చిలుక జోస్యమే చివరి ఆశ!

22 Jan, 2023 00:21 IST|Sakshi

జనతంత్రం

తూర్పు దిక్కున విచ్చుకుంటున్న ప్రభాత రేకల్ని మనం చూడగూడదు. పడమటి సంధ్యారాగపు విభాత గీతాలాపన మన చెవిన పడగూడదు. తలుపులకూ, కిటికీలకూ ఇనుప తెరలు కప్పేద్దాం. మన పాలితులకు మన సినిమానే చూపిద్దాం. ఆధిపత్య వర్గాలకు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగు బాటయ్యే సమాజాల్లో ఈ భావజాలం రాజ్యం చేస్తుంది. సకల వ్యవస్థలనూ ఈ వర్గాలు పెంపుడు చిలుకలుగా మార్చివేస్తాయి. వార్తలనూ, వ్యాఖ్యానాలనూ ఈ చిలుకల పలుకుల్లోనే మనం గ్రహించాలి. ధర్మమేమిటో, సంప్రదాయమేమిటో, వ్యవహార మేమిటో కూడా ఈ చిలుకలే మనకు బోధిస్తాయి. ‘హెచ్‌ఎమ్‌వి’ రికార్డుల్నే ఈ చిలుకలు వినిపిస్తాయనేది ప్రత్యేకంగా చెప్ప నవసరం లేదు.

ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు తాలం వేయని ప్రభుత్వాలు ఏర్పడితే ఇక రణమే. పెంపుడు చిలుకలు కూడా కత్తులు దూస్తాయి. మీడియానే ముందుండి యుద్ధం చేస్తుంది. ఈ పరిణామాలకు ఆంధ్రప్రదేశ్‌ కంటే స్పష్టమైన ఉదాహరణ ఇంకొకటి లేదు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో పెంపుడు చిలుకలకు అరాచకమే కనిపిస్తుంది. తొక్కిసలాట నిరోధించే భద్రతా చర్యలైనా, అక్రమ భవంతులను కూల్చివేయడమైనా అప్రజా స్వామికంగానే కనిపిస్తాయి.

సూర్యుడు మార్నింగ్‌ బెల్‌ కొట్టకముందే వేకువ కిరణాల మాదిరిగా సంక్షేమాన్ని జనం ముంగిటకు చేర్చుతున్న వలంటీర్లలో ఎల్లో మీడియాకు సంఘ విద్రోహులు కనబడుతున్నారు. తనకు కనిపించడమే కాదు, ప్రజలందరూ ఇదే విషయాన్ని నమ్మి తీరాలని కూడా ఎల్లో మీడియా సమాజాన్ని ఆదేశిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థను దేశంలో ఉన్న విజ్ఞులందరితోపాటు ఇంగిత జ్ఞానమున్న సామాన్యులు సైతం ప్రశంసిస్తున్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాకారంలో విప్లవాత్మకమైన ముందడుగుగా భావిస్తున్నారు. కానీ, మన పెత్తందారీ వర్గాల పెంపుడు చిలుకలు మాత్రం ఒక దుందుడుకు చర్యగా పరిగణిస్తున్నాయి. వాటి మీద విష ప్రచారాన్ని ఎక్కుపెట్టాయి. రైతు పండించిన ధాన్యానికీ, మద్దతు ధరకూ మధ్యన అడ్డుగోడగా నిలిచిన దళారీ వ్యవస్థను ప్రభుత్వం తొలగించింది. ఇది గిట్టని ఎల్లో మీడియా ప్రతిరోజూ కళ్లల్లో నిప్పులు గుమ్మరించుకుంటూనే ఉన్నది. 

పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువు చెబితే ఎల్లో మీడియాకు కడుపునొప్పి. నాణ్యమైన ఆధునిక విద్యను ఉచితంగా అందజేస్తే అజీర్తి రోగం. అత్యుత్తమమైన ప్రజా వైద్యం పల్లెగడప తొక్కితే మూలశంక వ్యాధి మెలిపెడుతున్నది. మహిళల సాధికారత కోసం పదవులూ, నిధులూ అందు బాటులో ఉంచితే కడుపు తరుక్కుపోతున్నది. సొంత ఇంటి రూపంలో కొంత ఆస్తిని సమకూర్చితే ఎల్లో కూటమి కాలేయం కమిలిపోతున్నది. పేదవర్గాలకు ప్రత్యక్షంగా నగదు బదిలీని చేస్తుంటే తనువెల్లా దహించుకుపోతున్నది. తను ఇంతగా రోగపీడితం కావడానికి కారణమైన ప్రభుత్వంపై ఈ కూటమి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నది. తక్షణం గద్దె దింపాలన్న కోరికతో సెగలు కక్కుతున్నది. అందుకోసం సమాచార విధ్వంసానికి పూనుకుంటున్నది. నందిని పందిగా, పందిని నందిగా ప్రచారం చేయడానికి తెగబడుతున్నది. వ్యవస్థల్లోని పెంపుడు చిలుకలను ఉపయోగించుకొని ప్రజాభిప్రాయాన్ని ‘ఉత్పత్తి’ చేయడానికి ఒడిగడుతున్నది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెస్తున్న అప్పులపైనా, చేస్తున్న ఖర్చులపైనా ఎల్లో మీడియా ఎంత గోబెల్స్‌ బీభత్సాన్ని సృష్టించిందో లోకమంతా చూసింది. రాష్ట్రం నేడో, రేపో మరో శ్రీలంక కాబోతున్నదని ప్రజలను బెదరగొట్టే ప్రయత్నాలు చేసింది. డబ్బంతా పప్పు బెల్లాలకే ఖర్చు చేస్తున్నారు తప్ప అభివృద్ధి కోసం పైసా విదల్చడం లేదని చాటింపు వేసి మరీ బాకా ఊదారు. ఇటువంటి కుక్క కాట్లకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వ శాఖలే చెప్పుదెబ్బల్లాంటి సమాధానాలిచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న వ్యయంలో అభివృద్ధి వాటానే ఎక్కువని బడ్జెట్‌ గణాంకాలను ఉటంకిస్తూ ఆర్‌బీఐ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. సామాజిక రంగంపై చేసే ఖర్చు... అంటే విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, గోదాముల నిర్మాణం వంటివన్నీ అభి వృద్ధి ఖాతాలోకే వస్తాయని ఆర్‌బీఐ తేటతెల్లం చేసింది. 11.43 శాతం వృద్ధిరేటుతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి దేశంలోనే మొదటిస్థానంలో (2021–22) ఉన్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నివేదికల సారాంశం ఎల్లో మీడియాకు నిద్ర పట్టనివ్వడం లేదు. అది వితండవాదానికి తెగబడుతున్నది. అమరావతిలో నాలుగు భవంతుల నిర్మాణమే అభివృద్ధిగా ప్రచారం చేయడానికి ఆపసోపాలు పడుతున్నది.

ప్రపంచమంతటా ఇప్పుడు కొత్త గాలులు వీస్తున్నాయి. నయా ఉదారవాదానికి (Neo Liberalism) కాలం చెల్లినట్టేనని పెట్టుబడిదారీ ఆర్థిక ప్రవక్తలే గట్టిగా వాదిస్తున్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఈ దేశంలో సృష్టించిన కీలుబొమ్మల్లో ముఖ్యుడైన చంద్రబాబు సహా ఆయన పెత్తందారీ ఎల్లో కూటమి ఇంకా దాన్నే పట్టుకొని వేలాడుతున్నాయి. మానవాభివృద్ధి కంటే వస్తుగతాభివృద్ధిలోనే పెత్తందారీ వర్గాల స్వీయ ప్రయోజనాలు ఇమిడి ఉండటమే అందుకు కారణం. గడిచిన నాలుగేళ్లలో ఒకదాని తర్వాత ఒకటి చొప్పున లాటిన్‌ అమెరికాలో నయా ఉదారవాద ప్రభుత్వాలు కుప్పకూలు తున్నాయి. వాటి స్థానంలో వామపక్ష, వామపక్ష మధ్యేవాద ప్రభుత్వాలను ప్రజలు అధికారంలోకి తెస్తున్నారు. మెక్సికో, అర్జెంటీనా, చిలీ, పెరూ, బొలీవియా, హోండూరస్, బ్రెజిల్‌ వగైరా డజన్‌కు పైగా లెఫ్టిస్టు ప్రభుత్వాలతో దక్షిణ అమెరికా ఖండం రంగు మారుతున్నది. నయా ఉదారవాదపు అమాన వీయ పంపిణీ విధానాన్ని జనం తిరస్కరిస్తున్నారు.

నయా ఉదారవాదం సృష్టించిన అసమానతలు ఎంత అమానుషంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు ఆక్స్‌ఫామ్‌ విడుదల చేస్తున్న నివేదికలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. మొన్నటి దావోస్‌ సమావేశాల తొలిరోజు విడుదల చేసిన తాజా నివేదిక మరింత భయంగొలిపే విధంగా ఉన్నది. ఈ రెండున్నరేళ్లలో ప్రపంచం 42 ట్రిలియన్‌ డాలర్ల సంపదను సృష్టించింది. జనాభాలో ఒక్క శాతం శ్రీమంతుల ఖాతాలో అందులో 67 శాతం సంపద పడి పోయింది. మిగిలిన 99 శాతం మందికి 33 శాతం సంపద. ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచెస్ట్‌’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక నయా ఉదారవాద అమానుషత్వాన్ని ఎత్తి చూపింది.

సంపన్నుల సంపద ఈ పాతికేళ్లలో ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా పేద ప్రజల పేదరికం కూడా పెరిగింది.భారతదేశం పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అట్టడుగున ఉండే 50 శాతం మంది పేద ప్రజల చేతిలో 3 శాతం సంపద మాత్రమే ఉన్నది. ఒక్కశాతం కుబేరుల చేతిలో 40 శాతం సంపద పోగుపడింది. ఈ కుబేరుల్లో వరసగా 10 శాతం మందిని లెక్కిస్తే వారందరి చేతిలో కలిపి 80 శాతం సంపద ఉన్నది. అంటే ఈ దేశంలో ఒక వంద రూపాయల సంపద ఉందనుకుంటే, దేశ జనాభా వందమంది అనుకుంటే పంపిణీ ఈవిధంగా ఉంటుంది. పదిమంది ధనవంతుల ఆస్తి 80 రూపా యలు. 50 మంది పేదవారి ఉమ్మడి ఆస్తి 3 రూపాయలు. 40 మంది మధ్య–ఎగువ మధ్యతరగతి వారి ఆస్తి విలువ 17 రూపా యలు. దేశంలోని సమస్త ప్రజలు సమష్టిగా శ్రమించి, అందరికీ చెందవలసిన సహజ వనరులను ఉపయోగించుకుని సృష్టించిన సంపదలో ఈ రకమైన పంపిణీ న్యాయమైనదేనా? ఈ దేశంలోని శ్రీమంతులకూ, పెట్టుబడిదారులకూ ఇంకో సౌలభ్యం కూడా ఉన్నది. వాళ్లు బ్యాంకుల్లో ఉన్న ప్రజల సొమ్మును అప్పుగా తీసుకొని ఆ తర్వాత ఎగవేయవచ్చు. అలా గడిచిన ఎనిమిదేళ్లలో 12 లక్షల కోట్ల రుణాలను ఎన్‌పీఏలుగా పరిగణించి కేంద్ర పెద్దల సాయంతో మాఫీ ముద్ర వేసేశారట. ఏ పేదవాడి రుణాన్నయినా ఈ దేశంలోని ఏ బ్యాంకయినా ఇలా మాఫీ చేసిన చరిత్ర ఉన్నదా? చెంబూ, తపేలాలతో సహా ఇంటినీ, ఒంటి మీది గోచీని కూడా వేలంవేసి వసూలు చేయడమే బ్యాంకులకు రివాజు.

ఈ నేపథ్యంలోనే నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా కొత్త ఆలోచనలు ముందుకు వచ్చాయి. ఈ ఆలోచనలకే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు పట్టం కడుతున్నారు. లాటిన్‌ అమెరికా దేశా ల్లోని పరిణామాలను కూడా ఈ కోణం నుంచే అర్థం చేసు కోవలసి ఉంటుంది. అసమానతలతో కూడిన అమానవీయ అభివృద్ధికి బదులుగా సమస్త మానవుల అభివృద్ధి, ప్రకృతి వనరుల పరిరక్షణతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (Sustainable development) ఎంపిక చేసుకోవాలనేది ఒక ముఖ్యమైన ఆలోచన. ముఖ్యమైన పరిశ్రమలు, కీలక మౌలిక రంగాల మీద ప్రభుత్వరంగ అజమాయిషీయే కొనసాగాలనేది మరో ఆలోచన. ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేయడానికీ, విద్య, వైద్య సౌకర్యాల విస్తరణకూ, వారి సాధికారతకూ ప్రభు త్వాలు పెద్దఎత్తున ఖర్చు చేయాలి. ధనిక–పేద, ఆడ–మగ, జాతి లేదా కులాల మధ్య అంతరాల్లేని అభివృద్ధి లక్ష్యంగా ఉండాలి. ఈ తరహా ఆలోచనలకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పట్టం కడుతున్నారు.

ఈ పూర్వరంగం నుంచి చూసినప్పుడే మనకు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కూడా అర్థమవుతాయి. పేద వర్గాల ప్రజలను నిలబెట్టడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల కోట్లను ప్రత్యక్షంగా బదిలీ చేయడాన్ని ‘ఈనాడు’ సహిత ఎల్లో మీడియా, ఆంధ్రప్రదేశ్‌ పెత్తందార్లు, వారి నాయకుడైన చంద్ర బాబు సహించలేకపోతున్నారు. ఇలా ఖర్చుపెడితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని శాపనార్థాలు పెడుతున్నారు. ట్యాక్స్‌ పేయర్ల సొమ్మును ఉచితాలకు తగలేస్తున్నారని మధ్యతరగతి వారిని రెచ్చగొడుతున్నారు. అయ్యా ట్యాక్స్‌ పేయర్లూ! మీ సొమ్మును ఎవరు కబళించుకుపోతున్నారో కొంచెం బుర్రపెట్టి ఆలోచించండి. ఎల్లో మీడియా మిడిమిడి జ్ఞానపు రాతలకూ, వాట్సప్‌ యూనివర్సిటీ పోసుకోలు పాఠాలకూ ప్రభావితం కావద్దు. మీ ట్యాక్స్‌ సొమ్మునే కాదు, పేద ప్రజలు రక్తమాంసాలు కరిగించి చిందించిన చెమట చుక్కల్ని కూడా కుబేరులు దోచుకుంటున్నారు. ఆ కుబేరులు పోగేసుకున్న 80 శాతం సంపదలో కనీసం సగమైనా సామాజిక అభివృద్ధికి తరలించ వలసిన అవసరం లేదా? ఆలోచించండి.

‘యుద్ధం ముగిసిన రణభూమి వృద్ధాప్యం’ అంటారు. చేతులు – కాళ్లు తప్ప మరే ఆస్తిలేని పేదలంతా కరాల బిగువు, నరాల సత్తువ ఉన్నంతవరకూ జీవన పోరాటం చేసి అలసి సొలసి, కొంచెం సాంత్వన కోరుకుంటారు. కన్నబిడ్డలు ఎవరి బతుకు పోరులో వారు నిమగ్నం కాగా, బుక్కెడు బువ్వకోసం, ఓ చిన్న పలకరింపు కోసం అవ్వాతాతలు ఎదురుచూస్తుంటారు. వారి ఇళ్ల వద్దకు వలంటీర్లు వెళ్లి యోగక్షేమాలడిగి పెన్షన్‌ డబ్బులు చేతిలో పెడితే పాపమా? అది వ్యవస్థ బాధ్యత కాదా? ‘ఈనాడు’–చంద్రబాబు ఎల్లో కూటమి అది పాపమనే అభి ప్రాయపడుతున్నాయి. పేద పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చద వడం కూడా పాపమనే భావిస్తున్నాయి. మహిళలకు సమాన స్థాయి సామాజిక – రాజకీయ – ఆర్థిక హోదాను కల్పించడాన్ని కూడా పాపకార్యంగానే భావిస్తున్నాయి. కనుక ఈ తరహా సుస్థిర–మానవీయ అభివృద్ధి లక్ష్యాలను ఎంచుకున్న జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అవి యుద్ధానికి సమాయత్తమవు తున్నాయి. కానీ ఈ కూటమి నమ్ముకున్న నయా ఉదార విధా నాలు ప్రపంచమంతటా మట్టికరుస్తున్నాయి. కొత్త ఆలోచనల ఝంఝామారుతం ప్రచండ వేగంతో వీస్తున్నది. ఇనుప తెరలు ఆ వేగాన్ని తట్టుకోలేవు. ఎన్ని రాజకీయ కూటములను ఏర్పాటు చేసుకున్నా, ఎంతమంది ప్రవచకుల చేత సుభాషితాలు చెప్పించినా, ఎన్ని చిలుక జోస్యాలను ప్రచారంలో పెట్టినా, జగన్‌ మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసుకున్న పేదవర్గాలు – మధ్యతరగతి ప్రజల ఐక్య సంఘటనను ఎదుర్కోలేవు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు