అన్నాడీఎంకేలో సామరస్యత

9 Oct, 2020 08:09 IST|Sakshi

దీర్ఘకాలం రాజకీయరంగాన్ని ప్రభావితం చేసిన దిగ్గజ నాయకులు కనుమరుగైతే... ఆ వెలితిని పూడ్చేవారు కనుచూపు మేరలో కనబడకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో తమిళనాడు చాన్నాళ్లుగా నిరూపిస్తూనే వుంది. రాష్ట్ర రాజకీయాల సంగతలావుంచితే పాలకపక్షంగా వున్న అన్నా డీఎంకేలో ఒకరకమైన అనిశ్చితి చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఆ పార్టీలో ఒక వర్గానికి ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామి, రెండో వర్గానికి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీరుసెల్వం నేతృత్వంవహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసివున్న తరుణంలో ఈ అని శ్చితికి ముగింపు పలకాలని ఇరు వర్గాలూ ఒక అంగీకారానికొచ్చాయి.

బుధవారం కుదిరిన అవగా హన ప్రకారం వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ప్రస్తుత సీఎం పళనిస్వామే మళ్లీ సీఎం అవు తారు. అలాగే పన్నీరుసెల్వం ఆధ్వర్యంలో పార్టీ సారథ్యబాధ్యతలను చూడటానికి ఒక స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ కోసం పన్నీరుసెల్వం కొంతకాలంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వమూ, పార్టీ తన చెప్పుచేతల్లో వుండాలన్నది పళనిస్వామి నిశ్చితాభిప్రాయం. ఈసారి తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలని, అది కుదరకపోతే పార్టీ పగ్గాలైనా అప్పగించాలని పన్నీరుసెల్వం కోరుకుంటున్నారు. ఈ విషయంలో వచ్చిన విభేదాలు తీవ్రమై సమస్యలు మొదలయ్యాయి. ఎన్నిక లకు ఇంకా ఆరేడు నెలల వ్యవధి వున్న తరుణంలో ఇద్దరు నేతలూ రాజీపడి ఒక అంగీకారానికి రావడం ఆ పార్టీ శ్రేయస్సుకు మంచిదే.
(చదవండి: అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి పళని)

ఎంజీఆర్‌ మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీకి పెద్ద దిక్కుగా వుంటూ వచ్చిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబర్‌లో చనిపోయాక ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ద్వితీయ శ్రేణి నాయకుడో, నాయకురాలో లేకపోవడంతో సీఎం పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. జయ ఆప్తురాలిగా వున్న వి.కె. శశికళ ఆమె బాటలోనే పన్నీరు సెల్వంను మరోసారి ఆ పదవిలో కూర్చోబెట్టారు. కానీ మరో రెండు నెలలకు తానే సీఎం కావాలనుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా నిర్ణయించుకున్నాక అదంతా బెడిసికొట్టి పదవి రావడం మాట అటుంచి ఆమెకు అవినీతి కేసులో శిక్షపడింది.

ఈలోగా పన్నీరుసెల్వం తన మద్దతుదార్లతో వేరే కుంపటి పెట్టుకున్నారు. చివరకు శశికళ పళనిస్వామికి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. అయితే చాలా త్వరగానే పళనిస్వామి సైతం ఆమె నుంచి దూరం జరిగారు. బీజేపీ నాయకగణం మధ్య వర్తిత్వం ఫలితంగా అన్నాడీఎంకేలోని పన్నీరుసెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమై అప్పటినుంచీ బండి లాగిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక్క ఎంజీఆర్‌ హయాంలో తప్ప ఎప్పుడూ ఒకే పార్టీ వరసగా మూడోసారి అధికారంలోకొచ్చిన దాఖలా లేదు. అలా చూస్తే అన్నాడీఎంకే కోటా అయిపోయినట్టే. ఆ పార్టీ అధికారంలో కొనసాగడం వరసగా ఇది రెండోసారి. ఇప్పుడు నేతలిద్దరి రాజీ ఫలితంగా ఆ పార్టీకి కొత్తగా జవసత్వాలొచ్చి మూడోసారి సైతం అధికారంలోకొచ్చి చరిత్రను తిరగరాస్తుందా అన్నది ఇంకా చూడాల్సివుంది. పై స్థాయిలో ఇద్దరి మధ్యా ఏర్పడ్డ సఖ్యత ప్రభావం కింది స్థాయి కేడర్‌ వరకూ వెళ్తే... పాలన సైతం జనరంజకంగా సాగితే అది అసాధ్యం కాకపోవచ్చు.

ప్రతిపక్షంతో పోలిస్తే అధికార పక్షానికి ఎప్పుడూ కొంత వెసులుబాటు వుంటుంది. ఏయే అంశాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి వుందో తెలుసుకుని, వాటిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడానికి... కొత్త విధానాలతో, పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి పాలకపక్షానికే అవకాశం వుంటుంది. పాలనకు సంబంధించి ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేకపోయినా గతంలోవలే కేంద్రంతో పోరాడి దేన్నయినా సాధించే తత్వం ప్రస్తుత పాలకుల్లో కొరవడిందన్న భావన ఏర్పడింది. నీట్‌ విషయంలో రాష్ట్రం గట్టిగా పోరాడితే బాగుండేదన్న అభిప్రాయం వుంది. నిరుడు చెన్నైలో ఏర్పడిన మంచినీటి కొరత కనీవినీ ఎరుగనిది. దానిపై చివరకు హాలీవుడ్‌ నటుడు లియనార్డో డి కాప్రియో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు అంతటా నిరుడు జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళన దక్షిణాదిలోనే అతి పెద్దది. సహజంగానే ఈ అంశంపై పాలక అన్నాడీఎంకే మాట్లాడలేకపోయింది. 

అన్నా డీఎంకే సమష్టిగా పోరాడటం ఒక ఎత్తయితే... విపక్షమైన డీఎంకే రూపంలో ఎదురయ్యే సవాలును ఎదుర్కొనడం మరో ఎత్తు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకే సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ ఏర్పాటుచేసి 39 స్థానాలకూ 38 సాధించుకుంది. పొరు గునున్న పాండిచ్చేరిలోని ఒకే ఒక స్థానం సైతం కూటమికొచ్చింది. అసెంబ్లీలోని 22 స్థానాలకు అంతక్రితం జరిగిన ఉప ఎన్నికల్లో 9 చోట్ల అన్నాడీఎంకే నెగ్గింది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే తుడిచి పెట్టుకుపోతుందని, తగిన మెజారిటీ లేక పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుందని భావించిన డీఎంకేకు ఇది షాక్‌. దాన్నుంచి త్వరలోనే కోలుకుని లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్‌ తన సత్తా చాట గలి గారు. అయితే నిరుడు అక్టోబర్‌లో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించి పళనిస్వామి పరువు నిలుపుకున్నారు.

సినీ నటుడు కమలహాసన్‌ ప్రారంభించిన మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడా నెగ్గకపోయినా తనకంటూ వోటు బ్యాంకు వుందని నిరూ పించుకుంది. మరో నటుడు రజనీకాంత్‌ పార్టీ ఇంకా కళ్లు తెరవలేదు. తమ పార్టీ అసెంబ్లీలోని 234 స్థానాలకూ పోటీ చేస్తుందని మాత్రం ప్రకటించారు. కాగా, శశికళ జైలుశిక్ష పూర్తిచేసుకుని డిసెం బర్‌లో రాబోతున్నారు. ఆమె ఎత్తుగడలేమిటో చూడాల్సివుంది. ప్రస్తుతం ఏ జాతీయ పార్టీ అయినా  అన్నాడీఎంకే, డీఎంకేల్లో ఏదో ఒకదానితో చెలిమి చేయడం తప్పనిసరి. ఇప్పుడు పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య ఏర్పడిన సామరస్యం ఫలితమేమిటో... కొత్త పార్టీల రాకతో డీఎంకేకు కలిగే లాభనష్టాలేమిటో, జాతీయ పార్టీల భవితవ్యమేమిటో రాగల అసెంబ్లీ ఎన్నికలు తేలుస్తాయి.

మరిన్ని వార్తలు