మహిళల హక్కుకు ఛత్రం

12 Aug, 2020 00:28 IST|Sakshi

స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామంటున్నాయి ప్రభుత్వాలు. అయినా సమాజంలో అడుగడుగునా మహిళలపై వివక్షే కొనసాగుతోంది. సంస్కృతి, సంప్రదాయాల పేరు చెప్పి...శారీరక అసౌకర్యాల పేరు చెప్పి ఇంటా, బయటా ఆమె హక్కుల్ని హరిస్తూనే వున్నారు. ఇలాంటి సమయంలో మంగళవారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఎన్నదగినది. హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 ప్రకారం తండ్రి ఆస్తిలో మగ పిల్లలతోపాటు ఆడపిల్లలకు కూడా సమాన వాటా రావాల్సిందేనని, ఇందుకు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. 1956నాటి హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం ఆమెకు పుట్టుకతోనే తన సోదరుడితో సమానంగా వారసత్వ హక్కు వస్తుందని తెలిపింది. 1937లో వలస పాలకులు తీసుకొచ్చిన చట్టం తొలిసారి హిందూ మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది. అంతకుముందైతే పెళ్లి సమయంలో అందించే కానుకలు మాత్రమే ఆమెకు చెందేవి. అవి స్త్రీ ధనంగా దక్కేవి.

ఆ చట్టం భర్త మరణించిన పక్షంలో అతని ఆస్తిని అనుభవించే హక్కు భార్యకు కల్పించింది. కానీ దాన్ని అమ్ముకునే హక్కు ఇవ్వలేదు. 1937నాటి చట్టాన్ని సవరిస్తూ, దాన్ని మరింత సమగ్రంగా మారుస్తూ 1956లో హిందూ వారసత్వ చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టం కూడా మహిళలను సంపూర్ణమైన హక్కుదారు లుగా గుర్తించలేదు. 1986లో స్వర్గీయ ఎన్‌టీ రామారావు తీసుకొచ్చిన సవరణ చట్టం ఈ విష యంలో ఎంతో ప్రగతిశీలమైనది. తండ్రి ఆస్తిలో మగపిల్లలతోపాటు ఆడపిల్లలకు కూడా పుట్టుకతోనే సమాన హక్కు వుండేలా దీన్ని రూపొందించారు. తండ్రి ఆస్తిలో పిల్లలందరికీ సమాన హక్కు కల్పించడం, తాతల ఆస్తిపాస్తుల్లో కూడా మనవలు, మనవరాళ్లకు సమానహక్కులివ్వడం ఈ చట్టం సారాంశం. భర్త మరణించిన స్త్రీ అతనికి వారసత్వంగా వచ్చే ఆస్తిని సైతం పొందే హక్కు సైతం దీనిద్వారా లభించింది.  ఇరుగు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ వగైరాలు అనంతర కాలంలో ఈ మాదిరే  సవరణ చట్టం తీసుకొచ్చాయి. దేశమంతా అమలయ్యేవిధంగా చట్టం తీసుకు రావడానికి మరో ఇరవై ఏళ్లు పట్టింది. 1956 నాటి వారసత్వ చట్టాన్ని యూపీఏ హయాంలో 2005లో సవరించారు.

మహిళలపై వివక్ష మన దేశానికే పరిమితమైన జాడ్యం కాదు. అది హెచ్చుతగ్గులతో ప్రపంచ దేశాలన్నిటా కొనసాగుతోంది. కానీ ‘ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో, పూజిస్తారో అక్కడ దేవతలు నడయాడతార’ని కీర్తించే మన దేశంలో కూడా ఆ వివక్ష భిన్న రూపాల్లో కొనసాగుతోంది. మహిళ లను గౌరవించడం, పూజించడం కాదు... తోటి మనిషిగా గుర్తించి, వారికి పురుషులతో సమానంగా అన్ని హక్కులూ కల్పించి ఆదరించడం ముఖ్యమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చాటారు.  హిందూ కోడ్‌ బిల్లు రూపొందించడానికి, దాన్ని చట్టంగా మార్చడానికి ఆయన చేసిన పోరాటం అసామాన్యమైనది.  ఆస్తి అంటే కుటుంబంలో అబ్బాయిలకు మాత్రమే దక్కేదన్న అభి ప్రాయం ప్రబలంగా వున్న రోజుల్లో ఆడపిల్లలకు ఆ హక్కు కల్పించాల్సిందేనని అందరినీ ఒప్పించ డానికి ప్రయత్నించింది ఆయనే. చిత్రమేమంటే ఆయన ఎంత పట్టుబట్టినా అది సాకారం కావడానికి దాదాపు పదేళ్లు పట్టింది. మహిళలకు సమాన హక్కుల కోసం ఆయన ఎంత ఆత్రుత ప్రదర్శించా రంటే... 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభిస్తే నవంబర్‌కల్లా కేంద్ర న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్‌ ముసాయిదా బిల్లును ఆయన రూపొందించారు.

ఆ తర్వాత అది సెలెక్ట్‌ కమిటీ మెట్లెక్కింది. దానిపై 1949 ఫిబ్రవరి నుంచి ఆ ఏడాది డిసెంబర్‌ వరకూ సెలెక్ట్‌ కమిటీలో చర్చ సాగిందంటే దానికి ఎదురైన అడ్డంకులు ఏ స్థాయిలో వున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఆ బిల్లు అన్ని పార్టీల్లోని సంప్రదాయవాదులనూ కలవరపరిచింది. వారిలో ఆగ్రహావేశాలు రగిల్చింది. కనుకనే 1951 ఫిబ్రవరిలో డాక్టర్‌ అంబేడ్కర్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లు కాస్తా అర్థంత రంగా నిలిచిపోయింది. తన కేబినెట్‌ సహచరుల్లో అనేకమంది ఆ బిల్లుకు ససేమిరా అనడంతోనే నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ దాన్ని ఆపేశారు. ఇందుకు నిరసనగా డాక్టర్‌ అంబేడ్కర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. 1955–56 మధ్య హిందూ కోడ్‌ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వచ్చిన నాలుగు చట్టాల్లో హిందూ వారసత్వ చట్టం కూడా ఒకటి. హిందూ వివాహ చట్టం, హిందూ దత్తత, నిర్వహణ చట్టం, హిందూ మైనారిటీ, సంరక్షణ చట్టం వగైరాలు మిగిలినవి. 

అయితే చట్టాలు చేయగానే సరిపోదు. అవి విస్పష్టంగా చెప్పకపోతే, అమలులో రాగల చిక్కు ముడులను ఊహించి అందుకు అనుగుణంగా రూపొందించకపోతే అడుగడుగునా ఆటంకాలు తప్పవు. 2005నాటి హిందూ వారసత్వ సవరణ చట్టానికి జరిగింది అదే. ఆ చట్టంపై దేశంలోని వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు కాగా, కొన్ని హైకోర్టులు వేర్వేరు భాష్యాలు చెప్పాయి. మరికొన్నిచోట్ల ఇంకా పెండింగ్‌లో వున్నాయి. 2005నాటి హిందూ వారసత్వ చట్టం వెనకటి తేదీ నుంచి వర్తిస్తుందని, ఈ విషయంలో వేరే అభిప్రాయానికి తావులేదని తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చింది. ఆస్తుల ప్రస్తావన అవసరం రానప్పుడు, సంబంధాలు సజావుగా సాగుతు న్నప్పుడు వారసుల మధ్య ఆస్తి తగాదాలుండవు. మానవ సంబంధాలన్నీ సారాంశంలో ఆర్థిక సంబంధాలే అన్నాడు కారల్‌ మార్క్స్‌. కనుక ఆస్తులుంటే, వాటి విషయంలో మరణించినవారు స్పష్టంగా రాసిపెట్టి వెళ్లకపోతే తగాదాలు, చిక్కుముడులు తప్పవు. జరగకూడనిది జరిగి, అంతా గల్లంతయ్యాక ‘ఇలా అవుతుందనుకోలేదు, ఇప్పుడు దిక్కులేనివాళ్లమయ్యామ’ని ఏ మహిళా ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుకోవడానికి అవకాశం లేని విధంగా సుప్రీంకోర్టు తాజా తీర్పు వుంది. ఇది మహిళల వారసత్వ హక్కుకు మరింత భద్రత కల్పించింది.

మరిన్ని వార్తలు