కంటినిండా కాంక్షలతో...

4 Nov, 2020 00:33 IST|Sakshi

బిహార్‌లో కీలకమైన రెండో విడత పోలింగ్‌ ముగిసింది. చివరిదైన మూడో విడతకు సాగే క్రమంలో రాజకీయ చిత్రం స్పష్టమౌతోంది. ఎన్నికల ప్రకటన ముందున్న నిశ్చింత, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌లో లేదిప్పుడు. విమర్శలకు కేంద్రబిందువు అవుతున్న ఆయన ప్రతిష్ట ఇదివరకెపుడూ లేనంతగా తగ్గుతోంది. పరిస్థితి గమనిస్తున్న పాలక ఎన్డీయే తరచూ వ్యూహాలకు పదును పెట్టాల్సి వస్తోంది. అంతర్గత స్పర్థ వీడి ఐక్యంగా ఉంటే తప్ప ప్రత్యర్థిపై ఆధిక్యత లభించదని గుర్తించినట్టు వారి దిద్దుబాటు చర్యలే నిదర్శనం. ఎన్డీయే భాగస్వాములు బీజేపీ, జేడీ(యూ) పొద్దుపోయాక సయోధ్య రాగం అందుకున్నాయి. విపక్ష ఆర్జేడీ నాయకుడు, ‘మహాఘట్‌బంధన్‌’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్‌కు జనాదరణ పెరుగుతోంది.

ఫలితమెలా ఉన్నా... సామాజిక న్యాయ రాజకీయాలకు దేశంలో అంతేవాసిగా మిగిలిన బిహార్‌లోనూ రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే, నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ పయనం తర్వాత కొత్తబాట పట్టిన వైనం. తరం మారుతున్న గట్టి సంకేతం! రామ్‌మనోహర్‌ లోహియా సిద్దాంతాలకు, జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వానికి ప్రభావితులై, సామాజికన్యాయ రాజకీయాల భిన్న పార్శా్వ లకు ప్రాతినిధ్యం వహించిన నాటి యువప్రతినిధుల్లో ఒకరు, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (72) శిక్షపడ్డ ఖైదీగా నేడు జైళ్లో ఉన్నారు. దళితవర్గ నేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ (74) ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే మరణించారు. మూడో ముఖ్యుడు నితీష్‌కుమారు (69) మూడు విడతలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. ప్రత్యర్థులు, వేర్పడ్డ లోక్‌జనశక్తి పార్టీయే కాదు, భాగస్వామ్య పక్షం బీజేపీ కూడా ఆయనపై విమర్శలకు దిగుతోంది. ఇప్పుడు గోడపై తన నీడతోనూ నితీష్‌కు పోరే! 

బిహార్లో ఎన్నికల ఎజెండా, రాజకీయ సమీకరణాల స్వరూపం మారింది. మలివిడత పోలింగ్‌ రోజే ఒక ప్రచార ర్యాలీలో సీఎం నితీష్‌పైకి సభికుల్లోంచి ఓ వ్యక్తి ఏదో విసిరేశాడు. నిరసన వ్యక్త మైంది. ‘ఇంకా వేయండి...’ అంటూ నిరసన తీవ్రత తగ్గించే యత్నం చేసిన నితీష్, ఆ వ్యక్తిని ఏమీ అనొద్దని పోలీసులను వారించారు. కొత్త సాంకేతికత సంతరించుకున్న సంప్రదాయ మీడియా, ఇటీవలే బలోపేతమైన సామాజిక మాధ్యమరంగం బిహార్‌ ప్రజానీకం ఆశల్ని, ఆకాంక్షల్ని కొత్త ఎత్తుల్లోకి తీసుకువెళ్లాయి. చెప్పింది వినడం, ప్రసంగాలకు ప్రభావితమయ్యే స్థాయిలోనే స్పందించే దశను బిహారీలు దాటేస్తున్నారు. ఆశించడం, వాటి కోసం ప్రశ్నించడం, తదనుగుణంగా ప్రతిస్పం దించడం వారిలో మొదలైనట్టు బిహార్‌ సమాజంలో కొత్త వాసన వెలువడుతోంది. ఇది సరికొత్త రాజ కీయాల్ని నిర్వచిస్తోంది.

ఈ మర్మమెరిగిన వాడిలా యువతరం ప్రతినిధి తేజస్వి యాదవ్‌ వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నారు. పదిలక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, చిన్న వయసు లోనే బిహార్‌ జీవనాడి పట్టుకున్న విజ్ఞత కనబరిచారు. అది ఆచరణ సాధ్యం కాదని ఎద్దేవా చేసి నాలుక్కరుచుకున్న ఎన్డీయే, జనస్పందనకు తలొగ్గి, తాము 19 లక్షల ఉద్యోగాలిస్తామని తేజస్వీ పన్నిన ఎజెండాలోకి జారింది. ఎన్డీయే నుంచి విడిపోయి, నితీష్‌పై విమర్శ బాణాలెక్కుపెడుతున్న ఎల్జేపీ యువనేత చిరాగ్‌ పాశ్వాన్, బీజేపీతో నెరపుతున్న సఖ్యతపై సందేహాలున్నాయి. ప్రధానంగా జేడీ(యు) అభ్యర్థులపైనే అగ్రకులాల వాళ్లను ఎల్జేపీ పోటీకి దింపింది. నితీష్‌ను–ఆయన గెలుచు కునే స్థానాల సంఖ్యను అదుపులో ఉంచేందుకు ఇది బీజేపీ పరోక్ష ఎత్తుగడనా? అనే అనుమా నాలున్నాయి. మొదటికే మోసం తెచ్చే సంకేతాలొచ్చేసరికి, చివరి పాదంలో సయోధ్య యత్నాలు ముమ్మరం చేశారు. ఎన్డీయే బలహీనమవుతున్న క్రమంలోనే మహాఘట్‌బంధన్‌ బలపడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. యూపీయే పెద్దన్నగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం బిహార్‌లో సున్నా! రాహుల్‌ గాంధీలో ప్రచార ఆసక్తీ కనబడటం లేదు. పైపెచ్చు, పొత్తుల్లో కాంగ్రెస్‌కు కేటాయించిన స్థానాల్లోనే ఎన్డీయే కూటమి ధీమాగా ఉంది.

మూడు దశాబ్దాల్లో... లాలూప్రసాద్‌ యాదవ్‌ కేంద్రబిందువు కాని బిహార్‌ తొలి ఎన్నికలివి. పరిస్థితి వికటించి లాలూ ఇవాళ జైళ్లో ఉండవచ్చు! కానీ, సామాజిక న్యాయం– లౌకికతత్వం ఇరు సుగా... బిహార్‌ను రాజకీయ ప్రయోగశాల చేశారనే పేరుందాయనకు. సరిగ్గా 30 ఏళ్లకింద, 23 అక్టో బర్‌ 1990న రామ రథయాత్రను నిలువరించి, అడ్వాణీని అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం. సామాజికన్యాయం–హిందుత్వల మధ్య సైద్ధాంతిక పోరు అలా బలపడింది. తర్వాత ఎన్నో రాజ కీయ బంధాలు, కూటములు, సమీకరణాలు బిహార్‌నే కాదు, మొత్తం దేశాన్నే ముంచెత్తాయి. తేజ స్వీకి వాళ్ల తండ్రి లాలూ వారసత్వం ఆస్తి కాదు, భారమని రాజకీయ పండితులు విశ్లేషిస్తారు. ఆయన హయాంలో అగ్రవర్ణ ఆధిపత్యం, రాజకీయ హింస, నేరాలు, అవినీతి ప్రబలి... చివరకాయన జైలు చేరడం చూస్తే నిజమే అనిపిస్తుంది.

కానీ, ఓబీసీ, దళిత, మైనారిటీ వర్గాలను ఏకం చేసి ఆయన ఏర్పాటు చేసిన భూమికపైన, లాలూ పేరు తీసుకోకుండానే తేజస్వీ అల్లుకుంటున్న కొత్త రాజకీ యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నిరుద్యోగం బిహార్‌లో ప్రధాన సమస్య. కోటికి పైగా బిహారీలు వలస కూలీలుగా భారతదేశమంతా విస్తరించి ఉంటారు. మొన్న కోవిడ్‌ లాక్‌డౌన్‌లో సుమారు 23 లక్షల మంది స్వస్థలాలకు చేరారు. అత్యధికులు వేల కిలోమీటర్లు కనాకష్టంగా నడిచొచ్చారు. గుర్రుగా ఉన్న వారూ, వారి కుటుంబాలు నేడు ఉద్యోగాలు, ఉపాధి కోసం గాఢమైన ఆకాంక్షలతో ఉన్నారు. ఎంత పెద్ద పేరున్నా... ప్రార్థించే పెదవుల కన్నా, పని చేసే చేతుల కోసం బిహారీలు నిరీక్షిం చడం కొత్త పోకడ. జనం ఆశల్ని చదివి, యువ రాజకీయ నాయకులు హూందాగా మాట్లాడటం సరి కొత్త మార్పు. బిహార్‌ ఎన్నికల్లో 42 శాతం పోటీదారులు 25–40 సంవత్సరాల యువత కావడం ఆశావహం! ఓటర్లు బిహార్‌ రాజకీయాల్ని ఏ తీరాలకు చేరుస్తారో ఈ నెల 10 ఫలితాల్లో తేలాల్సిందే!

మరిన్ని వార్తలు