Cop27: ఉత్తమాటల ఊరేగింపు

22 Nov, 2022 01:06 IST|Sakshi

ఆచరణలో ఆశించిన పురోగతి లేనప్పుడు మాటల ఆర్భాటాల వల్ల ఉపయోగం ఏముంటుంది! ఈజిప్టులోని రేవుపట్నమైన షర్మ్‌ ఎల్‌–షేక్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) సారథ్యంలోని ‘పర్యా వరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 27వ సదస్సు’ (యుఎన్‌–కాప్‌–27) ఆదివారం ముగిశాక అదే భావన కలుగుతోంది. 2015 నాటి ప్యారిస్‌ ఒప్పందం కింద పెట్టుకున్న లక్ష్యాలపై వేగంగా ముందుకు నడిచేందుకు ప్రపంచ దేశాలు కలసి వస్తాయనుకుంటే అది జరగలేదు. అది ఈ ‘కాప్‌– 27’ వైఫల్యమే. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంపై స్పష్టమైన హామీ లభించక పోవడంతో సదస్సుతో అందివచ్చిన అవకాశం చేజారినట్టయింది. అలాగని అసలు శుభవార్తలేమీ లేవని కాదు. కాలుష్యకారక ధనిక దేశాల వల్ల పర్యావరణ మార్పులు తలెత్తి, ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్న అమాయకపు దేశాల కోసం ‘నష్టపరిహార నిధి’ విషయంలో గత ఏడాది ఓ అంగీకారం కుదిరింది. దానిపై ఈసారి ఒక అడుగు ముందుకు పడింది. అది ఈ సదస్సులో చెప్పుకోదగ్గ విజ యమే. వెరసి, కొద్దిగా తీపి, చాలావరకు చేదుల సమ్మిశ్రమంగా ముగిసిన సదస్సు ఇది. 

సదస్సు ఫలితాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది అందుకే! పుడమితల్లి ఇప్పటికీ ‘అత్యవసర గది’లోనే ఉంది. గ్రీన్‌హౌస్‌ వాయువులను తక్షణమే గణనీయంగా తగ్గించా ల్సిన అవసరాన్ని ‘కాప్‌ గుర్తించలేదు’ అన్నది ఆయన మాట. అదే భావన ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది. పారిశ్రామికీకరణ అనంతరం విపరీతంగా కర్బన ఉద్గారాలకు కారణమైన ధనిక దేశాలు ‘నష్టపరిహార నిధి’కి ఒప్పుకోవడం కూడా ఆషామాషీగా ఏమీ జరగలేదు. 134 వర్ధమాన దేశాల బృందమైన ‘జి–77’ ఈ అంశంపై కట్టుగా, గట్టిగా నిలబడడంతో అది సాధ్యమైంది. ఈ నిధి ఆలోచన కనీసం 3 దశాబ్దాల క్రితం నాటిది. ఇన్నాళ్ళకు అది పట్టాలెక్కుతోంది. దాన్నిబట్టి వాతావరణ మార్పులపై అర్థవంతమైన బాధ్యత తీసుకోవడానికి ధనిక దేశాలు ఇప్పటికీ అనిష్టంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. పైపెచ్చు, ‘వాతావరణ బాధ్యతల నాయకత్వం’ వర్ధమాన ప్రపంచమే చేపట్టాలన్న అభ్యర్థన దీనికి పరాకాష్ఠ. 

చిత్రమేమిటంటే – ఈ నష్టపరిహార నిధిని ఎలా ఆచరణలోకి తెస్తారన్న వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం! ఆ నిధిని ఎలా సమకూర్చాలి, ఎప్పటికి అమలులోకి తేవాలనేది పేర్కొనలేదు. వాటిని ఖరారు చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్టు సదస్సు తీర్మానంలో చెప్పారే తప్ప, దానికీ తుది గడువేదీ పెట్టకపోవడం విడ్డూరం. అంతేకాక, దీర్ఘకాలంగా తాము చేసిన వాతావరణ నష్టానికి బాధ్యత వహించడానికి ఇష్టపడని ధనిక దేశాలు వర్తమాన ఉద్గారాలపైనే దృష్టి పెట్టనున్నాయి. ఆ రకంగా వర్ధమాన దేశాలకు ఇది కూడా దెబ్బే. ఇక, పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేరకే భూతాపోన్నతిని నియంత్రించాలని చాలాకాలంగా ‘కాప్‌’లో చెప్పుకుంటున్న సంకల్పం. ఈసారీ అదే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే దశలవారీగా శిలాజ ఇంధన వినియోగాన్ని ఆపేయడం కీలకం. గ్లాస్గోలో జరిగిన గడచిన ‘కాప్‌–26’లోనే ఇష్టారాజ్యపు బొగ్గు వినియోగాన్ని దశలవారీగా ఆపేందుకు అంగీకరించారు. తీరా దానిపై ఇప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరనే లేదు.  

శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంపై భారత్‌ తన వాణి బలంగా వినిపిస్తూ వచ్చింది. పునరుద్ధరణీయ ఇంధనాల వైపు వెళతామంటూ మన దేశం ఇప్పటికే గణనీయమైన హామీలిచ్చింది. కాకపోతే, ఒక్క బొగ్గే కాకుండా చమురు, సహజ వాయువులను సైతం శిలాజ ఇంధనాల్లో చేర్చాలని పట్టుబట్టింది. చివరకు మన డిమాండ్‌ గురించి ఎలాంటి ప్రస్తావనా లేకుండానే ముసాయిదా ఒప్పందం జారీ అయింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తడంతో, యూరోపియన్‌ దేశాలు మళ్ళీ బొగ్గుపైనే ఆధారపడే విధానాలకు తిరిగొచ్చాయి. శిలాజ ఇంధన వినియోగ లాబీదే పైచేయిగా మారింది. ఇది చాలదన్నట్టు వచ్చే ఏడాది జరిగే ‘కాప్‌’ సదస్సుకు చమురు దేశమైన యూఏఈ అధ్యక్షత వహించనుంది. కాబట్టి, భూతాపోన్నతిని నియత్రించేలా ఉద్గారాలను తగ్గించడమనే లక్ష్యం కాస్తా చర్చల్లో కొట్టుకుపోయింది.

నవంబర్‌ 18కే ఈ సదస్సు ముగియాల్సి ఉంది. అయితే, పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరక సదస్సును మరో రోజు పొడిగించారు. కానీ, సాధించినదేమిటంటే ‘నిధి’ ఏర్పాటు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితి. ఆ మాటకొస్తే, ఒక్క కరోనా ఉద్ధృతి వేళ మినహా... 1995లో బెర్లిన్‌లోని ‘కాప్‌–1’ నుంచి ఈజిప్ట్‌లోని ఈ ఏటి ‘కాప్‌–27’ వరకు ఇన్నేళ్ళుగా కర్బన ఉద్గారాలు నిర్దయగా పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. మన నివాసాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ సదస్సులతో గణనీయ లాభాలుంటాయనే అత్యాశ లేకున్నా, తాజా ‘కాప్‌–27’ అంచనాలను అధఃపాతాళానికి తీసుకెళ్ళింది. నియంతృత్వ పాలనలోని దేశంలో, ప్రపంచంలోని అతి పెద్ద ప్లాస్టిక్‌ కాలుష్యకారక సంస్థ స్పాన్సర్‌గా, 600 మందికి పైగా శిలాజ ఇంధన సమర్థక ప్రతినిధులు హాజరైన సదస్సు – ఇలా ముగియడం ఆశ్చర్యమేమీ కాదు. ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో ఇదే అతి పెద్ద ఫ్లాప్‌ షో అన్న మాట వినిపిస్తున్నది అందుకే. ఈ పరిస్థితి మారాలి. ఏటేటా పాడిందే పాడుతూ, వివిధ దేశాధినేతల గ్రూప్‌ ఫోటోల హంగామాగా ‘కాప్‌’ మిగిలిపోతే కష్టం. వట్టి ఊకదంపుడు మాటల జాతరగా మారిపోతే మన ధరిత్రికి తీరని నష్టం. 

మరిన్ని వార్తలు