చరిత్రాత్మకమైన తీర్పు

8 Apr, 2023 00:36 IST|Sakshi

న్యాయం చేయటం మాత్రమే కాదు, అలా చేస్తున్నట్టు కనబడటం కూడా ముఖ్యం అంటారు. ‘మీడియా వన్‌’ కేసులో సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పు ఈ సహజ న్యాయసూత్ర ప్రాధాన్యతనూ, దాపరికం లేని న్యాయవ్యవస్థ ఆవకశ్యతనూ నిర్మొహమాటంగా తెలియజేసింది. అంతేకాదు, ఈమధ్యకాలంలో ‘జాతీయ భద్రత’ను అడ్డం పెట్టుకునే పోకడలను నిశితంగా విమ ర్శించింది. ‘మీడియా వన్‌’ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే ఆ కేసు నిజానికి ఇంత దూరం రావా ల్సిన అవసరం లేదని సులభంగానే అర్థమవుతుంది. దేశ భద్రతకు ముప్పు కలుగుతుందన్న ఆరోపణతో కేరళలోని ‘మీడియా వన్‌’ చానెల్‌ ప్రసారాల కొనసాగింపునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది.

దేశభద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవటానికీ, ప్రజల ప్రాణాలు కాపాడటానికీ ప్రభుత్వాలకు సర్వాధికారాలూ ఉంటాయి. ఆ విషయంలో రెండో మాటకు తావులేదు. కానీ అందుకు సహేతుక కారణాలను చూపటం ముఖ్యం. అలా కారణాలు చూపటంవల్ల వ్యక్తులు లేదా సంస్థలు లబ్ధి పొందుతాయా లేదా అన్నది ప్రధానం కాదు. ప్రజా స్వామ్యం నాలుగు కాలాలపాటు మనుగడ సాగించాలంటే ఇది ముఖ్యం. ఇలా చేయటంవల్ల దేశ ప్రజల్లో చట్టబద్ధ పాలనపై విశ్వసనీయత ఏర్పడుతుంది. పాలన పారదర్శకంగా సాగుతున్నదనీ, జవాబుదారీతనం అమల్లో ఉన్నదనీ భరోసా కలుగుతుంది. 

కారణాలేమైనా గానీ ఇటీవలి కాలంలో కొన్ని కేసుల విషయంలో తన వాదనలకు మద్దతుగాకేంద్రం కొన్ని పత్రాలను సీల్డ్‌ కవర్‌లో అందజేయటం, న్యాయస్థానాలు ఆ ధోరణిని అంగీకరించటం కనబడుతుంది. ఇందుకు రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం, అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు తదితరాలు మొదలుకొని భీమా కోరెగావ్‌ కేసు వరకూ ఎన్నిటినో ఉదహరించవచ్చు. ఆఖరికి ఇదెంత వరకూ వచ్చిందంటే సీల్డ్‌ కవర్‌ అందజేయటం న్యాయవ్యవస్థలో ఒక సాధారణ విషయంగా మారింది. ఇందువల్ల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకూ, సంస్థలకూ నష్టం జరుగుతుంది. తమపై ఉన్న ఆరోపణలేమిటో, వాటికిగల ఆధారాలేమిటో తెలియకపోతే ఏ ప్రాతిపదికన వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించాలి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా? నేరం రుజువయ్యేవరకూ ఎవరినైనా నిరపరాధులుగా పరిగణించాలన్నది అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలూ అనుసరించే విధానం. దానికి సీల్డ్‌ కవర్‌ పద్ధతి గండికొడుతోంది.

అంతేకాదు, నిందితులకు అన్యాయం జరుగుతున్నదన్న భావన కలిగి ప్రజల్లో వారిపట్ల సానుభూతి ఏర్పడుతోంది. ‘మీడియా వన్‌’ కేసు విషయానికొస్తే ఆ సంస్థ ప్రసారాలను ఎందుకు నిలిపేయాల్సివచ్చిందో కేంద్రం చెప్పదు. హైకోర్టుకు పోతే అక్కడ ధర్మాసనం తనకు సమర్పించిన సీల్డ్‌ కవర్‌లో ఆ ఆరోపణలేమిటో చూస్తుంది. వీటిపై మీ వాదనేమిటని కక్షిదారును ప్రశ్నించదు. పైగా ఆ సీల్డ్‌ కవర్‌ సమాచారం ఆధారంగా తీర్పు వెలువడుతుంది. సింగిల్‌ బెంచ్‌ ముందూ, డివిజన్‌ బెంచ్‌ ముందూ కూడా ‘మీడియా వన్‌’కు ఇదే అనుభవం ఎదురైంది. అయితే అసలు న్యాయస్థానాలు సీల్డ్‌ కవర్‌ను అంగీకరించే ధోరణి గతంలో లేనేలేదని చెప్పలేం. ప్రభుత్వోద్యోగుల సర్వీసు, పదోన్నతుల వ్యవహారాల్లో సంబంధిత అధికారుల ప్రతిష్ట కాపాడేందుకు... లైంగిక దాడుల కేసుల్లో బాధితుల గుర్తింపు రహస్యంగా ఉంచటానికి సీల్డ్‌ కవర్‌లో వివరాలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఆఖరికి రాఫెల్‌ యుద్ధ విమానాల కేసులో సాంకేతిక అంశాలు వెల్లడిస్తే శత్రు దేశాలకు ఉప్పందించినట్టవుతుందని చెప్పటం వరకూ అంగీకరించవచ్చు.

కానీ బీసీసీఐ విషయంలో తానే నియమించిన కమిటీ నివేదికనూ, గుజరాత్‌కు సంబంధించిన నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసు, అయోధ్య స్థల దస్తావేజు కేసువంటి అంశాల్లో సైతం గోప్యత పాటించాలని ప్రభుత్వం చేసిన వినతిని న్యాయస్థానాలు అంగీకరించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2013లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ స్థితి ఏర్పడింది. అయితే తాజా తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టు బ్రిటన్, కెనడా సుప్రీంకోర్టులు ఈ విషయంలో ఎన్నదగిన తీర్పులు వెలువరించాయి. కేసులకు సంబంధించిన సమాచారాన్ని దాచివుంచటం వల్ల ఆ కేసుల గురించి చర్చించుకోవటం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించటం ప్రజలకు నిరాకరించినట్టే అవుతుందని అక్కడి న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. 

‘మీడియా వన్‌’ కేసులో జాతీయ భద్రతను సాకుగా చూపిన కేంద్రం దాన్ని సమర్థించుకునేందుకు సీల్డ్‌ కవర్‌లో ప్రస్తావించిన కారణాలు పేలవంగా ఉన్నాయి. అందుకే గాల్లోంచి ఆరోపణలు సృష్టిస్తే అంగీకరించబోమని ధర్మాసనం వ్యాఖ్యానించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి కేసుల విష యంలో న్యాయస్థానాలు అనుసరించాల్సిన రెండు గీటురాళ్లను కూడా ప్రకటించింది. కేసులోని అంశాలు వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు కలుగుతుందని భావించటానికి అవసరమైన సమా చారం ప్రభుత్వం అందించిందా లేదా అన్నది అందులో మొదటిది. వివేకవంతులైన వ్యక్తులు సైతం ఆ సమాచారం ఆధారంగా అలాగే భావించే అవకాశం ఉన్నదా లేదా అన్నది రెండోది. భావప్రకటనా స్వేచ్ఛకు పూచీపడే రాజ్యాంగంలోని 19వ అధికరణలోనే ఏయే అంశాల్లో నియంత్రణలు అమలు చేయవచ్చో వివరంగా ఉంది. వాటిని బేఖాతరు చేసి నచ్చని అభిప్రాయాలు ప్రకటించారన్న ఏకైక కారణంతో ఆ స్వేచ్ఛకు గండికొట్టడం రాజ్యాంగస్ఫూర్తిని దెబ్బతీస్తుంది. అందుకే ‘మీడియా వన్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది.

మరిన్ని వార్తలు