‘గురు’తర బాధ్యత

5 Sep, 2022 01:05 IST|Sakshi

గురువులను గౌరవించడం మన సంప్రదాయం. మన దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాల్లోనూ గురువులకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంది. ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లిన కాలంలో మొదలైన గురుకుల సంప్రదాయం, ఒకటి రెండు శతాబ్దాల కిందటి వరకు మన దేశంలో కొనసాగింది. ఆధునిక తెలుగు సాహితీవేత్తలలో సుప్రసిద్ధులైన తిరుపతి వేంకట కవులు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తదితరులు గురుకుల సంప్రదాయంలో చదువుకున్నవారే! అప్పటికి ఆధునిక పాఠశాలలు పుట్టుకొచ్చినా, బ్రిటిష్‌ హయాంలోనూ పలుచోట్ల గురుకులాలు కొనసాగేవి. ఆధునిక ప్రపంచంలో పరిస్థితులు మారాయి.

గురుకులాలు కనుమరుగైపోయి, ఆధునిక విద్యాసంస్థలు ఏర్పడ్డాయి. పల్లెల్లోని వీధి బడులు మొదలుకొని, పట్టణాలు, నగరాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల వరకు ఆధునిక పద్ధతుల్లోనే విద్యార్థులకు చదువులు చెబుతున్నాయి. గురుకులాల్లో గురుశిష్యుల అనుబంధం బలంగా ఉండేది. ప్రైవేటు విద్యాసంస్థల ధాటి మొదలవనంత కాలం ఉపాధ్యాయు లకు, విద్యార్థులకు మధ్య అనుబంధాలు బాగానే ఉండేవి. ప్రైవేటు విద్యాసంస్థల పుణ్యాన చదువులు అంగడి సరుకుల స్థాయికి చేరుకోవడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నడుమ వినియోగదారుకు, విక్రేతకు నడుమ ఉండే సంబంధానికి మించిన అనుబంధం ఏర్పడే అవకాశాలు దాదాపు మృగ్యంగా మారాయి. 

‘నేర్చుకునే శక్తి లోపించిన వాళ్లంతా బోధనలోకి వచ్చేస్తుంటారు’ అన్నాడు ఆస్కార్‌ వైల్డ్‌. మిడిమిడి జ్ఞానులైన కొందరు ఉపాధ్యాయుల గురించి ఆయన విసిరిన వ్యంగ్యాస్త్రం ఇది. ఇలాంటి బాపతు ఉపాధ్యాయులు ఇప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నారు. గురజాడ వారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఇందుకు ఒక ఉదాహరణ. గిరీశం లాంటి గురువుల శిక్షణలో విద్యార్థులు వెంకటేశం అంతటి మేధావులుగానే తయారవుతారు. ఎనిమిదో తరగతి దాటినా, మాతృభాషలో చిన్న చిన్న వాక్యాలను కూడా ధారాళంగా చదవలేని విద్యార్థులు పాతిక శాతం, కూడికలు తీసివేతల వంటి సామాన్యమైన లెక్కలు కూడా చేయలేని వాళ్లు దాదాపు అరవై శాతం మంది మన దేశంలో ఉన్నట్లు జాతీయ స్థాయి గణాంకాలు చెబుతున్నాయి. ఇదంతా ఎలాంటి గురువుల చలవో ఆలోచించుకోవాలి.

విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చాక కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ‘ఏం గురువులో ఏం చదువులో’ అనే నిస్పృహ రాదూ! గురువులకు మన సమాజంలో ఒకప్పుడు అత్యున్నత స్థానం ఉండేదనడానికి పురాణాల్లో ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాగని పురాణాల్లో కనిపించే గురువులంతా సచ్ఛీలురని కాదు. అర్జునుడిపై పక్షపాతంతో ఏకలవ్యుడి బొటనవేలిని గురుదక్షిణగా కోరిన ద్రోణాచార్యుల వంటి పక్షపాతబుద్ధులు గురువుల్లో నేటికీ ఉన్నారు. దండోపాయ ధురంధరులైన చండామార్కుల వంటి గురువులకూ నేడు లోటు లేదు. బోధనారంగానికే ఇలాంటి వారు తీరని కళంకాలు. రాజస్థాన్‌లో ఒక ఉపాధ్యాయుడు నీటికుండను తాకిన పాపానికి తొమ్మిదేళ్ల దళిత బాలుడిని చావగొట్టి పొట్టన పెట్టుకున్నాడు. స్వాతంత్య్ర అమృతోత్సవాలకు ముందురోజే వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఎందరినో కలచివేసింది. ఇలాంటి క్రూర ప్రవృత్తిగల వాళ్లను బోధనా రంగం నుంచి దూరంగా ఉంచేందుకు ప్రభుత్వాలే తగిన చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయుల ఎంపికలో అభ్యర్థుల విద్యార్హతలతో పాటు వారి మానసిక స్థితిగతులనూ పరిగణనలోకి తీసుకోవాలి. 

నానా స్వభావాలు గల మనుషులు ఉండే సమాజంలో ఉన్న గురువులు కూడా మనుషులే! మామూలు మనుషుల స్వభావాలకు భిన్నంగా గురువులు ఉంటారని ఆశిస్తే, అది అత్యాశే అవుతుంది. అయితే, గురువుల్లో నైతికత, విద్యాప్రావీణ్యం, బోధనానైపుణ్యం, నిష్పాక్షికత వంటి లక్షణాలను సమాజం ఆశిస్తుంది. ఇదివరకటి గురువుల్లో ఈ లక్షణాలు పుష్కలంగానే ఉండేవి. ఇప్పటి కాలంలో బొత్తిగా అరుదైపోయాయి. ‘బోధన అంతరించిపోయిన కళ కాదు, దాని పట్ల గౌరవమే అంతరించిపోయిన సంప్రదాయం’– అమెరికాలో స్థిరపడిన ఫ్రెంచి చరిత్రకారుడు జాక్వెస్‌ బార్జున్‌ అభిప్రాయం ఇది. ఝార్ఖండ్‌లో కొందరు విద్యార్థులు తమకు మార్కులు తక్కువ వేసి ఫెయిల్‌ చేశారంటూ ఉపాధ్యాయులను చెట్టుకు కట్టేసి చితక్కొట్టిన సంఘటన కలకలం రేపింది. ఇలాంటి సంఘటనలను గమనిస్తే, బార్జున్‌ మాటలు నిజమే కదా అనుకోకుండా ఉండలేం.

పరిస్థితులు ఎంత మారినా, నిబద్ధతతో చదువులు చెప్పే ఉపాధ్యాయులు ఇప్పటికీ లేకపోలేదు. అరుదుగా ఉండే అలాంటి ఉపాధ్యాయులతోనే విద్యార్థులు అనుబంధాన్ని పెంచుకుంటారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి రెండు రోజుల ముందు ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారుగా పనిచేస్తున్న రాజేశ్‌ థప్లియాల్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. తన బోధనతో విద్యార్థులను అంతగా ఆకట్టుకున్నాడాయన. విద్యార్థులంతా ఆయనను కన్నీళ్లతో వీడ్కోలు పలికిన దృశ్యాలు వార్తలకెక్కాయి. నూటికో కోటికో ఒక్కరుగా ఉండే ఇలాంటి ఉపాధ్యాయులే, బోధనా రంగంపై ఆశలు అడుగంటిపోకుండా కాపాడుతుంటారు. ‘ఉపాధ్యాయుడు తాను బోధించే అంశాన్ని విద్యార్థులకు సులభగ్రాహ్యం చేయాలే తప్ప కేవలం సమాచారాన్ని అందివ్వడానికే పరిమితం కారాదు’ అని అభిప్రాయపడ్డాడు సోవియట్‌ మానసిక శాస్త్రవేత్త లెవ్‌ ఎస్‌. వైగోత్‌స్కీ. సులభగ్రా హ్యంగా బోధించే ఉపాధ్యాయులను విద్యార్థులు ఎన్నటికీ మరచిపోలేరు. భావితరాలకు బలమైన పునాదులు వేసేది అలాంటి ఉపాధ్యాయులే! వాళ్లను కాపాడుకోవలసిన బాధ్యత సమాజానిదే!

మరిన్ని వార్తలు