చరిత మీది... భవిత మీది..!

1 Jun, 2022 01:55 IST|Sakshi

‘లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అన్న కవి వాక్కు ఫలిస్తోంది. క్రాంతదర్శిగా అరవై ఏళ్ళ క్రితం కవి చెప్పినమాట ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన 2021వ సంవత్సరం సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో మొదటి మూడు ర్యాంకులనూ కైవసం చేసుకొని, అమ్మాయిలు తమ సత్తా చాటారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన శ్రుతీ శర్మ, కోల్‌కతా వనిత అంకిత, చండీగఢ్‌ అమ్మాయి గామిని తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సోమవారం నాటి ఈ స్ఫూర్తిదాయక ఫలితాలు మారుతున్న పరిస్థితులకు అద్దం.  

గతంలోనూ అనేకసార్లు యూపీఎస్సీ పరీక్షల్లో ఆడపిల్లలు అగ్రస్థానంలో నిలిచారు. గణాంకాలు చూస్తే, గడచిన పదేళ్ళలో ఇప్పటికి అయిదుసార్లు అమ్మాయిలే ఫస్ట్‌ ర్యాంకర్లు. మునుపు 2015 నుంచి 2017 దాకా వరుసగా మూడేళ్ళూ టాప్‌ ర్యాంకర్లు అమ్మాయిలే. 2018లో సైతం యూపీఎస్సీ పరీక్షల్లో విజేతలైన టాప్‌ 25లో 8 మంది ఆడవాళ్ళే అన్నది చరిత్ర. కానీ, మొదటి మూడు స్థానాలనూ ఆడపిల్లలే ఒంటిచేతితో సాధించడమనేది గడచిన ఏడేళ్ళలో ఇదే తొలిసారి.

2014 సివిల్స్‌లో తొలి 4 ర్యాంకులూ అమ్మాయిలే సాధించారు. ఆ తర్వాత అలాంటి ఫలితాలు రావడం మళ్ళీ ఇప్పుడే! ఈసారి మొత్తం 5 లక్షల మంది ప్రిలిమ్స్‌కు హాజరవగా, చివరి వరకు వడపోతల్లో నిలిచి సివిల్స్‌ పాసైంది 685 మంది. వారిలో 177 మంది ఆడపిల్లలే! అంటే దాదాపు 25.8 శాతం మంది అమ్మాయిలే! దేశంలోకెల్లా అత్యంత క్లిష్టమైన పరీక్షగా పేరున్న సివిల్స్‌ పాసైనవారిలో నాలుగో వంతు మంది అమ్మాయిలే కావడం విశేషం. అందులోనూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వనితలు కష్టపడి చదువుకుంటూ, పట్టుదలతో, పరిశ్రమించి ర్యాంకులు సాధిస్తుండడం కచ్చితంగా మరీ విశేషం. 

గమ్మత్తేమిటంటే, ఈసారి మొదటి రెండు ర్యాంకుల విజేతలూ ఒకే కాలేజీ (ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌)లో చదువుకున్నవారే! ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన శ్రుతీ శర్మ ‘జామియా మిలియా ఇస్లామియా’కు చెందిన రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అకాడెమీలో శిక్షణ పొందడం విశేషం. మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, స్త్రీలకు ఉచిత శిక్షణనిచ్చే ఈ అకాడెమీపై రెండేళ్ళ క్రితం 2020లో వివాదం చెలరేగింది.

సివిల్‌ సర్వీసుల్లో ముస్లిమ్‌లకు వీలైనంత ఎక్కువగా ప్రవేశం లభించేలా ‘యూపీఎస్సీ జిహాద్‌’ నడుస్తోందనీ, అందుకు ఈ అకాడెమీ కేంద్రబిందువనీ అప్పట్లో ప్రత్యర్థులు ఆరోపణలు చేశారు. కానీ, రెండేళ్ళుగా సివిల్స్‌కు సన్నద్ధమవుతూ, ఇప్పుడీ రెండో ప్రయత్నంలో ఫస్ట్‌ ర్యాంకర్‌గా నిలిచిన శ్రుతీశర్మ ఈ అగ్రస్థానానికి కారణం జామియాలో శిక్షణే అన్నారు. గడచిన పదేళ్ళలో జామియా 500 మందికి పైగా అభ్యర్థులకు శిక్షణనివ్వగా, 266 పైచిలుకు మంది సివిల్స్‌కు ఎంపికవడం విశేషం. ఈసారి కూడా ఎంపికైనవారిలో 23 మంది అక్కడ శిక్షణ పొందినవారే! 

ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తరువాత ఇంటర్వ్యూ – ఇలా మూడు విడతలుగా సాగే కఠినమైన వడ పోతలో ఆడపిల్లలు అగ్రభాగంలోకి దూసుకురావడం ఒక్క రోజులో సాధ్యమైనది కాదు. దీని వెనుక తరతరాల పోరాటం ఉంది. ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే శిశువును చంపే భయానక భ్రూణ హత్యల రోజుల నుంచి నేటి ‘బేటీ బచావో... బేటీ పఢావో’ నినాదాల దాకా సుదీర్ఘ పయనం ఉంది. పితృస్వామ్య, పురుషాహంకార సమాజంలో సైతం శతాంశమైనా మార్పు సాధించడం వెనుక ఎంతోమంది కృషీ ఉంది. ఆడవారిని ఒంటింటి కుందేళ్ళుగా భావించే సమాజంలో – విద్య, ఉద్యోగ అవకాశాల్లో అమ్మాయిలకు మెరుగైన భాగస్వామ్యం కల్పించడానికి ఏళ్ళ తరబడి అనేక ప్రభుత్వాలిస్తున్న చేయూతా ఉంది. అవన్నీ ఇప్పుడు ఫలిస్తున్నాయి. తాజా విజయాలన్నీ సమాజంలోని లింగ దుర్విచక్షణను రూపుమాపే సుదీర్ఘ క్రమంలో సోపానాలని విశ్లేషకులు అంటున్నది అందుకే! 

నిజానికి, భారత రాజ్యాంగంలోని 14 నుంచి 16వ అధికరణం దాకా అన్నీ స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రవచించినవే. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళవుతున్నా ఇప్పటికీ సమానత్వం, స్వేచ్ఛ కోసం స్త్రీలు వివిధ స్థాయుల్లో పోరాటాలు చేయాల్సి వస్తూనే ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకూ, 1020 మంది స్త్రీలున్నారని తాజా లెక్కలు చెబుతున్న దేశంలో లైంగిక సమానత్వం ఇంకా మాటల్లోనే ఉంది. అధికారుల సంఖ్యలో సరే, అధికారంలో స్త్రీల వాటా మాటేమిటి? ప్రపంచ లైంగిక అంతరాల సూచికలో 153 దేశాల్లో మనమెక్కడో 140వ ర్యాంకులో ఉన్నాం. మహిళా శ్రామికశక్తి మునుపటి కన్నా తగ్గుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 

ఈ నిరాశల మధ్య కూడా కుటుంబ సభ్యుల అండ ఉంటే, అన్ని రంగాల్లో స్త్రీల పురోగమనం సాధ్యమే. చదివించే విషయంలో ఆడా, మగా ఒకటేననే మార్పు దక్షిణాది మధ్యతరగతిలో కనిపి స్తోందని ఓ విశ్లేషణ. కానీ దిగువ తరగతిలో, ఉత్తరాదిలో ఆ చైతన్యం తగినంత రాలేదన్నదీ నిజమే! నిదానంగానైనా ఐఏఎస్‌ లాంటి సర్వీసుల్లోనే కాదు... విద్యుత్‌ స్తంభాలను ఎక్కే లైన్‌ ఉమన్లుగా, రైలింజన్లను నడిపే డ్రైవర్లుగానూ నేడు మహిళలు కనిపిస్తున్నారు. కానీ, ఇది సరిపోదు. చదువులు, ఉద్యోగాలు, అవకాశాలు అన్నింటిలోనూ ఆడవారి పట్ల దుర్విచక్షణ మరింత తగ్గాలి. ఆ మార్పు వస్తే అబ్బాయిలకు ఏ విధంగానూ తీసిపోమని నిరూపించడానికి నవతరం అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అందుకు ఓ నిదర్శనమే తాజా సివిల్స్‌ ఫలితాలు. ఇదే ధోరణి కొనసాగితే, భవిష్యత్తు ఆడవారిదే అంటున్న అంచనా వాస్తవరూపం ధరించడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. 

మరిన్ని వార్తలు