ఉత్కంఠ పోరులో గెలుపెవరిది?

5 Nov, 2020 00:22 IST|Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సహజంగానే యావత్‌ ప్రపంచ దృష్టినాకర్షించే ఈ ఎన్నికల ఫలితాల్లో కడదాకా సాగుతున్న సస్పెన్స్‌ ఏకంగా థ్రిల్లర్‌ సినిమాని తలపిస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌–జో బైడెన్‌ల మధ్య పోటీ నువ్వా–నేనా అన్నంత సమీపానికి వచ్చింది. వెనుకబడుతారనుకున్న ట్రంప్‌ దూసుకువచ్చిన తీరు చూస్తే సర్వేలు, మీడియా విశ్లేషణలు, రాజ కీయ పండితుల అంచనాలు తలకిందులవుతున్న సంకేతాలే కనిపిస్తున్నాయి. బుధవారం రాత్రి వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికానప్పటికీ... ఇద్దరి మధ్య వ్యత్యాసం అత్యల్పంగా ఉంది. మిషిగాన్, విస్కాన్సిన్‌ వంటి రాష్ట్రాల్లో కడపటి ఫలితాల మొగ్గుని బట్టి ఎవరైనా విజేత కావచ్చు! కొద్దిపాటి తేడాతో ఎవరు నెగ్గినా మరొకరు ఎన్నికల ప్రక్రియను న్యాయస్థానానికీడ్చే ఆస్కారం ఉంది. అలా చేస్తానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇంకా లెక్కింపు జరగాల్సిన రాష్ట్రాల్లో, ముఖ్యంగా రణక్షేత్రాల్లాంటి మెజారిటీ స్వింగ్‌ రాష్ట్రాల్లో రిపబ్లికన్లు పొందుతున్న ఆధిక్యతను బట్టి ట్రంప్‌ మరో దఫా అమెరికా అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారా? అన్న విశ్లేషణలు తాజాగా తెరపై కొచ్చాయి.

డెమాక్రాట్‌ అభ్యర్థి బైడెన్‌ మాత్రం అంచనాల మేర అమెరికన్ల ఆదరణ పొందలేదని ఫలితాల సరళి చెబుతోంది. వాళ్లు ఆశిస్తున్నట్టు, ఆలస్యంగా లెక్కింపులోకి వస్తున్న మెయిల్‌–ఇన్‌ ఓట్లు ఆదుకుంటే స్వల్ప ఆధిక్యత బైడెన్‌కు లభించవచ్చేమో! నాలుగేళ్ల కిందట ట్రంప్‌కు అను కూలించిన తీవ్ర జాతీయవాదం, అమెరికా ఔన్నత్యాన్ని నిలిపే హామీ వంటివి ఈ సారి కూడా లబ్ది చేకూర్చినట్టే! ఎన్నికల ఏడాదిలో వచ్చిపడ్డ కోవిడ్‌–19 ట్రంప్‌కు నష్టం కలిగిస్తుందేమో అన్న అంచనాలూ తప్పాయి. మహమ్మారి బారిన పడి దాదాపు రెండున్నర లక్షల మంది అమెరికన్లు మరణించినా, కోటి మందికి పైగా ఉద్యోగ–ఉపాధి కోల్పోయినా... అతనిపై అది ప్రతికూల ప్రభా వమేమీ చూపినట్టు లేదు. పైగా, స్వేచ్ఛా–స్వాతంత్య్ర జీవనశైలికి పెద్దపీట వేసే అమెరికన్లకు కరోనా–లాక్‌డౌన్‌ విషయంలో ఆయన చిరాకు వైఖరి, ఈసడింపు ధోరణి నచ్చినట్టే ఉంది. చిన్న కంపెనీలను ఆదుకునేందుకు ఉద్యోగుల పేరోల్స్‌ ఆపొద్దంటూ కొన్ని నెలలకు సరిపడా వేతనాలను తాను సర్దుబాటు చేసిన నిర్ణయం ఆయనకెంతో లాభించింది.

రిపబ్లికన్ల రాష్టమే అయినా, డెమాక్రాట్లకు సానుభూతి చూపే మెక్సికన్లు, ఆసియా దేశీయులు ఎక్కువుండే టెక్సాస్‌ వంటి రాష్ట్రాల్లోనూ బైడెన్‌ ఆధిక్యత సాధించకపోవడాన్ని బట్టి ఓటర్ల ముందు ఆయనొక ఎజెండా కాలేదని స్పష్టమౌతోంది. చివరకు ట్రంప్‌ అనుకూల–ప్రతికూశాంశాలే ఎన్నికల ఫలితాల్ని నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా వరకు... ఒక తరహా మీడియా, తన అభీష్టాలను వండి–వార్చడమే తప్ప వాస్తవాల్ని ప్రతిబింబించదేమో అనే భావనకు ఈ ఫలితాలు అద్దం పడుతున్నాయి. పనిగట్టుకొని పాలక ట్రంప్‌కు వ్యతిరేకంగా పనిచేసిన ప్రసార మాధ్యమాల అంచనాలు గాలికిపోయాయి. ట్రంప్‌ ఎక్కుపెట్టిన ప్రచారాస్త్రాలు మధ్యతరగతి అమెరికన్లలోకి చొచ్చుకు వెళ్లాయి. బైడెన్‌ అధ్యక్షుడైతే పన్నుల భారం మోపుతాడని విస్తృత ప్రచారం చేశారాయన. బైడెన్‌ వద్ద సగటు అమెరికన్లను ఆకట్టుకునే ప్రచారాంశమే లేకపోయింది. ప్రపం చీకరణ, బహిరంగ మార్కెట్‌ వంటి కారణాలతో కంపెనీలు, పరిశ్రమలు మూతపడి అమెరికాలో వస్తోత్పత్తి నిలిచిపోయింది. చైనా వస్తు–సేవలు అమెరికాలోకి వరద కట్టాయి.

ఇదే అమెరికన్ల ఉద్యోగ–ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోందని చైనానొక శత్రువుగా చూపి, దాన్ని నిలువరించే పోరాట యోధుడిగా ట్రంప్‌ తనను తాను సృష్టించుకున్నారు. వలసలు అమెరికన్ల ఉద్యోగ–ఉపాధి అవ కాశాల్ని దెబ్బతీస్తున్నాయనే భావనను ట్రంప్‌ నాలుగేళ్లు సజీవంగా ఉంచడం బాగా పనిచేసిన ట్టుంది. ఒకవైపు కోవిడ్‌ ఉపద్రవం ఉండగానే, న్యాయస్థానాలు అడ్డుకున్నా... వలసల కట్టడికి ఆదే శాలిస్తూ పేద, మధ్యతరగతి శ్వేత అమెరికన్లను ఆకట్టుకోగలిగారు. విదేశీ నైపుణ్య శ్రామికులపై ఆధారపడ్డ అక్కడి బహుళజాతి కంపెనీలు తప్ప స్థానిక కార్పొరేట్లు, శ్వేతఅమెరికన్లు... విభిన్న వర్గాల్లో ట్రంప్‌కు మద్దతు దొరికింది. సర్వేలకు అతీతంగా, కనీసం 6 నుంచి 8 శాతం, అంచనాలకు చిక్కని గోప్య ఓట్లు ఆయనకు అనుకూలించాయి.

ట్రంప్‌ వివాదాలు, దూకుడు ధోరణి బయట ఏ అభిప్రాయం కలిగించినా అమెరికాలో ప్రతి కూలమైనట్టు లేదు. అంతర్జాతీయ అంశాల్లో నిర్ణయాలు విమర్శలకు తావిచ్చాయి. పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగడం, మెక్సికోతో గోడ వివాదం, ఇరాన్‌పై ఆంక్షలు, సిరియాపై కూటమి పక్షాల దాడి, ఏడు ముస్లీం దేశాల నుంచి ప్రయాణాల నిషేధం.... వంటి నిర్ణయాల ప్రభావం ఎన్నికల్లో పెద్దగా నష్టం కలిగించినట్టు లేదు. అందుకే, సర్వేల్లో వెనుకబడ్డ ట్రంప్‌ ఫలితాల్లో దూసుకొచ్చారు. స్వల్ప వ్యత్యాసంతో ట్రంప్‌ ఓడినా మంచి ఫలితాలు సాధించినట్టే లెక్క! అమెరికా ఎన్నికల్లో ఇటీవల స్వల్ప వ్యత్యాస విజయమంటే 2000లో రిపబ్లికన్‌ అభ్యర్థి జార్జి.డబ్లు.బుష్‌ దే! 270 కనీస ఎలక్టోరల్‌ స్థానాలు గెలవాల్సిన చోట 271 తో అధ్యక్షపీఠం ఆయన దక్కించుకున్నారు.

ఎవరెన్ని చెప్పినా ట్రంప్‌ పేచీకోరుతనం కడకు ఫలితాల తర్వాతా ప్రతిబింబించింది. దీన్ని వేరెవరికన్నా కూడా... బాగా గ్రహించింది డెమాక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిత్వానికి విఫల యత్నం చేసిన బెర్నీ శాండర్స్‌! ఫలితాల తర్వాత ట్రంప్‌ స్పందన ఎలా ఉంటుందో చెబుతూ ‘పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో తాము గెలుస్తున్నాం అని పోలింగ్‌ రోజు రాత్రి ట్రంప్‌ చెబుతారు. కానీ, మెయిల్‌–ఇన్‌ ఓట్లు ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ కనుక మరుసటి రోజు ఫలితాలు తారుమారయి, చేజారుతాయి. అప్పుడు.... ఈ లెక్కింపు మోసం, మా గెలుపును లాక్కుంటున్నారు అని నానా యాగీ చేస్తాడు, కోర్టుకు వెళతా నంటాడు....’’ అని గత నెల 24న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శాండర్స్‌ చెప్పారు. ట్రంప్‌ అక్షరాలా బుధవారం అదే చేశారు.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా