IND vs PAK: ఆటా? మతవిద్వేషపు సయ్యాటా?

27 Oct, 2021 01:03 IST|Sakshi

ఓటమి... ఎప్పుడూ అంత సులభంగా మింగుడుపడని అనుభవమే! అదీ... పచ్చగడ్డి మధ్యలో వేస్తే భగ్గుమనే దాయాది దేశం చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోవడం మరీ దారుణమైన అనుభవం. పాకిస్తాన్‌ జట్టుతో ఆదివారం రాత్రి దుబాయ్‌లో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవం అలాంటిదే. అది భారత జట్టుకూ, వీరాభిమానులకూ కొన్నేళ్ళపాటు వెంటాడే ఓ పీడకల. కానీ, ఆ పరాభవభారం కన్నా మించిన అవమానం భారత బౌలర్‌ మహమ్మద్‌ షమీకి ఎదురైంది.

మ్యాచ్‌లో 3.5 ఓవర్లలో 43 పరుగులిచ్చి, ఒక్క పాకిస్తాన్‌ వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయిన ఈ పేస్‌ బౌలర్‌ను ‘‘ద్రోహి’’ అంటూ సోషల్‌ మీడియాలో సోమవారం జరిగిన ట్రోలింగ్‌ అంతా ఇంతా కాదు. 31 ఏళ్ళ షమీ జాతీయతనూ, దేశభక్తినీ శంకిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా సహా అనేక వేదికల్లో వచ్చిన వందల కొద్దీ విద్వేషపూరిత వ్యాఖ్యలు ఆ ఆటగాడి మనస్సును ఇక జీవితాంతం వెంటాడనున్నాయి. భారత, పాక్‌ క్రికెట్‌ జట్ల పోరాటం ఎప్పుడూ ఆసక్తికరమే కానీ, కొందరు దానికి మతం రంగు పులమడం తీవ్ర ప్రమాదకరం. 

ఒక మతంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దేశానికి ద్రోహులే అనేంత బరి తెగింపు దేశభక్తి... ఆటను కూడా మతంతో ముడిపెడుతున్న కుహనా జాతీయవాద మూర్ఖత్వం... ఈ దేశ సామాజిక చట్రానికి చేస్తున్న లోతైన గాయం మానడం కష్టం. షమీని ఏకంగా భారత జట్టులో నుంచే తొలగించాలంటూ వెల్లువెత్తిన వాదనను క్రికెటర్లు, క్రీడాభిమానులు, రాజకీయ నేతలు ఖండించారు. అతనికి నైతికంగా అండగా నిలిచారు. అదే ఉన్నంతలో ఊరట.

ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా షమీ కొన్నేళ్ళుగా భారత జట్టులో అంతర్భాగం. 54 టెస్టుల్లో 195 వికెట్లు, 79 వన్డే మ్యాచ్‌లలో 148 వికెట్లు, 12 అంతర్జాతీయ టీ20లలో 12 వికెట్లు పడగొట్టిన అనుభవం, సామర్థ్యం ఈ పేస్‌ బౌలర్‌వి. అలాంటి నిబద్ధత కలిగిన ఆటగాడి వ్యక్తిత్వాన్ని ఒక్క మ్యాచ్‌ ఆధారంగా కించపరుస్తూ, అదీ మతానికి ముడిపెడుతూ మాట్లాడడం ఏ రకంగా సమంజసం? ఏ రకమైన సంస్కారం?

ఆట అంటేనే నైపుణ్యం. ఆ రోజు మైదానంలో ఎవరు బాగా ఆడితే, వారిదే గెలుపు. కొన్నిసార్లు అద్భుతంగా ఆడడం, మరికొన్నిసార్లు ఆశించినట్టు రాణించలేకపోవడం ఎవరికైనా సహజం. కానీ, దాన్ని దేశభక్తికి గీటురాయిగా పరిగణిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా కొందరు విషం చిమ్మిన ఈ ఆన్‌లైన్‌ విద్వేషం దిగ్భ్రాంతికరం.

భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ‘మేమూ ఓడిన సందర్భాలున్నాయి. మమ్మల్నెవరూ పాకిస్తాన్‌కు వెళ్ళిపొమ్మనలేదు’ అన్నారు. కొన్నేళ్ళలో దేశంలో అసహనం పెరుగుతోందనడానికి అది ప్రతీక. ఆ మాటకొస్తే, 2015లో అడిలైడ్‌లో జరిగిన భారత–పాక్‌ వరల్డ్‌కప్‌ వన్డేలో 35 పరుగులకే 4 వికెట్లు తీసి, భారత్‌కు 76 పరుగుల తేడాతో విజయం దక్కేలా చేసిన బౌలర్‌ షమీ. భారత్‌ను గెలిపించినప్పుడు అతని మతం గుర్తు రాలేదా? 

అంతెందుకు! భారత ఆటగాడిగా, సారథిగా గతంలో అనేక విజయాలందించిన అజరుద్దీన్‌ది ఏ మతం? పాక్‌పై గెలుపు తెచ్చిన వికెట్‌ కీపర్లు సయ్యద్‌ కిర్మాణీ, సాబా కరీమ్‌ సహా అనేకులు ఎవరు? హాకీలో మనకు పతకాలు, ప్రతిష్ఠ తెచ్చిన జాఫర్‌ ఇక్బాల్‌ను దూరం పెడదామా? జన్మతః పాక్‌ మూలాలు ఉన్నాయని సినీరత్నాలు రాజ్‌కపూర్, దిలీప్‌ కుమార్‌లను పగవాళ్ళంటామా? పాకిస్తాన్‌కే పోయి ఉండాల్సింది అందామా? ఈ మూర్ఖత్వంలో అబ్దుల్‌ కలామ్‌ లాంటి మహనీయులకీ మతం మకిలిని అంటగడదామా? అసలు ఫలానా మతమంటే పాకిస్తానీలేనా? ఎంత శోచనీయం!

మన హైదరాబాద్‌ నుంచి పాక్‌ వలసవెళ్ళిన కుటుంబానికి చెందిన యాసిఫ్‌ ఇక్బాల్‌ సారథ్యంలో 1980లలో పాక్‌ క్రికెట్‌ జట్టు భారత్‌లో పర్యటించింది. భారత గడ్డ మీది బంధుమిత్రుల్ని చూసి ఇక్బాల్‌ ఆనందిస్తే, భారత్‌ చేతిలో పాక్‌ ఓటమికి అతనే కారణమంటూ అతణ్ణి పాక్‌లోకి రానివ్వబోమన్న ఘటనలూ చూశాం. తటస్థ క్రికెట్‌ వేదిక షార్జా లాంటివి అవతరించడమూ గమనించాం. ‘దేశమును ప్రేమించుమన్నా’ అంటే పొరుగువారిని ద్వేషించుమన్నా అని అర్థం కాదు.

ఓ పాకిస్తానీ మంత్రి సైతం తమ జట్టు తాజా గెలుపు మత విజయమంటూ ప్రమాదకర వ్యాఖ్యలు చేశారు. ఆ భావన ఎవరు కలిగించినా అది ముమ్మూటికీ తప్పే. 29 ఏళ్ళ నిరీక్షణ ఫలించి, 12 వరుస ఓటముల తర్వాత 13వ సారి ఓ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో, ఏకంగా 8 మంది తొలి టీ20 వరల్డ్‌కప్‌ ఆటగాళ్ళతో సమష్టి కృషి వల్ల పాక్‌ జట్టు గెలిచింది. దేశాల మధ్య విద్వేషాలకు భిన్నంగా భారత కెప్టెన్‌ కోహ్లీ, మార్గదర్శకుడు ధోనీ క్రీడాస్ఫూర్తితో అభినందించడం, సంభాషించడం గమనార్హం. 

నిజానికి, బంగ్లాదేశ్‌ లాంటి కూనల చేతిలోనూ భారత జట్టు ఓడినప్పుడు రాని ఉక్రోషం, బయటపడని విద్వేషం, మత్సరం పాక్‌ చేతిలో ఓడినప్పుడే మనకు ఎందుకొస్తోంది? దీనిలో ఆటకు మించి దాగిన రాజకీయ, సాంస్కృతిక భావోద్వేగాలేమిటి? క్రీడను సైతం కురుక్షేత్రంగా భావించేలా యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంలో ప్రజలు, పాలకుల నుంచి మీడియా దాకా ఎవరి పాపం ఎంత? ఇవన్నీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశాలు.

ఒక మతంలో పుట్టిన పాపానికి ఈ దేశంలో అన్నిటికీ శీలపరీక్షకు నిలబెడుతూ, అగ్నిపునీతులుగా నిరూపించుకోవాలనడం అన్యాయం. అది సోదర భారతీయుణ్ణి అవమానించడమే కాదు, అనుక్షణం అనుమానించడం! అవమానాన్ని అయినా భరించవచ్చేమో కానీ, నిత్యం అనుమానాన్ని భరించడం కష్టమే! ఈ మతవిద్వేష క్రీడ శతాబ్దాల సహజీవనానికి పేరుపడ్డ మన సామరస్య సామాజిక వ్యవస్థకు తీరని ప్రమాదమే!!

>
మరిన్ని వార్తలు