లెక్కలు తేల్చడం ఇలాగా?!

7 May, 2022 00:10 IST|Sakshi

కరోనా మహమ్మారి చాలా గుణపాఠాలు నేర్పింది. ఊహకందని సంప్రదాయాలు తీసుకొచ్చింది. కానీ దాని కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో మన దేశానికి లడాయి ఏర్పడుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. తాజాగా కరోనా మరణాలపై ఆ సంస్థ విడుదల చేసిన గణాంకాలు పెద్ద దుమారం సృష్టిస్తున్నాయి. అధికారిక గణాంకాలను అది బేఖాతరు చేసిందనీ, అశాస్త్రీయమైన లెక్కలతో అభాసుపాలు చేస్తోందనీ కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు దేశా లతో వివాదాలు కొత్తగాదు. కరోనా విషయంలో అది చైనాతో ఒకటికి నాలుగుసార్లు తగువుపడింది. కరోనా పుట్టుకపై ఆరా తీసేందుకు సంస్థ పంపిన శాస్త్రవేత్తలకు తగిన సహకారం ఇవ్వకుండా చైనా ముప్పుతిప్పలు పెట్టింది. చివరికది చైనాకు అనుకూలమైన వైఖరి తీసుకునేసరికి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు లొంగి పోయిందని ఆరోపిం చారు. కానీ భారత్‌ నుంచి దానికి అక్షింతలు పడటమే కొత్త విషయం. ఏమాటకామాటే చెప్పు కోవాలి. కరోనా మరణాల విషయంలోనైనా, అసలు ఆ వ్యాధి గ్రస్తుల గణాంకాల విషయంలోనైనా మన ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు విడుదల చేసిన లెక్కలను జనం అపనమ్మకంగానే చూశారు. మంచం పడుతున్నవారు ఉన్నకొద్దీ పెరుగుతుండగా... ప్రభుత్వ గణాంకాలకు వాటితో పొంతన లేకపోవడంతో సంశయం రావడం సహజమే. మరణాల సంగతీ అంతే. పిడిరాయిలా కనబడిన వారు సైతం ఏదో నలతగా ఉన్నదని ఆసుపత్రికి వెళ్లి, మళ్లీ తిరిగి రాని సందర్భాలు ఎన్నెన్నో! ఇక ప్రజారోగ్య మౌలిక సదుపాయాల సంగతి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. 

నిజమే... వదంతులు నమ్మి, చుట్టూ జరుగుతున్నది చూసి ప్రజానీకం కలవరపడటం, ఉన్న దాన్ని పదింతలుగా ఊహించుకుని భయాందోళనలకు లోనవడం సహజమే. అయితే ఆరోగ్య సంస్థ నివేదిక ఆ బాపతు కాదు. అందుకోసం ఏర్పాటైన కమిటీలో జనాభా లెక్కల నిపుణులున్నారు, ప్రజారోగ్య నిపుణులున్నారు, డేటా సైంటిస్టులున్నారు, గణాంక శాస్త్రవేత్తలున్నారు. ఈ కమిటీ ప్రభుత్వాల డేటానూ, స్థానికంగా సేకరించే ఇంటింటి సర్వేల్లో లెక్క తేలిన మరణాలనూ, గత సంవత్సరాల్లో ఇదే కాలంలో జరిగిన మరణాలనూ పరిగణనలోకి తీసుకుంది. కరోనా లేకపోయినా వేరే ప్రాణాంతక వ్యాధులుండి, కరోనా రోగులవల్ల ఆసుపత్రులు కిక్కిరిసి ఉన్న కారణంగా వైద్య సదుపాయాలు దొరక్క మరణించినవారి లెక్కలను ఈ మదింపు క్రమంలో వేరు చేసింది. ప్రభు త్వాల నివేదికలపై గల అనుమానాలేమిటో చెప్పింది. జవాబులు తెప్పించుకుంది. చివరన నివేదిక రూపొందించి ప్రభుత్వాల స్పందనేమిటో తెలుసుకుంది. పలుమార్లు చర్చించింది. నిజానికి మొన్న ఫిబ్రవరిలో ఈ నివేదికను బహిరంగపరచవలసి ఉంది. ఈ విషయంలో కమిటీ నిపుణులు అసహనం వ్యక్తం చేసి, తామే నివేదిక వెల్లడిస్తామని హెచ్చరించారు కూడా. 

ఆరోగ్య సంస్థ కేవలం మన దేశాన్ని మాత్రమే తప్పుబట్టలేదు. అమెరికా నుంచి ఇజ్రాయెల్‌ వరకూ... రష్యా మొదలుకొని దక్షిణాఫ్రికా, పెరూ, ఈజిప్టు వరకూ చాలా దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. మనతో పోలిస్తే పకడ్బందీ ఆన్‌లైన్‌ వ్యవస్థ ఉన్న అమెరికా సైతం 9,32,795 మరణాలను కప్పిపుచ్చాలని చూస్తే రష్యా 10,02,548 మరణాలను, బ్రెజిల్‌ 6,81,219 మరణాలను కప్పి పుచ్చాయని ఆ సంస్థ అభియోగం. అయితే అందరికన్నా అత్యధికంగా కరోనా మరణాలను మరుగు పరిచే ప్రయత్నం చేసిన దేశం మనదేనని ఆ నివేదిక అంటున్నది. మన దేశంలో 47,29,548 కరోనా వాతబడి మరణించారని ఆ నివేదిక నిర్ధారించింది. కేంద్ర గణాంకాల ప్రకారం 2020 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 2021 వరకూ కరోనాకు బలైన పౌరుల సంఖ్య 4,81,000. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏకంగా దీనికి పదిరెట్లు ఎక్కువ చెబుతోంది. మన పౌర నమోదు పట్టిక డేటా ఈమధ్యే విడుదలైంది. దాని ప్రకారం 2020లో దేశ వ్యాప్తంగా 81 లక్షలమంది పౌరులు మరణించారు. ఈ సంఖ్య అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 6 శాతం అధికం. అయితే ఈ అదనపు మరణాలన్నీ కరోనా మరణాలుగా పరిగణించడం సరికాదన్నది అధికారుల వాదన. నిజమే కావొచ్చు. కానీ జనాభా లెక్కల్లో... ఓటర్ల జాబితాల్లో, ఆధార్‌ కార్డుల్లో నమోదైన పౌరులు కరోనా వల్ల మృత్యువాత బడితే వాటికి లెక్కాపత్రం లేకుండా చేయవచ్చనుకోవడం తెలివితక్కువతనం. జనన మరణాల నమోదు పట్టిక నిర్వహణ సక్రమంగా లేదన్న విమర్శలు మొదటినుంచీ ఉన్నాయి. గ్రామసీమల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నదని నిపుణులంటారు. రాబోయే జనాభా లెక్కల సేకరణలోనైనా జనవరి 2020 తర్వాత కుటుంబంలో ఎవరైనా మరణించారా అన్న ప్రశ్న చేరిస్తే, కారణాలేమిటో ఆరా తీస్తే మెరుగైన డేటా రూపొందుతుంది. 

అంతేతప్ప ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉద్దేశాలు అంటగట్టడమో, దాని నివేదిక ఆధారంగా ఎద్దేవా చేస్తున్నవారిని దేశ వ్యతిరేకులుగా ముద్రవేయడమో సరికాదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని భ్రష్టుపట్టించడంతో సమానం చేయడంలోని అహేతుకత సంగతలా ఉంచి, అసలు ఆ సంస్థ నిపుణుల కమిటీ వ్యక్తం చేసిన సందేహాలకు మన అధికారులు, నిపుణులు సంతృప్తికరంగా ఎందుకు జవాబులివ్వలేకపోయారో చెప్పాలి. ఆరోగ్య సంస్థ అనుసరించిన పరిశోధనా పద్ధతి లేదా ప్రక్రియ అశాస్త్రీయమైతే అదేమిటో సోదాహరణంగా వివరించాలి. అప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థే పలచనవుతుంది. సైన్సును సైన్సుతోనే ఎదుర్కొనాలి తప్ప ఎదురుదాడికి దిగడం భావ్యం కాదు. 

మరిన్ని వార్తలు