Election Commissioner: నచ్చినవాడికి ఇచ్చేద్దామా?

24 Nov, 2022 01:00 IST|Sakshi

నిష్పక్షపాతంగా వ్యవహరించడమే కాదు, వ్యవహరించినట్టు కనిపించడం కూడా అంతే ముఖ్యం. కానీ, ప్రజాస్వామ్యానికి పునాది లాంటి ఎన్నికలు, వాటిని నిర్వహిస్తున్న మన ఎన్నికల వ్యవస్థ అలానే ఉన్నాయా? ఎన్నికల సంఘానికి పెద్ద అయిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామక ప్రక్రియ నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరుగుతోందా? దేశ సర్వోన్నత న్యాయస్థానం మంగళ, బుధవారాల్లో అన్న మాటలు, అడిగిన ఫైళ్ళు చూశాక సహజంగానే ఈ ప్రశ్నలు అడగాల్సినవే అనిపిస్తాయి. సీఈసీ, ఈసీల వ్యవస్థ రాజకీయ, ప్రభుత్వ జోక్యాలకు అతీతంగా ఉండేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు ఆలోచన రేపుతున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ లాంటి చోట్ల కూడా ఎన్నికల సంఘ నియామకాలు, చట్టాలు పారదర్శకంగా ఉంటే 72 ఏళ్ళ తర్వాతా మన వద్ద ఆ పరిస్థితి లేకపోవడం విషాదమే.

ఈ నెల 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయెల్‌ను ఆ వెంటనే 19వ తేదీన ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వ పెద్దలు నియమించడం సైతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామూలుగా అయితే, ఈ ఏడాది ఆఖరుకు రిటైరవ్వాల్సిన వ్యక్తికి హఠాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి, ఇలా ఎన్నికల సంఘంలో నియుక్తం చేయడంలో అంతా సవ్యంగానే జరిగిందా అన్నది ప్రశ్న. అది తెలుసుకొనేందుకే సుప్రీమ్‌ కోర్ట్‌ ఇప్పుడు అరుణ్‌ గోయెల్‌ నియామకం సహా నిర్ణీత ఫైళ్ళను పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. అధికార పార్టీలు తమకు నచ్చిన ప్రభుత్వ ఉన్నతాధికారులను సీనియారిటీ ప్రాతిపదికన ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్న విధానం తప్పనేది ప్రాథమికంగా పిటిషనర్ల వాదన. సీఈసీల నియామకంలోనూ కొలీజియమ్‌ తరహా విధానాన్ని పాటించాలని అభ్యర్థన.  

ఎన్నికల కమిషనర్ల నియామకం పూర్తిగా పాలకుల ఇష్టారాజ్యమైందన్నది చేదు నిజం. సుప్రీమ్‌ అన్నట్టు – క్యాబినెట్‌ నియమించిన సీఈసీ, ఈసీలు ఏ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికో వ్యతిరేకంగా నోరు విప్పగలరా అన్నది అనుమానమే. గణాంకాలు చూస్తే రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి 46 ఏళ్ళలో (1950 –1996) సీఈసీగా వ్యవహరించింది పట్టుమని పది మందే! ఆ తర్వాత గత 26 ఏళ్ళలో ఇప్పటికి 15 మంది వచ్చారు, పోయారని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 2004 తర్వాత ఏ ఒక్కరూ పూర్తి ఆరేళ్ళ పదవీకాలం లేరు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్‌ సారథ్య యూపీఏ అయినా, బీజేపీ నేతృత్వ ఎన్డీఏ అయినా ఇదే దుఃస్థితి. స్వల్పకాలమే ఉంటున్న ఈ ఎన్నికల పెద్దలు అనుకున్నది చేయగలరా? ఏ మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలరు? సుప్రీమ్‌ ప్రశ్న కూడా ఇదే! 

దేశంలో తొలిసారిగా ఎన్నికల సంఘం గురించి సామాన్యులకు తెలిసింది – ఎన్నికల కమిష నర్‌గా శేషన్‌ సంస్కరణలు సాగించిన కాలంలోనే. ఇవాళ్టి ఓటర్‌ గుర్తింపుకార్డులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రవేశపెట్టిందీ ఆయనే. శేషన్‌ తర్వాత లింగ్డో లాంటి కొందరు నిర్భయంగా ఎన్నికల సంఘం అధికారాలను వినియోగించినా, గత దశాబ్దిన్నరలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడా ఎన్నికల వ్యయంపై నియంత్రణ లేకుండా పోయింది. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక సహా అనేకచోట్ల మద్యం ఏరులై పారుతూ, కోట్లకొద్దీ నోట్ల కట్టలు తెగుతూ, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నా, ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూస్తోంది. శేషన్‌ నాటికీ, నేటికీ అధికా రాల్లో మార్పు లేకపోయినా అంకితభావంలో మార్పు వచ్చింది. పదవీప్రసాద ప్రభుభక్తి పెరిగింది. 

రాజ్యాంగంలోని 324వ అధికరణం ఈసీల నియామక ప్రక్రియను వివరించలేదు. దానిపై పార్లమెంట్‌ చట్టం చేస్తుందని భావించింది. ఇన్నేళ్ళుగా అది జరగలేదు. తాజా కేసులోనూ సర్కారు 1991 నాటి చట్టాన్నీ, అలాగే రాష్ట్రపతికి ప్రధాని సారథ్యంలోని మంత్రివర్గ సిఫార్సుల పైనే నియా మకాలు జరుగుతున్న పూర్వోదాహరణల్నీ అడ్డుపెట్టుకుంటోంది. లా కమిషన్‌ సైతం కొలీజియమ్, లేదా ప్రధాని, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్షన్‌ కమిటీయే ఈసీలం దర్నీ నియమించాలని 2015 నివేదికలో పేర్కొంది. కొలీజియమా, కమిటీయా అన్నది పక్కన పెడితే ఈసీల నియామక ప్రక్రియలో తక్షణ సంస్కరణలు అవసరం. అయితే, దీనికి పార్లమెంట్‌ ఆమోదంతో రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు మన పాలకులెంత సిద్ధం ఉంటారో చెప్పలేం.

అసలైనా అధికారంలోని వారి అభీష్టమైన ఈసీల నియామకంపై జడ్జీలు జోక్యం చేసుకోవడమే మిటనేది ప్రభుత్వ అనుకూల వర్గాల వాదన. ధర్మాన్ని నిలబెట్టాల్సిన న్యాయవ్యవస్థ సైతం దృష్టి సారించరాదంటే తప్పొప్పులు దిద్దేదెవరు? రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి తొలి ఈసీగా నియుక్తులైన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లాంటి వారు బాధ్యత మరిచి, పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం తాజా ఉదాహరణే. ఇక, ఈసీల నియామకంపై వ్యాఖ్యానించిన సుప్రీమ్‌ తన సొంత జడ్జీల నియామక ప్రక్రియపై విమర్శలకు స్పందించదేమన్నది కొందరి విమర్శ. కొలీజియమ్‌ వ్యవస్థ ఆసరాగా ప్రధాన న్యాయమూర్తులు మెచ్చినవారినే జడ్జీలుగా నియమిస్తున్నారనీ, ఈ నియామకాల్లో పారద ర్శకత లేదనీ ఆరోపణ. న్యాయశాఖ మంత్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే, ఎన్నికల సంఘంలోనైనా, న్యాయవ్యవస్థలోనైనా నియామకాలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరపాలి. తటస్థ వ్యవస్థలుంటేనే విశ్వాసం బలపడుతుంది. ప్రజాస్వామ్య పరిపుష్టి సాధ్యమవుతుంది.

మరిన్ని వార్తలు