర్శ ప్రాయంగా ఉండాలని అనుచరులు, ప్రజలు కూడా కోరు కుంటారు. ఆయన మూడు పెళ్లిళ్లు వివాదాస్పదమయ్యాయి. ‘నేను మాత్రం కోరుకున్నానా? ఏదో అలా జరిగిపోయింద’ని ఆ మధ్యనే ఒకసారి కామెంట్‌ చేశారు.

మొన్న బీజేపీ ముసుగును తొలగించే సందర్భంలో మాట్లాడుతూ ‘కావాలంటే ఒకరికి విడాకులిచ్చి మరొకరి చొప్పున మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చ’ని ఇచ్చిన సందేశం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు పవన్‌ బాజప్తా ఎల్లో కూటమిలోని మనిషి. ఈ కూటమిలో మరో మీడియా మనిషి ఉన్నాడు. ఆయన పేరు నాయుడు. ఆయన గతంలో ‘న్యూజెన్‌’ పేరుతో ఒక తలనూనెను ప్రమోట్‌ చేశాడు. అది రాసుకుంటే జుట్టు ఊడిపోదనీ, బట్ట తల మీద కూడా వెంట్రుకలు మొలుస్తాయని ప్రచారం చేసుకున్నాడు. ‘నూనె రాసుకున్న తర్వాత చేతుల్ని గట్టిగా సబ్బుతో కడుక్కోకపోతే అరచేతిలో కూడా వెంట్రుకలు మొలుస్తాయి జాగ్రత్త!’ అని కూడా ప్రచారం చేసుకుని ప్రజల్ని ఫూల్స్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఒక్క మెతుకు చాలు, ఇతని అవినీతి ఎంత ఉడికిందో చెప్పడానికి!

ఇలాంటి బాపతుగాళ్లంతా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్కరుగా జతకూడబోతున్నారు. ప్రజాకంటక చరిత్ర కలిగిన వాళ్లంతా జతకట్టి దానికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే ముద్దుపేరు పెట్టబోతున్నారు. ఈ కూటమిలోకి కుడి ఎడమ పక్షాలను కూడా కన్నుగీటి పిలిచేందుకు సిద్ధపడుతున్నారు. వేటాడే ఓపిక నశించిన పెద్దపులి చేతిలో బంగారు కడియం పట్టుకుని, చెరువు గట్టున ఎదురు చూసిందట బక్రాగాడి కోసం! ఇప్పుడు చంద్ర బాబు – రామోజీలు ప్రజాస్వామ్య కడియం చేతిలో పట్టుకొని అలా ఎదురుచూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సర్కార్‌ను కూలదోసి చంద్రబాబును గద్దెనెక్కించడం ఎల్లో కూటమికి ఇప్పుడొక జీవన్మరణ సమస్య. ఎందుకని? ఒక తక్షణ కర్తవ్యం ఉన్నది. ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉన్నది. ఎల్లో కూటమి అమరావతి భూముల్లో పెట్టిన పెట్టు బడికి లాభాలు పిండుకోవడానికి ఈ సర్కార్‌ ఆటంకంగా ఉన్నది. బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం జగన్‌ సర్కార్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే ఎల్లో కూటమి శాశ్వతంగా అధికారానికి దూరమవ్వక తప్పదు. అందుకోసం ఆ ప్రయ త్నాలకు కళ్లెం వేయాలి. ఇది దీర్ఘకాలిక వ్యూహం.

ఇంతకూ అమరావతి భూముల్లో ఎల్లో కూటమి, దాని అనుబంధ సభ్యులు, ఆత్మీయ సభ్యులు, శ్రేయోభిలాషులు, బ్లడ్‌ గ్రూపులవారూ అంతా కలిసి ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు? చంద్రబాబు అధికారంలో ఉన్న కాలంలో ఆ ప్రాంతంలో 75 వేల ఎకరాల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 35 వేల ఎకరాల ల్యాండ్‌ పూలింగ్‌ను మినహాయిస్తే సుమారు 40 వేల ఎకరాల్లో పెట్టుబడులు పెట్టి నట్టు ఒక అంచనా! రిజిస్ట్రేషన్‌ వాల్యూను ‘ఈనాడు’ చిలుక ఒప్పుకోదు కనుక మార్కెట్‌ వాల్యూనే లెక్కించాలి. చంద్రబాబు అప్పుడు చెప్పిన లెక్క ఎకరాకు 10 కోట్లు. దాని ప్రకారం నాలుగు లక్షలకోట్లు పెట్టుబడిగా పెట్టినట్టా? అందులో సగమైనా, పావలా వంతైనా సరే గుండె జారిపోయే లెక్కే. అందుకే వికేంద్రీకరణ అంటేనే హడలి చస్తున్నారు. పాలనా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే పేరు పెట్టుకున్నారు. ఇంతకంటే వింత ఉంటుందా?

బలహీనవర్గాలు, మహిళల సాధికారతకు తాను వ్యతిరేకి నని మొదటి నుంచీ ఎల్లో కూటమి చాటుకుంటూనే ఉన్నది. బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కోర్టుకు వెళ్లింది. రాజధానిలో మా పక్కన పేద ప్రజలు ఉండటానికి వీల్లేదని నానాయాగీ చేసింది. ఇంగ్లీషు మీడియానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేయబోయి ప్రజాగ్రహానికి భయపడి తోక ముడిచింది. ఇది తాత్కాలికమే. ప్రజా సాధికారతకు వ్యతి రేకంగా తన కుట్రలను ఈ కూటమి ఆపదు. ప్రజలు సాధించు కుంటున్న విజయాలను కబళించడానికి పొంచి ఉన్నది. కుల మత ప్రాంతాలకు అతీతంగా పేదప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం. ఎల్లో కూటమి ప్రాణం ఫిలిం సిటీలోని ‘ఈనాడు’ చిలుకలో ఉన్నది. ఆ చిలుక పలుకుల మోసంపై అవగాహన పెరగాలి. ఆ చిలుక పలుకుల బండారాన్ని ఎండ గడితేనే ఎల్లో కూటమి అనే మాయల ఫకీరు ఆగడాలు ఆగుతాయి.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు