Chat GPT Vs Bard: అంతర్జాలంలో ‘కృత్రిమ’ యుద్ధం

10 Feb, 2023 00:53 IST|Sakshi

సాంకేతిక యుద్ధం ఇది. కృత్రిమ మేధ(ఏఐ)తో అంతర్జాలంలో టెక్‌ దిగ్గజాల మధ్య వచ్చిపడ్డ పోటీ ఇది. సరికొత్త ఏఐ ఛాట్‌బోట్‌ విపణిలో సంచలనాత్మక సంగతులివి. మైక్రోసాఫ్ట్‌ భారీగా పెట్టుబడి పెట్టిన ‘ఓపెన్‌ ఏఐ’ సంస్థ సృష్టి ‘ఛాట్‌ జీపీటీ’దే నేటిదాకా హవా. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్‌ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్‌ తనదైన ఛాట్‌బోట్‌ ‘బార్డ్‌’ను తెస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కథ మలుపు తిరిగింది. మరోపక్క ఈ ఛాట్‌బోట్‌ టెక్నాలజీతోనే మరింత పదును తేలిన సెర్చ్‌ ఇంజన్‌గా మునుపటి తమ ‘బింగ్‌’ను ముందుకు తేనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. వెంటనే గూగుల్‌ సైతం సెర్చ్‌ ఇంజన్‌గా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొనేందుకు ఏఐ ఫీచర్లతో సై అంటోంది. వెరసి, అంతర్జాలంలో కృత్రిమ మేధ ఆధారంగా కనివిని ఎరుగని పోటాపోటీ వాతావరణం నెలకొంది.

కృత్రిమ మేధతో సాగే ఈ పనిముట్లతో మానవాళికి కలిగే మేలు, కీడులపై చర్చ ఊపందుకుంది. సంక్లిష్ట అంశాల్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పడానికి కృత్రిమమేధతో నడిచే ఈ ఛాట్‌బోట్స్‌ ఉపకరిస్తాయన్నది ప్రాథమిక ఆలోచన. గత ఏడాది నవంబర్‌లో వచ్చిన ‘ఛాట్‌ జీపీటీ’ అలా నూత్నపథగామి అయింది. 2 నెలల్లో 10 కోట్ల యూజర్లతో సంచలనమైంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో 375 మంది ఉద్యోగుల చిన్న స్టార్టప్‌ ‘ఓపెన్‌ ఏఐ’ 30 బిలియన్‌ డాలర్ల విలువైనదైంది. దీంతో,  పోటీగా ‘బార్డ్‌’ను తేవడంలో గూగుల్‌ తొందరపడక తప్పలేదు. నిజానికి, గూగుల్‌ బృందపు ఆరేళ్ళ శ్రమ ఫలితం ‘బార్డ్‌’. తద్వారా ప్రపంచ విజ్ఞానాన్ని సంభాషణల పద్ధతిలో జనానికి సులభంగా  అందిస్తామన్నది గూగుల్‌ మాట. తీరా ప్రయోగదశలో ‘బార్డ్‌’కు బాలారిష్టాలు తప్పలేదు.

గూగుల్‌ స్వీయ ప్రచార ప్రకటనలోనే ‘బార్డ్‌’ కొన్ని జవాబులు తప్పు చెప్పినట్టు ‘రాయిటర్స్‌’ వార్తాసంస్థ పట్టుకొనేసరికి గగ్గోలు మొదలైంది. ప్యారిస్‌లో ఆ సర్వీస్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే సంరంభానికి కొద్ది గంటల ముందే ఆ లోటుపాట్లు బయటపడ్డాయి. దీంతో ఒకపక్క మైక్రోసాఫ్ట్‌ షేర్ల ధరలు పెరిగితే, మరోపక్క గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేర్లు ఒక్క బుధవారమే 7.8 శాతం పడిపోయాయి. 100 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌ గురించి ‘బార్డ్‌’ తప్పు చెప్పడం ఒకరకంగా గూగుల్‌కు తలవంపులే. కాకపోతే, ఈ ఛాట్‌బోట్‌ సేవల్ని ఇంకా ప్రజా వినియోగానికి పెట్టలేదు గనక ఫరవాలేదు. అందు బాటులోకి తెచ్చే ముందు ప్రత్యేక పరీక్షకులతో క్షుణ్ణంగా పరీక్షలు జరిపిస్తామంటోంది గూగుల్‌. 

నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ సెర్చ్‌లో గూగుల్‌దే ఆధిపత్యం. ఏ సమాచారం కావాలన్నా ‘గూగులమ్మను అడుగు’ అనేది ఆధునిక జనశ్రుతి. ఈ ప్రాచుర్యంతో గూగుల్‌కు నిరుడు వాణిజ్య ప్రకటనల ద్వారా 100 బిలియన్‌ (10 వేల కోట్ల) డాలర్ల ఆదాయం వచ్చిపడింది. అయితే, ‘ఏఐ’ను ఆసరాగా చేసుకొని విజృంభిస్తున్న ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్‌తో గూగుల్‌ పీఠం కదులుతోంది. మైక్రోసాఫ్ట్‌ తమ సెర్చ్‌ ఇంజన్‌ ‘బింగ్‌’ను సైతం సరికొత్త ఫీచర్స్‌తో తీర్చిదిద్ది, గూగుల్‌కు గట్టి పోటీ ఇవ్వ నున్నట్టు ఈ వారమే యుద్ధభేరి మోగించింది. వెంటనే ఫిబ్రవరి 8న గూగుల్‌ సైతం జనరేటివ్‌ ఏఐ అనుసంధానిత ఫీచర్లతో తమ సెర్చ్‌ ఇంజన్‌ ఫలితాల్ని మెరుగుపరుస్తామని చెప్పాల్సి వచ్చింది. ‘బార్డ్‌’ను తెచ్చిన రెండ్రోజులకే గూగుల్‌ ఈ రెండో ప్రకటన చేయాల్సిరావడం గమనార్హం.

అంతర్జాలంలో పెరుగుతున్న పోటీకీ, టెక్‌ దిగ్గజాల పోరుకూ ఇది దర్పణం. ఆధునిక ఏఐ సాంకేతికత ఆవిర్భావం, పోటాపోటీ ఒక రకంగా మంచిదైతే, మరోరకంగా చెడ్డది. అనేక ఇతర సాంకేతిక విప్లవాల లానే దీనివల్లా కొత్త ఉద్యోగాలొస్తాయి. కొన్ని పాతవి పోతాయి. ఏఐతో ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారులు సహా అనేక అంశాల్లో మానవ సామర్థ్యం పెరగవచ్చు. తరగతిలో వేర్వేరు అవగాహన స్థాయుల్లో పది మంది ఉంటే, ఒకే పాఠం ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి అర్థమయ్యేలా అందించడం లాంటి మామూలు మేళ్ళు సరేసరి. అయితే, సంభాష ణాత్మక ఛాట్‌బోట్‌ సర్వీస్‌లు సమస్యలకు సమాధానాలివ్వడంతో పాటు సొంతంగా కథలు, కవితలు అల్లగలగడం సృజనాత్మకతకూ సవాలే. ఇలా సమాజాన్నే మార్చేసే సవాలక్ష అంశాలతో తలెత్తే నైతిక, సామాజిక, తాత్త్విక ప్రశ్నలెన్నో. మానవజాతి మేలుకు వాడాల్సినదాన్ని దుర్వినియోగం చేస్తేనే ప్రమాదం. దీనిపై ప్రపంచ వ్యాప్త పర్యవేక్షణ ఎలా అన్నది చూడాలి. సాక్షాత్తూ ‘ఛాట్‌ జీపీటీ’ సృష్టికర్తలే ప్రభుత్వాల నియంత్రణ కోరుకుంటూ ఉండడం గమనార్హం. 

వ్యాపార కార్యకలాపాలలో ఏఐ వ్యవస్థలను జొప్పించడానికీ, తద్వారా ఉద్యోగుల స్థానంలో అవే పనిచేయడానికీ చాలాకాలమే పట్టవచ్చు. ఈలోగా గ్రంథచౌర్యాలు, తప్పుడు పరిష్కారాలు తలెత్తే ప్రమాదమైతే ఉంది. అందుకే, అమెరికాలో కొన్ని స్కూళ్ళలో ఛాట్‌ జీపీటీని నిషేధించారు. అయితే, కాలప్రవాహంలో ఏ సాంకేతిక పురోగతినైనా స్వాగతించాల్సిందే. అడ్డుకోవాలని చూస్తే ఆగదు, అందువల్ల ప్రయోజనమూ లేదు. దశాబ్దాల క్రితం కంప్యూటర్‌ విషయంలో భయపడడం లాంటిదే ఇదీ. కానీ, జీవితంలో భాగమయ్యే కొత్త సాంకేతికత సక్రమంగా, బాధ్యతాయుతంగా వినియోగమయ్యేలా చూసుకోవాలి. విలువలకు తిలోదకాలివ్వకుండా అప్రమత్తం కావాలి. ఇప్పటికే సమాజంలో డిజిటల్‌ విభజనతో పెరిగిపోతున్న అసమానతలకు ఎలా అడ్డుకట్ట వేయాలో ఆలోచించాలి. యంత్రాన్ని సృష్టించిన మనిషికి, ఆ యాంత్రిక కృత్రిమ మేధే ప్రత్యామ్నాయం కావడం సమా జానికే సవాలన్నది నిజమే కానీ మనిషికి ఇవి మహత్తర క్షణాలు. టెక్నాలజీని మనిషి తీర్చిదిద్దితే, ఆ టెక్నాలజీయే మళ్ళీ మనిషిని తీర్చిదిద్దే కీలక ఘట్టం. వెల్కమ్‌ టు ది న్యూ ఏఐ వరల్డ్‌!

మరిన్ని వార్తలు