పతాక సన్నివేశం!

28 Feb, 2021 00:26 IST|Sakshi

జనతంత్రం

ఎ టేల్‌ ఆఫ్‌ టూ పార్టీస్‌!
ఎ స్టోరీ ఆఫ్‌ టూ లీడర్స్‌!!

కథ క్లైమాక్స్‌కు చేరినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఆడిన మాటను నిలబెట్టుకోవాలనే విశ్వసనీయతలో పుట్టి, కష్టాల కొలిమిలో అగ్నిస్నానం చేసి మొదలైన ఒక ప్రస్థానం... కొత్త వెలుతురు లోకపు తలుపులు తెరిచేటందుకు సిద్ధపడు తున్నది. అధికార దాహంతో అవతారమెత్తి వెన్నుపోటు అనే ఆయుధాన్ని ధరించి మానవీయ విలువల్ని వధిస్తూ సాగిన ఒక వక్రయాత్ర ముగింపునకు చేరుకుంటున్నది. ఈ రెండు పరిణా మాలకు సంబంధించిన స్పష్టమైన సందేశాలు ఒకేవారంలో రావడం ఒక విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడొక విజయ శంఖా రావం ధ్వనిస్తున్నది. అవరోహణ క్రమంలో ఒక చరమగీతం వినబడుతున్నది.

రానున్న సంవత్సర కాలానికి సంబంధించిన సంక్షేమ పథ కాల క్యాలెండర్‌ను మొన్న మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. అధికారం లోకి రాగానే ఎన్నికల వాగ్దానాలను అటకెక్కించడం, వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోలను మాయం చేయడం షరామామూలైన రోజులివి. ఏ పథకానికి సంబంధించిన నిధులను ఏరోజున విడుదల చేస్తారో తెలియజేస్తూ తారీఖులతో సహా కచ్చితమైన లెక్కను ఏడాది మొదట్లోనే ప్రకటించడం నిజంగా అబ్బురపడే విశేషం. ఇదొక సాహసం. ఇదొక విశ్వాస ప్రకటన. ఇరవై ఒక్క మాసాల విశ్వసనీయ పాలనకు అద్దంపట్టే శిలాశాసనం లాంటి ప్రకటన. కొత్త పుంతలు తొక్కించే ఒరవడి.

ఇంకో దృశ్యం. పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదార్లు అద్భుత విజయాన్ని సాధించారు. ఎనభై శాతం పంచాయతీలను వారు కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మద్దతుదార్లు పదహారు శాతం గ్రామాలకే పరిమితమయ్యారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ జనరంజక పాల నపై ఈ తరహా తీర్పును పరిశీలకులు ముందుగానే ఊహిం చారు. ఇక్కడ ఇదికాదు విశేషం. తాను గత ముప్పయ్‌ రెండేళ్లుగా ఏకధాటిగా ప్రాతినిధ్యం వహిస్తూ మరో మూడేళ్ల పవర్‌ ఆఫ్‌ అటార్నీ కలిగివున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రతిపక్ష నేతకు శృంగభంగమైంది. అసలు విశేషంతో పోలిస్తే ఇది కూడా అంత గొప్పదేమీ కాదు. డ్యామేజీ కంట్రోల్‌కోసం ఆయన హుటాహుటిన కుప్పానికి బయల్దేరారు. కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎప్పటిలాగే మైకును దొరకబుచ్చుకొని తన మానాన తాను తమ్ముళ్లనుద్దేశించి మాట్లాడసాగారు. ఇంతలో అనూహ్యంగా తమ్ముళ్లంతా మూకుమ్మడిగా ఈసారి ప్రచారానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. దాంతో ఆయనకు చేష్టలుడిగినట్లయింది. కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌లో ఒకరకమైన నిర్వికారత కనిపించింది. కానీ, మనోభావాలను అర్థం చేసు కోగలము. బహుశా గజేంద్రమోక్షం గుర్తుకొచ్చి ఉండవచ్చు కూడా. ‘ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్‌ ఠావుల్‌ దప్పెను; మూర్ఛ వచ్చె’ అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే, తన సొంత కోటలో, తన సొంత పార్టీ కార్యకర్తలు కట్టెదుట నిలబడి నిర్భీతిగా తనపై చేసిన అవిశ్వాస ప్రకటన అది. మీ నాయకత్వం మీద మాకు నమ్మకం లేదంటూ నారా అండ్‌ సన్స్‌పై తెలుగుదేశం పార్టీ చేసిన అవిశ్వాస ప్రక టన. నేడు కార్యకర్తలతో మొదలైన పరిణామం రేపు పార్టీ మొత్తానికీ పాకవచ్చు.

పరిపాలనలో పారదర్శకతకూ, విశ్వసనీయతకూ అగ్రా సనం వేస్తూ పాలకుడు విశ్వాస ప్రకటన చేసిన మూడు రోజు ల్లోనే, పరాజితునిపై అతని అనుయాయులు అవిశ్వాస ప్రకటన చేయడం ఒక విశేషం. ఈ రెండు ఘటనలూ ఒకే వారంలో జరగడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, చరిత్రాత్మకం కూడా. గడచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన రాజకీయ కథా గమనానికి ఇదొక పతాక సన్నివేశం. ఇక నుంచి తెలుగుదేశం పార్టీకీ, ఆ పార్టీ అధినేతకూ దిగే మెట్లు తప్ప ఎక్కే మెట్లు ఉండకపోవచ్చు.

2019 మే 30వ తేదీన వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చేనాటికి దివాళా తీసిన ఖజానా వారసత్వంగా వచ్చింది. లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ సొమ్మును హారతి కర్పూరంలా వాడేసింది తప్ప ఆస్తుల కల్పన జరిగిందేమీ లేదు. ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రం లెక్కల ప్రకారం ఆనాటికి ప్రతి గర్భస్థ శిశువు మీద కూడా సగటున 42,500 రూపాయల అప్పును బాబు ప్రభుత్వం చేసింది. వేల కోట్ల పెండింగ్‌ బిల్లులనూ, వివిధ రంగాలకు చెందిన బకాయి లను చెల్లించకుండా కొత్త ప్రభుత్వం మీద పడేసిపోయింది. ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం మొదలైంది. మాంద్యం వైపు దారితీసే పరిస్థితులు కనిపించాయి. ఇటువంటి అననుకూల పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపట్టారు. అందరి కళ్లూ ఆంధ్రప్రదేశ్‌ వైపే. ఏం చేస్తారీయన?. ఎదురుగా ఖాళీ ఖజానా, పేరుకుపోయిన అప్పులూ, బకాయిల జాబితా. కింకర్తవ్యం?. ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక ప్రస్తుతానికి మేనిఫెస్టోను మడతేయడమే... ఇలాంటి ఊహాగానాలెన్నో నడిచాయి. చంద్ర బాబు అనుకూల మీడియా ఒకడుగు ముందు కేసి ‘జీతాలకే డబ్బుల్లేవు. ఇక ముందుంది మొసళ్ల పండుగ’ అంటూ సంబ రాన్ని దాచిపెట్టుకోలేకపోయింది.

పండితుల అంచనాలూ, ప్రతిపక్షం ఆశలూ గల్లంతు కావడానికి ఎన్నోరోజులు పట్టలేదు. కొత్త ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోను పటం కట్టించి మంత్రులందరి ఛాంబర్లలోనూ పెట్టించారు. తనవద్దా పెట్టుకున్నారు. ఇదే మన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ అని మరోసారి మంత్రులకూ, అధికారులకూ నూరిపోశారు. నవరత్నాలతో పాటు ఇచ్చిన హామీలనూ, ఇవ్వని హామీలను కూడా అమలుచేయడం ప్రారంభించారు. ఎలా సాధ్యమైందో తెలియదు. మేధస్సు అనేది వుంటే, దానికి చిత్త శుది తోడైతే ఆ మేధస్సును బహుశా అల్లావుద్దీన్‌ వండర్‌ ల్యాంప్‌గా వాడొచ్చేమో!. సంకల్పబలం ఉంటే సాధ్యంకానిది లేదంటారు పెద్దలు. విశ్వసనీయత అనే ఆరు అక్షరాలను రాజ కీయ తిరుమంత్రంగా జపిస్తూ వచ్చినందువల్ల సహజంగానే సంకల్పబలం తోడై ఉండవచ్చు. 

అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఈ సంవత్సరం జనవరి నెలాఖరు నాటికి లెక్కిస్తే వివిధ పథకాల కింద ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసిన మొత్తం 81 వేల 196 కోట్ల రూపాయలు. నేరుగా ఖాతాల్లో వేయకుండా ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాల వంటి వాటి ద్వారా జరిగిన లబ్ధి 15,162 కోట్లు. ఫిబ్ర వరి నెలాఖరు దాకా లెక్క వేసుకుంటే వివిధ పథకాల ద్వారా లక్ష కోట్ల రూపాయలకు పైగా ప్రజల చేతికి అందాయి. ఆర్థిక మందగమనం, దాని వెన్నంటే వచ్చిన కోవిడ్‌ సంక్షోభాల నుంచి ప్రజలను గట్టెక్కించిందీ, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది కూడా ప్రభుత్వం చేసిన ఈ సంక్షేమ వ్యయమే. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్థికవేత్తలందరూ ఇప్పుడు చెబుతున్న మాట ఇదే. క్షేత్రస్థాయిలో సాధారణ ప్రజానీకం తమ నిత్య జీవితావసరాల కోసం చేసే ఖర్చును తగ్గనీయకుండా వారికి డబ్బును అందు బాటులో ఉంచడం ద్వారానే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోగల మని వారు చెబుతున్నారు. ఈ మాటలను ఇప్పటికే జగన్‌ మోహన్‌రెడ్డి ఆచరణలో నిరూపించారు. ఒక్క సంక్షేమ వ్యయమే కాదు. కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పు లకు శ్రీకారం చుట్టిన విధానం సమకాలీన రాజకీయవేత్తలలో ఆయనకు స్టేట్స్‌మన్‌ హోదాను కల్పించింది.

కోవిడ్‌ సంక్షోభం తలెత్తిన తొలిరోజుల్లోనే దానితో సహ జీవనం చేయడానికి సిద్ధపడాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. నలభై మూడేళ్ల రాజకీయ అనుభవం కలిగిన మన ప్రతిపక్ష నాయకునితో సహా పలువురు ఆయన మాటల్ని ఎగతాళి చేశారు. కొంతకాలం తర్వాత ఇవే మాటలను సుప్రసిద్ధ వైద్యనిపుణులు, సామాజికవేత్తలు, ప్రపంచ దేశాల నేతలూ వర సగా చెప్తూ వచ్చారు. విస్తృతంగా పరీక్షలు చేయించడం ద్వారా కోవిడ్‌ వ్యాప్తిని అదుపు చేయవచ్చునని ఆచరించి చూపెట్టారు. విద్యారంగ సంస్కరణల్లో భాగంగా తొలుత ప్రభుత్వ పాఠశా లల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వరంగ విద్యా వ్యవస్థను పునరుజ్జీవింపజేశారు. ప్రతి పేదబిడ్డా బడికి వెళ్లి చదువుకోవడానికి తీసుకోవలసిన అన్నిరకాల ప్రోత్సాహక చర్య లను వివిధ పథకాల ద్వారా ఆయన చేపట్టారు. బడికి వెళ్లకుండా ఆటంకపరిచే ఏ ఒక్క కారణాన్ని పరిష్కరించకుండా విడిచి పెట్టలేదు. తెలుగు భాషను తప్పనిసరిగా చదవాల్సిన సబ్జెక్టుగా ప్రకటిస్తూనే ఇంగ్లిష్‌ను బోధనా భాషగా ప్రకటించారు. పేద, బలహీనవర్గాల పిల్లలకు ఇదొక గొప్ప వరం. రానున్న పదేళ్ల కాలంలో ఈ రాష్ట్రంలోని ప్రతి పేదబిడ్డా శ్రీమంతుల బిడ్డలతో సమానస్థాయిలో పోటీపడగల స్థితికి చేరుకుంటుంది. ఫలితంగా పోటీతత్వం మరింత పెరిగి నైపుణ్యత రాటుదేలుతుంది. అద్భు తమైన మానవ వనరుల పంట ఏటేటా రాష్ట్రమంతటా విరగ పండుతుంది.

ఇంటింటికీ అందుబాటులో వైద్యం అనే స్ఫూర్తితో ప్రభుత్వం వైద్యరంగ సంస్కరణల్ని ప్రారంభించింది. ప్రతి గ్రామంలో ఒక వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నాలుగైదు గ్రామాలకు ఒక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. అందులో ఉండే వైద్యులకు ఆ ప్రాంతాన్ని సమానంగా విభ జించి బాధ్యతలు అప్పగిస్తారు. తమకు కేటాయించిన ప్రాంతంలో ఈ వైద్యులు ఒక షెడ్యూల్‌ ప్రకారం ఫ్యామిలీ విజిట్స్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ డాక్టర్‌ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు పట్టణ ప్రాంతా ల్లోని ఉన్నత మధ్యతరగతి వర్గానికి కూడా ఈ సౌకర్యం లేదు. ‘కొనబోతే కొరివి–అమ్మబోతే అడవి’గా తయారైన పెట్టుబడి వ్యయం, మార్కెట్‌ ధరలు వ్యవసాయానికి శాపంగా మారిన వైనం అందరికీ తెలిసిందే. ఈ మౌలిక సమస్యను అధిగమిం చేందుకు కూడా వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో ఏర్పాటవుతున్న రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగానికి గొప్ప ఆసరాగా నిలబడుతున్నాయి. ‘ఇంటి ముంగి టికే ఇన్‌పుట్స్, ఫామ్‌గేట్‌ మార్కెట్‌’ దిశగా అడుగులు పడు తున్నాయి. రాష్ట్రంలో 85 శాతంగా వున్న చిన్న, సన్నకారు రైతులకు ఈ పద్ధతిలో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అధికారం చేపట్టగానే ఆర్థిక మందగమనం,దానితోపాటే వచ్చిన కోవిడ్‌ సంక్షోభాలను ఎదుర్కొంటూనే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇవి కొన్ని మాత్రమే. కొన్ని మీడియా సంస్థలూ, రాజ్యాంగ వ్యవస్థల్లోని కొందరు వ్యక్తుల సహకారంతో అడుగడుగునా విషం చిమ్ముతున్న ప్రతిపక్ష కుట్ర లను కూడా ఎదుర్కొంటూ ఇరవై నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో ఇప్పటికే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో డిస్టింక్షన్‌ మార్కులు వేశారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష నేత, ఆయన పార్టీ కార్యక్రమాలేమిటి?... ప్రభుత్వంపై దుష్ప్రచారం, అధినేత మీద కుట్ర. ఈ రెండు అంశాలకే ఆ పార్టీ పరిమితమైంది. అధికా రంలో ఉన్నప్పుడు అమరావతి పేరుతో ఒక భారీ కుంభ కోణానికి పాల్పడ్డారనీ, అందుకోసమే ల్యాండ్‌ పూలింగ్‌ అనే నాటకాన్ని ఆడారనీ ఇప్పుడు ప్రజలందరికీ తేటతెల్లమవుతు న్నది. అమరావతి డెవలప్‌మెంట్‌ పేరుతో ఒక సింగపూర్‌ బినామీ కంపెనీని తెరపైకి తెచ్చినట్టు కూడా ప్రజలకు అర్థమైంది. అర్ధంతరంగా ఆగిపోయిన తన ట్రెజర్‌ హంట్‌పై విచారణ జరిగితే శిక్ష ఖాయమని ప్రతిపక్ష నేతకు తెలుసు. అమరావతి స్కామ్‌తోపాటు మరో అరడజన్‌ అవినీతి బాగో తాలపై విచారణ జరిగితే తన వారసునితోపాటు ముఖ్య అనుయాయులందరూ బుక్కవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో రాజధాని ఉద్యమం పేరుతో ఒక కృత్రిమ ఉద్యమాన్ని నడిపి స్తూనే, బీజేపీతో తమ నాయకుడు రాయబారాలు నడుపుతు న్నాడని ఆ పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. తన మీద, తన వాళ్ల మీద విచారణ జరక్కుండా చూస్తే తన పార్టీని త్యాగం చేయడానికి కూడా చంద్రబాబు సిద్ధపడ్డారని వినికిడి. అంటే పార్టీని విలీనం చేయడానికైనా, జూనియర్‌ పార్ట్‌నర్‌గా పొత్తు పెట్టుకోవడానికైనా తాను రెడీగానే ఉన్నట్టు బీజేపీ అధినాయ కత్వానికి చేరవేశాడట. ఈ విషయం ఆనోటా ఈనోటా పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నది. బీజేపీతో కలిసి పోవడానికి ఇష్టంలేని ఒక వర్గం తెలుగుదేశం పార్టీని కాపాడు కోవడానికి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను రంగంలోకి తీసుకు రావాలనే వాదాన్ని వినిపిస్తున్నది. కుప్పంలో కనిపించింది కేవలం ట్రెయిలర్‌ మాత్రమేనట. అసలు సినిమా అంతా ముందే ఉందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ ఉంటుందా? అంతర్ధానమవుతుందా? ఉంటే ఏ రూపంలో? ఎన్ని ముక్కలు? వగైరా ప్రశ్నలకు సమాధానం త్వరలోనే మనం బుల్లితెరలపై చూసే అవకాశం ఉంది.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు