ఇది ప్రకృతి పొలికేక

21 Oct, 2021 00:04 IST|Sakshi

ప్రకృతి కోపిస్తోంది. ఆకాశానికి హఠాత్తుగా చిల్లులు పడ్డాయనిపిస్తోంది. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వంతెనలు విరిగిపడుతున్నాయి. ఆనకట్టలు గేట్లెత్తేస్తున్నాయి. అపారమైన ఆస్తి, ప్రాణనష్టం. కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్, కేరళల్లో పరిస్థితి ఇదే! అనేక ఆలయాలు, తీర్థయాత్రా స్థలాలతో ‘దేవభూమి’గా పేరుపడ్డది– ఉత్తరాఖండ్‌.

నిత్యం పర్యాటకులతో ‘దేవతల సొంత గడ్డ’గా పేరొందింది–కేరళ. రెండు రాష్ట్రాల్లో తాజా ఉత్పాతాలు చూస్తుంటే దేవతగా కొలుచుకొనే ప్రకృతి మళ్ళీ మళ్ళీ ఏదో చెప్పదలుచుకుందని అనిపిస్తోంది. అభివృద్ధి పేరిట సహజ నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు, కర్బన ఉద్గారాలతో పర్యావరణ హాని, ఫలితంగా అనూహ్య వాతావరణ మార్పులు– అన్నీ మన తప్పును ఎత్తిచూపుతున్నాయి. చార్‌ధామ్, శబరిమల యాత్రలకు బ్రేకులేస్తూ, హెచ్చరిస్తున్నాయి. మానవాళి పాపానికి ప్రకృతి శాపం అనిపిస్తున్నాయి. 

వర్షాకాలం దాదాపు ముగిసినా, అనేక ప్రాంతాలను ఇప్పటికీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాతావరణం మారిపోతోంది. గత నెలాఖరుకే వెళ్ళిపోవాల్సిన నైరుతి ఋతుపవనాలు ఇంకా ఉన్నాయి. ఈ నెల మొదటే రావాల్సిన ఈశాన్య ఋతుపవనాలు ఇంకా రానేలేదు. ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, కేరళ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, వెస్ట్‌ బెంగాల్, రాజస్థాన్‌లలో ఇటీవల దంచికొట్టిన వర్షాలే అందుకు ఉదాహరణ. అక్టోబర్‌ 18న 24 గంటల్లో అనేక దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత (87.9 మి.మీ) వర్షం ఢిల్లీలో కురవడం గమనార్హం.

1956 తర్వాత (అప్పట్లో 111 మి.మీ) ఢిల్లీలో ఒక్క రోజులో ఇంత వర్షం ఇదే ప్రథమం. ఒడిశాలోని బాలాసోర్, తమిళనాట కోయంబత్తూరుల్లోనూ ఈ వారం ఇలాంటి పరిస్థితే. సాధారణంగా మన దేశంలో పడమటి కనుమలు, ఈశాన్య, మధ్య భారతావనిలో అధికంగా వర్షాలు కురుస్తాయి. కానీ కొన్నేళ్ళుగా అతి తక్కువ సమయంలో అధిక వర్షపాతం, ఆకస్మిక భారీ వర్షాలు తరచూ సంభవిస్తున్నాయి. కేరళ సహా అనేక రాష్ట్రాల్లో వర్షాలు పడే తీరు మారింది. ఇది ఆలోచించాల్సిన విషయం. 

ఈ నెల 12 నుంచి ముంచెత్తుతున్న వాన, మెరుపు వరదల్లో కేరళలో 42 మంది, పర్వతప్రాంత ఉత్తరాఖండ్‌లో 52 మంది బలయ్యారు. కోట్లలో ఆస్తి నష్టం. సాధారణంగా అక్టోబర్‌ 1 – 19 మధ్య కేరళలో 192.7 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. ఈశాన్య ఋతుపవనాల కాలమైన అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు అంతా కలిపినా సగటున 491.6 మి.మీ. వర్షమే కురవడం ఆనవాయితీ. కానీ, ఈసారి కేవలం ఈ 19 రోజుల్లోనే 453.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అంటే, మామూలు కన్నా 135 శాతం ఎక్కువ వర్షం కురిసిందన్న మాట. మూడు నెలల సీజన్‌ మొత్తంలో కురవాల్సినదానిలో 90 శాతం ఈ కొద్దిరోజుల్లో ఇప్పటికే కురిసేసింది. దీన్నిబట్టి వర్ష తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 

ఈ కుండపోత ఇంతటితో ఆగేలా లేదు. రాగల రోజుల్లో పడమటి కనుమల్లో, తూర్పు కొండల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవట. కేరళలోని మొత్తం 14 జిల్లాలకు గాను 11 జిల్లాలకు ఎల్లో ఎలర్ట్‌ ఇచ్చారు. ప్రభుత్వం అప్రమత్తమై, కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న తూర్పు కొండల్లో జనావాసాలను ఖాళీ చేయిస్తోంది. ఈ శతాబ్దంలో ఎన్నడూ లేనంతటి వరదతో 2018లో కేరళలో కనీసం 400 మంది చనిపోయారు. పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అది ఇప్పటికీ మర్చిపోలేని విషాదం. వర్షజల ప్రవాహానికి 44 నదులున్నా, 2019లోనూ వరదలొచ్చిన చరిత్ర ఆ రాష్ట్రానిది. ఇక, ఈ జూలైలోనే ఉత్తరాదినీ, పశ్చిమ భారత తీరప్రాంతాలనూ వరదలు వణికించాయి.   

తరచూ ముంచెత్తుతున్న వరదలను సమర్థంగా ఎదుర్కోవడంలో సొంత వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. నదీ పరివాహకాల్లో, పర్వతప్రాంతాల్లో నివాసం కేరళ, ఉత్తరాఖండ్‌ లాంటి చోట్ల ఎక్కువ. కేరళ ‘రూమ్‌ ఫర్‌ రివర్‌’ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించింది. వరద ముప్పున్న ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పిస్తూ, వరద నీటిని నిర్వహించే ఈ తరహా ప్రాజెక్టును నెదర్లాండ్స్‌ అమలు చేస్తోంది. 2019 మేలో ఆ దేశాన్ని సందర్శించిన కేరళ సీఎం అదే ఫక్కీలో చర్యలు చేపడతామన్నారు. ఆ ప్రాజెక్టునూ, ‘రీబిల్డ్‌ కేరళ’నూ అమలు చేయడంలో సర్కారు విఫలమైందని ప్రతిపక్షాల ఆరోపణ. వర్షాలు, వరదలు దేశానికి కొత్త కాదు. కానీ, ఇంత తరచుగా రావడం వెనుక మానవ తప్పిదాలు అనేకం.

హిమాలయాల నుంచి పడమటి కనుమల దాకా ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే అసలు సమస్య. పర్యావరణ సంక్షోభంపై శాస్త్రీయసాక్ష్యాలను పట్టించుకోవడం లేదు. ప్రకృతికి హానికరంగా కొండలు, గుట్టల తవ్వకాలు, అడవుల నరికివేత, ఇష్టారాజ్యంగా రోడ్లు, జలవిద్యుత్కేంద్రాలు సహా అనేక నిర్మాణాలు పాలకుల తప్పులే. పడమటి కనుమల పరిరక్షణకు 2011లో మాధవ్‌ గాడ్గిల్‌ నివేదిక చేసిన సూచనల్ని పక్కన పడేశారు. గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడుల మీదుగా లక్షా 30 వేల చదరపు కి.మీ.ల ప్రాంతాన్ని సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా ప్రకటించాలని గాడ్గిల్‌ సిఫార్సు చేశారు. ఆరు రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ ఒప్పుకోలేదు. 

తర్వాత 2013లో కె. కస్తూరి రంగన్‌ మునుపటి సిఫార్సుల తీవ్రతను తగ్గించి ఇచ్చిన సూచనలకూ అదే గతి. పర్యావరణ ఉత్పాతాలను నివారించాలంటే కొన్ని నిర్బంధాలు తప్పవని ప్రజలను చైతన్యపరచ లేదు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం జనం డిమాండ్లకు తలొగ్గారు. కేరళ లాంటి రాష్ట్రాలు దానికి ఇప్పుడు చెల్లిస్తున్న భారీ మూల్యమే ప్రస్తుత దుఃస్థితి. దేశంలో తాజా వరద బీభత్సం మరోసారి ప్రకృతి పెట్టిన పొలికేక. ఇప్పటికైనా పెనునిద్దర వదలకపోతే మనకే నష్టం!

మరిన్ని వార్తలు