సింహళ తీరంలో నిఘానేత్రం

5 Aug, 2022 00:39 IST|Sakshi

వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌తోట అంతర్జాతీయ నౌకాశ్రయంలో చైనా సైనిక గూఢచర్య నౌక ‘యువాన్‌ వాంగ్‌5’ లంగరేయడానికి శ్రీలంక ఇచ్చిన అనుమతి చర్చోపచర్చలకు దారితీస్తోంది. సదరు పోర్ట్‌పై పట్టు బిగించిన చైనా, వ్యతిరేకిస్తున్న భారత్‌ల మధ్య సర్దుబాటు చేసుకోలేక సిలోన్‌ సతమతమవుతోంది. ఉపగ్రహ, రాకెట్, ఖండాంతర గతిశీల క్షిపణుల ప్రయోగాల ఆచూకీ తెలుసు కొనేందుకు వాడే ఈ ‘యువాన్‌ వాంగ్‌’ శ్రేణి పరిశోధక, సర్వే నౌక మన దేశానికి అతి సమీపంలో వారం పాటు తిష్ఠ వేయడం ఆందోళనకరమే.

గగనతలాన 750 కిలోమీటర్ల పైగా కన్నేయగల ఈ షిప్పుతో కేరళ, తమిళనాడు, ఏపీల్లోని అనేక పోర్ట్‌లు చైనా రాడార్‌లోకి వచ్చేస్తాయి. కల్పాక్కం, కూడంకుళం లాంటి అణుపరిశోధక కేంద్రాలు సహా దక్షిణాదిలోని కీలక ప్రాంతాలూ డ్రాగన్‌ గూఢ చర్యం బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వార్తలే ఇప్పుడు మన దేశాన్ని అప్రమత్తం చేస్తున్నాయి.

ఆగస్టు 11 నుంచి 17 దాకా సింహళ తీరంలో ఉండే సదరు నిఘానౌక రాక పట్ల శ్రీలంక దేశాధ్యక్షుడితోనే భారత్‌ తన అభ్యంతరం తెలిపింది. ఆ నౌక తమ దగ్గరకు వస్తున్నది ఇంధనం, అవసరమైన సరుకులు నింపుకోవడానికే అని సిలోన్‌ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న లంకేయులకు భారత్‌ అందిస్తూ వస్తున్న సాయంపై పార్లమెంట్‌ సాక్షిగా ప్రశంసాగీతం అందుకొని, అధ్యక్షుడు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఆర్థికకష్టాల్లోనే∙కాదు... అంతకు ముందూ ‘సువసరియా’ అంబులెన్స్‌ సర్వీసుకు భారత్‌ సాయమే వేలాది ప్రాణాలు కాపాడిందని గుర్తుచేసుకున్నారు. కానీ మాటల్లోని మెచ్చుకోలుకు భిన్నమైన శ్రీలంక చేతలే సమస్య. 

ఆసియా, ఐరోపాలను కలిపే సూయజ్‌ కాలువకూ, మలక్కా జలసంధికీ మధ్య అతి ముఖ్యమైన నౌకాయాన మార్గంలో సింహళం ఉంది. 4500 చమురు ట్యాంకర్లతో సహా దాదాపు 36 వేల నౌకలు ఆ మార్గంలో ఏటా పయనిస్తాయని లెక్క. కొలంబో నౌకాశ్రయం తర్వాత శ్రీలంకలో రెండో అతి పెద్దదైన హంబన్‌తోట ఆ కీలకమార్గంలోదే! ఆ పోర్ట్‌ నిర్మాణం ఆలోచన మూడు దశాబ్దాల పైగా ఉన్నా, అనేక తర్జనభర్జనలు, నివేదికల బుట్టదాఖలు తర్వాత 2005లో హంబన్‌తోట వాసి మహిందా రాజపక్స అధ్యక్షుడయ్యాక మళ్ళీ ఊపిరి పోసుకుంది. చైనా ఆర్థిక సాయంతో పన్నెండేళ్ళ క్రితం 2010లో ఈ అంతర్జాతీయ పోర్ట్‌ తొలిదశ పూర్తయింది. ఆర్థికంగా ఆట్టే గిట్టుబాటు కాని ఆ నౌకాశ్రయ నిర్మాణం కోసం 15 ఏళ్ళ కాలానికి చైనా ఇచ్చిన అప్పు వడ్డీలపై వడ్డీలతో ఇప్పుడు శ్రీలంక తలపై భారమై కూర్చుంది. 

చైనా, శ్రీలంక నౌకాసంస్థల సంయుక్త భాగస్వామ్యంలో నడుస్తున్న ఈ పోర్ట్‌ను స్వల్పకాలిక ప్రయోజనాల నిమిత్తం 99 ఏళ్ళ లీజుకిచ్చి, ద్వీపదేశం తిప్పుకోలేని తప్పు చేసింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే శ్రీలంక క్రమం తప్పకుండా ఆ అప్పుల వాయిదాలు తీర్చాల్సిందేనని చైనా కొండెక్కి కూర్చుంది. డ్రాగన్‌ విసిరిన ఈ ఋణదౌత్యం వలలో చిక్కుకొని, బయటపడలేక సింహళం సతమతమవుతోంది. హంబన్‌తోట పోర్ట్‌పై చైనా నియంత్రణతో హిందూ మహాసముద్ర జలాల్లో తమ ప్రయోజనాలకు భంగమని భారత్, అమెరికాలు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా చైనా నిఘానౌక వ్యవహారం ఆ అనుమానాలకూ, ఆందోళనకూ తగ్గట్టే ఉంది.

శ్రీలంక ఇటు భారత్, అటు చైనాతో దోస్తీ చేస్తూ, ఇరువైపుల నుంచి లబ్ధి పొందాలని చూస్తోంది. భౌగోళికంగా తనకున్న సానుకూలతను ద్వీపదేశం వాడుకోవాలని అనుకోవడం అర్థం చేసుకోదగినదే. కానీ, ఏకకాలంలో ఇరుపక్షాలకూ కన్నుగీటడమే సమస్య. సింహళం మాత్రం వర్తమాన ఆర్థిక సంక్షోభంలో భారత, చైనాలు రెండూ అండగా నిలిచాయనీ, ఇరుదేశాలూ తమకు కీలక మిత్రులనీ తన వైఖరిని సమర్థించుకుంటోంది. దాని పరిస్థితి ఇప్పుడు కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపంగా తయారైంది. ఏకకాలంలో ఇద్దరికి కన్నుగీటడం సులభమూ కాదు. సమస్యా రహితమూ కాబోదని ద్వీపదేశానికి మరోసారి తెలిసొస్తోంది.

చైనానేమో చట్టబద్ధమైన తన సముద్రజల శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాల్లో ‘సంబంధిత పార్టీలు’ చొరబడడం మానుకోవాలని శ్రీరంగనీతులు చెబుతోంది. నిజానికి, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో చర్యలు చేపట్టేలా చైనా వద్ద ఏకంగా ఇలాంటి ఏడు నౌకలున్నాయి. ఇప్పటికే భూతలంపై బీజింగ్‌కు ఉన్న ట్రాకింగ్‌ కేంద్రాలకు ఈ నౌకలు అదనం. అందులోనూ అత్యాధునిక ట్రాకింగ్‌ సాంకేతికత శ్రీలంకలో లంగరేస్తున్న తాజా నౌక సొంతం. ఈ రెండు నెలలూ హిందూ మహాసముద్ర వాయవ్య ప్రాంతంలో చైనా ఉపగ్రహాల నియంత్రణ, రిసెర్చ్‌ ట్రాకింగ్‌ను తమ నౌక చేస్తుందని చైనా అధికారిక ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ శ్రీలంక’ (బ్రిస్ల్‌) మాట. 

కానీ, డ్రాగన్‌ నక్కజిత్తులు తెలిసినవారెవరైనా ఆ మాటల్ని యథాతథంగా విశ్వసించడం కష్టమే. పైగా, 2014లో కొలంబో పోర్ట్‌లో లంగరేసిన చైనా జలాంతర్గాములతో పోలిస్తే తాజా నిఘానౌక శక్తిసామర్థ్యాలు మరింత ప్రమాదకరం. మీదకొస్తున్న ఈ ముప్పు రీత్యా మనం కట్టుదిట్టమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టక తప్పదు. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు అది అత్యవసరం. హంబన్‌తోట నౌకాశ్రయం గనక రేపు చైనా ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (పీఎల్‌ఏ) నౌకాదళానికి కేంద్రంగా మారితే, భారత్‌కు ఉత్తరాన, దక్షిణాన డ్రాగన్‌ ఆధిపత్యంతో మన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుంది. తస్మాత్‌ జాగ్రత్త!  

మరిన్ని వార్తలు