దుబారా సినిమా 

8 Aug, 2022 00:10 IST|Sakshi

ఎన్‌.టి.రామారావు ఆఖరు పుట్టినరోజు వేడుక లలిత కళాతోరణంలో జరిగింది. తెల్లసూటు, హ్యాటు పెట్టుకుని హాజరైన ఎన్‌.టి.ఆర్‌ తన గురించి కంటే సినిమా పరిశ్రమ గురించి ఎక్కువ మాట్లాడారు. ‘నేను మద్రాసు నుంచి షూటింగ్‌కు వస్తే నిర్మాత ఇక్కడ రిట్జ్‌ హోటల్‌లో రూమ్‌ వేస్తాననేవారు. అక్కర్లేదు... సారథీ స్టూడియోలో ఉంటానని అనేవాణ్ణి. మరి ఇవాళ్టి హీరోలు ఎందుకు స్టార్‌ హోటల్‌ అడుగుతున్నారో అర్థం కావడం లేదు’ అన్నారు. ఎన్‌.టి.ఆర్‌ ఎంత సమర్థులైన నటులో అంత సమర్థులైన నిర్మాత. ‘ఫలానా పాత్ర చుట్ట వెలిగిస్తూ డైలాగ్‌ చెబుతుంది’ అని తాను తీసే సినిమాలో సీన్‌ ఉంటే ప్రొడక్షన్‌ వాళ్లకు నాలుగు లంక పొగాకు చుట్టలు తెమ్మని చెప్పేవారు. ఆ సంగతి తెలిసి ఆ పాత్ర వేసే నటుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని నాలుగు టేకుల్లో షాట్‌ ఓకే చేయాలన్నమాట. పది టేకులకు పది లంక పొగాకు చుట్టలు అక్కడ ఉండవు. 

సినిమాకు మూలవిరాట్టు– హీరో కాదు. నిర్మాత... అతణ్ణి కాపాడుకుంటే ఇండస్ట్రీని కాపాడు కున్నట్టేనని పెద్ద హీరోలంతా భావించేవారు. తన సమీప బంధువు వెంకటరత్నం ‘యమగోల’ తీస్తుంటే అతనికి ప్రొడక్షన్‌ స్థాయిలోనే రూపాయి మిగల్చాలని మొత్తం బడ్జెట్‌ చెప్పమని పట్టుబట్టారు ఎన్‌.టి.ఆర్‌. ఎక్కడెక్కడ తగ్గించవచ్చో చెబుతానన్నారు. దానికి అతను ‘అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. సెకండ్‌ హాఫ్‌లో మీరు యమలోకంలో ఉంటారు. మొత్తం సీన్లన్నీ ఒక్క డ్రస్‌ మీదే ఉంటారు.

అలా మీ కాస్ట్యూమ్స్‌ ఖర్చు కూడా తగ్గించాను’ అని చెప్తే సంతృప్తి పడ్డారు. ఎన్‌.టి.ఆర్‌ షూటింగ్‌లో ఉండి తనకు గెస్ట్‌లు వస్తున్నట్టయితే ‘ఇంత మంది గెస్ట్‌లు వస్తున్నారు. కాఫీ, టీలకు ఖర్చు అవుతుంది’ అని కూడా చెప్పేవారు. నిర్మాతకు ఇచ్చే మర్యాద అలాంటిది. ఏ.ఎన్‌.ఆర్‌ తన పారితోషికం పెంచాలనుకుంటే నిర్మాతలను పిలిచి, వారి ముఖ కవళికలు గమనిస్తూ ఆ పెంపును ప్రతిపాదించేవారు. భయంకరమైన ఎండలు కాసే వేసవిలో కృష్ణ ఊటీకి విశ్రాంతికి వెళ్లినా ఆ కాలంలో తలా ఒక పాట చేసుకోండని నిర్మాతలకు చెప్పి డబ్బు ఆదా చేసేవారు. ఉదయం ఏడుకల్లా సెట్‌లో టంచన్‌గా ఉన్న హీరోలు వీరంతా.

దర్శకులకు కూడా నిర్మాతే మూలవిరాట్టు అని తెలుసు. ‘కృష్ణుడు ఫ్లూట్‌ పట్టుకుని నాలుగు అడుగులు నడిచి డైలాగ్‌ చెబుతాడు’ అని స్క్రిప్ట్‌ రాసుకునేవారు కె.వి.రెడ్డి. ఆయన సినిమాలకు ఎడిటర్‌ వృథా అని తీసి పారేసేదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే వృథా షాట్‌ ఒక్కటీ తీయడు. ‘ప్రేమాభిషేకం’ సినిమాకు రెండు పాటలు, ఐదారు ముఖ్యమైన సీన్లు ఉన్న జయసుధ నుంచి దాసరి తీసుకున్నది ఎనిమిది రోజుల కాల్షీట్లే. ఏం తీస్తున్నామో, ఎందుకు తీస్తున్నామో, ఎంతలో తీస్తున్నామో దర్శకులకు తెలిసేది. వహీదా రెహమాన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది– ‘సత్యజిత్‌ రే ఒక షాట్‌ ఓకే చేశాక నాకు అదనంగా ఇంకో ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలనిపించింది. అది కూడా ఇస్తాను యాడ్‌ చేసుకోండని ఎంతో బతిమిలాడాను. నేను తీయను వహీదా! పిక్చర్‌ ఎడిట్‌ అయ్యి ఎలా ఉంటుందో నాకు తెలుసు... నీ కోసం తీసినా ఆ షాట్‌ పక్కన పడేస్తాను అన్నారు’. కాలం చాలా మారింది. కొందరి ధోరణీ అలాగే మారింది. 

‘నిర్మాతను సెట్‌ బయట కూర్చోమనండి. లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు’ అనగలిగే హీరోలు వచ్చారు. ‘నిర్మాతకు కథ చెప్పను... బడ్జెట్‌ ఎంతో చెబుతాను’ అనే దర్శకులు వచ్చారు. సినిమా సైన్‌ చేసిన నాటి నుంచి తన సమస్త ఖర్చులు, విహారాలు సదరు నిర్మాత చూసుకునేలా హీరోలు పరిణామం చెందారు.  హీరోయిన్లు షూటింగ్‌లో ఉంటే తాము ఏం తింటామో అడక్కుండా ఒకరోజు తిండి ఖర్చు కింద పాతిక వేలు ఇమ్మని డిమాండ్‌ చేస్తున్నారు. కేరెక్టర్‌ ఆర్టిస్టులు తమకో బండి, తమ స్టాఫ్‌కో బండి పెట్టమని వ్యక్తిగత సిబ్బంది ఖర్చు నిర్మాత నెత్తిన వేస్తున్నారు.

హీరోలు ఔట్‌డోర్‌ ఎండను, క్రౌడ్‌ను ఇష్టపడక íసీజీలో చేద్దాం అని తడిపి మోపెడు చేస్తున్నారు. దర్శకులు ఆ రోజున ఏ సీన్‌ తీస్తున్నాము, ఏ ఆర్టిస్ట్‌ అవసరం అని ప్లాన్‌ చేసుకోక అందరు ఆర్టిస్ట్‌లనూ సెట్‌లలో కూర్చోబెడుతున్నారు. వీరందరికీ క్యార్‌వాన్‌లు ఏర్పాటు చేయలేక నిర్మాతలు నలుగుతున్నారు. ఇక ఈ దర్శకులే ఏ ఎక్విప్‌మెంట్‌ వాడుతారో స్పష్టత లేకుండా మొత్తం ఎక్విప్‌మెంట్‌ను డంప్‌ చేయించి అద్దెలు కట్టిస్తున్నారు. ఈ దుబారాకు జవాబుదారీతనం ఎవరిదన్న అవలోకనం చేసుకోవాల్సిందే!

డిమాండ్‌ అండ్‌ సప్లై సూత్రం ప్రకారం హీరో, డైరెక్టర్, ఆర్టిస్ట్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి నిర్మాతలు పడ్డ పోటీ కూడా నేటి పరిస్థితికి కారణమన్నది నిర్వివాదాంశం. నిర్మాత, దర్శకుడు, హీరో... అందరూ సినిమా కోసమే పని చేసినా సమన్వయం, సమైక్య దృష్టి అవసరం. నేడు పరిశ్రమలో రెగ్యులర్‌ పని, థియేటర్లకు ఫీడ్‌ దొరకాలంటే సరైన బడ్జెట్‌లో పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలని పరిశీలకులు అంటున్నారు. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ వాస్తవిక అంచనాలతో, భేషజం లేని స్వీయ విశ్లేషణ  చేసుకుని సినిమా రంగ భవిష్యత్తును నిర్దేశించుకోవాలి. 

ఎందుకంటే వీరందరూ కాకుండా స్టేక్‌ హోల్డర్‌ మరొకడు ఉన్నాడు– ప్రేక్షకుడు. ప్రేక్షకుడికి నేడు వేయి వినోదాలు. అతణ్ణి కట్టి పడేయడానికి సినిమా రంగం కలిసికట్టుగా సంస్కరణలు చేసుకోక తప్పదు. త్వరలో సినీ పరిశ్రమ మంచికి ‘యాక్షన్‌’, చెడుకు ‘కట్‌’ పలుకుతుందని ఆశిద్దాం.  

మరిన్ని వార్తలు