వీకెండ్‌ రుతుపవనం!

24 Jul, 2022 00:42 IST|Sakshi

జనతంత్రం

ఆరు రుతువులూ గతులు తప్పుతున్నాయిప్పుడు. తప్పుడు అడ్రసుల్లో తలుపులు తడుతున్నాయి. లండన్‌లో ఎండలు మండుతున్నాయి. ఇండియాలో మబ్బులు పగులుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ఎఫెక్ట్‌! భూ మండలాన్ని నరావతారం భ్రష్టుపట్టించిన ఫలితం. 

భారత రాజకీయాలను కూడా ఇటువంటి ఎఫెక్ట్‌ ఏదో పట్టి పీడిస్తున్నది. ముఖ్యంగా తెలుగుజాతి రాజకీయాలను! రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను వాటి కక్ష్యల్లో అవి పరిభ్రమించకుండా గతులు తప్పించినందువల్ల కలిగిన దుష్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ పొలిటికల్‌ వార్మింగ్‌కు ఆదిగురువు చంద్రబాబు అని ప్రత్యేకంగా చెప్ప వలసిన అవసరమే లేదు. దుష్ఫలితాల్లో ఒకటి – వీకెండ్‌ రుతుపవనం. ఇది ప్రతి వారాంతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్‌లో కమ్ముకొని యాసిడ్‌ రెయిన్స్‌ను కురిపిస్తున్నది. అది కులాల మధ్య చిచ్చుపెట్టే యాసిడ్‌.

రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం సహజం. పాత పొత్తులు భగ్నమవడం, కొత్త పొత్తులు కుదురుకోవడం కూడా సహజమే. కాకపోతే కొత్త పొత్తులు పొడవడానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. వేళాపాళా లేకుండా ఎవడైనా భూపాలం పాడితే అనుమానించాలి. కారణమేమిటో ఆరా తీయాలి. ‘జనసేన’ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల పొత్తుతో ఆరేడు శాతం ఓట్లను సంపాదించగలిగింది. భారతీయ జనతాపార్టీ జాతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో దాని ప్రభావం పరిమితమైనది. మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, ఒక్క శాతం ఓట్లను మాత్రమే సంపాదించగలిగింది.

ఈ రెండు పార్టీలు కలిసి ఒక శుభోదయాన పొత్తు కుదుర్చుకున్నాయి. ఎన్నికలకు ముందు కాదు... ముగిసిన తర్వాత! అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి ఒక సీటు, మరో పార్టీకి సున్నా సీట్లు లభించాయి. కనుక ఈ రెండూ కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదు. పోనీ పార్లమెంట్‌లో జనసేన బలంతో బీజేపీకి ఏమన్నా ఉపయోగముంటుందా? బీజేపీకి సొంతంగానే మెజారిటీ ఉంది. ఆపైనా ఎన్డీఏ పక్షాలున్నాయి. అయినా సరే, కరివేపాకులా కలిసి పోదా మనుకున్నా జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా లేదు.

పోనీ, భావసారూప్యత వంటి గంభీరమైన అంశమేదైనా ఈ అకాలపొత్తునకు పురికొల్పి ఉంటుందా? ఎన్నికలయ్యేంత వరకు జనసేన పార్టీ వామపక్షాల పొత్తులో ఉన్నది. వామ పక్షాలు – బీజేపీ తూర్పు పడమరల వంటివి. భావజాల పరంగా ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు. మరి, మన ఏకాకి ఇక్కడ్నుంచి ఎలా వెళ్లింది? ఆ ఇంటి మీద ఎలా వాలింది? కంటికి కనిపించని రహస్యమేదో ఉన్నది. సరిగ్గా అదే సమయంలో సమాంతరంగా తెలుగుదేశం పార్టీలో జరిగిన పరిణామాలను కూడా బేరీజు వేసి చూస్తే రహస్యం గుట్టు విడిపోతుంది.

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో నాలుగేళ్ల పాటు సహజీవనం చేసిన చంద్రబాబు ఎన్నికలకు ఏడాది ముందు అడ్డం తిరిగారు. మోదీపై యుద్ధం ప్రకటించారు. రెండు చేతులతో కత్తులు దూశారు. కాంగ్రెస్‌తో, ఇతర నాన్‌–బీజేపీ పక్షాలతో చుట్టరికం కలుపుకొన్నారు. ప్రధానమంత్రిపై వ్యక్తిగత స్థాయి దూషణలకు కూడా దిగారు. ఆయనను గద్దె దించేది ఖాయమని రణగర్జనల కేసెట్‌ వినిపించారు. ఫలితాలు రాగానే చల్లబడిపోయారు.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్‌ వచ్చింది. చేసిన స్కామ్స్‌ చంద్రబాబుకు నిద్రపట్టనివ్వలేదు. ప్రచారంలో తాను తిట్టిన తిట్లను మోదీ మనసులో పెట్టుకుంటే, చేసిన కుంభ కోణాల ఫలితాన్ని జైల్లో అనుభవించవలసి వస్తుందని వణికి పోయాడు. యెల్లో సిండికేట్‌తో కలిసి విరుగుడు మంత్రంపై చర్చించారు. బీజేపీలో పలుకుబడి కలిగిన కొందరు దగ్గరి వారి సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన హితులు, సన్నిహితులు, తన ఆస్తుల బినామీలుగా పరిగణించే సుజనా చౌదరి, సీఎమ్‌ రమేశ్‌ వగైరా రాజ్యసభ బృందాన్ని బీజేపీలో చేర్పించారు. మోదీ సర్కార్‌కు తనపై ఆగ్రహం కలుగకుండా లాబీయింగ్‌ చేయడం ఈ సంధి లక్ష్యం.

పూర్వకాలంలో రాజులు పొరుగు రాజ్యాలతో సంధి చేసుకొని వియ్యమందుకున్నప్పుడు ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు, వజ్రవైఢూర్యాది కట్నకానుకలతో పాటు కొందరు విదూషకులనూ, చెలికత్తెలనూ కూడా అరణంగా పంపించే వారు. తన పార్టీ వారిని అంతర్గత లాబీయింగ్‌ కోసం బీజేపీలో చేర్పించడంతోనే చంద్రబాబు సాంత్వన పడలేదు. ఆయన అభీష్టం మేరకు రాష్ట్రంలో బీజేపీకి ఒక మిత్రపక్షంగా జనసేన పార్టీ కూడా సరిగ్గా అదే సమయంలో షరీకైంది.

చంద్రబాబు అభీష్టం మేరకే జనసేన పార్టీ బీజేపీని హత్తుకున్నట్లయితే అంతకు ముందు ఎన్నికల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేస్తుందనే అనుమానం కొందరికి కలగవచ్చు. అది కూడా చంద్రబాబు అభీష్టం మేరకేనని అభిజ్ఞుల అభిప్రాయం. ఇందుకు రెండు కారణాలున్నాయని వారు చెబుతున్నారు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీతో పాటు, బీజేపీ, జనసేన–లెఫ్ట్‌ కూటమిల మధ్య నెగెటివ్‌ ఓటు చీలిపోతే తనకు లబ్ధి కలుగుతుందని టీడీపీ భావించింది. ఇక జనసేన అభ్యర్థులను తనకు పనికివచ్చే సామాజిక సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయించు కోవచ్చుననేది రెండో కారణం. ఆచరణలో ఈ ఎత్తుగడను అమలు చేశారు. వైసీపీ తరఫున బలమైన అభ్యర్థులున్న ప్రతి చోటా జనసేన తరఫున అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దించారు. కులపరంగా ఓట్లు చీలిపోతే టీడీపీకి లబ్ధి జరుగుతుందని ఆ పార్టీ అధినేత ఓ నాటు లెక్కను వేసు కున్నారు. కాకపోతే ఉద్ధృతంగా వీచిన జగన్‌ ప్రభంజ నంలో ఈ నాటులెక్కలు కొట్టుకుపోతాయని వారు ఊహించ లేకపోయారు.

అధికార లక్ష్యసాధన కోసం కాకుండా అందుకు ఉప యోగపడే పనిముట్టుగానే జనసేన పురుడు పోసుకున్నదనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, అదే నిజం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పద్ధెనిమిది శాతం ఓట్లు ఆ పార్టీకి లభించాయి. బీసీ కేటగిరిలో ఉండే తూర్పు కాపులను మినహాయించినా మిగిలిన కాపు ఉపజాతుల వారు ఏపీ జనాభాలో పది శాతం వరకుంటారనే ఒక అంచనా ఉన్నది. ఇందులో మెజారిటీ ఓటర్లు ప్రజారాజ్యం పార్టీ పట్ల సానుకూలంగా స్పందించారని తేలింది. కాపుల ఆత్మగౌరవ ప్రతీకగా ఎదుగుతున్న వంగవీటి మోహనరంగా హత్యకు ప్రధాన కారకుడిగా చంద్రబాబును కాపులు పరిగణిస్తారు. అందువల్ల నేరుగా వారి మద్దతును సంపాదించడం చంద్ర బాబుకు సాధ్యం కాదు. అందువల్ల చిరంజీవి సోదరుడైన పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దించి తనకు అవసరమైనప్పుడు, అవసరమైన రీతిలో ఉపయోగపడే విధంగా ఈ రాజకీయ ప్రయోగం చేశారనే రహస్యం టీడీపీ ముఖ్యనేతలందరికీ తెలిసిన వాస్తవం. టీడీపీ వలన టీడీపీ కొరకు టీడీపీ చేత ప్రభవించిన రాజకీయ వేదికగా జనసేనపై ముద్ర పడింది.

పవన్‌ కల్యాణ్‌కు సినిమా కాల్షీట్లు ఎలానో, పొలిటికల్‌ కాల్షీట్లూ అలానే! ఈ సీజన్‌లో ఆయనకు శని, ఆదివారాల కాల్షీట్లు కేటాయించారు. ఈ రెండు రోజులూ యెల్లో మీడియా ఆయనకు విస్తృత ప్రచారం చేస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు యెల్లో మీడియా కాల్షీట్లన్నీ చంద్రబాబుకూ, వాళ్లబ్బాయికీ రిజర్వవుతాయి. మొన్న పవన్‌ కల్యాణ్‌ తూర్పు గోదావరి పర్యటనలో ఉండగానే గోదావరి వరదలు మొదల య్యాయి. స్వతంత్ర రాజకీయ నాయకుడైతే ఇంకో రెండు మూడు రోజులు అక్కడే ఉండేవారు. కానీ ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం ఆయన వెంటనే నిష్క్రమించి, మీడియా స్పేస్‌ను చంద్రబాబుకు అప్పగించారు.

తాజా పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ కొత్త రాగాన్ని అందుకున్నారు. ‘మీకు ఆంధ్రా ఫీలింగ్‌ ఎలాగూ లేదు. కనీసం కుల ఫీలింగయినా తెచ్చుకొండ’ని తన సామాజిక వర్గాన్ని ఉద్దేశించి పిలుపునిచ్చారు. కుల ఫీలింగ్‌తో వారు తనను అనుసరించాలనీ తాను చంద్రబాబును అనుసరిస్తాననేది కవిహృదయం. ఈమధ్య కాలంలోనే పవన్‌ కల్యాణ్‌ రెండు కీలకమైన ప్రకటనలు చేశారు. వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోమనేది మొదటి ప్రకటన. జనసేన ఏర్పాటు తర్వాత మొదటి ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా టీడీపీకి ప్రచారం చేసిపెట్టారు. రెండో ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి సహకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నది. కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తనూ తనతోపాటు బీజేపీ కూడా చంద్రబాబు కూటమిలో చేరాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసం బీజేపీ పైనా ఒత్తిడి తెస్తున్నారు.

ఇక్కడ బీజేపీ అభిప్రాయం మరొక రకంగా ఉన్నది. కేంద్రనాయకత్వం ఏపీ ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడానికి విస్తృతంగా సర్వేలు చేసింది. 52 నుంచి 55 శాతం ఓటర్ల మద్దతు వైసీపీకి ఉన్నదనీ ఈ సర్వేలన్నీ తేల్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను బేరీజు వేసుకొని చూసినా ఈ సర్వే ఫలితాలనే బలపరుస్తున్నాయి. అందువల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన అన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వైఎస్సార్‌సీపీని ఓడించడం సాధ్యం కాదనే నిర్ధారణకు బీజేపీ వచ్చింది. కనుక జనసేన, తాము ఒక కూటమిగా పోటీ చేసి ఈ ఎన్నికల్లో వీలైనంత బలపడాలని ఆ పార్టీ భావిస్తున్నది. మరో ఓటమి తర్వాత టీడీపీ పూర్తిగా బలహీన పడుతుందనీ, తదుపరి ఎన్నికల నాటికి తమ కూటమే ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ గలుగుతుందనేది బీజేపీ రోడ్‌ మ్యాప్‌. కానీ వారి పార్ట్‌నర్‌... వాస్తవానికి ముసుగేసుకున్న చంద్రబాబు పార్ట్‌నర్‌. ఆయనకీ రోడ్‌మ్యాప్‌ నచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ బీజేపీ తనతో కలిసిరాకున్నా ఆయన మాత్రం హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌ ప్రకారం టీడీపీతో సహకరించే అవకాశాలు ప్రస్ఫుటం.

ఇక పవన్‌ కల్యాణ్‌ చేసిన రెండో కీలక ప్రకటన – తన సొంత సామాజిక వర్గం వారిని సంతృప్తిపరచడం కోసం చేసింది. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నం చేస్తున్నాడనే అభిప్రాయం పోగొట్టడానికి ఆయనొక ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి పోటీలో తాను కూడా ఉన్నట్టు ఒక సందేశాన్ని వదిలారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పుట్టుపూర్వోత్తరాలపై అవగాహన ఉన్న కొందరు టీడీపీ నేతలు ఈ సందేశంపై తీవ్రంగా స్పందించారు. దాంతో ఆయన మళ్లీ దాన్ని పునరుద్ఘాటించే సాహసం చేయలేక పోయారు. ఇప్పుడు తాజాగా కాపు సామాజిక వర్గం తన వెంట రావాలని పిలుస్తున్నారు.

తాజా పిలుపుపై ఆయన సామాజిక వర్గం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రంగా హత్యకు కారకుడైన వ్యక్తిని, ముద్రగడ వంటి పెద్దమనిషి కుటుంబాన్ని వేధించి అవ మానించిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాలకు తాము ఏ పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని పలువురు సామాజిక వర్గ ప్రముఖులు తెగేసి చెబుతున్నారు. పూర్వం ప్రజారాజ్యంలో కీలకంగా పనిచేసి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా వున్న ప్రముఖుడొకరు ఈ నేపథ్యంలో కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ అనే వ్యక్తికి ఒక ఐడియాలజీ లేదు, ఒక లక్ష్యం లేదు, నిబద్ధత అసలే లేదు. చివరికి ప్రమాణపూర్వకంగా కోర్టుకు కూడా అసత్యాలు చెప్పిన వ్యక్తి ఆయన’. అటువంటి వ్యక్తిని నాయకునిగా స్వీకరించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. 

‘‘ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించే సమయంలో, 2007లో అనుకుంటా. ఈయన ‘కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’ అనే సంస్థను పెట్టారు. ఆ సమయంలో మాట్లాడుతూ తాను రేణూ దేశాయ్‌తో సహజీవనం చేస్తున్నట్టు, అకీరా నందన్‌ అనే కొడుకు ఉన్నట్టు మాకు చెప్పారు. తర్వాత కొద్ది రోజులకే మొదటి భార్య విడాకుల కేసులో విశాఖపట్నం ఫ్యామిలీ కోర్టులో ఒక అఫిడవిట్‌ వేశారు. అందులో తాను రేణూ దేశాయ్‌తో సహజీవనం చేయడం లేదనీ, తనకు కొడుకు లేడనీ ప్రమాణ పూర్వకంగా చెప్పారు. తర్వాత ఏడాదిన్నరకు 2009లో ఆయన రేణూ దేశాయ్‌ని బహిరంగంగా పెళ్లి చేసుకున్నారు. ఆయన కొడుకు పేరుతో కొందరికి ఆహ్వానాలు కూడా అందాయి. కొంత కాలా నికి పవన్‌తో విడాకుల తర్వాత రేణూ దేశాయ్, ఏబీఎన్‌ రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఎనిమిదేళ్ల సహజీవనం తర్వాత తమ పెళ్లయిందని ఆమె చెప్పారు. అంటే 2001 నుంచి వారు సహజీవనంలో ఉన్నారు. కానీ 2007లో కోర్టుకు మాత్రం అటువంటిదేమీ లేదని ప్రమాణ పూర్వకంగా చెప్పారు’’. కోర్టుకే అసత్యాలు చెప్పిన వ్యక్తిని నాయకునిగా ఎలా అంగీకరిస్తామన్నది ఇప్పుడా ప్రజారాజ్యం మాజీ నాయకుని ప్రశ్న.

జరుగుతున్న రాజకీయ పరిణామాలను సాధారణ ప్రజలు నిశితంగా గమనిస్తుంటారు. కొన్నిసార్లు రాజకీయ పరిశీలకుల కంటే మిన్నగా స్పష్టమైన అంచనాలకు వారు వస్తుంటారు. పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌పై ఆయన సామాజిక వర్గానికే చెందిన ఒక మెడికల్‌ షాప్‌ యజమాని విశ్లేషణ చూడండి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకరకంగా, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో మరోరకంగా ప్రతిపక్షపాత్రను పవన్‌కల్యాణ్‌ పోషించారట. ‘చంద్రబాబు టైమ్‌లో అన్నీ ఒకరోజు ఉద్యమాలే చేసేవాడు. ఉద్దానంపై ఒక రోజు, రాజధాని రైతుల కోసం  ఒకరోజు... అలా! కానీ ఇప్పుడు మాత్రం కౌలు రైతుల పేరుతో వారం వారం సీరియల్‌లాగా ఉద్యమం చేస్తున్నాడు. అసలు కౌలు రైతుల సమస్యను ఇప్పటి వరకు రాష్ట్రంలో గానీ దేశంలో గానీ ఎవరూ పరిష్కరించనంత గొప్పగా జగన్‌మోహన్‌ రెడ్డి పరిష్కరించారు. అయినా కూడా పవన్‌కు అందులోనే సమస్య కనబడుతున్నది. చంద్రబాబు కోసం కాకపోతే ఎవరికోసమండీ ఈయన రాజకీయమ’ని సదరు మెడికల్‌ షాపు ఓనర్‌ ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజల్లో ఇంత రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్నప్పుడు ఈ వీకెండ్‌ రుతుపవనాలు ఏ ఉత్పాతాలను సృష్టించగలుగుతాయి?


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు