Scientific Literature: శాస్త్ర సాహిత్యం

12 Sep, 2022 00:50 IST|Sakshi

మనకు శాస్త్ర సాహిత్యం కొత్తదేమీ కాదు. కాకుంటే, శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా మనకు ఆశించిన స్థాయిలో శాస్త్ర సాహిత్యం రాకపోవడమే శోచనీయం. క్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సామాన్యులకు తేలికగా అర్థమయ్యేలా సాహిత్య రూపంలో అందించిన కవులు, రచయితలు తెలుగువాళ్లలో చాలామందే ఉన్నారు. తెలుగులో తొలి శాస్త్ర కావ్యం గణిత శాస్త్రానికి సంబంధించినది. క్రీస్తుశకం పదకొండో శతాబ్దికి చెందిన కవి పండితుడు పావులూరి మల్లన్న ‘గణితశాస్త్ర సంగ్రహం’ రాశాడు. మహావీరాచార్యుడు సంస్కృతంలో రాసిన గణిత గ్రంథాన్ని మల్లన్న పద్యాల్లో అనువదించాడు. ఆయన కృషికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నవఖండవాడ అనే అగ్రహారాన్ని బహూకరించాడట. 

ప్రజల్లో విజ్ఞానాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో హైదరాబాద్‌ కేంద్రం 1906లోనే మునగాల రాజా నాయని వేంకట రంగారావు పోషణలో విజ్ఞాన చంద్రికా మండలి ఏర్పడింది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు దీనికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరిస్తూ, తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని అందించారు. విజ్ఞాన చంద్రికా మండలి చరిత్ర, శాస్త్ర విషయాలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలను ప్రచురించింది. ఆచంట లక్ష్మీపతి రాసిన  ‘జీవశాస్త్రము’, ‘జంతుశాస్త్రము’, ‘కలరా’, ‘చలిజ్వరము’; మంత్రిప్రగడ సాంబశివరావు రాసిన ‘పదార్థ విజ్ఞానశాస్త్రము’, వేమూరి విశ్వనాథశర్మ రాసిన ‘రసాయన శాస్త్రము’ వంటి గ్రంథాలను విజ్ఞాన చంద్రికా మండలి అప్పట్లోనే వెలుగులోకి తెచ్చింది. ఇంచుమించు అదేకాలంలో కృష్ణా జిల్లా వ్యవసాయ సంఘం గోపిశెట్టి నారాయణస్వామి నాయుడు సంపాదకత్వంలో ‘వ్యవసాయము’ మాస పత్రికను ప్రారంభించింది. తెలుగులో అదే తొలి వ్యవసాయశాస్త్ర పత్రిక. తర్వాత కొంతకాలానికి బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసే కాళీపట్నం కొండయ్య 1935లో ‘విజ్ఞానం’ మాసపత్రికను ప్రారంభించి, దాదాపు ఐదేళ్లు నడిపారు. అంతేకాదు, జేమ్స్‌ జీన్స్‌ రాసిన ‘యూనివర్స్‌ అరౌండ్‌ అజ్‌’ను తెలుగులో ‘విశ్వరూపం’ పేరిట తెలుగులోకి అనువదించారు. శాస్త్రవేత్తలు, విజ్ఞానశాస్త్ర విద్యార్థులు కాకుండా, సాధారణ పాఠకులకు అర్థమయ్యే శాస్త్రీయ అంశాలను వివరిస్తూ వెలువడే ఇలాంటి గ్రంథాలు జనరంజక శాస్త్ర గ్రంథాలుగా పేరుపొందాయి.

శాస్త్ర సాంకేతిక అంశాలను సామాన్యులకు చేరవేయడాన్నే పనిగా పెట్టుకుని ఒక ఉద్యమంలా రచనలు సాగించిన రచయితలు మనకు ఉన్నారు. వీరిలో సాహిత్యరంగంలో దిగ్గజాలుగా గుర్తింపు పొందినవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో వసంతరావు వెంకటరావు ఒకరు. ఆయన 1949లో ‘ఆధునిక విజ్ఞానం’ రాశారు. శాస్త్ర విషయాలను పద్యాలు, పాటల రూపంలో పిల్లలకు సైతం అర్థమయ్యే రీతిలో విరివిగా రాసి, ‘భౌతికశాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి’గా ప్రసిద్ధుడయ్యారు. విస్సా అప్పారావు ‘విజ్ఞానం–విశేషాలు’ పుస్తకం రాశారు. అలాగే ఆయన పిల్లల కోసం నక్షత్రాల గురించి పుస్తకం రాశారు. లండన్‌లో డాక్టరేట్‌ చేసిన శ్రీపాద కృష్ణమూర్తి ‘విజ్ఞాన సాధన’, ‘విజ్ఞాన వీధులు, ‘ఇంటింటా విజ్ఞాన సర్వస్వము’, ‘రాకెట్లు–ఆకాశయానము’, ‘వైజ్ఞానిక గాథాశతి’ వంటి పుస్తకాలను రాశారు. ఖగోళ శాస్త్రంపై ఏవీఎస్‌ రామారావు ‘వినువీధి’ పుస్తకం రాశారు. తాపీ ధర్మారావు ‘పెళ్లి–దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు?’ వంటి శాస్త్ర పరిశోధన పుస్తకాలను రాశారు. డాక్టర్‌ ఉప్పల లక్ష్మణరావు ‘నిత్యజీవితంలో భౌతికశాస్త్రం’, ‘జంతుశాస్త్రం’ వంటి శాస్త్ర గ్రంథాలను రష్యన్‌ నుంచి తెలుగులోకి అనువదించారు. శాస్త్రీయ దృక్పథం గల తెలుగు రచయితల్లో ఒకరైన కొడవటిగంటి కుటుంబరావు ‘బుద్ధికొలత వాదాన్ని’ ప్రతిపాదించారు. మహీధర రామమోహనరావు ‘సైన్స్‌ ప్రపంచం’ పత్రికను నడిపారు. ఆయన కుమారుడు మహీధర నళినీమోహన్‌ పిల్లలకు అర్థమయ్యే రీతిలో శాస్త్ర సాంకేతిక విషయాలపై ‘నిప్పు కథ’, ‘టెలిగ్రాఫు కథ’, ‘టెలిఫోను కథ’, ‘విద్యుత్తు కథ’, ‘ఆలోచించే యంత్రాలు’, ‘ఇతర లోకాల్లో ప్రాణులు’ వంటి అనేక పుస్తకాలు రాశారు. పాత్రికేయ రచయిత నండూరి రామమోహనరావు ఖగోళ, మానవ పరిణామ శాస్త్ర అంశాలపై ‘విశ్వరూపం’, ‘నరావతారం’ వంటి పుస్తకాలు రాశారు. పాల్‌ డి క్రూఫ్‌ రాసిన ‘మైక్రోబ్‌ హంటర్స్‌’ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దీనిని జమ్మి కోనేటిరావు తెలుగులో ‘క్రిమి అన్వేషకులు’ పేరిట అనువదించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ పిల్లల కోసం‘ప్లాస్టిక్‌ ప్రపంచం’ వంటి పుస్తకాలు రాశారు. వృత్తిరీత్యా వైద్యులైన డాక్టర్‌ గాలి బాలసుందరరావు, డాక్టర్‌ జి.సమరం, డాక్టర్‌ వెంకటేశ్వర్లు తదితరులు వైద్య, ఆరోగ్యశాస్త్ర అంశాలపై విరివిగా పుస్తకాలు రాశారు. 

ఇదివరకు ‘భారతి’, ‘పుస్తక ప్రపంచం’ వంటి సాహిత్య పత్రికలు సైతం శాస్త్ర సాంకేతిక వ్యాసాలను విరివిగా ప్రచురించేవి. పూర్తిగా శాస్త్ర సాంకేతిక అంశాల కోసం తెలుగులో ‘సైన్స్‌వాణి’, ‘సైన్స్‌ ప్రపంచం’ వంటి పత్రికలు వెలువడేవి. ఇప్పుడవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పటికాలంలో ప్రధాన స్రవంతి సాహిత్యంలో గుర్తింపు పొందిన రచయితలెవరూ శాస్త్ర సాంకేతిక అంశాలపై రచనలు సాగించడం లేదు. చక్కని శైలి గల రచయితలు శాస్త్ర సాంకేతిక అంశాల రచనలు చేస్తే పాఠకులు ఆదరించకుండా ఉండరు. ఈ అంశాలపై ఇదివరకటి పుస్తకాలను ఎన్నిసార్లు పునర్ముద్రణ చేసినా పాఠకులు ఇంకా వాటిని  కొంటూ ఉండటమే ఇందుకు నిదర్శనం. తెలుగులో శాస్త్ర సాంకేతిక రచనలు ఇంకా విరివిగా రావాల్సిన అవసరం ఉంది. దీనిని సాహిత్య అకాడమీలు, ప్రచురణకర్తలు, రచయితలే గుర్తించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు