జెండా ఊంఛా రహే హమారా!

14 Aug, 2022 00:18 IST|Sakshi

జనతంత్రం

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. ఆయన విజయవాడ సమీపంలోని పెదకళ్ళేపల్లిలో మాతామహుల ఇంట జన్మించి, భట్లపెనుమర్రులో పెరిగారు. జైహింద్‌ నినాద సృష్టికర్త అబిద్‌ హాసన్‌. హైదరాబాద్‌ వాసి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా జాతీయ జెండాల రెపరెపలు, జైహింద్‌ నినాదాల హోరు దేశమంతటా అలుముకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజా హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.

ఆజాద్‌ భారత్‌కు ఇది 75వ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు బాగానే పనిచేసింది. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ నినాదాన్ని జనం ఆదరిస్తున్నారు. ఇళ్ళ మీదనే కాదు, వీధుల్లో సైతం జెండా ప్రదర్శనలు జరుగుతున్నాయి. లక్షలాదిమంది ప్రజలు మొబైల్‌ ఫోన్లలో వారి ప్రొఫైల్‌ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. జెండా ఉత్సవాల ఫోటోలు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆక్రమించాయి. 

కొన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో తిరుగుతున్న ఒక ఫోటో కొంత ప్రత్యేకంగా కనిపించింది. ఒక ఛాయాచిత్రం అనేక విషయాలను చెప్పగలదనేది నానుడి  (Photo speaks volumes). ఈ ఫోటో చాలా ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నది. దాని బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే ఏజెన్సీ ప్రాంతంగా తోస్తున్నది. ఒక సన్నటి వెదురు కర్రకు ఒక జాతీయ జెండాను తొడిగారు. కర్రను మట్టిలో పాతి, దాని చుట్టూ ముగ్గు వేశారు. మందార పూలు పెట్టారు. చుట్టూ ఓ పదిమంది పిల్లలు నిలబడి జెండా వందనం చేస్తున్నారు. వారి వయసు నాలుగు నుంచి ఎనిమిదేళ్ల వరకుండవచ్చు. వాళ్ల నిక్కర్లు జీర్ణావస్థలో ఉన్నాయి. పైన చొక్కా ల్లేవు. అందరికంటే చిన్నవాడికి నిక్కర్‌ కూడా లేదు. జెండా ఎగరేసే తాడు వాని చేతిలోనే ఉన్నది. కనుక వాడే చీఫ్‌గెస్టయి వుంటాడు. అందరిలో పేదరికం తాండవిస్తున్నది. జెండాను తలకిందులుగా ఎగరేయడం వంటి తప్పులు వాళ్లు చేయలేదు. ఫ్లాగ్‌ కోడ్‌ పాటించారు. వారి సెల్యూల్‌లో ఏ వంకా లేదు.

ఆ జెండా తమలాంటి వాళ్ల జీవితాల్ని మార్చివేస్తానన్న హామీని 75 ఏళ్ల కిందనే ఇచ్చిందన్న విషయం ఆ పిల్లలకు తెలియకపోవచ్చు. జెండా అంటే దేవుడితో సమానమని మాత్రమే తెలుసు. పూజించాలని మాత్రమే తెలుసు. ఈ ఫోటో మరోసారి కొన్ని మౌలికమైన ప్రశ్నల్ని మనముందు తెచ్చింది. అసలు స్వతంత్రం అంటే ఏమిటి? కేవలం మాట్లాడే స్వేచ్ఛ మాత్రమేనా? ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వాతంత్య్రాల మాటేమిటి? సామాజిక న్యాయం సంగతేమిటి?

రాజ్యాంగం పూచీపడినట్టు అందరికీ ఆలోచనా, భావ ప్రకటనా, నమ్మకం, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ సమకూరిందా? హోదాల్లో అవకాశాల్లో సమానత్వం సిద్ధించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చిన నాటి రోజులతో పోలిస్తే దారిద్య్రం అంత తీవ్రంగా లేకపోవచ్చు. ఇప్పుడు ఆకలి చావుల మాటలు వినిపించకపోవచ్చు. అక్షరాస్యత పెరిగి ఉండవచ్చు. జీవన ప్రమాణాలు, ఆయుర్దాయం పెరిగి ఉండవచ్చు. కానీ అసమానతలు కూడా పెరిగాయి. పేదలు – ధనికుల మధ్య పెరుగుతున్న అంతరాల్లో ప్రపంచంలోనే ఇండియా నెంబర్‌ 1 స్థానంలో ఉన్నది. సీఐఏ వరల్డ్‌ ఫ్యాక్ట్‌ బుక్‌ లెక్క ప్రకారం దేశ సంపదలో 58% కేవలం ఒక్కశాతం కుబేరుల చేతిలోనే ఉన్నది. పది శాతం శ్రీమంతుల చేతిలో 80 శాతం జాతి సంపద పోగుపడింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌ ఇండియాలో పది శాతం సంపన్నుల చేతిలో 54 శాతం సంపద ఉండేది. ఆ అంతరం ఇప్పుడు మరింత పెరిగింది. పేదలు, నిరుపేదలు, దిగువ, ఎగువ మధ్యతరగతులందరి ఉమ్మడి సంపద ప్రస్తుతం 14 శాతమే.

ఆర్థిక అసమానతలు తొలగించలేక మరింత పెంచుకోవడం ఒక విషాదం. సామాజిక అసమానతలను కూడా పూర్తిగా రూపుమాపలేకపోయాము. సోషల్లీ రాడికల్‌ స్వభావం కలిగిన రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని కొందరు పరిగణిస్తారు. అయినప్పటికీ సామాజిక అసమానతలు 75 ఏళ్ల తరువాత కూడా కొనసాగుతున్నాయి. ‘ఎస్‌.సీ. కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని బాహాటంగా మీడియా గోష్ఠి లోనే కామెంట్‌ చేయగలిగిన ఒక కులదురహంకారి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదమూడేళ్లు ప్రతిపక్ష నేతగా చలామణి కాగలగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టే విషయం.

మెదళ్లకు బూజు పట్టించిన ఛాందస భావాలు ఇంకా సమాజాన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. దళితులు వండిపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని తమ పిల్లలు తినబోరంటూ బహిష్కరిస్తున్న ఘటనలు ఇంకా జరగడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అల్లుడిని కరకు కత్తులకు బలి ఇస్తున్నారు. పైగా దానికి ‘పరువు హత్య’ అనే ముద్దుపేరు పెట్టుకుంటున్నారు.

వెనుకబడిన వర్గాలుగా పరిగణించే చేతివృత్తుల వారి వృత్తి వ్యాపారాల్లోకి క్రమంగా సంపన్నులు ప్రవేశించారు. చెప్పుల వ్యాపారం, బట్టల వ్యాపారం, పాల వ్యాపారం, లిక్కర్‌ బిజినెస్, కుండలు, బుట్టలు, ఫర్నిచర్, బంగారం వగైరాలన్నీ వెనుకబడిన వర్గాల నుంచి ఎప్పుడో చేజారిపోయాయి. వీధిన పడిన ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కొంత రిజర్వేషన్‌ కోటాను అమలుచేయ ప్రయత్నించినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో తెలిసిందే. మనదేశంలో పొట్టకూటి కోసం రెక్కలమ్ముకుంటున్న వారి సంఖ్య 90 కోట్లు. ఇందులో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న వారి సంఖ్య కేవలం రెండు కోట్లు మాత్రమే. ప్రైవేట్‌ సెక్టార్‌లోని వైట్‌కాలర్‌ ఉద్యోగాల్లో ఈనాటికీ ఎటువంటి రిజర్వేషన్‌ లేదన్న విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి.

ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించి వారిని ఎంపవర్‌ చేయకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలోని కుల దురహంకార విషసర్పం వేయి పడగల్ని విప్పి రోజూ వేయిటన్నుల విషాన్ని విరజిమ్ముతున్న భయానక పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవులిస్తే గిట్టదు. మహిళలకు కీలక శాఖల్ని కేటాయిస్తే నచ్చదు. వారికి నామినేటెడ్‌ పదవులిస్తే కోపం. నామినేటెడ్‌ పనులు అప్పగిస్తే కోపం. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిస్తే పట్టరాని ఆగ్రహం. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిస్తామంటే తనువంతా కంపరం. పారదర్శకంగా ప్రజలకు నగదు బదిలీ చేస్తే పాపం. ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యనందించడం సహించరాని నేరం. ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తూ ఇంటింటికీ డాక్టర్‌ను పంపిస్తాననడం అపచారం. స్వపరిపాలనను గ్రామస్థాయికి వికేంద్రీకరించడం మహా పాపం. అవ్వాతాతల పెన్షన్‌ డబ్బులు ఠంచన్‌గా తలుపు తట్టడం అపరాధం... వేయి పడగల విషసర్పం దృష్టిలో ఇవన్నీ జగన్‌ ప్రభుత్వ నేరాలు. ఇటువంటి పడగల్ని కత్తిరించకుండా నిజమైన స్వాతంత్య్రం సాధ్యం కాదనే విషయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అనుభవంలోకి వచ్చింది.

ఈ 75 సంవత్సరాల కాలంలో దేశం సాధించిన ఆర్థిక అభివృద్ధి తక్కువేమీ కాదు. పంపిణీలో అసమానతలుండడమే అసలు సమస్య. ప్రధానమంత్రి పెట్టుకున్న లక్ష్యం ప్రకారం వచ్చే రెండు మూడేళ్లలో దేశ సంపద ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలి. ఇంకో పది పన్నెండేళ్లలో పది ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కాబోతున్నదని ప్రసిద్ధ ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఇందుకు దోహదపడే కారణంగా మన మానవ వనరుల సంపదను వారు చూపెడుతున్నారు. ఈ వనరులకు నాణ్యమైన విద్యనిచ్చి నైపుణ్యాన్ని జతచేయడమే మనం చేయవలసిన పని. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ బాధ్యతను నెరవేర్చగలిగితే రాబోయే తరం యువకులు ఈ దేశాన్ని మరో రెండు దశాబ్దాల్లోగా అగ్రరాజ్యంగా నిలబెట్టగలుగుతారు.

ఈ లక్ష్యసాధన కోసం మానవ వనరుల్ని సాధికారం చేయడానికి ప్రగతి శీల ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చును కొందరు ప్రబుద్ధులు తప్పుపడుతున్నారు. ‘ఉచితాలు అనుచితం’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం చేస్తున్న వారి జేబుల్లోనే సుజనా చౌదరి వంటి బ్యాంకు కేటుగాళ్లుండటం ఒక విచిత్రం. ఇటువంటి కేటుగాళ్లు ఎగవేసిన లక్షలకోట్ల రూపాయలను మాఫీ చేస్తున్న కేంద్రం ప్రజలను ఎంపవర్‌ చేసే పథకాలకు మోకాలడ్డాలనుకోవడం ఒక వైరుద్ధ్యం. ఇటువంటి వంకర విధానాలను సరిదిద్దుకోకుండా భారతదేశం తన ముందున్న సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యంకాదు. కట్టుబట్టలు కూడా లేకున్నా సరే, దేశభక్తిలో ఎవరికీ తీసిపోమని నిరూపిస్తున్న మన ఏకలవ్య బాలల్ని మరవద్దు. వారికి చేయూతనిచ్చి ప్రధాన స్రవంతిలో నిలబెడితే మన ప్రగతి రథం పరుగులు తీస్తుంది. అట్లా కాకుండా మళ్లీ బొటనవేళ్లు నరకడానికే పూనుకుంటే ఇంకో వందేళ్లయినా ఈ దేశం అగ్రదేశం కాబోదు.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు