మస్క్‌ పంజరంలో మాటల పిట్ట

2 Nov, 2022 00:42 IST|Sakshi

అనేక నెలల నాటకీయత అనంతరం ఎట్టకేలకు ట్విట్టర్‌ అమ్మకం పూర్తయింది. ఎప్పుడెలా ప్రవర్తి స్తారో అంతుచిక్కని అంతర్జాతీయ వ్యాపారి, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ చేతికి అక్టోబర్‌ 27న ఈ సుప్రసిద్ధ సామాజిక మాధ్యమ వేదిక వచ్చింది. 4400కోట్ల డాలర్లకు జరిగిన కొనుగోలులో ఇది అంతిమ ఘట్టంగా కనిపించవచ్చు. కానీ, ఇక నుంచే అసలు కథ! తక్షణ వార్తలకూ, అభిప్రాయ వినిమయానికీ అంతర్జాతీయంగా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సోషల్‌ మీడియా బుజ్జిపిట్ట భవితపై చర్చ మళ్ళీ మొదలైంది. యాజమాన్యం మార్పుతో సమాచార ప్రమాణాలు క్షీణిస్తాయా అనే శంక రేగుతోంది. ముప్పాతిక శాతం ఉద్యోగాల ఊచకోత మొదలు ధ్రువీకృత ఖాతాదార్లకిచ్చే బ్లూ టిక్‌ మార్క్‌కై నెలకు 20 డాలర్ల రుసుము ప్రతిపాదన వరకు మస్క్‌ చేష్టలు గగ్గోలు పుట్టిస్తున్నాయి.

వర్తమాన స్థితిని మిత్రులతో పంచుకోవాలన్న జాక్‌ డోర్సీ ఆలోచనతో 2006లో ట్విట్టర్‌ మొదలైంది. మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌గా అమెరికాలో ఏర్పాటైన ట్విట్టర్‌ ఇప్పుడు 130 కోట్లకు పైగా ఖాతాలతో దానికదే ఓ పెద్ద వ్యవస్థ. ప్రపంచంలో అత్యధికులు వాడుతున్న మొబైల్‌ యాప్‌లలో 6వ స్థానం ఈ మాటల పుట్టదే. 280 అక్షరాల ట్వీట్‌తో భావావేశాలను వ్యక్తీకరించే ఈ వేదిక వినియోగం భారత్‌తో పాటు జపాన్, జర్మనీ, ఉత్తర అమెరికాల్లో ఎక్కువ. రోజూ 24 కోట్ల మంది దీన్ని చూస్తారని ఓ లెక్క. కొన్నాళ్ళుగా అనేక వివాదాలెదుర్కొన్నా, ప్రత్యామ్నాయ సమాచార, భావప్రకటన వేదికగా అపరిమిత ప్రభావం చూపిన ఘనత ఈ టీనేజ్‌ యాప్‌దే! రాకెట్‌ సంస్థ స్పేస్‌ ఎక్స్, విద్యుత్‌ కార్ల సంస్థ టెస్లా, బ్రెయిన్‌చిప్‌ అంకురసంస్థ న్యూరాలింక్, సొరంగ నిర్మాణ సంస్థ బోరింగ్‌ కంపెనీ – ఇలా మరో 4 సంస్థలు నడుపుతున్న మస్క్‌ అత్యధిక ఫాలోయర్లతో ట్విట్టర్‌లో 3వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడదే ట్విట్టర్‌కు అధినేతయ్యారు. 

ఏప్రిల్‌లో కొనుగోలు ప్రతిపాదన చేసి, ఆ తర్వాత ముందు వెనకలాడి, చివరకు ట్విట్టర్‌ బల వంతంపై కొనుగోలు ప్రక్రియ పూర్చి చేసిన మస్క్‌ అంతా అవగానే అన్న మాట – ‘పంజరంలోని పక్షికి స్వేచ్ఛ దొరికింది. శుభ సమయం వచ్చేసింది’. వస్తూనే ఆయన సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ సహా పలువురికి ఉద్వాసన పలికి, బోర్డు మొత్తాన్నీ రద్దు చేశారు. తోకలేని తుర్రుపిట్ట ‘పబ్లిక్‌’ లిస్టెడ్‌ కంపెనీ నుంచి ‘ప్రైవేట్‌’కు మారింది. అంటే, సదరు వేదికపై విచక్షణాధికారం ఆయనదే! బయటి పర్యవేక్షణ, పరిశీలన తగ్గనున్నాయి. అంటే గతంలోనే పారదర్శకత, జవాబుదారీతనం లేదని విమర్శలెదుర్కొన్న ట్విట్టర్‌లో అవి మరింత క్షీణించవచ్చు. కానీ, విభిన్న అభిప్రాయాలున్నవారితో సమాచార నియంత్రణ మండలి పెడతానంటున్నారు. వివాదాలతో ట్విట్టర్‌లో శాశ్వత నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఆ మండలిలో ఉంటారట. తన కొత్త ముంజేతి చిలక భావస్వేచ్ఛకు ప్రతిరూపమన్న మస్క్‌ మాట ఆచరణ సాధ్యమేనా?  

నియంత్రణను సడలిస్తే... అనధికార ఖాతాలతో,  పెద్ద సంఖ్యలో తనంత తానే పోస్టులు పంపే ఇంటర్నెట్‌ ప్రోగ్రామైన ‘స్పామ్‌ బోట్‌’లతో విద్వేషపరులు ట్విట్టర్‌ను ఇష్టానికి ఆడించగలుగుతారు. ఈ విద్వేష వ్యాఖ్యాతల హోరులో అసలు యూజర్ల స్వరం వినిపించకుండా పోతుంది. మరోపక్క ఇప్పటి దాకా ఉచితమైన ధ్రువీకృత బ్లూటిక్‌ నెలవారీ రుసుము కట్టకుంటే పోతుంది. ధ్రువీకృత ఖాతా లేకపోయేసరికి ప్రముఖులు, బ్రాండ్లు, ప్రభుత్వ అధికారుల పేర్లతో నకిలీ ఖాతాదారులు ఏదేదో పోస్ట్‌ చేస్తారు. తప్పుడు వార్తలు మరింతగా ప్రజల్లో వ్యాపిస్తాయి. అందుకే, అటు ట్రంప్‌ను చేరదీయడం, ఇటు బ్లూటిక్‌కు నెలవారీ రుసుము ట్విట్టర్‌కు తిరోగమన చర్యలే! 40 దేశాల్లో తన సంస్థల వ్యాపారమున్న మస్క్‌ ఆ ప్రభుత్వాలకు చీకాకు కలిగేలా ట్విట్టర్‌లో స్వేచ్ఛను అనుమతించ డమూ అనుమానమే. ఆర్థిక ప్రయోజనాల్నీ, భావస్వేచ్ఛనూ సమతౌల్యం చేసుకోక తప్పదు. 

యాప్‌లో మార్పులు తేవడంలో, పెద్ద సంఖ్యలో పోస్ట్‌లు చేసే స్పామ్‌ ఖాతాలను తొలగించ డంలో నత్తనడక నడుస్తున్నారంటూ మస్క్‌ కొద్ది నెలలుగా ట్విట్టర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు వచ్చీరాగానే తనదైన ముద్రకు ప్రయత్నిస్తున్నారు. ఆయన బృందాలు ట్విట్టర్‌ సాఫ్ట్‌వేర్‌ కోడ్‌నూ, పనిలోని వివిధ అంశాలనూ ఆకళింపు చేసుకొనే పనిలో పడ్డాయి. వారంలో 7 రోజులూ, రోజుకు 12 గంటలు పనిచేసి, గడువులోగా ఇచ్చిన పని పూర్తిచేయకుంటే ఉద్యోగాలు ఊడతాయనే భయం తెచ్చారు. తన ఇతర కంపెనీల్లోని నమ్మకస్థుల్ని పదుల సంఖ్యలో ట్విట్టర్‌లో పనికి దింపి, సోర్స్‌కోడ్‌ సహా అన్నీ చకచకా నేర్చేసుకొమ్మంటున్నారు. కార్ల కంపెనీ నిపుణుడికి కంటెంట్‌ కథెలా తెలుస్తుందని ఆలోచించట్లేదు. రాత్రికి రాత్రి ట్విట్టర్‌ రూపుమార్చేయాలని ఆత్రపడుతున్నారు. 

తోటి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌ల స్థాయి మార్కెట్‌ విలువకు చేరుకోలేక, గత పదేళ్ళలో 8 ఏళ్ళు ఈ తుర్రుపిట్ట నష్టాలే చవిచూసింది. కాబట్టి ప్రతిభావంతుడైన వ్యాపారిగా మస్క్‌ తొందర అర్థం చేసుకోవచ్చు. కానీ, ట్విట్టర్‌ను కొనేశా కాబట్టి ఏదైనా చేస్తా, అన్ని నిబంధనలకూ అతీతుణ్ణి అనుకుంటే కష్టం. రథసారథిగా ఈ పిచ్చి మారాజు చేపట్టే చర్యలు రేపు ఎదురుతన్నే ప్రమాదం ఉంది. ఈ ఇష్టారాజ్యపు చేష్టలన్నీ మాటల పిట్ట గొంతుకు ఉరి బిగించి, బెదిరిన వాణిజ్య ప్రకటన కర్తలు దూరం జరిగినప్పుడు వీడని నీడలా వెంటాడతాయి. ట్విట్టర్‌ సంస్థాపకుడు జాక్‌ కొత్తగా మొదలెట్టిన వికేంద్రీకృత సోషల్‌ నెట్‌వర్క్‌ బ్లూస్కై లాంటి వాటి నుంచి పోటీ సరేసరి. వరస చూస్తుంటే, ఈ వ్యవహారంలో తలబొప్పి కడితే కానీ తత్త్వం బోధపడేలా లేదు!

>
Poll
Loading...
మరిన్ని వార్తలు