కుంగిపోరాని నింగి పయనం 

8 Aug, 2022 23:44 IST|Sakshi

కొన్నేళ్ళుగా నిరీక్షిస్తున్న కల నిజమవుతోందని ఆనందిస్తున్న వేళ ఆఖరి నిమిషంలో అర్ధంతరంగా కల కరిగిపోతే ఎలా ఉంటుంది? భారతదేశ రాకెట్ల సేనలోకి సరికొత్తగా వచ్చి చేరిన ‘చిన్న ఉపగ్రహ వాహక నౌక’ (ఎస్‌ఎస్‌ఎల్వీ) తొలి ప్రయోగం ఆ భావననే కలిగించింది. గడచిన మూడేళ్ళలో అనేక సార్లు వాయిదాపడ్డ ఈ రాకెట్‌ వినువీధి ప్రయోగం విజయవంతమైనా, ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే మిషన్‌లో అది విఫలమవడం తీపి, చేదుల మిశ్రమ అనుభూతి. వినువీధిలో దేశానికి ఎన్నో విజయాలను అందించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగి, తప్పొప్పుల ఆత్మ పరిశీలనకు దిగాల్సిన స్థితి. వాణిజ్యపరంగా వివిధ దేశాల, సంస్థల ఉపగ్రహాలను విహాయసంలోకి పంపుతూ, వాణిజ్యపరంగానూ రెక్కలు విప్పుకోవడానికి మరికొన్నాళ్ళు వేచిచూడక తప్పని పరిస్థితి.

34 మీటర్ల పొడవు, 120 టన్నుల బరువున్న ‘ఎస్‌ఎస్‌ఎల్వీ–డి1’ను ఆదివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇస్రో రూపొందించిన భూగ్రహ పరిశీలక మైక్రో – శాటిలైట్‌ ‘ఈఓఎస్‌–02’, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్ళలో చదివే ఆడపిల్లలు తయారుచేసిన ‘ఆజాదీ శాట్‌’ – ఈ రెండు ఉపగ్రహాలనూ దానితో పాటు పంపారు. వాటిని మోసుకుంటూ, రూ. 56 కోట్ల విలువైన భారతదేశ సరికొత్త రాకెట్‌ దూసుకెళ్ళింది. మూడు దశల్లోనూ రాకెట్‌ ప్రయోగం విజయవంతంగానే సాగింది. ప్రణాళిక ప్రకారం నింగిలో దాదాపు 12 నిమిషాలు ప్రయాణించాక అది రెండు ఉపగ్రహాలనూ కక్ష్యలో ప్రవేశపెట్టాలి. ముందుగా ‘ఈఓఎస్‌–2’నూ, ఆ తర్వాత కొద్ది సెకన్లకు ‘ఆజాదీశాట్‌’నూ నిర్ణీత కక్ష్యలోకి పంపాలి. సరిగ్గా ఇక్కడే ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌ ఇక్కట్ల పాలైంది. 

ఉపగ్రహాలు రెండూ నిర్ణీత సమయం ప్రకారం విడివడ్డాయి. అన్ని దశల్లోనూ రాకెట్‌ పనితీరూ ఊహించినట్టే సాగింది. కానీ, ఇస్రో మాటల్లో చెప్పాలంటే ‘రాకెట్‌ తుది దశలో కొంత డేటా నష్టం జరిగింది’. వృత్తాకార కక్ష్యలోకి వెళ్ళాల్సిన ఉపగ్రహాలు కాస్తా దీర్ఘవృత్తాకార కక్ష్యల్లోకి వెళ్ళాయి. ఆజాదీ శాట్‌ అనేది ‘హ్యామ్‌’ అమెచ్యూర్‌ రేడియో ఆపరేటర్ల గ్రహణశక్తిని పెంచడానికి ఉద్దేశించినది. అనుకున్న దాని కన్నా తక్కువ కక్ష్యలోకి చేరడంతో, అస్థిరంగా మారి ఆ ఉపగ్రహాలు నిరుపయోగమయ్యాయి. తక్కువ కక్ష్యలోకి చేరడమంటే అవి అంతరిక్షంలో ఉండక, అనతికాలంలోనే భూమి పైకి ఇంటిదారి పడతాయన్న మాట. చిన్న శాటిలైట్లతో నింగిలోకి ప్రయాణం వరకు విజయవంతమైనా, ‘ఎస్‌ఎస్‌ఎల్వీ–డి1’ తన మిషన్‌ను పూర్తి చేయడంలో మాత్రం విఫలమైందని అంటున్నది అందుకే! 

రాగల కాలంలో ‘ఎస్‌ఎస్‌ఎల్వీ’ రాకెట్‌ తమకు ప్రధాన ప్రయోగ వాహక నౌక అవుతుందని ఇస్రో ఆశలు పెట్టుకొంది. తీరా ఉపగ్రహాలను పంపాల్సిన కక్ష్యలో జరిగిన పొరపాటు ఊహించని ఎదురుదెబ్బ. చిన్న ఉపగ్రహాలను వాణిజ్యస్థాయిలో నింగిలోకి పంపడమనేది కొన్ని వందల కోట్ల డాలర్ల విలువైన కొత్త విపణి. ఆ మార్కెట్‌లో జెండా పాతాలనుకుంటున్న భారత్‌ ఆశలకు ఇది అవాంతరం. అలాగే, రిమోట్‌ సెన్సింగ్‌ సామర్థ్యాలతో నిమ్న భూ కక్ష్య ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో మనకు కొన్ని దశాబ్దాల రికార్డుంది. కానీ, కొత్త సిరీస్‌ భూ పరిశీలక ఉపగ్రహాలను (ఈఓఎస్‌లను) పంపడంలో రెండేళ్ళలో మనకిది రెండో వైఫల్యం. నిరుడు శక్తిమంతమైన ‘ఈఓఎస్‌– 03’ని ‘జీఎస్‌ఎల్వీ–ఎఫ్‌10’తో పంపాలని యత్నించాం. ప్రయోగ వైఫల్యంతో అది సాధ్యం కాలేదు.  

చాలాకాలంగా కేవలం 5 నుంచి వెయ్యి కిలోల లోపల బరువుండే చిన్న ఉపగ్రహాలను సైతం ఇతర, భారీ ఉపగ్రహాలను తీసుకెళ్ళే రాకెట్లతోనే అంతరిక్షంలోకి పంపాల్సి వస్తోంది. అనేక వ్యాపారసంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చివరకు విశ్వవిద్యాలయాలు, పరిశోధనాశాలలు తమ చిన్న ఉపగ్రహాలను ఈ పెద్ద ఉపగ్రహాలతో కలిపి మోసుకెళ్ళేలా చేయడానికి దీర్ఘకాలం వేచిచూడక తప్పని పరిస్థితి. దానికి ఖర్చు, నిరీక్షణ సమయం ఎక్కువే. గత పదేళ్ళలో అంతరిక్ష డేటా, కమ్యూనికేషన్, నిఘా, వాణిజ్య అవసరాలు పెరగడంతో అలాంటి చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే ప్రత్యేక వాహక నౌకలకు గిరాకీ హెచ్చింది. సుదీర్ఘ అనుభవమున్న ఇస్రో లాంటి వాటికి ఇది పెద్ద వ్యాపార అవకాశం. అందుకే, చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్ళే ‘ఎస్‌ఎస్‌ఎల్వీ’ని అది రూపొందించింది. 

ఇప్పుడున్న పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ లాంటి ఇతర ఉపగ్రహ నౌకల తయారీకి ఒక్కోదానికీ 70 నుంచి 80 రోజులకు పైగా పడుతుంది. అందులో పదోవంతు ఖర్చుతో, 72 గంటల్లోనే అయిదారుగురి బృందం ఎస్‌ఎస్‌ఎల్వీని సిద్ధం చేయగలదు. రాగల పదేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా పదుల వేల సంఖ్యలో చిన్న ఉపగ్రహాలు నింగికి పోనున్న వేళ భారత్‌కు ఇది అద్భుత అవకాశం. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి చకచకా తలుపులు తీస్తున్న మన దేశంలో ఇప్పటికే కనీసం మరో 3 ప్రైవేట్‌ సంస్థలు చిన్న ఉపగ్రహాలను తీసుకెళ్ళే రాకెట్లను తయారు చేస్తున్నాయి. 

ఏటా 2–3 ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితమైన ప్రభుత్వ ఇస్రో సైతం ఎస్‌ఎస్‌ఎల్వీ సఫలమైతే వారానికో ప్రయోగం చేయగలదు. కరోనాతో పాటు కొంత పనితీరులో జాప్యంతో ఇప్పటికే నాలు గేళ్ళుగా ఈ ప్రయోగం ఆలస్యమైంది. అలాగని తాజా వైఫల్యంతో కుంగిపోనక్కర లేదు. సెన్సార్‌ పనితీరులో లోపం ఒక్కటీ పక్కనపెడితే ‘ఎస్‌ఎస్‌ఎల్వీ’ పనితీరు బాగుండడం ఇస్రో విజయమే. ఇప్పుడిక జరిగిన తప్పును నిపుణుల సంఘం విశ్లేషించనుంది. అనంతరం సరిదిద్దిన తదుపరి వెర్షన్‌ రాకెట్‌ (ఎస్‌ఎస్‌ఎల్వీ–డి2)తో ఇస్రో మళ్ళీ ముందుకు వస్తుంది. దాంతో వినువీధిలో మన అంతరిక్ష శోధనల వాణిజ్య పతాక ఎగురుతుంది. ఎందుకంటే, ప్రతి వైఫల్యం ఓ కొత్త విజయానికి సోపానమే! 

మరిన్ని వార్తలు