ఫస్ట్‌–రేట్‌ రచయిత

5 Feb, 2024 03:57 IST|Sakshi

సెకండ్‌–రేట్‌ రచయితల్లో తాను మొదటి వరుసలో ఉంటానని చెప్పుకొన్నాడట సోమర్‌సెట్‌ మామ్‌. ఆయన దృష్టిలో బాల్జాక్, డికెన్ ్స, టాల్‌స్టాయ్, దోస్తోవ్‌స్కీ ప్రపంచం చూసిన నలుగురు గొప్ప నవలాకారులు. పాఠకులను సాహిత్యం వైపు ఆకర్షించడమే కొందరు రచయితల విలువైన కాంట్రిబ్యూషన్  అవుతుంది. ఇక్కడ కూడా మామ్‌ మొదటి వరుసలో ఉంటారు. ఆంగ్ల అనువాద కథలతో పరిచయం ఉండే తెలుగు పాఠకులకు దాదాపుగా తగిలే మొదటిపేరు విలియమ్‌ సోమర్‌సెట్‌ మామ్‌. అత్యధిక కాపీల అమ్మకం, అత్యంత పేరు, అత్యధిక సంపాదనలతో చాలా విధాలుగా ఒక కమర్షియల్‌ రచయిత కూడా కలలు కనలేని జీవితాన్ని మామ్‌ అనుభవించాడు.

హాలీవుడ్‌ సినిమాలకు పనిచేశాడు, దేశదేశాలు తిరిగాడు, అత్యంత ప్రముఖులతో విలాసవంతమైన టూర్లు, డిన్నర్లల్లో పాల్గొన్నాడు. తన గురించి మామ్‌ ఏమని చెప్పుకొన్నా, ఆయన ‘ద మూన్  అండ్‌ సిక్స్‌పెన్ ్స’, ‘ద పేంటెడ్‌ వీల్‌’, ‘కేక్స్‌ అండ్‌ ఎయిల్‌’, ‘ద రేజర్స్‌ ఎడ్జ్‌’ గొప్ప నవలలుగా పేరొందాయి. ఇక మామ్‌ మాస్టర్‌పీస్‌గా చెప్పే ‘ఆఫ్‌ హ్యూమన్  బాండేజ్‌’ ప్రపంచ గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచిపోయింది. నూటికి పైగా కథలు, పదులకొద్దీ నాటకాలు, నవలలు... ఎంత విస్తృతంగా రాశాడో అంత ఆదరణ పొందిన మామ్‌కు ఇది నూటా యాభయ్యో జయంతి సంవత్సరం.

మామ్‌ జీవితంలోనూ ఒక రచనకు కావాల్సినంత డ్రామా, కన్నీళ్లు, కష్టాలు, ట్విస్టులు ఉన్నాయి. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఆంగ్లాన్ని చిన్నతనంలో సాటి విద్యార్థులు హేళన చేసేవారు. కారణం, జన్మకు ఆంగ్లేయుడు అయినా, పుట్టింది ఫ్రెంచ్‌ గడ్డ మీద. అలా ఫ్రెంచ్‌ ఆయన మొదటి భాష అయింది. ఫ్రెంచ్‌ గడ్డ మీద పుట్టిన అందరూ ఫ్రెంచ్‌వాళ్లే అవుతారనీ, తప్పక మిలిటరీలో చేరాల్సిందేననీ శాసనం వచ్చినప్పుడు ఆ స్థానీయతను తప్పించుకోవడానికి మామ్‌ కుటుంబం ఫ్రాన్ ్సలోని బ్రిటిష్‌ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించింది. 

అందులోనే మామ్‌కు జన్మనిచ్చింది(1874 జనవరి 25) వాళ్ల తల్లి. అలా బ్రిటన్  ఎంబసీలో జన్మించడం వల్ల మామ్‌ బ్రిటనీయత స్థిరపడిపోయింది. వాళ్ల గ్రేట్‌–అంకుల్‌ గుర్తుగా పెట్టిన సోమర్‌సెట్‌ అనే మధ్యపేరు ఆయనకు నచ్చలేదు. ఇంట్లో విల్లీ అని పిలిచేవాళ్లు. మామ్‌కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తల్లి క్షయవ్యాధితో చనిపోయింది. ఆ లోటు ఆయనకు ఎప్పుడూ తీరలేదు. ‘అది ఎప్పడూ పూర్తిగా మానని గాయం’గానే ఉండిపోయింది.

వృద్ధుడయ్యాక కూడా తల్లి ఫొటోను మంచం పక్కనే ఉంచుకునేవాడు. ఆ తర్వాత రెండేళ్లకే తండ్రి చనిపోవడం మరో దెబ్బ. అప్పుడు బ్రిటన్ లోని చిన్నాన్న దగ్గరికి వచ్చాడు. ఆ కొత్త ఇల్లు, వాతావరణం బాగున్నప్పటికీ, తల్లిదండ్రులు లేని చింత, కొత్త సమాజంలో కలవలేకపోవడం, సిగ్గరి కావడం వంటి కారణాల వల్ల ఇట్టే మాట్లాడేవాడు కాదు. అది క్రమంగా నత్తిగా మారి జీవితాంతం ఆయనతో ఉండిపోయింది. తాత, తండ్రి న్యాయవాదులు అయినప్పటికీ మామ్‌ ఆ బాటలోకి పోకపోవడానికి ఈ నత్తి కూడా ఒక కారణం.

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అవడంలా కాకుండా, నిజంగానే డాక్టరీ చదివినా దాని జోలికి పోకుండా రంగస్థలంలో ప్రాక్టీస్‌ చేశాడు మామ్‌. నాటకాలతో ముందు ప్రజాదరణ పొందినా తర్వాత నవలలు, కథల మీద మాత్రమే దృష్టిసారించాలని నిశ్చయించుకున్నాడు. ఒక చదవదగ్గ కథకు మెటీరియల్‌ రాకపోతే తానెవరి సమక్షంలోనూ గంటసేపు కూడా గడపనని అనేవాడు. ఆయనకు ఏదైనా కథావస్తువే. దానికి తగినట్టే ఆయన జీవితం కూడా అనుభవాల పుట్ట. యువకుడిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్  సీక్రెట్‌ ఇంటెలిజెన్ ్స సర్వీస్‌ కోసం కొన్నాళ్లు స్విట్జర్లాండ్‌లో గూఢచారిగా పనిచేశాడు.

ఫ్రెంచ్‌ నాటక రచయిత అన్నది అప్పుడు ఆయన కవర్‌. తర్వాత, రష్యాలోనూ బోల్షివిక్కులకు వ్యతిరేకంగా, జర్మన్  నిఘా నెట్‌వర్క్‌ మీద సమాచారాన్ని పంపాడు. మెన్షివిక్కులకు మద్దతు ఇవ్వాలన్నది బ్రిటన్  ఆలోచన. జర్మనీలో చదువుకున్నందువల్ల మామ్‌కు జర్మన్  వచ్చు. ఈసారి అమెరికా పబ్లిషర్‌ అనేది కవర్‌. అయితే ఈ అనుభవాలను రచనలుగా తెచ్చాడుగానీ అధికార రహస్యాల చట్టాన్ని ఇవి ఉల్లంఘిస్తుండటంతో చాలావాటిని కాల్చేశాడు. అయినా గూఢచర్య కథలు రాసిన తొలి గూఢచార రచయిత మామ్‌ అయ్యాడు. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌ రాయడానికి ఇయాన్  ఫ్లెమింగ్‌కు ప్రేరణగా నిలిచాడు. కానీ గూఢచర్యంలో పనిరోజులు ఒకేవిధంగా ఉండి విసుగు పుట్టిస్తాయనీ, చాలా రోజులు నిరర్థకమనీ వ్యాఖ్యానించాడు.

ఇటీవల వచ్చిన మలయాళ సినిమా ‘కాదల్‌’లో హోమోసెక్సువల్‌ అయినప్పటికీ హీరోకు ఒక కూతురు ఉంటుంది. దాంపత్య బంధపు ఒత్తిడి అది. మామ్‌ కూడా లైంగిక ధోరణి రీత్యా హోమోసెక్సువల్‌. పదేళ్ల వివాహ బంధంతో ఆయనకు ఒక కూతురు. కానీ తర్వాత వివాహం నుంచి విముక్తం అయ్యి స్నేహితులతో స్వేచ్ఛాజీవితం గడిపాడు. తల్లి దూరమవడం మొదలు తన జీవితంలోని అపసవ్యతలన్నింటి కారణంగా, జీవితాంతం దేవుడి మీద అవిశ్వాసిగా ఉన్న మామ్‌ తన ఆత్మకథాత్మక నవలను చివరి దశలో చదువుకున్నా కన్నీళ్లు కార్చకుండా పూర్తిచేసేవాడు కాదు.

ఇంకేది కలిపినా డిజైన్  పాడవుతుందని తెలిసినప్పుడు ఆర్టిస్ట్‌ ఇక దాన్ని వదిలేసినట్టుగా, తాను రచయితగా సంతృప్తికర దశలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలించాలని మామ్‌ ఆశపడ్డాడు. అన్నింటి విషయంలో జరిగినట్టుగానే ప్రకృతికి ఆయన విషయంలో వేరే లెక్ఖుంది. కోరుకున్న ముప్పై సంవత్సరాల తర్వాత, అన్ని వృద్ధాప్యపు సమస్యలతో పాటు 91 ఏళ్ల నిండుతనం కూడా ఇచ్చిగానీ ఆయన్ని సాగనంపలేదు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega