కొత్త రకం వివక్ష 

27 May, 2021 00:39 IST|Sakshi

ఎన్ని లోటుపాట్లున్నా, ధనిక, బీద దేశాల తారతమ్యాలున్నా...అంతర్జాతీయంగా ఏదో మేర సమ భావనలు క్రమేపీ అలుముకుంటున్నాయని ఆశపడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి విరుచుకుపడి అంతటినీ తలకిందులు చేసినట్టు కనబడుతోంది. మన దేశంలో ఉత్పత్తవుతున్న రెండు టీకాలను గుర్తించకపోవడం ఈ సరికొత్త ధోరణికి నిదర్శనం కావొచ్చు. మరోపక్క యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలూ, మరికొన్ని ఏకమై త్వరలో జరగబోయే ప్రపంచ ఆరోగ్య సదస్సులో మహమ్మారులు ముంచుకొచ్చినప్పుడు ప్రపంచ దేశాలు పాటించాల్సిన విధి విధానాలు, వాటి సంసిద్ధత వగైరా అంశాల్లో ఒక ప్రామాణికమైన విధాన రూపకల్పనకు తొందర చేస్తున్నాయి. పైకి చూడటానికి ఇది సదుద్దేశంగానే కనిపిస్తున్నా ఇందులో కొన్ని ప్రమాదాలు పొంచివున్నాయన్నది నిపుణులు చెబుతున్న మాట. ఒకపక్క కరోనా మహమ్మారి రెండో దశ సృష్టిస్తున్న బీభత్సంతో మన దేశంతోపాటు చాలా దేశాలు ఇంకా అల్లాడుతున్నాయి. దాన్ని ఎదుర్కొ నడానికి ప్రయత్నిస్తున్నాయి. మొదటి, రెండో దశల తీరుతెన్నులు, వాటిని ఎదుర్కొనడంలో ప్రపంచ దేశాలు పొందిన సాఫల్యవైఫల్యాలు, ఆ క్రమంలో ఎదురైన వివిధ రకాల అనుభవాలు వగైరాలపై బేరీజు వేసుకునే దశలో ఈ కొత్త కార్యాచరణ రూపకల్పనకు ధనిక దేశాలు హడావుడి పడటం వెనక ప్రయోజనం వుంది. ఇలాంటి మహమ్మారులు విరుచుకుపడినప్పుడు వాటిని సొంత సమస్యలుగా పరిగణించి తమ తమ సరిహద్దుల పరిమితుల్లో ఆలోచించి వ్యవహరించటం, వెనక బడిన దేశాలకు తగిన సమాచారం ఇవ్వడంలో, ఎదుర్కొనడానికి తోడ్పడటంలో నిరాసక్తత ప్రదర్శించటం తదితరాలు చర్చకు రాకుండా... వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి ఆటంకంగా వున్న పేటెంట్‌ హక్కులు తొలగించాలన్న భారత్, దక్షిణాఫ్రికాల వాదనను బేఖాతరు చేయడం ధనిక దేశాల ఆంతర్యం కావొచ్చు. 

మహమ్మారులపై ప్రామాణిక విధివిధానాల రూపకల్పన సంగతి తర్వాత... అసలు మన దేశంలో ఉత్పత్తయిన టీకాలపై వివక్ష ఎందుకు ప్రదర్శించవలసి వస్తున్నదో ప్రశ్నార్థకం. కోవాగ్జిన్‌కు సంబంధించినంతవరకూ దాని పూర్తి డేటాను తమకు ఇవ్వలేదని, అది అందుబాటులో వుంటే తప్ప అనుమతించటం సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దాన్ని ఉత్పత్తి చేసే సంస్థ ఎటూ ఆ డేటాను సమర్పిస్తున్నామని ప్రకటించింది. కానీ కోవిషీల్డ్‌ టీకాకు ఏమైంది? దాని విషయంలో ఎందుకు వివక్ష పాటిస్తున్నారు? కోవిషీల్డ్‌ రూపకల్పనలో మన సాంకేతికత లేదు. అది పూర్తిగా ఆస్ట్రాజెనెకా సాంకేతికత. కేవలం ఇక్కడ ఉత్పత్తయ్యే వ్యాక్సిన్‌కు పేరుమార్చి కోవిషీల్డ్‌ అని వ్యవహరిస్తున్నారు. కానీ చాలా యూరప్‌ దేశాలు దాన్ని గుర్తించనిరాకరిస్తున్నాయి. యూరప్‌ దేశాల్లో హంగరీకి తప్ప మరెవరికీ అది నచ్చదట. ఒకపక్క ఆస్ట్రాజెనెకాను అంగీకరిస్తూ కోవిషీల్డ్‌ టీకాను మాత్రం గుర్తించబోమనడంలోని సహేతుకత ఏమిటో ఆ దేశాలు చెప్పవు. ఇలా లేబుల్‌ మారేసరికే వైఖరి మార్చుకునేవి మారుమూలనుండే ఏ ద్వీపకల్ప దేశాలో అయితే ఎవరూ పట్టించు కునేవారు కాదు. విద్య, విజ్ఞానం, పరిశోధన వెల్లివిరుస్తున్నట్టు చెప్పుకునే దేశాలు సైతం నిరక్షర కుక్షుల్లా ప్రవర్తించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా టీకాను 101 దేశాలు గుర్తిస్తే, కోవిషీల్డ్‌ను కేవలం 40 దేశాలు మాత్రమే ఒప్పుకుంటున్నాయి. కొన్ని దశాబ్దాలక్రితమైతే వేరే దేశాలకు నచ్చకపోతే మనకేమిటని బేఖాతరు చేసేవాళ్లం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. విదేశాల్లో పనిచేసే వృత్తిగత నిపుణులు, వ్యాపారం, వాణిజ్యం, చదువు వగైరాల్లో తలమునకలైన వారు లక్షలాదిమంది వున్నారు. వారంతా మన దేశంలో లభ్యమయ్యే రెండు టీకాలను మాత్రమే తీసుకోగలరు. కానీ వాటిని గుర్తించబోమని... ఆ టీకాలు తీసుకున్నా దేశంలోకి అనుమతించ బోమని ఆ దేశాలు మొండికేస్తే అలాంటివారి పరిస్థితేమిటి? ఇప్పటికే వీసాలకూ, టీకాలకూ ముడి పెట్టే దేశాల సంఖ్య పెరుగుతోంది. టీకా వేయించుకున్నవారికి మాత్రమే దేశంలో ప్రవేశమని ప్రభుత్వాలు నిబంధనలు పెడుతున్నాయి. ఫలానా టీకాలు చెల్లబోవని చెప్పడం వల్ల వివిధ రంగాల వారికి ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. కరోనా మహమ్మారి దేశదేశాలకూ అంటించడంలో అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించినవారి బాధ్యత చాలావున్నదని ఇప్పుడిప్పుడు స్పష్టంగానే వెల్లడవుతోంది గనుక వ్యాక్సిన్‌ వీసాలంటూ కొత్త నిబంధనలు పెట్టడాన్ని అపార్థం చేసుకోనవసరం లేదు. కానీ ఫలానా టీకాలు వేయించుకున్నవారికి మాత్రమే ప్రవేశమని చెప్పడంలోని ఔచిత్యం ఏమిటో అంతుపట్టదు. 

టీకా సాంకేతికతను లాభార్జన ఉద్దేశంతో గుప్పిట మూసివుంచి, ఫలానా టీకాలు పనికి రానివంటూ ముద్రలుకొట్టి ఆ ధనిక దేశాలు మున్ముందు ఏం సాధించదల్చుకున్నాయో అనూహ్యం. ఆ దేశాల్లోకి అడుగుపెట్టలేకపోతే వర్ధమాన దేశాల్లోని భిన్న రంగాలవారు నష్టపోవడం మాట నిజమే అయినా... ఆ మేరకు ధనిక దేశాలు కూడా దెబ్బతినడం ఖాయం. ఒకపక్క ప్రపంచ మార్కెట్‌లపై ఆధిపత్యం కోసం కలలుకంటూ ఇలాంటి అస్పృశ్యత పాటించటం తెలివితక్కువతనం. భూగోళం లోని అన్ని దేశాలూ సురక్షితంగా వుండాలంటే అందరికీ సమంగా టీకాలు అందుబాటులోకి రావా లని, అన్ని రకాల టీకాల సమర్థతపైనా అవసరమైన డేటా సాయంతో సానుకూల దృక్పథంతో మెలగాలని సకాలంలో గుర్తించకుంటే అంతిమంగా నష్టపోయేది ధనిక దేశాలే.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు