అటు శనీశ్వరం – ఇటు కాళేశ్వరం

31 Jul, 2022 02:23 IST|Sakshi

జనతంత్రం

తెలుగు రాష్ట్రాలకు ఎండ వేడి ఎక్కువే. రాజకీయ వేడీ ఎక్కువే. అసెంబ్లీ ఎన్నికలు ఐదేళ్లకోమారు జరగాలి. ఆ ఎన్నికల కోసం రాజకీయ ఎత్తులు, పైయెత్తులూ రెండున్నరేళ్లు ముందుగానే ప్రారంభమవుతాయి. అందువల్ల రేయింబవళ్ల మాదిరిగా మన సగం జీవితకాలాన్ని ఈ రాజకీయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో 22 నెలల టైముంది. ఇంకో పదహారు నెలల్లోనే తెలంగాణ ఎన్నికలు జరగాలి.

వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు సంధించ బోయే ప్రధానాస్త్రాలేమిటో ఇప్పటికే వెల్లడైంది. ఏపీలో శనీశ్వరుని పీడ, తెలంగాణలో కాళేశ్వరంపై రగడ! చంద్రబాబు పార్టీ, దాని అనుబంధ విభాగాలైన యెల్లో మీడియా, సోషల్‌ మీడియా, స్లీపర్‌ సెల్స్‌ అన్నిటినీ కలిపి శనీశ్వరుని పేరుతో పరిగణించవలసి వస్తున్నది. ఎందుకంటే ఈ యెల్లో సిండికేట్‌కు మంచీ–చెడులతో పనిలేదు. ఉచ్ఛ–నీచ విచక్షణ లేదు. న్యాయా న్యాయ విచికిత్స అవసరం లేదు. సమయమూ – సందర్భమూ ఉండదు. తన కూటమి అధికారంలో ఉండడానికి ఏం చేయడా నికైనా వెనుకాడదు.

శనీశ్వరుడూ అంతే... ఎందుకు, ఎప్పుడు, ఎవరిలో ప్రవేశి స్తాడో తెలియదు. ఎందుకు పీడిస్తాడో తెలియదు. ఎప్పుడు వదులుతాడో తెలియదు. అతడి ప్రభావం నుంచి పరమ శివుడైనా తప్పించుకోలేడనే కథ ఒకటి ఉన్నది. ఒకసారి నారద మహర్షి కైలాసానికి వెళ్లి శనీశ్వరుడి ఆగడాలపై పరమేశ్వరునికి మొరపెట్టుకున్నాడట! అతని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని సవాల్‌ చేశాడట. ‘ఆ శని నన్ను కూడా వేధించగలడా’ అని పరమశివుడు ప్రశ్నించాడట. ‘తప్పకుండా వేధిస్తాడ’ని నారదుల వారు బదులు చెప్పారట! అయితే డేటూ, టైమూ ఫిక్స్‌చేసి రమ్మని చెప్పు, ఏం చేస్తాడో చూద్దామని శివుడు ఆదేశించాడట. నిర్ణయించిన ముహూర్తానికి ఒక కీకారణ్యంలోకి వెళ్లి వటవృక్షం తొర్రలో పరమేశ్వరుడు దాక్కున్నాడట. నిర్ధారిం చిన ఘడియలు దాటిన తర్వాత విజయగర్వంతో శివుడు బయ టకు వస్తాడు. ఎదురుగా శనీశ్వరుడు! శివునికి నమస్కరించి, ‘స్వామీ! కైలాసంలో కూర్చొని లోకాలను పాలించవలసిన తమరు నా భయంతో కొన్ని ఘడియలైనా సరే చెట్టు తొర్రలో దాక్కున్నారు. అదీ నా ప్రభావం’ అని చెప్పాడట!

యెల్లో సిండికేట్‌ కనికట్టు విద్యలో దిట్ట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడంలో బహు నేర్పరి. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా భ్రమించేంతవరకు వెంటపడుతూనే ఉంటుంది. ఈ యెల్లో శనీశ్వరుని లీలలే మనం ఏపీ ఎన్నికల ప్రచారంలో చూడబోతున్నాము. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్‌ఎస్‌ చేతిలో వజ్రాయుధంగా ఉండవలసింది. కానీ, దాన్నే ప్రతిపక్షాలు కూడా ప్రధాన ఆయుధంగా మలుచుకోగలగడమే వింతల్లో కెల్ల వింత. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది విపక్షాల ఆరోపణ.

ఈ వ్యవహారంపై కేంద్ర సర్కార్‌ కూడా కన్నేసిందనీ, ఈడీ రంగంలోకి దిగిందనే వార్తలు కూడా ముసురుకున్నాయి. ఈ వార్తలకు ప్రతిపక్షం కంటే అధికార పక్షమే ఎక్కువ ఆజ్యం పోయడం ఆసక్తి కలిగించే అంశం. దర్యాప్తు సంస్థల్ని చేతిలో పెట్టుకొని కేంద్రం ప్రతిపక్ష రాష్ట్రాలను బెదిరిస్తున్నదనీ, మేం దానికి భయపడేది లేదనీ స్వయంగా ముఖ్యమంత్రే పలుమార్లు ప్రకటించారు. దీంతో లోలోపల ఏదో జరుగుతున్నదనే అనుమానం జనంలో పొడసూపింది. ‘డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌’ అంటే ‘మోడీ, ఈడీ’ అనే నిర్వచనాన్ని కేటీఆర్‌ పదేపదే చెప్పుకొస్తున్నారు. ఫలితంగా రాబోయే ఎన్నికల కాలాన్ని ప్రభావితం చేయబోయే అంశం కాళేశ్వరమేనన్న అభిప్రాయం బలపడుతున్నది.

శని ఒకసారి ప్రవేశిస్తే కొంత కీడు చేస్తాడు. రెండోసారి ప్రవేశిస్తే ఇంకొంచెం ఎక్కువ కీడు చేస్తాడు. మూడోసారి కూడా ప్రవేశిస్తే చాలా ప్రమాదకరమట. ఆ మూడో దశను మృత్యు పీడనతో పోల్చుతారు కొందరు జ్యోతిష్యులు. ఈ యెల్లో శనీశ్వరుడు ఇప్పటికే రెండుసార్లు అధికార పీఠంలో ప్రవేశించి, మొదటిసారి ఉమ్మడి రాష్ట్రాన్ని, రెండోసారి విభజిత రాష్ట్రాన్ని పీడించాడు. కాకపోతే శని పీడన కాలాన్ని కూడా స్వర్ణయుగంగా ప్రచారం చేయడం యెల్లో సిండికేట్‌ గొప్పతనం. మూడోసారి ప్రవేశం కోసం గత మూడేళ్లుగా యెల్లో శనీశ్వరుడు ప్రదర్శిస్తున్న ఇంద్రజాల విద్యల్ని చూస్తూనే ఉన్నాము. తాజాగా ఈ వారం నుడివిన పోలవరం సుభాషితాలను ఒకసారి పరిశీలించండి.

గోదావరి వరదల తర్వాత రెండుసార్లు చంద్రబాబు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు ఒకసారి, తర్వాత ఒకసారి! ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించి, వారికి కావలసిన వనరులను సమకూర్చి నిరంతరం పర్యవేక్షించడం, సలహాలివ్వడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనుసరించే పద్ధతి. తానే స్వయంగా పర్యటనకు వెళ్తే అధికార యంత్రాంగం తన చుట్టూ మూగుతారనీ, సహాయ చర్యలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో ఆయన ఈ పద్ధతిని అనుసరిస్తారు. ప్రపంచంలో చాలామంది ప్రభుత్వాధినేతలు కూడా ఈ పద్ధతినే అనుస రిస్తారు. చంద్రబాబు పద్ధతి వేరు. ఆయనొక షోమ్యాన్‌. సహాయ కార్యక్రమాలు అటకెక్కినా సరే తాను తుపానులను ఆపేస్తున్నట్టూ, వరదలను కంట్రోల్‌ చేస్తున్నట్టూ మీడియాలో కనిపించాలి. అధికార బృందాన్ని తన చుట్టూ నిలబెట్టుకొని వారి మీద అరుస్తుండాలి. తాను ఒక్కడే చురుగ్గా పనిచేస్తున్నట్టు మీడియాలో ఆహా ఓహో అనే వార్తలు రావాలి.

వైఎస్‌ జగన్‌ అనుసరించే పరిష్కార వైఖరిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి చంద్రబాబు మొదటిసారి వెళ్లారు. ‘సీఎం రాలేదు... నేను వచ్చాన’ని గొప్పలు చెప్పు కున్నారు. సీఎం పర్యటన ముగిసిన వెంటనే ఆయన మాటలను వక్రీకరించడానికి చంద్రబాబు మరోసారి వెళ్లారు. పోలవరం ప్రాజెక్టును జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేయలేరని తేల్చేశారు. తాను మళ్లీ వచ్చి పూర్తిచేస్తానన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం జగన్‌ ప్రభుత్వ వైఫల్యమని చెప్పారు. 22 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం 20 వేల కోట్లు ఇస్తుందని సలహా ఇచ్చారు. పోలవరాన్ని ప్రత్యేక జిల్లా చేస్తానన్నారు. ఎప్పుడూ చెప్పినట్టుగా సకల అనర్థాలకు జగన్‌ ప్రభుత్వమే కారణమనీ, తాను వస్తే జిందా తిలిస్మాత్‌ తెస్తాననీ మరోసారి ఢంకా భజాయించారు.

పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్ని మూడు ముక్కల్లో పరిశీలిద్దాము. 195 టీఎమ్‌సీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందుకోసం గోదావరికి అడ్డంగా రెండున్నర కిలోమీటర్ల ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ను కట్టాలి. ఈ డ్యామ్‌ను కట్టాలంటే వరదను మళ్లించాలి. సీడబ్లు్యసీ ఆమోదించిన డిజైన్‌ ప్రకారం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌కు ఎగువన అప్రోచ్‌ చానల్‌ నిర్మించి, నదీ ప్రవాహాన్ని కుడివైపుకు మళ్లించాలి. డ్యామ్‌కు సమాంతరంగా కుడివైపున నిర్మించే స్పిల్‌వే మీదుగా నీటిని విడుదల చేసి సుమారు 6 కిలోమీటర్ల తర్వాత మళ్లీ ప్రధాన నదిలో కలపాలి. స్పిల్‌వే పనులు కాగానే 35 మీటర్ల ఎత్తు కాంటూర్‌ పరిధిలో నివసించే 8,800 కుటుంబాలకు పునరావాసం కల్పించి, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలి. ఆ తర్వాత స్పిల్‌వే ద్వారా మళ్ళించి మళ్లీ నదిలో కలిపిన వరద వెనక్కు ఎగదన్ని డ్యామ్‌ పనులకు విఘాతం కలిగించకుండా దిగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి, ఈసీఆర్‌ఎఫ్‌కు పునాదిగా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాలి.

ఈ పద్ధతి మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం తలకిందులు చేసింది. నిర్వాసితుల పునరావాసంలో కమీషన్లు రావు కనుక అది పక్కనపెట్టి డయాఫ్రమ్‌ వాల్‌ పనులను చేపట్టింది. కాఫర్‌ డ్యాం ద్వారానే పంటలకు నీళ్లిస్తానని ప్రకటించి, స్పిల్‌వే కట్టకుండానే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పని ప్రారంభిం చారు. నిర్వాసితులు పోలవరం అథారిటీకి ఫిర్యాదు చేయడంతో కాఫర్‌ డ్యామ్‌ల పనిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. ఆ తర్వాత 2019 ఆగస్టు, 2020 ఆగస్టుల్లో వచ్చిన వరదలు సగం కట్టిన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ కారణంగా తక్కువ వైశాల్యంలో ప్రవహించవలసి వచ్చింది. దీంతో వరద ఉధృతి పెరిగి, ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై, రెండు భారీ అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్‌ వాల్‌ కూడా దెబ్బతిన్నది. ఇదీ తెలుగుదేశం ప్రభుత్వం పోలవరంలో సాధించిన ఘనకార్యం.

ఈ పాపాలన్నిటినీ దాచిపెట్టి చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంపై నిందలకు దిగారు. 22 మంది ఎంపీలు రాజీనా మాలు చేస్తే నిర్వాసితుల పునరావాసానికి డబ్బులు రావా అని ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నీటిపారుదల వ్యయాన్ని మాత్రమే ఇస్తామంటూ, అంటే నిర్వాసితుల పరిహారం తమ పరిధిలోది కాదంటూ గతంలో కేంద్ర కేబినెట్‌ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇప్పుడు 20 వేల కోట్లను పరిహారంగా తీసుకు రావడానికి ఆ తీర్మానమే అవరోధంగా మారింది. తీర్మానం చేసినప్పుడు కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు తెలుగుదేశం మంత్రులు న్నారు. వారు అభ్యంతరం చెప్పి వున్నా, రాజీనామా చేస్తామని హెచ్చరించి వున్నా ఈ కేబినెట్‌ తీర్మానం ఉండేది కాదు. ఇప్పుడీ అవస్థ ఉండేది కాదు. సిగ్గుతో తలదించుకోవలసింది ఎవరు? రాజీనామా చేయవలసింది ఎవరు? అలాగే, ‘అల్లూరి సీతారామ రాజు జిల్లా కేంద్రం పాడేరులో ఉండటమేమిటి? అంతదూరం ఎలా వెళ్తారు? విలీన మండలాలతో ఒక ప్రత్యేక జిల్లానే ఏర్పాటు చేస్తా’నని కూడా చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్ర చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలం పద్నాలుగేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క కొత్త జిల్లాను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. రెండున్నరేళ్ల కాలంలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పదమూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు పోలవరం జిల్లా ప్రకటన చూస్తే నవ్వు రాకుండా ఉంటుందా? పైగా గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత పనుల కోసం మండల కేంద్రాలకు వెళ్లే వారే కరువయ్యారు. ఇక జిల్లా కేంద్రానికి వెళ్లేవారి సంఖ్య బహుస్వల్పం. యెల్లో శనీశ్వరుల ప్రచారాలకు ఒక తర్కం గానీ, హేతుబద్ధత గానీ, వాస్తవికత గానీ, ఆధారాలు కానీ ఏమీ ఉండవు. స్వార్థ ప్రయోజనం తప్ప! వారానికి ఒకటి చొప్పున వెలువడుతున్న పోలవరం తరహా ప్రచారాలు విశ్లేషణలకు అందవు. బండకేసి బాదడమే మార్గం.

కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఇంజినీరింగ్‌ వండర్‌గా తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికవుతున్న వ్యయాన్ని బట్టి చూసినా ఇదొక ప్రపంచస్థాయి ప్రాజెక్టు. ఇప్పటికే రమారమి 80 వేల కోట్లు ఖర్చయ్యాయి. మరో 40 వేల కోట్లయితే తప్ప మొత్తం ప్రాజెక్టు పూర్తి కాదు. 20 చోట్ల లిఫ్టులు, 20 రిజర్వాయర్లున్న బృహత్తర పథకం ఇది. ప్రాజెక్టు నిర్వహణకయ్యే విద్యుత్‌ వ్యయమే ఏటా 4 వేల కోట్లుంటుందని అంచనా. వ్యయంలో సింహభాగం రుణాలే కనుక రానురాను ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ భారంగా మారనున్నదని ప్రతిపక్షాలతో సహా కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ అంతకు అనేక రెట్లు రైతులు లాభపడనున్నారని ప్రభుత్వం చెబుతున్నది. ఇందుకు ఉదాహరణగా తెలంగాణ రైతులు గత సంవత్సరం సాధించిన 2 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులను చూపెడు తున్నది. కానీ ఈ రెండేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తి పోసిన నీళ్లు వంద టీఎమ్‌సీల కంటే తక్కువేనన్నది వాస్తవం.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన జల యజ్ఞంలో భాగంగా ‘ప్రాణహిత – చేవెళ్ల’ అనే ఒక కొత్త ఆలోచనకు కూడా కార్యరూపం ఇచ్చారు. వార్ధా, వేనగంగ నదుల సంగమం తర్వాత ప్రాణహిత నదిపై ఆదిలాబాద్‌ జిల్లా ఈశాన్య సరిహద్దులో తుమ్మిడిహెట్టి దగ్గర ఒక బరాజ్‌ నిర్మించాలి. అక్కడి నుంచి ఎల్లంపల్లి దగ్గర (గోదావరి – ప్రాణహిత సంగమానికి ముందు) గోదావరికి తరలించి, మిడ్‌ మానేరు మీదుగా రంగారెడ్డి జిల్లా వరకు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ ప్రాజెక్టును ప్లాన్‌ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాజెక్టును రీ–డిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. తుమ్మిడిహెట్టితో పోలిస్తే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందనీ, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో మరో 18 లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చనే అంచనాతో ప్రాజెక్టును రీ–డిజైన్‌ చేశారు.

తుమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి... సముద్రమట్టానికి దాదాపు సమానమైన ఎత్తులో ఉంటాయి. కనుక ఎత్తిపోతల వ్యయం తక్కువగా ఉంటుంది. మేడిగడ్డ తక్కువ ఎత్తులో ఉంటుంది. అక్కడ్నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేందుకు ఎక్కువ సామర్థ్య మున్న మోటర్లు, ఎక్కువ ఖర్చు అవసరమౌతాయి. పైగా రివర్స్‌ పంపింగ్‌! నదిని వెనక్కు పంపించడం! పోలవరంలో నదీ ప్రవాహాన్ని కుడిపక్కకు మళ్లించి, దిగువన ప్రవాహంలో కలిపేయడం ప్రత్యేకత.

కాళేశ్వరంలో ఎగువకు మళ్లించడం ప్రత్యేకత. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నుంచి మూడు పంప్‌హౌస్‌ల సాయంతో ఎల్లంపల్లి దగ్గర గోదావరిలో కలుపు తారు. అయితే గడిచిన సంవత్సరం ఇలా 30 టీఎమ్‌సీలను ఎల్లంపల్లికి తరలించిన తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో అందులో 23 టీఎమ్‌సీలను గేట్లెత్తి మళ్లీ దిగువకు వదలాల్సి వచ్చింది. పీఛేముడ్‌ – ఆగేముడ్‌! కరెంట్‌ ఖర్చు అదనం. కాళేశ్వరం ప్రాజెక్టును సాంకేతిక అంశాలు, వ్యయప్రయాసల అంశాల అధారంగా విమర్శించే వారు ఒక వర్గం. రాజకీయ విమర్శలు చేసేవారు మరో వర్గం.

ఈసారి ఎలాగైనా తెలంగాణాలో అధికారాన్ని సాధించి దక్షిణాదిన బలపడాలని బీజేపీ గట్టిగా కోరుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బలహీనపడుతున్నప్పటికీ తెలంగా ణలో మాత్రం ఇప్పటికీ బలమైన పునాదు లున్నందు వల్ల చావో–రేవో తేల్చుకోవడానికి కాంగ్రెస్‌ సిద్ధపడు తున్నది. ఈ రెండు పార్టీలు కాళేశ్వరాన్ని రాజకీయాస్త్రంగా మలుచుకున్నాయి. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిం దని ఆరోపిస్తున్నాయి తప్ప ఇప్పటివరకు ఆ అవినీతికి సంబం ధించి ఒక్కటైనా నిర్దిష్టమైన ఆధారాన్ని చూపెట్టలేకపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉండి అన్ని వనరులూ చేతిలో ఉన్న బీజేపీ కూడా ఎటువంటి ఆధారాన్నీ చూపెట్టలేకపోతున్నది. కాకపోతే ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో పారదర్శకత లేదని వాదిస్తున్నది.

నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సాయం అందించే ఏఐబీపీ స్కీమ్‌లో చేర్చుతాము... వివరాలు పంపించమని అడిగితే రాష్ట్రం స్పందించడం లేదని కేంద్రం ఆరోపిస్తున్నది. ఖర్చులు, రుణాలు మొదలైన వివరాలను చెప్పడం ఇష్టం లేకనే స్పందించడం లేదని కేంద్రం అభిప్రాయం. ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్రం చేసిన డిమాండ్‌పై కేంద్రం స్పందిస్తూ – ఈ ప్రాజెక్టుకు పెట్టుబడి అనుమతులు లేవనీ, అందుకే జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చలేమనీ చెప్పింది.

ఎంతసేపూ ఖర్చులకు సంబంధించిన పారదర్శకత లేదని చెప్పడం ద్వారానే అవినీతి ముద్ర వేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు కనిపి స్తున్నది. ‘కాళేశ్వరం – అవినీతి’ అనే అంశంపై జాతీయ పార్టీలు ఎంత దూకుడుగా ఉన్నాయో, టీఆర్‌ఎస్‌ అంతే దూకుడుగా ఉన్నది. వస్తేరానీ ఈడీ–మోడీ అంటున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే కాళేశ్వరం ట్రాప్‌లో జాతీయ పార్టీలను ఇరికించ డానికి టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నదా? టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీలు ఇరుకున పెడుతున్నాయా అనేది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు