గార్సెటీ సాధించేదేమిటి?

18 Mar, 2023 01:11 IST|Sakshi

దౌత్యం గురించీ, దౌత్యవేత్తల గురించీ వ్యంగ్య వ్యాఖ్యలు ఎంతగా ప్రచారంలో ఉన్నా దేశాల మధ్య సంబంధాల్లో దౌత్యవేత్త పోషించే పాత్ర అత్యంత విలువైనది. అలా చూస్తే అమెరికా వంటి అగ్ర రాజ్యానికి మన దేశంలో గత 26 నెలలుగా పూర్తికాలం పనిచేసే రాయబారి లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని అవరోధాలూ అధిగమించి ఎరిక్‌ గార్సెటీ ఎట్టకేలకు ఈ పదవి స్వీకరించ బోతున్నారు. ఆయన విషయంలో సెనేట్‌లో అధికార, విపక్షాలమధ్య ఏకాభిప్రాయం కుదరక పోవటమే ఇంత జాప్యం చోటుచేసుకోవటానికి కారణం. సుదీర్ఘమైన ఈ ప్రక్రియ పొడవునా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పట్టుదలగా వ్యవహరించటం గార్సెటీకి కలిసొచ్చింది. స్వపక్షమైన డెమాక్రాటిక్‌ పార్టీనుంచి ముగ్గురు కట్టుదాటినా రిపబ్లికన్‌ పార్టీనుంచి ఏడుగురు ఆసరాగా నిలవడంతో 52–42 తేడాతో గార్సెటీ ఎంపిక ఆమోదం పొందింది.

బైడెన్‌ తన మొండిపట్టు ద్వారా సెనేట్‌కు ఒక సందేశం పంపారు. తన ఎంపిక ఆమోదం పొందేవరకూ ఎంతకాలమైనా ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచుతాన న్నది దాని సారాంశం. అమెరికాలో కీలక పదవుల ఎంపికంతా మనకు భిన్నం. అధికార పక్షం ఎంపిక చేసినవారిపై బహిరంగంగా చర్చ జరగటం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం కావటం సర్వసాధారణం. వచ్చిన ఆరోపణలకు అభ్యర్థి సంతృప్తికరంగా సమాధానాలివ్వలేకపోతే ఆ ఎంపిక వీగిపోతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా ఒకటే...రాయబారి అయినా ఒకటే. గార్సెటీపై వ్యక్తిగతంగా నేరుగా ఆరోపణలు లేవు. కానీ గతంలో ఒక పదవిలో ఉండగా తన సహాయకుడిగా ఉన్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు వచ్చినా దాన్ని ఆయన పట్టించుకోలేదన్నది ఆ ఆరోపణల సారాంశం. అప్పట్లో ఆ సంగతి తనకు తెలియనే తెలియదని గార్సెటీ వివరణనిచ్చారు. ఆయన గతంలో లాస్‌ ఏంజెలిస్‌ మేయర్‌గా పనిచేశారు. 

ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో రాగల రోజులు దౌత్యపరంగా ఎంతో కీలకమైనవి. చైనాను కట్టడి చేయటం కోసం అమెరికా రూపకల్పన చేసిన ఇండో పసిఫిక్‌ దేశాల కూటమి క్వాడ్‌లో మన పాత్ర ప్రధానమైనది. ఒకపక్క ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. అక్కడ ఏ క్షణంలో ఏమవుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూఉంది. రష్యానుంచి ముడి చమురుతోసహా దేన్నీ కొనుగోలు చేయొద్దని అమెరికా కోరినా మన దేశం దాన్ని పాటించటం లేదు. దీర్ఘకాల మిత్రదేశమైన రష్యాను కాదనటం మనకంత సులభమేమీ కాదు. రష్యాను ఆర్థికంగా కట్టడి చేయాలన్న అమెరికాకు ఇది మింగుడుపడటం లేదు. భారత్‌ను తన దారికి తెచ్చుకోవటం ఎలాగన్నదే దాని ఆత్రుత. గార్సెటీ రాయబారిగా ఉంటే ఇది సులభమవుతుందని ఆ దేశం భావిస్తోంది. అదీగాక ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటించబోతున్నారు. అలాగే సెప్టెంబర్‌లో ఇక్కడ జరగబోయే జీ–20 శిఖరాగ్ర సదస్సుకు బైడెన్‌ హాజరవుతున్నారు. ఇలాంటి తరుణంలో రాయబారి పదవి ఖాళీగా ఉండటం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. వాస్తవానికి గార్సెటీకి దౌత్యరంగంలో పెద్దగా అనుభవం, నిపుణత లేవు. భారత్‌ వంటి కీలక దేశానికి అటువంటి వ్యక్తిని పంపటం సరైందికాదన్న విమర్శలు రిపబ్లికన్‌ శిబిరం నుంచి వినిపించాయి. అయితే బైడెన్‌కు ఆయన అత్యంత విశ్వసనీయుడు. ఉపాధ్యక్ష పదవికి పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంపిక చేసిన కమిటీకి నేతృత్వంవహించింది గార్సెటీయే. ఆ ఎంపిక అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ ఘన విజయం సాధించటానికి బాటలు పరిచిందని చెప్పాలి. 

రాయబారిగా తన ప్రాధాన్యతలేమిటో 2021 డిసెంబర్‌లోనే సెనేట్‌ ముందు గార్సెటీ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా భద్రతకూ, కలిమికీ భారత్‌ తోడ్పాటు ఎంతో అవసరమని, దాన్ని తాను సాధించగలనని హామీ ఇచ్చారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండాలన్న అమెరికా భావనతో భారత్‌కు ఏకీభావం ఉన్నదని, ఈ విషయంలో ద్వైపాక్షిక సంబంధాలు దృఢతరం కావటానికి అవసరమైన చొరవ తీసుకుంటానని గార్సెటీ వివరించారు. అలాగే భారత్‌కు బలమైన పొరుగుదేశంనుంచి ముప్పు ఉన్నందున దానికి అమెరికా అండగా నిలవటం ముఖ్యమని, ఈ విషయంలో తాను గట్టిగా కృషి చేస్తానన్నారు. పైగా 1990లో భారత్‌ పర్యటన తర్వాత హిందీ, ఉర్దూ అధ్యయనం చేయటం, ఇక్కడి సాంస్కృతిక, మత సంబంధ చరిత్ర గురించిన అవగాహన పెంచుకోవటం గార్సెటీకి అనుకూలాంశాలు. అమెరికాలో 40 లక్షలమంది భారతీయు లున్నారు. రెండు లక్షలమంది అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు.

మరిన్ని లక్షల మంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రజల మధ్యా సాన్నిహిత్యం అవసరమని, దాన్ని తాను సాధించగలనని హామీ ఇచ్చారు. వీటితోపాటు మానవహక్కుల్ని గౌరవించటం, పటిష్ట ప్రజాస్వామిక సంస్థలు ఇరు దేశాల సంబంధాల్లో కీలకాంశాలని, భారత్‌తో వీటిపై తరచు చర్చిస్తానని కూడా చెప్పారు. ఇది సహజంగానే వివాదాస్పదం కావొచ్చు. ఈ పరిధిలోకి వచ్చే అంశాలేమిటో ఆయన చెప్పకపోయినా 370వ అధికరణ, నిఘా సంస్థల వ్యవహార శైలివంటివి అందులో భాగం కావొచ్చునన్న అనుమానాలున్నాయి. అదే జరిగితే మోదీ సర్కారు మౌనంగా ఏమీ ఉండకపోవచ్చు. కనుక బాధ్యతల నిర్వహణ గార్సెటీకి అంత సులభమేమీ కాదనే చెప్పాలి. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి మన దేశానికి రాయబారిగా రావటం శుభసూచకం. ఇప్పుడున్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థితికి చేరుకోవటానికి దోహద పడగల పరిణామం. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు