గాలి నిండా గరళమేనా?!

25 Mar, 2022 02:01 IST|Sakshi

మనం పీలుస్తున్న గాలి ఎంత నాణ్యమైనది? ఎంత సురక్షితమైనది? పైకి మామూలుగా అనిపించినా, ఇవి ఎంతో కీలకమైన ప్రశ్నలని తాజా ‘ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక –2022’తో మరోసారి తెలిసొస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యభరిత రాజధానిగా ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచిందన్న మాట ఆందోళన రేపుతోంది. వరుసగా నాలుగో ఏడాది ఢిల్లీకి ఈ అపకీర్తి కిరీటం దక్కడం పరిస్థితి తీవ్రతకు దర్పణం. ప్రపంచ వ్యాప్తంగా 117 దేశాల్లోని 6475 ప్రాంతాల్లో కాలుష్యగణన చేసి, స్విట్జర్లాండ్‌ సంస్థ ‘ఐక్యూ ఎయిర్‌’ మంగళవారం విడుదల చేసిన ఈ నివేదిక ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. గడచిన 2020 నాటి కాలుష్య ర్యాంకులను కొట్టిపారేసిన పాలకులు తిరుగులేని సాక్ష్యంతో వచ్చిన తాజా 2021 నివేదికకు ఏం జవాబిస్తారు? 

కాలుష్యంలో ‘టాప్‌–100’ నగరాల జాబితా తీస్తే, అందులో 63 నగరాలు మన దేశంలోవే! వాటిలో సగానికన్నా ఎక్కువ ఢిల్లీ చుట్టుపక్కలి హరియాణా, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లోవే. ఈ కఠిన వాస్తవం దేశంలో తక్షణ చర్యల అవసరాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది. గాలిలో కాలుష్యకారక కణాల (పీఎం) వార్షిక సగటు 2.5 స్థాయి అంటే, ఘనపుమీటరుకు 5 మైక్రో గ్రాములకు మించి కాలుష్య కణాలు ఉండకూడదు. కానీ, మన దేశంలో ఏ నగరంలో పరిస్థితీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ) నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టు లేదు. ఉత్తరాదిన మరీ దారుణం. కాలుష్యంలో అగ్రభాగాన నిలిచిన తొలి 15 ప్రపంచ స్థలాల చిట్టాలోనూ ఏకంగా 10 భారతీయ నగరాలే! రాజస్థాన్‌లోని భివాడీ, ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజియాబాద్, చైనాలోని హోటన్‌ తర్వాత వాయు కాలుష్యంలో నాలుగో ర్యాంక్‌ ఢిల్లీదే. రాజధానిలో కాలుష్యం గత ఏడాది కన్నా దాదాపు 15 శాతం ఎక్కువైంది. అక్కడ డబ్ల్యూహెచ్‌ఓ పరిమితుల కన్నా దాదాపు 20 రెట్లు ఎక్కువ వాయు కాలుష్యం నెలకొంది. 

విశాఖపట్నం, హైదరాబాద్‌ లాంటి తెలుగు ప్రాంతాలూ ఈ వాయు కాలుష్య జాబితాలో ఉన్నాయి. ప్రకృతి, పర్యావరణం, జలాశయాల పరిరక్షణ ధ్యేయంగా దశాబ్దాల క్రితం చేసిన జీవో 111ను సైతం తెలంగాణ సర్కార్‌ ఎత్తివేస్తామంటున్న వేళ... హైదరాబాద్‌ 232వ స్థానంలో నిలవడం మరింత ఆందోళనకరం. మన దేశంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న రెండో అతి పెద్ద కారణం – వాయు కాలుష్యమే. దీనివల్ల ఏటా దాదాపు 15 వేల కోట్ల అమెరికన్‌ డాలర్ల పైగా ఆర్థిక నష్టం కలుగుతోందని అంచనా. కరోనా కాలంలో లాక్‌డౌన్ల పుణ్యమా అని దేశంలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గిందని వార్తలు వచ్చాయి. కానీ చిత్రం ఏమిటంటే – ఇప్పుడు మన దేశంలో పీఎం స్థాయి మళ్ళీ లాక్‌డౌన్ల పూర్వం ఉన్న 2.5కి చేరుకోవడం! వాహన ఉద్గారాలు, ఇంధన ఉత్పత్తి, పారిశ్రామిక వ్యర్థాలు, వంట కోసం బయోమాస్‌ దహనం, నిర్మాణ రంగం, పంటల కాల్చివేత లాంటివన్నీ ఈ వాయు కాలుష్యానికి మూలాలు. పట్టణ భారతావనిలో అయితే ఈ పీఎం 2.5 స్థాయిలో 20 నుంచి 35 శాతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మోటారు వాహనాల ఇంజన్ల వల్లేనని నిపుణుల మాట. ఏటా వాహనాల అమ్మకాలు పెరిగిపోతున్న భారత్‌లో వచ్చే 2030 నాటి కల్లా వాహనాల సంఖ్య 1.05 కోట్లకు చేరుతుందన్న అంచనా మరింత భయపెడుతోంది. 

నిజానికి, దేశంలో వాయు కాలుష్యాన్ని పర్యవేక్షించడం కోసం 2015 ఏప్రిల్‌ 7న మోదీ సర్కార్‌ ఆర్భాటంగా ‘జాతీయ వాయు నాణ్యతా సూచి’ పథకాన్ని ప్రకటించింది. కానీ, వాక్శూరత్వమే తప్ప ఒరిగిందేమీ లేదని తాజా లెక్కలు తేల్చేస్తున్నాయి. 2024 నాటి కల్లా గుర్తించిన నగరాలలో పీఎం స్థాయి 20 నుంచి 30 శాతం మేర తగ్గేలా చూస్తామనీ పాలకులు సంకల్పం చెప్పుకున్నారు. అందు కోసం 2019లో ‘జాతీయ స్వచ్ఛ వాయు పథకం’ (ఎన్సీఏపీ)ని కేంద్ర పర్యావరణ శాఖ చేపట్టింది. అది ఏ మేరకు సఫలమైందన్నదీ స్పష్టం కాలేదు. మూడేళ్ళుగా లాక్‌డౌన్‌ సహా రకరకాల కారణా లతో గాలి నాణ్యత పెరుగుతోందని ఆశిస్తుంటే, వాస్తవం తద్విరుద్ధంగా ఉందని తాజా నివేదిక తేల్చేసింది. గత 2020 నాటి నివేదిక వాయు కాలుష్యంలో ప్రపంచంలో భారత్‌ది మూడో స్థానమని పేర్కొంది. అది ఉపగ్రహ డేటాయే తప్ప క్షేత్రస్థాయి వాస్తవం కాదంటూ అప్పట్లో కేంద్రం కొట్టిపారే సింది. ఇప్పుడీ 2021 నివేదిక క్షేత్రస్థాయి సెన్సర్ల నుంచి సేకరించినదే. ఆ సెన్సర్లలో సగం సాక్షాత్తూ ప్రభుత్వ సంస్థలు నడుపుతున్నవే. పాలకులు బుకాయించడం, మాటలతో మభ్యపెట్టడం కష్టమే.

ప్రజల ఆరోగ్యానికే ప్రమాదం గనక సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రధానంగా నగరాల మీదే దృష్టి పెట్టడమూ ఎన్సీఏపీ లాంటి పథకాలలోని లోపమని గుర్తించాలి. కాలుష్య నియంత్రణలో వర్తమాన విధానం విఫలమైనందున సరికొత్త వ్యూహరచన చేయాలి. తాజా నివేదికలో సిఫార్సు చేసినట్టుగా వ్యక్తిగత వినియోగానికి కాలుష్యరహిత స్వచ్ఛ వాయు వాహనాలను వాడేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా చట్టాలు చేయడం లాంటివి ఆలోచించాలి. రాష్ట్ర పాలకులు సైతం సీజన్‌లో మళ్ళీ కొయ్యకాళ్ళను కాల్చడం లాంటివి మొదలు కాకముందే బయో డీకంపోజర్‌ లాంటివి విస్తృతంగా రైతులకు అందుబాటులోకి తేవాలి. అటు ఢిల్లీ, పంజాబ్‌ల్లో అధికారంలో ఉన్న ‘ఆప్‌’, ఇటు హరియాణా, యూపీల్లో గద్దె మీదున్న బీజేపీ సమన్వయంతో జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతను కాపాడాలి. అటవీ పెంపకం లాంటి ఆలోచనలు ఎన్ని చేసినా, చివరకు వాటి అమలులో చిత్తశుద్ధి అవసరం. అది లోపించి, ఆరావళి సహా అనేక అంశాలపై తప్పుదోవలో కొనసాగితే పరిస్థితి ఏటేటా దిగజారుతుంది. మాటల కన్నా చేతలు ముఖ్యమంటున్నది అందుకే! 

మరిన్ని వార్తలు