ఐఐఎంల నెత్తిన పిడుగు

9 Dec, 2020 06:47 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి విద్యా సంస్థలు భవిష్యత్తు ఉద్యోగులను తయారు చేసే ఫ్యాక్టరీలు కాదు. ఎంచుకున్న రంగంలో విద్యార్థులకెదురయ్యే సవాళ్లనూ, సమస్యలనూ విప్పి చెప్పి వారిని ఆలోచింపజేయడం, వాటి పరిష్కారానికి సన్నద్ధపరిచేలా ప్రోత్సహించడం ఆ సంస్థల పని. ఆ ప్రక్రియలోనే మెరుగైన రేపటి తరం ఆవిర్భవిస్తుంది. అలాంటి సంస్థలు తమ లక్ష్యాలు సాధించా లంటే వాటిని ఉద్యోగస్వామ్య నియంత్రణ నుంచి తప్పించాలన్న సదుద్దేశంతోనే ప్రపంచ దేశాల న్నిటా వాటికి స్వయంప్రతిపత్తినిస్తారు. ఆ ప్రతిపత్తికి ఇప్పుడు ముప్పు ముంచుకొచ్చిందని దేశం లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు బెంబేలెత్తుతున్నాయి. గవర్నర్ల బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఐఐఎం ప్రవర్తించిందని తేలినపక్షంలో చర్య తీసుకునేందుకు అనువుగా ప్రస్తుతం వున్న ఐఐఎం చట్టాన్ని సవరిస్తారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఇది తమ స్వయం ప్రతిపత్తిలో జోక్యం చేసుకోవడమే అవుతుందన్నది ఐఐఎంల వాదన. ఆ సంస్థలకు ఇలాంటి పరిస్థితి కొత్తగాదు. అయిదేళ్లక్రితం స్మృతి ఇరానీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను చూస్తు న్నప్పుడు ఆ శాఖ ఐఐఎంల నియంత్రణ కోసం బిల్లు రూపొందించినప్పుడు ఆ సంస్థల నిర్వాహ కుల్లో కలవరం బయల్దేరింది. ఐఐఎం డైరెక్టర్ల నియామకం మొదలుకొని అధ్యాపకుల ఎంపిక, వారి జీతభత్యాల నిర్ణయం వరకూ అన్నిటిలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం వుండేలా ఆ బిల్లును తయారు చేశారు. మొన్న ఆగస్టు నుంచి ఆ శాఖ పేరు మారింది. దాన్ని ఇప్పుడు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా పిలుస్తున్నారు. కానీ తమ స్వయంప్రతిపత్తి విషయంలో మాత్రం అప్పటికీ ఇప్పటికీ మారిం దేమీ లేదని ఐఐఎం నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఆ బిల్లు మూలనపడింది. అంతేకాదు... వాటి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు పూచీపడేలా 2017లో ఐఐఎం చట్టం రూపొందింది. అది 2018 జనవరి నెలాఖరునుంచి అమల్లో కొచ్చింది. దాని ప్రకారం డైరెక్టర్లనూ, చైర్‌పర్సన్‌లనూ, బోర్డు సభ్యులనూ ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఐఐఎంలకే వదిలిపెట్టారు. అంతక్రితం ప్రధాని ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్‌ నియామకాల సంఘం (ఏసీసీ) ధ్రువీకరించాకే ఐఐఎంలు తాము అర్హులనుకున్నవారిని నియమించగలిగేవి.

సమస్య చాలా చిన్నది. ఏడాది కోర్సుకు డిగ్రీ పట్టా ఇవ్వడంపైనే వివాదం. మొన్న జూలైలో ఇలా డిగ్రీలు ప్రదానం చేయడానికి నిర్ణయించారు. అంతవరకూ దాన్ని డిప్లొమాగానే పరిగణించేవారు. ఏ కోర్సునైనా డిగ్రీగా నిర్ణయించుకునే అధికారం ఐఐఎంలకు వుందని ఐఐఎం చట్ట నిబంధన చెబుతోంది. అయితే రెండేళ్ల కోర్సు చేసేవారికి మాత్రమే డిగ్రీ పట్టా ప్రదానం చేయాలని యూజీసీ స్పష్టం చేసింది. ఐఐఎం ప్రయత్నం తమ నిబంధనలకు విరుద్ధమం టోంది. ప్రభుత్వం కూడా యూజీసీనే సమర్థిస్తోంది. ఈ వివాదం తేలకుండానే రోహ్తక్‌ ఐఐఎం తమ గవర్నర్ల బోర్డుకు చైర్‌పర్సన్‌ను నియమించే ప్రయత్నం చేసింది. అది కూడా వివాదంగా మారింది. ఐఐఎంకు కావాల్సిన నిధుల్ని ప్రభుత్వం సమకూర్చుతున్నప్పుడు, దానిపై అజ్మాయిషీ కూడా అవస రమవుతుందని 2015లో స్మృతి ఇరానీ చెప్పారు. అయితే ప్రధాని కార్యాలయం దాన్ని తోసి పుచ్చింది. ఐఐఎంల స్వయంప్రతిపత్తిలో ఏ అధికారికీ ఎలాంటి పాత్ర వుండబోదని, ప్రభుత్వానికి వాటి నిర్వహణలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని మోదీ స్పష్టంగా చెప్పారు. అందుకు తగినట్టే ఐఐఎం చట్టం వచ్చింది.

ఇతర ఉన్నత స్థాయి విద్యాసంస్థలకు కూడా ఈ నమూనానే వర్తింప జేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు కూడా. నాలుగు నెలలక్రితం కేంద్ర మంత్రివర్గం ఆమోదిం చిన జాతీయ విద్యా విధానం సైతం విద్యా సంస్థలకు స్వాతంత్య్రం ఇస్తామని తెలిపింది. అయితే తాజాగా కేంద్ర విద్యాశాఖ, యూజీసీ ప్రయత్నాలు అందుకు భిన్నంగా వున్నాయి. ఏ గవర్నర్ల బోర్డు అయినా ఐఐఎం చట్టాన్ని ఉల్లంఘించిన పక్షంలో విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవ డానికి అధికారమిచ్చేవిధంగా చట్టాన్ని సవరించాలని విద్యామంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఉన్నత విద్యా సంస్థలు మెరుగైన ప్రమాణాలతో సమున్నతంగా ఎదుగుతున్నాయా లేదా అన్నది చూడాలి తప్ప, వాటి పనిలో జోక్యం చేసుకుంటూ, అవి తమ చెప్పుచేతల్లో పనిచేయాలని తాపత్రయపడటం సరికాదు.

ఐఐటీ, ఐఐఎం, జేఎన్‌యూ, ఐఐఎస్‌సీ వంటి ఉన్నత విద్యా సంస్థలు దశాబ్దాలుగా తమ స్వతంత్రతను కాపాడుకుంటూ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు గడిస్తున్నాయి. వాస్తవానికి తొలి వంద ప్రపంచ శ్రేణి సంస్థల్లో వాటికింకా చోటు దక్కటం లేదు. అవి సాధారణంగా ఎప్పుడూ 100–200 మధ్యనే వుంటాయి. ఆ విషయంలో ఇంకేం చేయాలో చూడాల్సిన తరుణంలో వున్న స్వతంత్రతనే దెబ్బతీసే ప్రయత్నాలు ఎంతవరకూ సమంజసమో ఆలోచించాలి. ఉద్యోగస్వామ్యం ఎప్పుడూ అధికారాలనూ, అజ్మాయిషీని కోరుకుంటుంది. ఏ పార్టీ అధికారంలోవున్నా ఆ వర్గం ఆలోచనా ధోరణి ఇలాగే వుంటుంది.  

మితిమీరిన జోక్యం ఎప్పుడూ వికటిస్తుంది. ఉన్నత స్థాయి సంస్థలపై ప్రభుత్వ అజ్మాయిషీ పెరిగినకొద్దీ అందులో ప్రమాణాలు క్షీణిస్తాయి. అంతిమంగా వాటినుంచి నిపుణులైన, ప్రతిభావం తులైన అధ్యాపకులు వలసపోయే ప్రమాదం కూడా వుంటుంది. పర్యవసానంగా అవి కుప్పకూల తాయి. ఐఐఎంలను కేవలం విద్యా సంస్థలుగా మాత్రమే చూడకూడదు. వాటినుంచి కార్పొరేట్‌ సంస్థల నిర్వాహకులుగా, వాటి అధిపతులుగా ఎదుగుతున్నవారు మాత్రమే కాదు... పాలనా వ్యవ స్థల్లో కీలకపాత్ర పోషించేవారు, విధాన నిర్ణేతలు రూపొందుతున్నారు. దేశాభివృద్ధిలో ఇతర ఉన్నత విద్యా సంస్థలతోపాటు ఐఐఎంల పాత్ర కూడా ఎంతో వుంది. ఆ ప్రమాణాలను నీరుగార్చే ఏ చర్యా మంచిది కాదు. ప్రధాని మోదీ మేకిన్‌ ఇండియా నినాదం స్ఫూర్తిని కూడా ఇలాంటి చర్యలు దెబ్బతీస్తాయి. కనుక ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. 

మరిన్ని వార్తలు