నిగూఢంగానే మిగిలిన స్పైవేర్‌

26 Aug, 2022 00:51 IST|Sakshi

పౌరుల గోప్యతకూ, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకూ పెనుముప్పు కలిగించ గలదని దేశమంతా భావించిన స్పైవేర్‌ పెగసస్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక నిరాశనే మిగిల్చింది. మన దేశంలో మొత్తం 300 మంది ఫోన్లపై ఈ స్పైవేర్‌ దాడి చేసిందనీ, అందులో పాత్రికేయులతోపాటు కేంద్రంలోని ఇద్దరు మంత్రులూ, విపక్ష నేతలు ముగ్గురూ, రాజ్యాంగ పదవిలో ఉన్న ఒకరు, వ్యాపారవేత్తలు, పౌరహక్కుల నాయకులు ఉన్నారనీ అప్పట్లో బయటికొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం నిరుడు అక్టోబర్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలనకు 29 మంది తమ ఫోన్‌లు అందజేయగా అందులో అయిదు ఫోన్లలో మాల్‌వేర్‌ ఉన్నట్టు గుర్తించారు.

అది పెగసస్‌ సాఫ్ట్‌వేరా కాదా అన్నది కమిటీ తేల్చలేకపోయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తెలిపింది. నిపుణుల కమిటీ నివేదిక, పర్యవేక్షించిన మాజీ న్యాయమూర్తి నివేదిక సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో ఉంచబోతోంది. ఆ తర్వాతగానీ ఈ విచారణ లోతుపాతులు తెలియవు. ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ రూపొందించిన పెగసస్‌ గురించి నిరుడు వెల్లడైనప్పుడు ప్రపంచ దేశాల ప్రజానీకమంతా నివ్వెర పోయింది. పలు ప్రభుత్వాలు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ కంట్లో నలుసుగా మారినవారిపై నిఘా పెట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్పైవేర్‌ను మన ప్రభుత్వం 2017లో కొనుగోలు చేసిందని మొన్న జనవరిలో ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందంలో భాగంగానే ఇది జరిగినట్టు ఆ పత్రిక కథనం.

మరో ఆసక్తికరమైన సంగతేమంటే... ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి చంద్రబాబు సర్కారు ఈ స్పైవేర్‌ను కొన్న దని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇలా ఇంటా బయటా అందరూ కోడై కూస్తున్నా కేంద్రం నోరు మెదపలేదు. పార్లమెంటులో అలజడి రేగినా, నిరుడు వర్షాకాల సమావేశాలు ఈ అంశంపైనే తుడిచిపెట్టుకుపోయినా ‘భద్రతా కారణాల రీత్యా’ ఏమీ చెప్పలేమన్న గంభీరమైన ప్రత్యుత్తరంతో సరిపెట్టింది. సర్వోన్నత న్యాయస్థానంలోనూ అదే వైఖరి తీసుకుంది. ఇక చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. ఆయన మొదటినుంచీ దబాయింపుతో నెట్టుకొస్తున్నారు.

మన స్వాతంత్య్రోద్యమం ప్రజాజీవితంలోకి ఎన్నో కొత్త విలువలను మోసుకొచ్చింది. అట్టడుగు పౌరులకు సైతం ప్రజాస్వామ్య ఫలాలు అందాలన్న ఆకాంక్షతో ఆ విలువల ప్రాతిపదికనే మన రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా, సమస్యలెన్ని ఎదురవుతున్నా అవన్నీ సంపూర్ణ రిపబ్లిక్‌ ఆవిర్భావానికి దేశం పడుతున్న పురుటి నొప్పులుగా మొదట్లో అందరూ భావించారు. కానీ రాను రాను ప్రజాస్వామ్యాన్ని ఛిద్రం చేస్తున్నవారిదే పైచేయి అవుతున్న వైనం కనబడుతూనే ఉంది. ఈ పరిణామాలే చివరకు పెగసస్‌ వంటి స్పైవేర్‌ కొనుగోలుకు దారితీసినట్టు భావించాలి. పెగసస్‌ గురించి అధికారికంగా ఆధారాలేవీ బయటపడకపోయినా భీమా కోరెగావ్‌ కేసులో ఇరుక్కున్న ఒకరిద్దరి కార్యకర్తల  లు, కంప్యూ టర్లలో అవాంఛనీయమైన సాఫ్ట్‌వేర్‌ చొరబడటంలో ఆ సాఫ్ట్‌వేర్‌ పాత్ర ఉందన్న సంగతి వెల్లడైంది. తమ స్పైవేర్‌ను ‘బాధ్యతాయుత ప్రభుత్వాలకు’ విక్రయించాం తప్ప ప్రైవేటు వ్యక్తులెవరికీ అంద జేయలేదని ఎన్‌ఎస్‌ఓ స్పష్టంగా చెబుతోంది.

ఆ ‘బాధ్యతాయుత’ ప్రభుత్వాల జాబితా అది బయట పెట్టకపోయినా, వ్యక్తులెవరికీ ఆ సంస్థ విక్రయించలేదన్న సంగతైతే మీడియా సంస్థల అంతర్జాతీయ కన్సార్షియం దర్యాప్తులో తేటతెల్లమైంది. పైగా ధర రీత్యా ఆ సాఫ్ట్‌వేర్‌ బడా కోటీశ్వరులకు తప్ప అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇటు కేంద్రం నడత సందేహాలను నివృత్తి చేయకపోగా మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. గూఢచర్యం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను కేంద్రం ఖండిస్తున్న మాట నిజమే అయినా... రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై, కేంద్రమంత్రులపై నిఘా కొనసాగిందన్న అంశంలో అది నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడం వింత కాదా? ప్రభుత్వ సంస్థలేవీ ఆ స్పైవేర్‌ను వినియోగించలేదని ప్రకటిస్తున్న ప్రభుత్వం, తామే కాదు... వేరెవరూ కూడా ఆ పని చేయలేదని నిర్ద్వంద్వంగా ఎందుకు చెప్పలేకపోతోంది? కనీసం ఆ విషయంలో దర్యాప్తు చేశామనీ, ఫలానా అంశాలు వెల్లడయ్యాయనీ ఎందుకు వివరించడం లేదు? బహిరంగ అఫిడ విట్‌లో వివరాలు పొందుపరచడం సాధ్యపడదనీ, నిపుణుల కమిటీ నియామకానికి తనను అను మతిస్తే ఆ కమిటీకి నివేదిస్తాననీ నిరుడు కేంద్రం చేసిన వినతిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. తానే కమిటీ ఏర్పాటుచేసింది. దానికైనా కేంద్రం వివరాలందజేస్తే బాగుండేది. ఆ పని చేయకపోవడం వల్ల కమిటీ నివేదిక కొత్తగా ఏమీ చెప్పలేకపోయింది.

దేశం మొత్తాన్ని కుదిపేసిన పెగసస్‌ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం నీళ్లు నమలడం, దాటేయడం ఎవరి సలహా పర్యవసానమో గానీ ఈ వైఖరి దాని ప్రతిష్ఠను ఏమాత్రం పెంచదు. దేశ పౌరులనుంచి చట్టబద్ధ ప్రవర్తనను ఆశించే ప్రభుత్వాలూ, చట్ట ఉల్లంఘనకు పాల్పడే పౌరులపై చర్యలు తీసుకునేందుకు సర్వాధికారాలు ఉన్న ప్రభుత్వాలూ రాజ్యాంగ నైతికతకు కట్టుబడి ఉండాలి. ఆదర్శవంతంగా మెలగాలి. రాజ్యమే రాజ్యాంగ ఉల్లంఘ నకు పాల్పడుతుంటే, అది రివాజుగా మారితే ఆ సమాజాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదు.

మరిన్ని వార్తలు