మళ్లీ టపాసుల చర్చ

7 Nov, 2020 00:32 IST|Sakshi

గత కొన్నేళ్లుగా టపాసులు, బాణసంచా వినియోగంపై నియంత్రణ, నిషేధం వంటివి దీపావళి పండగ సమయానికి బాగా చర్చకొస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లోనూ, దాని శివారు ప్రాంతాల్లోనూ నాలుగేళ్లుగా పండగకు ముందు విధి, నిషేధాలు అమలవుతున్నాయి. ప్రభుత్వం చొరవ చూపని సందర్భంలో సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని ఉత్తర్వులివ్వడం కూడా ఒకటి రెండు సందర్భాల్లో చోటుచేసుకుంది. అయితే ఈసారి కరోనా వైరస్‌ మహమ్మారి విసిరిన పంజాతో మరికొన్ని రాష్ట్ర ప్రభు త్వాలు సైతం టపాసులు, బాణసంచా వినియోగాన్ని నియంత్రిస్తున్నాయి. రాజస్తాన్, ఒడిశా, సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తాము తీసుకోదల్చుకున్న చర్యల్ని ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా నిషేధిస్తే, మరికొన్ని నియంత్రణలు విధించాయి. హరియాణా, మధ్యప్రదేశ్‌ ‘దిగు మతి చేసుకున్న’ టపాసులు పంపిణీ చేయొద్దని, వాడొద్దని నిషేధం పెట్టాయి. తాజాగా కర్ణాటక కూడా నిషేధించదలచుకున్నట్లు ప్రకటించింది.

పశ్చిమ బెంగాల్‌లో కలకత్తా హైకోర్టు నిషేధం విధించింది. దీపావళికి మాత్రమే కాదు... కాళిపూజ, ఛాత్‌ పూజల్లో కూడా టపాసులు, బాణసంచా వాడరాదని ఉత్తర్వులిచ్చింది. మూడేళ్లక్రితం దీపావళికి టపాసులు వాడరాదని సుప్రీంకోర్టు నిషేధం విధించిన ప్పుడు హిందూ మత సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం హిందువుల ఆచారాలు, సంప్రదా యాల సమయాల్లోనే ఇలాంటివి గుర్తొస్తాయా అని ప్రశ్నించాయి. అసలు టపాసులు, బాణసంచా కాల్చడం ఎప్పటినుంచి దీపావళికి సంప్రదాయమైందో చెప్పడానికి పెద్దగా ఆధారాల్లేవు. చైనాలో 10 లేదా 11వ శతాబ్దంలో తుపాకి మందు కనిపెట్టాక అక్కడినుంచి భారత్, యూరప్‌లకు అది చేరిందని, ఆ తర్వాత చాన్నాళ్లకు టపాసులు వినియోగంలోకొచ్చాయని మహారాష్ట్రకు చెందిన చరిత్రకారుడు పీకే గోడే అభిప్రాయపడ్డారు. కనుక ఆ తర్వాతకాలంలో ఎప్పుడో పండగలకు బాణసంచా, టపాసులు వాడటం మొదలైవుండొచ్చన్నది ఆయన అంచనా. మొగల్‌ చక్రవర్తి షా జహాన్‌ కుమారుడు దారా షికో పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అమ్మాయి తరఫువారు బాణసంచాతో స్వాగతం పలుకుతున్నట్టు తెలిపే ఒక పెయింటింగ్‌ ఢిల్లీ జాతీయ మ్యూజియంలో వుంది. 

కాలుష్యం పెను సమస్యగా మారిందనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయం వుండదు. దీపావళి పండగ సమయంలో భారీగా టపాసులు, బాణసంచా అధికంగా వుంటుంది కనుక ఆ కాలుష్యం మరిన్ని రెట్లు పెరుగుతుంది. వాయు కాలుష్యంతోపాటు శబ్దకాలుష్యం కూడా ఎక్కువే వుంటుంది. రెండేళ్లక్రితం తొలిసారి సుప్రీంకోర్టు ‘హరిత దీపావళి’ జరుపుకోవాలని సూచించింది. అంటే తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని, బాణసంచాను మాత్రమే ఉత్పత్తి చేయాలని, వాటినే అమ్మాలని తెలిపింది. అలాగే రాత్రి 8–10 గంటల మధ్య మాత్రమే వాటిని కాల్చాలని కూడా పరిమితి విధించింది. అయితే దాన్ని పెద్దగా పాటించినవారు లేరు. దీపావళి రాత్రి మోగిన టపాసులు, ఆ మర్నాడు వెలువడిన కాలుష్యం గణాంకాలు ఆ సంగతిని తెలియజెప్పాయి. ఈసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ టపాసుల వాడకాన్ని పూర్తిగా ఆపేయాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ తీవ్రతనూ, కాలుష్యం వల్ల ఢిల్లీ ఊపిరాడకుండా మారిన వైనాన్ని అందరూ చూశారు గనుక టపాసులకు దూరంగా వుండటం క్షేమదాయకమని చెప్పారు. అయితే మన ప్రభుత్వాలతో సమస్యేమంటే... పండగకు వారం, పదిరోజుల ముందు మాత్రమే వాటికి నిషేధం ఆలోచనమొదలవుతుంది.

వాస్తవానికి పండగకు చాలా చాలా ముందుగానే వ్యాపారులు సరుకు కోసం ఆర్డర్లు ఇస్తారు. ఆ తర్వాత వారి నుంచి రిటైల్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. టపాసుల పరిశ్రమలు అధికంగా వుండే తమిళనాడులోని శివకాశి వంటిచోట ఏడాది పొడ వునా వాటి తయారీ ఉంటుంది. ప్రభుత్వాలు ఈ కాలమంతా మౌనంగా వుంటాయి. వాటికి నిజంగానే కాలుష్యంపై ఆందోళన వున్నప్పుడు ప్రక్రియ మొదలైనప్పుడే దాన్ని నియంత్రించే చర్యలు ప్రారం భించాలి. కానీ అది జరగదు. తీరా సరుకంతా రిటైల్‌ దుకాణాలకు చేరాక పాలకుల ప్రకటనలు ప్రారం భమవుతాయి. న్యాయస్థానాల ఆంక్షలు కూడా అప్పుడే వెలువడతాయి. సహజంగానే అప్పటికే పెట్టు బడి పెట్టిన దుకాణాల వారు ఆ విధినిషేధాలను పట్టించుకోరు. ఇది ఏటా పునరావృతమవుతున్నా పరిస్థితి మారడం లేదు. ఈసారి కరోనా వైరస్‌ ప్రభావం వల్ల వేరే రాష్ట్రాలు సైతం టపాసులు, బాణసంచా వినియోగాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అవి కూడా పండగ ముంగిట్లో వుండగానే మేల్కొన్నాయి. 

టపాసులు, బాణసంచా వినియోగం వల్ల భారీ మొత్తంలో రసాయనాలు వాతావరణంలో కలుస్తాయి. ముఖ్యంగా టపాసుల్లోవాడే కార్బన్, సల్ఫర్, కాడ్మియం... వేర్వేరు రంగుల కాంతులు వెదజల్లేందుకు, అవి కాంతిమంతంగా వుండేందుకు  తోడ్పడే ఇతర రసాయనాలు ప్రమాదకరమైనవి. ముఖ్యంగా పిల్లల్లో, వృద్ధుల్లో ఇలాంటి రసాయనాల వల్ల కలిగే కీడును ఎదుర్కొనగల సామర్థ్యం తక్కువగా వుంటుంది గనుక వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం వుంటుంది. వారిలో శారీరక, మానసిక సమస్యలు మొదలవుతాయి. ఈ రసాయనాలవల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, చూపు మసకబారటం, బధిరత్వం, ఊపిరితిత్తుల వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, కేన్సర్లు, కండరాల బలహీనత, హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వంటివి ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

గర్భస్థ శిశువులకూ, నవజాత శిశువులకూ కూడా అనేక సమస్యలు తలెత్తుతాయంటున్నారు. మనుషులకే కాదు... జంతువులకూ, మొక్కలకూ కూడా ప్రమాదమేనంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఒక్క దీపా వళి సమయంలో మాత్రమే కాదు... సాధారణ రోజుల్లో సైతం టపాసులు, బాణసంచా వినియోగం తగ్గించడంపై శ్రద్ధ పెట్టాలి. మొత్తంగా అన్ని రకాల కాలుష్యాన్ని అరికట్టడానికి నిరంతర చర్యలుండాలి. అప్పుడు మాత్రమే ప్రజానీకంలో టపాసులు, బాణ సంచా వల్ల కలిగే అనర్థాలపై నిజమైన అవగాహన ఏర్పడుతుంది. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు